మిగ్-21: భారత గగనతలాన్ని 60 ఏళ్లు రక్షించిన ఈ ఫైటర్ జెట్‌కు వీడ్కోలు, దీనిని నడిపిన తొలితరం పైలట్ ఏమంటున్నారంటే...

ఫొటో సోర్స్, BRIJESH DHAR JAYAL
- రచయిత, ఆసిఫ్ అలీ
- హోదా, డెహ్రాడూన్ నుంచి, బీబీసీ కోసం
చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో 2025 సెప్టెంబర్ 26న ఫైటర్ జెట్ మిగ్-21కు భారత వైమానిక దళం అధికారికంగా వీడ్కోలు పలికింది.
గత 60 ఏళ్లుగా భారత గగనతలాన్ని రక్షించిన, అనేక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించిన యుద్ధ విమానమే ఈ మిగ్-21.

ఈ మధ్య కాలంలో మిగ్-21 ప్రమాదాల బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ, సవాళ్లతో కూడిన సమయాల్లో మిషన్‌లు నిర్వహించడం, ధైర్యసాహసాలు ప్రదర్శించడం వంటి అనేక కథలు ఈ యుద్ధ విమానంతో ముడిపడి ఉన్నాయి.
భారత వైమానిక దళం, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ బ్రిజేశ్ ధర్ జయాల్‌కు ఈ మిగ్-21తో ప్రత్యేక అనుబంధం ఉంది.
భారత్‌లో ఈ సూపర్‌సోనిక్ విమానాన్ని మొట్టమొదటగా నడపడానికి ఎంపిక చేసిన 8 మంది పైలట్లలో బ్రిజేశ్ ధర్ జయాల్ కూడా ఒకరు.
ఈ పైలట్లలో ఆరుగురు చనిపోగా బ్రిజేశ్ ధర్ జయాల్‌తో పాటు ఏకే సేన్ మాత్రమే జీవించి ఉన్నారు.
బ్రిజేశ్ ఇప్పుడు డెహ్రాడూన్‌లో నివసిస్తున్నారు.
సెప్టెంబర్ 27కు ఆయనకు 90 ఏళ్లు నిండుతాయి.
మిగ్-21ను మొదటిసారిగా నడపడం, ప్రమాదాల నుంచి నేర్చుకున్న పాఠాలు, తన అనుభవాలను బ్రిజేశ్ బీబీసీతో పంచుకున్నారు.

ఫొటో సోర్స్, BRIJESH DHAR JAYAL
సోవియట్ యూనియన్‌లో ట్రైనింగ్,
భారత వాయుసేన 1960ల మొదట్లో ఒక కొత్త మలుపు తీసుకుంది.
మిగ్-21 విమానాలను వాడాలని భారత్ నిర్ణయించుకుంది.
ఆ సమయంలో తనను, తన సహచరులను శిక్షణ కోసం సోవియట్ యూనియన్‌కు పంపించారని జయాల్ చెప్పారు. అప్పుడు ఆయన వయస్సు 27 ఏళ్లు.
భారత్ నుంచి మొత్తం ఎనిమిది మంది పైలట్‌లు రష్యా చేరుకున్నారు. కానీ, వైద్య కారణాలతో వారిలో నుంచి ఒక పైలట్ భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. దీంతో ఏడుగురు పైలట్‌లకు రష్యాలో తొలిసారిగా మిగ్-21 విమానాన్ని నడిపే అవకాశం లభించింది.
బ్రిజేష్ జయాల్ తో పాటు, వింగ్ కమాండర్ దిల్బాగ్ సింగ్, స్క్వాడ్రన్ లీడర్ ఎం.ఎస్.డి. వోలెన్, ఎస్కే మెహ్రా, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఏకే ముఖర్జీ, హెచ్‌ఎస్ గిల్, ఏకే సేన్, డి. కీలోర్ ఈ బృందంలో ఉన్నారు.
ఈ బృందం సోవియట్ యూనియన్‌లో మొత్తం నాలుగు నెలలు శిక్షణ తీసుకుంది.
