మావోయిస్టులపై సర్కారీ యుద్ధం: ప్రజలు నలిగిపోతున్నారా?

ఫొటో సోర్స్, Seraj Ali/BBC
- రచయిత, విష్ణుకాంత్ తివారీ, జుగల్ పురోహిత్, అంతరిక్ష్ జైన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య జరుగుతున్న కాల్పులతో చాలాకాలంగా మధ్య,తూర్పుభారత్‌లోని స్థానికులు, ఆదివాసీ కమ్యూనిటీలు నలిగిపోతున్నాయి.
కమ్యూనిస్టు రాజ్యస్థాపన కోసం మావోయిస్టులు చేస్తున్న సాయుధపోరాటం ఆరుదశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ పోరాటంలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు.
అధికారికంగా వామపక్ష తీవ్రవాదమని పిలిచే ఈ ఉద్యమం 1967లో పశ్చిమ బెంగాల్‌లో సాయుధ రైతాంగ తిరుగుబాటుగా ప్రారంభమై, 2000ల మధ్య నాటికి దేశంలోని సుమారు మూడోవంతు జిల్లాలకు వ్యాపించింది. 2009లో ప్రధాని మన్మోహన్ సింగ్ దీన్ని దేశానికి ''అతిపెద్ద అంతర్గత ముప్పు''గా అభివర్ణించారు.

గత ఏడాది భారత ప్రభుత్వం మావోయిస్టు తిరుగుబాటును అణచివేయడానికి 2026 మార్చిని గడువుగా విధించింది. తరువాత కఠిన వ్యూహాలను అమలు చేస్తూ భద్రతాదళాలతో తీవ్ర చర్యలు ప్రారంభించింది.
జనవరి 2024 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు మధ్య తిరుగుబాటుదారులుగా ఆరోపిస్తూ భద్రతాబలగాలు చంపేసిన వారి సంఖ్య 600కన్నా ఎక్కువే అని దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్(ఎస్ఏటీపీ)తెలిపింది. మృతుల్లో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన అనేకమంది సీనియర్లు కూడా ఉన్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ప్రభుత్వం డజన్ల కొద్దీ భద్రతా శిబిరాలు ఏర్పాటుచేసింది. ప్రత్యేకించి మధ్యభారతంలోని ఛత్తీస్‌గఢ్‌లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ జనాభాలో 30శాతం ఆదివాసీ తెగలకు చెందినవారు. వీరు దట్టమైన అడవుల్లో నివసిస్తున్నారు.
తీవ్రమైన అణచివేత నేపథ్యంలో తిరుగుబాటుదారులు ప్రభుత్వంతో షరతులతో కూడిన శాంతిచర్చలకు సిద్ధంగా ఉన్నామని ఈ ఏడాది మొదట్లో ప్రకటించారు.
మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టేదాకా ఎలాంటి చర్చలూ ఉండవని అధికారులు తేల్చిచెప్పారు.
ప్రభుత్వ చర్యలు ఫలితాలనిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక ప్రకారం 2023తో పోలిస్తే 2024లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు దాదాపు రెట్టింపు అయ్యాయి. చనిపోయిన తిరుగుబాటుదారుల సంఖ్య ఐదు రెట్లు ఎక్కువ.
ఈ ఆపరేషన్ల వల్ల కలుగుతున్న ప్రాణనష్టంపై హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
పుష్కలమైన సహజ వనరులు ఉన్నప్పటికీ, పేదరికంతో, అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో నివసించే సాధారణ పౌరులు, ముఖ్యంగా ఆదివాసీ సమాజాలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.

