ఆసియాకప్ : పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్ భారత్‌కు అంత తేలిక కాదా?

భారత్, పాకిస్తాన్ టీమ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, భరత్ శర్మ
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

''ఫైనల్‌లో భారత్‌ను ఓడించాలనే ఆలోచనే పాకిస్తాన్ జట్టుకు మానసిక ఒత్తిడిగా మారుతుందా?''

సూపర్ 4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ జర్నలిస్టు పాకిస్తాన్ జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌ను ఈ ప్రశ్న అడిగారు.

"నేను అలా అనుకోవడంలేదు. ఆసియాకప్‌లో భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్ లో మొదటి మ్యాచ్ కంటే చాలా మెరుగ్గా ఉన్నాం. మేం పోటీలోనే ఉన్నాం, మమ్మల్ని ఓడించడానికి అభిషేక్ శర్మ అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది''

"మేం భారత్ పై గెలవాలనుకుంటే, మేం వారిని ఎక్కువ సేపు ఒత్తిడిలో ఉంచాలి, అలా చేయకపోతే మ్యాచ్ వారి నియంత్రణలోకి వెళుతుంది. అందుకే ప్రపంచంలోనే వాళ్లు టాప్ టీమ్‌గా నిలిచారు. అదో సవాలు కూడా'' అని చెప్పారు.

"మేం సెప్టెంబర్ 14 , సెప్టెంబర్ 21 తేదీలలో ఆడాం, కానీ ఇప్పుడు చాలా ముఖ్యమైన మ్యాచ్ ఆడనున్నాం. దీనిపైనే మా దృష్టి నిలిపాం’ అని తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, పాక్ అభిమానుల సందడి

ఫొటో సోర్స్, Reuters

ఆసియాకప్ ఫైనల్లో తొలిసారి

ఆసియాకప్‌ ఫైనల్లో ఈరోజు (సెప్టెంబర్ 28) భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఆసియాకప్ ఫైనల్లో ఈ రెండు జట్లు ఇప్పటిదాకా ఎన్నడూ తలపడలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరూ గెలిచినా చరిత్ర సృష్టించినవాళ్లవుతారు.

ఆసియాకప్ 1984లో మొదలైనప్పటి నుంచి ఈ 41 ఏళ్లలో ఇండియా, పాకిస్తాన్ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి.

ఈ టోర్నీలో భారత్ అత్యధికంగా ఎనిమిది సార్లు గెలిచింది, తరువాత శ్రీలంక ఆరు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు గెలిచింది.

ఓ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇరు జట్ల మధ్య పోటీ లేదని, కాబట్టి పాకిస్తాన్‌ను ప్రత్యర్థి అనడం మానాలని కోరాడు.

భారత్ వర్సెస్ పాకిస్తాన్

ఫొటో సోర్స్, FADEL SENNA/AFP via Getty Images

పాకిస్తాన్‌ను తేలికగా తీసుకోకూడదా?

ఈ ఫైనల్లో పాకిస్తాన్‌ను భారత్ ఎందుకు తేలికగా తీసుకోకూడదని ప్రసిద్ధ క్రికెట్ నిపుణుడు అయాజ్ మెమన్ ప్రశ్నించగా "ఎందుకంటే ఇది ఫైనల్!" కాబట్టి అన్నారు.

‘‘టీ20 ఛాంపియన్ కాబట్టి టీమిండియాపై మరింత ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే కాగితంపై భారత ఆటగాళ్లు నాణ్యతలో చాలా ఉన్నతంగా కనిపిస్తారు. పాకిస్తాన్ కంటే భారత జట్టు ఆధిపత్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే దీని అర్థం జట్టు మ్యాచ్ గెలిచిందని కాదు. ఈ మ్యాచ్ ఇంకా ఆడాల్సి ఉంది. క్రికెట్‌లో , ముఖ్యంగా టీ20 క్రికెట్లో ఏదైనా జరగొచ్చని మనకు తెలుసు’’ అని మెమన్ బీబీసీకి చెప్పారు.

"మనం కాగితంపై ఒక్కో ఆటగాడి మాట్లాడితే, భారతదేశం చాలా ముందుంటుంది, కానీ మ్యాచ్ లు పిచ్ పై గెలుస్తాయి, కాగితంపై కాదు" అని ఆయన చెప్పారు.

ఫైనల్ మ్యాచ్ ఒత్తిడి వేరే రకంగా ఉంటుందని, చిన్న తప్పుకూడా ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు.