లుగోవాయా ఎయిర్‌బేస్‌లో 1963 జనవరి 11న తొలిసారి ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా మిగ్-21 కాక్‌పిట్‌లో అడుగుపెట్టినప్పుడు తనకు ఎదురైన సవాళ్లు, తన అనుభవాన్ని జయాల్ వివరించారు.
''అన్ని మీటర్లు, అన్ని డయల్స్, రేడియో కమ్యూనికేషన్స్ మొత్తం రష్యన్ భాషలో ఉండేవి'' అని ఆయన చెప్పారు.
దీని కోసం తమకు నెలన్నర పాటు క్లాస్‌రూమ్ శిక్షణ ఇచ్చి, రష్యన్ భాష కూడా నేర్పించినట్లు ఆయన తెలిపారు. క్లాస్‌రూమ్‌లో కేవలం సిస్టమ్స్, సిద్ధాంతాలు మాత్రమే బోధించేవారని చెప్పారు.
''విమానంలోని ప్రతి వ్యవస్థకు సంబంధించిన వివరాలను మాకు అర్థమయ్యేలా చెప్పారు. ఈ పద్ధతినే తర్వాత భారత వాయుసేన కూడా అవలంబించింది'' అన్నారు.

ఫొటో సోర్స్, BRIJESH DHAR JAYAL
ప్రాణాన్ని రక్షించడానికి సాహసం..
సోవియట్‌లో ట్రైనింగ్ తీసుకునే రోజుల్లో జరిగిన ఒక సంఘటనను బ్రిజేష్ ధర్ జయాల్ ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు.
ఒక రోజు తాను ల్యాండింగ్ అప్రోచ్‌లో ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఒక సోవియట్ సైనికుడు రన్‌వే దాటడం ప్రారంభించారని ఆయన గుర్తుచేసుకున్నారు.
అప్పుడు తాను గో ఎరౌండ్ ( ల్యాండ్ కాకుండా తిరిగి పైకి వెళ్లి, మరోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించడం) కు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రన్‌వే పక్కన కూర్చున్న కల్నల్ పదే పదే వద్దని చెప్పినప్పటికీ తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
''తర్వాత బ్రీఫింగ్‌లో నన్ను కోప్పడ్డారు. కానీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని నా తోటి పైలట్లు, దిల్బాగ్ అన్నారు. ఒకవేళ నేను గో-ఎరౌండ్‌కు వెళ్లకపోతే, ఢీకొనే ప్రమాదం ఉండేది. 200 అడుగుల కంటే తక్కువ ఎత్తులో గో-ఎరౌండ్‌కు వెళ్లకూడదని మాకు నేర్పించారు. కానీ ఆ సమయంలో ఒక ప్రాణాన్ని రక్షించడం చాలా ముఖ్యమని నాకు అనిపించింది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, BRIJESH DHAR JAYAL
భారతదేశపు తొలి సూపర్ సోనిక్ స్క్వాడ్రన్
అంబాలాలో 1963 జనవరిలో '28 స్క్వాడ్రన్' ఏర్పాటు చేయడమనేది భారత వాయుసేన చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం.
ఈ స్క్వాడ్రన్‌ను భారతదేశపు మొదటి సూపర్ సోనిక్ స్క్వాడ్రన్‌గా పిలుస్తారు.
మిగ్-21 విమానాలతో సిద్ధమైన మొట్టమొదటి స్క్వాడ్రన్ ఇదే.
ఈ స్క్వాడ్రన్ సహ-వ్యవస్థాపకుల్లో బ్రిజేశ్ ఒకరు.
దీన్ని స్థాపించిన తొలినాళ్లలో పైలట్లు, ఇంజినీర్ల వద్ద పరిమిత వనరులు ఉండేవి.
చండీగఢ్‌లో హ్యాంగర్‌లు చిన్నవిగా ఉండేవి.
చాలాసార్లు గుడారాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లోనే వారు సూపర్ సోనిక్ యుగానికి పునాది వేశారు.
జయాల్ లాగ్‌బుక్‌లో 1963 జులై నాటికి 18 యుద్ధ విమాన ప్రయాణాలు నమోదయ్యాయి.