ఫొటో సోర్స్, Seraj Ali/BBC
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాకు చెందిన పెకారం మెత్తామీ తన కుమారుడికి నివాళులర్పిస్తున్నారు. రెండు పదుల వయసులో ఉన్న మెత్తామీ కుమారుడిని ఈ జనవరిలో పోలీసులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ మావోయిస్టు రెబెల్స్ చంపేశారు. కానీ మావోయిస్టుల ఆరోపణలను ఆయన కుటుంబం, పోలీసులు, స్థానికులు ఖండించారు.
పదో తరగతి వరకు చదివిన సురేశ్ ఆ గ్రామంలో ఎక్కువ చదువుకున్న వ్యక్తి. స్థానిక స్కూళ్లు, ఆస్పత్రులకోసం పోరాడేవాడు.
''తన ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించాలన్నదే ఆయన లక్ష్యం, కానీ అందుకోసం తన జీవితాన్ని మూల్యంగా చెల్లించాల్సివచ్చింది'' అని ఆయన తండ్రి చెప్పారు.
బీజాపుర్‌కు వందమైళ్ల దూరంలో ఉన్న ప్రాంతంలో అర్జున్ పొటమ్ తన సోదరుడు లక్చుకు నివాళులర్పిస్తున్నారు. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా ఫిబ్రవరిలో ఆయన్ను చంపేశారు. ఎనిమిదిమంది మావోయిస్టులను చంపేశామని పోలీసులు చెప్పారు. కానీ వారంతా అమాయకులని పొటమ్ అంటున్నారు.
''చనిపోయిన వాళ్ల దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. కొందరు లొంగిపోవడానికి కూడా ప్రయత్నించారు. కానీ పోలీసులు వినిపించుకోలేదు''అని ఆయన తెలిపారు.
''ఆయనకు(లచ్చు) పోలీసులు, మావోయిస్టులిద్దరితో సంబంధాలున్నాయి. కానీ ఆయనెప్పుడూ ఆయుధాలు పట్టుకోలేదు'' అని తెలిపారు.
ఈ ఆరోపణలను బస్తర్ సీనియర్ పోలీసు అధికారి పి.సుందర్‌రాజ్ ఖండించారు. సాధారణ పౌరులకు వ్యతిరేకంగా తప్పుడు చర్యలు చేపట్టినట్టు ఇటీవలికాలంలో ఎలాంటి కేసులూ లేవని ఆయన అన్నారు.
భద్రతా ఆపరేషన్లలో తిరుగుబాటుదారులకు, సాధారణ ప్రజలకు మధ్య ఉన్న గీత చెరిగిపోవడం చాలా సాధారణంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కొత్తగా భద్రతా శిబిర ఏర్పాటును వ్యతిరేకించిన ఐదుగురు నిరసనకారులను భద్రతా బలగాలు 2021లో కాల్చిచంపాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తిరుగుబాటుదారులు రెచ్చగొట్టడంతో ఆందోళనకారులు తమపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. కానీ అధికారులు ఆ ప్రాంతాన్ని చేరుకోకుండా అడ్డుకునేందుకు ఆందోళనకారులు రోడ్లను మాత్రమే దిగ్బంధించారని గ్రామస్తులు చెప్పారు.
''నా భర్తకు బుల్లెట్ తగిలిన తర్వాత వారు మావోయిస్టుగా ప్రకటించారు'' అని ఉర్సా నందె చెప్పారు. చనిపోయినవారిలో ఆమె భర్త ఉర్సా భీమా ఉన్నారు.
దీనిపై విచారణకు ఆదేశించారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు తెలిపింది. ఆ విచారణ ఏమయిందని బీబీసీ ప్రశ్నించగా జిల్లా పోలీస్ చీఫ్ కానీ, ఉన్నతాధికారులకానీ స్పందించలేదు.