టీమిండియా జట్టు అప్రమత్తంగా ఉండాలని, పాకిస్తాన్ ను రెండుసార్లు ఓడించాం కాబట్టి, ఆ జట్టునుతేలికగా తీసుకోలేమని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, రచయిత్రి నీరూ భాటియా అన్నారు.

నీరూ మాట్లాడుతూ ''ఫైనల్ ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ లను పరిశీలిస్తే తొలి మ్యాచ్ కంటే రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ మెరుగ్గా ఉంది. భారత్‌పై మాత్రమే కాకుండా ఇతర జట్లపై కూడా వారి ప్రదర్శన మెరుగుపడింది. అందువల్ల, వారిని తేలికగా తీసుకోలేం. పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ మెరుగ్గా కనిపిస్తున్నాయని, అయితే బలమైన జట్టుగా భారత్ ఫైనల్లోకి వెళుతుందనేది కూడా నిజం' అని చెప్పుకొచ్చారు

భారత్ వర్సెస్ పాకిస్తాన్

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images

భారత్ దేనిపై దృష్టి సారించాలి?

ఈ టోర్నీలో భారత బ్యాటింగ్ విషయానికొస్తే, అభిషేక్ శర్మ శుభ్‌మన్ గిల్ తరచుగా మంచి ప్రారంభాన్ని అందించారు. ఇది మిడిల్ ఆర్డర్ ఒత్తిడిని తగ్గించింది. అయితే ఫైనల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జట్టులోని మిగతా బ్యాట్స్ మెన్ సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.

సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు ధర్మేంద్ర పంత్ మాట్లాడుతూ శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ చాలా బాగా ఆడారు. వారు సరిగా ఆడక మిడిల్ ఆర్డర్‌ సామర్థ్యానికి పరీక్ష ఎదురైనప్పుడు వరుసగా వికెట్లు పడిపోయాయన్నారు.

ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అనేక మార్పులు చేసి ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఆడారు. వారు ఎంత ప్రయోజనం పొందారో కాలమే చెబుతుంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం బాధ్యతతో ఆడాల్సి ఉంటుంది. అతను నిలకడగా కొనసాగితే పాకిస్తాన్ పై భారత్ మంచి స్థితిలో ఉంటుందని అన్నారు.

నీరూ భాటియా కూడా బ్యాట్స్ మన్ గా సూర్యకుమార్ రాణించాలన్నారు.

‘‘సూర్యకుమార్ ఆడుతున్నాడు, కానీ స్ట్రగుల్ అవుతున్నాడు. అతడు ఏ స్థానంలో ఆడతాడనేది నిర్ణయించాలి. అతన్ని అదేపనిగా కిందకు, మీదకు కదిలించకూడదు. ఇది మిడిల్ ఆర్డర్‌లో సమస్యలు సృష్టిస్తుంది. టీములో అతనో కీలక బ్యాట్స్‌మెన్. కానీ అతను బ్యాట్‌ ఇంకా ఝుళిపించలేదు. పరుగులు చేయడంలేదు. అతని కెప్టెన్సీ బాగుంది. ఫైనల్లో అతనిపై బోలెడు అంచనాలు కూడా ఉన్నాయి’’ అన్నారు.

వీటితోపాటు ఇండియా జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ కంటే క్యాచ్‌లు జారవిడవడం పెద్ద సమస్యగా మారింది.

"భారత జట్టు రెండు మ్యాచ్ లలో చాలా క్యాచ్ లు నేలపాలు చేసింది. ఇలా ఫైనల్లో జరగకూడదు, ఎందుకంటే ఇలాంటి తప్పులు పెద్ద మ్యాచ్ లలో ఆటను పాడుచేస్తాయి" అని మెమన్ చెప్పారు .

నీరూ కూడా దీనికి ఏకీభవించినట్లు కనిపించారు.

‘‘భారత జట్టుకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రధానంగా ఫీల్డింగ్. జట్టు చాలా క్యాచ్ లు వదిలేసింది. క్యాచ్ లే మ్యాచ్ లను గెలుస్తాయి, ముఖ్యంగా పెద్దవి. అది పాకిస్తాన్ అయినా లేదా మరే ఇతర జట్టు అయినా, క్యాచింగ్ పదునుగా ఉండాలి, ప్రస్తుతానికి ఈ పదును కనిపించడంలేదు’’

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images

పాకిస్తాన్ ప్రమాదకారిగా మారుతుందా?

కొంతమంది నిపుణులు పాకిస్తాన్ జట్టు అనూహ్యంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటున్నారు.

‘‘పాకిస్తాన్ దాని అనూహ్య ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. ఆ జట్టు ఆటతీరు ఎప్పుడు పేలవంగా ఉంటుందో ఎప్పుడు బాగుంటుందో చెప్పడం కష్టం’’ అంటారు పంత్.