ఆ తర్వాత ఒక రోజు ముంబయి నౌకాశ్రయానికి ఓడ ద్వారా తీసుకొచ్చిన మొదటి ఆరు మిగ్-21 విమానాలను రష్యన్ ఇంజనీర్లు అసెంబుల్ చేసి, టెస్ట్ ఫ్లైట్ అనంతరం భారత పైలట్లకు అప్పగించారు.
వీటిని నడుపుతూ ముంబయి నుంచి ఆగ్రాకు, అక్కడినుంచి చండీగఢ్ వరకు తీసుకురావడం భారత వాయుసేనకు కొత్త ఆరంభం.
జయాల్ తొలిసారిగా 1963 ఏప్రిల్ 22న సాంతా క్రూజ్ (ముంబయి) నుంచి మిగ్-21 కాక్‌పిట్‌లో కూర్చుని ఈఫైటర్ జెట్‌ను నడిపారు. ఆ తర్వాత, 1963 ఏప్రిల్ 26న సాంతా క్రూజ్ నుంచి ఆగ్రా మీదుగా చండీగఢ్‌కు ప్రయాణించారు.
'ఈ ప్రయాణం నాకొక బంధం లాంటిది' అని జయాల్ అన్నారు.

ఫొటో సోర్స్, BRIJESH DHAR JAYAL
ప్రెజర్ సూట్, ప్రమాదాల నుంచి పాఠాలు
మిగ్-21 వాడకం మొదలైన తొలినాళ్లలో వాటిని నడిపేటప్పుడు పైలట్లు ప్రెజర్ సూట్‌లు ధరించాల్సి వచ్చేది.
ఉత్తర భారతదేశంలో వేసవి కాలంలో సార్టీజ్‌ల (ఒక రౌండ్ విమాన ప్రయాణం) సమయంలో ప్రెజర్ సూట్ ధరించడం చాలా అసౌకర్యంగా ఉండేదని జయాల్ గుర్తు చేసుకున్నారు.
నాసిక్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో జయాల్ మూడున్నరేళ్ల పాటు టెస్ట్ పైలట్‌గా పనిచేశారు.
ప్రతీ కొత్త మిగ్ విమానాన్ని కచ్చితంగా పరీక్షించేవారు. వీటిని నడిపిన ప్రతిసారి ప్రెజర్ సూట్ ధరించాల్సి వచ్చేది.
''అది చాలా అసౌకర్యంగా ఉండేది. కానీ మా పనిలో అది కూడా భాగం'' అని చెప్పారు.
1963 రిపబ్లిక్ డే ఫ్లైపాస్ట్ ప్రాక్టీస్ సమయంలో జైపూర్‌లో రెండు విమానాలు ఢీకొన్న ఘటన అందరినీ కలచివేసింది.
ఈ రెండు విమానాల్లో స్క్వాడ్రన్ లీడర్ ఎం.ఎస్.డి వోలెన్, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఏకే ముఖర్జీ ఉన్నారు. అయినప్పటికీ ఈ ప్రమాదంలో వారిద్దరూ బతికి బయటపడ్డారు.
దీని తర్వాత, ప్రెజర్ సూట్ వాడకాన్ని కేవలం ఎక్కువ ఎత్తులో, అధిక వేగంతో ప్రయాణించే విమానాలకు మాత్రమే పరిమితం చేశారు.
''దీనివల్ల ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ చాలా మెరుగైంది. ప్రతీ ప్రమాదం ఒక పాఠమే. ఇవి ఆపరేషనల్ భద్రతను మరింత మెరుగుపరిచాయి'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, BRIJESH DHAR JAYAL
‘ప్రమాదాల పేరుతో బలిపశువును చేశారు’
గత కొన్నేళ్లుగా మిగ్-21 ఫైటర్ జెట్లు ప్రమాదాలకు గురవుతుండటంతో వీటిని 'ఎగిరే శవపేటిక' గా కొందరు పిలిచారు.
భారతీయ మీడియా నివేదికల ప్రకారం, 1972 నుంచి ఇప్పటివరకు మిగ్-21 ప్రమాదాలు సుమారు 400 జరిగాయి. 2012లో అప్పటి కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, పార్లమెంట్‌లో మాట్లాడుతూ రష్యా నుంచి కొనుగోలు చేసిన 872 మిగ్-21 విమానాల్లో సగం ప్రమాదాలకు గురయ్యాయన్నారు.