ఫొటో సోర్స్, Seraj Ali/BBC
మావోయిజంపై భారత ప్రభుత్వం అనుసరిస్తున్న "జీరో టాలరెన్స్" విధానం విజయవంతమైందని, స్థానికులు, లొంగిపోయిన మావోయిస్టులతో కూడిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్‌జీ) తిరుగుబాటుదారుల వ్యూహాలు, రహస్య స్థావరాలను తెలుసుకోవడానికి భద్రతా దళాలకు సాయపడుతుందని సీనియర్ అధికారులు బీబీసీకి తెలిపారు.
ఈ యూనిట్లలో స్థానికులను చేర్చడాన్ని హక్కుల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. దీనిని గతంలో రద్దు చేసిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (ఎస్పీఓ)లతో పోలుస్తూ,ఈ నియామకాలకు కూడా అప్పట్లో స్థానికులపై ఆధారపడ్డారని సూచిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఎస్‌పీఓ వ్యవస్థను రద్దు చేయాలని 2011లో ఛత్తీస్‌గఢ్‌ను ఆదేశించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఆదివాసీలకు తగిన శిక్షణ లేకపోవడం, మావోయిస్టులపై పోరులో వారిని ‘బలిపశువులు’ను చేయడాన్ని అంగీకరించమని హెచ్చరించింది.
ఈ ఆదేశం వల్ల ఎస్పీఓలలో గిరిజన నియామకాలను నిలిపివేసినప్పటికీ, ఇది డీఆర్‌జీకి వర్తించదు. మాజీ తిరుగుబాటుదారులతో సహా స్థానిక యువతను చేర్చుకోవడాన్ని డీఆర్‌జీ కొనసాగిస్తోంది.
జ్ఞానేష్ (28) (పేరు మార్చాం) వారిలో ఒకరు. ఆయన గతేడాది తిరుగుబాటుదారుడిగా లొంగిపోయారు. కొన్ని వారాలలోనే డీఆర్‌జీలో చేరారు. "ఇంకా ఎటువంటి శిక్షణ పొందలేదు" అని చెప్పినప్పటికీ తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో పాల్గొన్నారు.
పోలీసులు దీనిని నిరాకరిస్తున్నారు. మొత్తం సిబ్బందికి ఆపరేషన్లకు ముందు సరైన శిక్షణ లభిస్తుందని చెబుతున్నారు. అయితే మాజీ తిరుగుబాటుదారులు మళ్లీ ఆయుధాలు పట్టకుండా నిరోధించాలని హక్కుల కార్యకర్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
లొంగిపోయిన తిరుగుబాటు దారులను ‘‘సాధారణ పౌర జీవితం గడపడమని’’ చెప్పడం ‘‘ ప్రభుత్వ కనీస బాధ్యత’’ అంటారు రచయిత, విద్యావేత్త నందినీ సుందర్. ఆమె ఎస్‌పీఓలకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేశారు.

ఫొటో సోర్స్, Antariksh Jain Jain/BBC
స్థానికుల మద్దతు పొందడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా ప్రారంభించింది. వీటిలో మావోయిస్టులు పూర్తిగా లొంగిపోయే గ్రామాలలో కోటిరూపాయల అభివృద్ధి నిధిని ప్రకటించారు. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కొత్త పాఠశాలలు, రోడ్లు, మొబైల్ టవర్ల ఏర్పాటుకు హామీ ఇస్తోంది.
కానీ ఈ ప్రాజెక్టుల కారణంగా తమ భూమి కోల్పోయి నిర్వాసితులవుతామని, వారు ఆధారపడిన అడవులు దెబ్బతింటాయని స్థానికులు భయపడుతున్నారు. బస్తర్‌కు చెందిన గిరిజనుడు ఆకాష్ కోర్సా (26) మాట్లాడుతూ, ఈ భయాలు మావోయిస్టులకు కొంత స్థానిక మద్దతును నిలబెట్టడానికి సాయపడతాయని చెప్పారు.
మార్చి నాటికి ప్రభుత్వం మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించగలదా అనే విషయంలో నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా మావోయిస్టు రహిత జిల్లాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో కూడా చిన్నచిన్న తిరుగుబాటు గ్రూపులు ఇంకా మనుగడలో ఉన్నాయని ఛత్తీస్‌గఢ్ మాజీ పోలీసు చీఫ్ ఆర్.కె. విజ్ అన్నారు.
ప్రస్తుతం ఈ రెండు వాదాల మధ్య ఇరుక్కుపోయిన స్థానికులు,దశాబ్దాల పోరాటానికి మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు.
‘‘కనీసం మాకు అత్యంత కష్టకాలంలో కూడా ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ఎటువంటి సాయం అందలేదు, ఇప్పుడు మావోయిస్టులను కూడా మాకు సాయపడకుండా ఆపేశారు’’ అని ఉర్సానందే చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