రెండు జట్లపైనా అంచనాల భారం ఉంది. కానీ ఒత్తిడి భారత్ పై ఎక్కువగా ఉంది, అందువల్ల పాకిస్తాన్‌ను తక్కువ అంచనావేసే అతివిశ్వాసాన్ని భారత్ వీడాలి.

‘‘పాకిస్తాన్ రికార్డు పేలవంగా ఉందని, వారు భారత్ చేతిలో ఓడిపోతూనే ఉన్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌పై ఒత్తిడి లేకపోతే వారు స్వేచ్ఛగా ఆడవచ్చు' అని పంత్ చెప్పారు.

మరోపక్క పాకిస్తాన్ జట్టు బౌలింగ్ ఏ మ్యాచ్ గమనాన్ని అయినా మార్చగలదు.

‘‘రవూఫ్ బౌలింగ్ తీరుపై మనం జాగ్రత్తగా ఉండాలి. అతనితో పాటు షాహీన్ షా అఫ్రిది లెంగ్త్ తప్పకుండా బౌలింగ్ చేస్తున్నారు. మునుపటి మ్యాచ్ లలో, అభిషేక్ శర్మ తన లెంగ్త్‌ను గమనించకుండా చేశాడు. షార్ట్ పిచ్ బంతులను సమర్థవంతంగా వేశాడు. ఫైనల్లో ఇలా జరిగితే మిగతా బౌలర్లపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే గత రెండు మ్యాచ్ ల్లో అఫ్రిది బౌలింగ్ పదునుగా కనిపించింది’’ అని పంత్ విశ్లేషించారు.

టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లు ఇద్దరూ బాగా ఆడుతున్నారని, అయితే అభిషేక్ శర్మ వికెట్ అత్యంత విలువైనదని అయాజ్ మెమన్ అన్నారు.

'టీమిండియా ఓపెనర్లు, ముఖ్యంగా శర్మ ఫామ్‌లో ఉన్నారు. టీమిండియా సంజు శాంసన్‌తో సహా అనేక మార్పులను ప్రయత్నించింది, సూర్య కూడా స్థానం మారాడు, కానీ ఫైనల్లో బ్యాటింగ్ ఆర్డర్ ను తారుమారు చేయలేం. స్పిన్నర్లు బాగా రాణిస్తున్నారు, కానీ హార్దిక్ పాండ్యా కూడా ప్రభావం చూపగలడు’’ అన్నారు.

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images

పాకిస్తాన్ బ్యాటింగ్ సంగతేంటి?

సాహిబ్‌జాదా ఫర్హాన్ తన ఇన్నింగ్స్ తోనే కాకుండా తన సెలబ్రేషన్స్‌తో కూడా వివాదంలోకి వచ్చాడు.

కానీ ఈ వివాదాల మధ్య భారతజట్టు అతని బ్యాటింగ్‌ను విస్మరించకూడదు.

టీమిండియాతో జరిగిన లీగ్ దశ మ్యాచ్ లో 44 బంతుల్లో 40 పరుగులు, సూపర్ 4లో 45 బంతుల్లో 58 పరుగులు చేశాడు.

సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను టీమ్ ఇండియా కుదురుకోనీయకూడదు. అతను హాఫ్-వాలీని బాగా ఆడుతున్నాడు, కాబట్టి ముందుగానే ఒత్తిడిలోకి నెట్టాలి. జస్ప్రీత్ బుమ్రా ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది, కానీ ఫర్హాన్ లాంగ్ షాట్లు ఆడటం ద్వారా అతనిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. ఫర్హాన్ తొందరగా ఔట్ అయితే మిగతా బ్యాట్స్ మెన్ పై ప్రభావం పడుతుంది' అని పంత్ విశ్లేషించారు.

ఫర్హాన్ తో పాటు టీమిండియా ఎదుర్కోవాల్సిన మరో బ్యాట్స్ మన్ ఫఖర్ జమాన్.

‘‘ఫకార్ జమాన్ ప్రమాదకరమైన ఆటగాడిగా పరిగణిస్తున్నారు. కాబట్టి భారత జట్టు అతడిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది’’

దీనితో బౌలర్ షాహీన్ షా అఫ్రిదిపైనా భారత జట్టు దృష్టి సారించాలి.

బంగ్లాదేశ్ మ్యాచ్ తర్వాత భారత్ తో ఫైనల్ గురించి అఫ్రిదిని అడిగినప్పుడు 'మేం సిద్ధంగా ఉన్నాం' అని చెప్పాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)