జయాల్ ఈ విషయంతో ఏకీభవించలేదు. ఈ అభిప్రాయం తప్పు అని జయాల్ విచారంగా అన్నారు.
''దేశానికి ఒక కవచంగా మిగ్-21 పనిచేసింది. ప్రతిసారీ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న అద్భుతమైన యంత్రం ఇది. ఈ విమానం ఒక ఆయుధ వ్యవస్థగా అభివృద్ధి చెందడాన్ని, ప్రపంచంలోని అత్యుత్తమ పైలట్ల చేతుల్లో మరింత శక్తిమంతమైన ఆయుధంగా మారడాన్ని నేను చూశాను'' అని ఆయన అన్నారు.
''నా కష్టం, నా అంకితభావం అన్నీ మిగ్-21తో ముడిపడి ఉన్నాయి. ఇదొక మంచి యంత్రం. ఇది విమానం మాత్రమే కాదు నా జీవితంలో ఒక భాగం'' అని చెప్పారు.
జయాల్ చివరిసారిగా 1992 నవంబర్ 18న మిగ్‌లో ప్రయాణించారు. అప్పుడు ఆయన జోధ్‌పూర్‌లో సౌత్ వెస్ట్రన్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ ఆఫీసర్‌గా ఉన్నారు.
''మిగ్-21 విమాన భద్రత సమస్యలు, వాటి పరిష్కారాలను డాక్యుమెంట్ చేశారు. కేవలం పరిపాలనాపరమైన చిత్తశుద్ధి లోపించింది. మిగ్-21ను బలిపశువు చేయడం, దురదృష్టవశాత్తు పరిష్కారం కాదు'' అని 2002 ఏప్రిల్ 20న ఆంగ్ల వార్తాపత్రిక 'ది టెలిగ్రాఫ్'లో 'గాట్ ది రాంగ్ బర్డ్' అనే శీర్షికతో జయాల్ ఒక కథనాన్ని రాశారు.
ఈ కథనంలో ఆయన మిగ్-21ను ప్రశంసించారు.

ఫొటో సోర్స్, BRIJESH DHAR JAYAL
మిగ్-21 వారసత్వం, జయాల్ సందేశం
మిగ్-21 వేగమే దాని ప్రత్యేకత. ఇది శబ్దం కంటే రెట్టింపు వేగంతో ప్రయాణిస్తుంది. భారత వైమానిక దళానికి ఈ ఫైటర్ జెట్ కొత్త శక్తిని ఇచ్చింది.
''ఈ ఫైటర్‌జెట్‌తో నాకు చాలా ఉత్కంఠభరితమైన అనుభవాలు ఉన్నాయి. రాత్రిపూట టేకాఫ్ అయ్యాక ఇంజిన్ ఆగిపోవడం, 15 కిలోమీటర్ల ఎత్తులో 'ఫ్లేమ్-అవుట్' కావడం, కొత్త ఆయుధాల పరీక్షలు. ఇవన్నీ ఇప్పుడు పిల్లలకు, మనవలు, మనవరాళ్లకు కథలుగా చెబుతున్నాను.
నేను వైమానిక దళంలో ఉన్నప్పుడు ప్రతిదీ పూర్తి అంకితభావంతో చేశాను. వాయుసేన కారణంగా నేను చాలా పొందాను. వాటన్నింటికీ వాయుసేనకు నేను కృతజ్ఞుడను. మనల్ని చూసేవారు మన నుంచి స్ఫూర్తి పొందుతారు. ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తాం. ఈ ప్రక్రియే దేశాన్ని, సైన్యాన్ని బలోపేతం చేస్తుంది'' అని ఆయన అన్నారు.
మిగ్-21పై వివాదాలు, విమర్శలు వంటివి ఉన్నప్పటికీ ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) బ్రిజేష్ ధర్ జయాల్ దృష్టిలో ఈ విమానం గౌరవం, గర్వానికి చిహ్నం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














