హైదరాబాద్ మెట్రో రైలును ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకుంటోంది, ఆ లింకు కుదరకపోవడమే ప్రధాన కారణమా?

హైదరాబాద్ మెట్రో

ఫొటో సోర్స్, ltmetro.in

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం టేకోవర్(స్వాధీనం) చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

ఇప్పటివరకు 90 శాతం భాగస్వామిగా ఉన్న ఎల్ అండ్ టీ కంపెనీ తన వాటా విక్రయానికి అంగీకరించినట్లుగా తెలంగాణ సీఎంవో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

''మెట్రో రైలు ఫేజ్ -1లో తమకున్న మొత్తం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన చర్చల సందర్భంగా ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు'' అని ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఎల్ అండ్ టీ మెట్రో ప్రాజెక్టుపై ప్రస్తుతం ఉన్న దాదాపు రూ. 13,000 కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తారు.

''ఎల్ అండ్ టీ కంపెనీ ఈక్విటీ విలువకు సుమారు రూ.2 వేల కోట్లు వన్ టైం సెటిల్మెంట్ చేయాలని కంపెనీ ప్రతిపాదించింది'' అని ప్రభుత్వం చెప్పింది.

ఈ చెల్లింపులు పూర్తయితే, ప్రస్తుతం హైదరాబాద్‌లో నడుస్తున్న మెట్రో ప్రాజెక్టు మూడు కారిడార్ల నెట్‌వర్క్ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది.

ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో 69.2 కిలోమీటర్ల పరిధిలో, మూడు కారిడార్లలో ఉన్న మెట్రో రైలులో సగటున రోజుకు 4.8 లక్షల మంది ప్రయాణిస్తున్నారని అధ్యయనాల్లో తేలింది.

హైదరాబాద్ మెట్రో

ఫొటో సోర్స్, ltmetro.in

ఎల్ అండ్ టీ ఎందుకు తప్పుకుంది?

మెట్రో రైలు భాగస్వామ్యం నుంచి ఎల్ అండ్ టీ వైదొలుగుతుందని గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మెట్రో రెండో దశ ఏ, బీ ప్రతిపాదనల విషయంలో ఎల్ అండ్ టీ ఆసక్తిగా లేదనే ప్రచారం ఉంది.

ఈ విషయంలో అధికారికంగా ఎల్ అండ్ టీ నుంచి ప్రకటన రాకపోయినా, ఆ కంపెనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఏడాది ఆగస్టులో రాసిన లేఖ ఇటీవల వెలుగులో వచ్చింది.

కేంద్ర హౌజింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ వద్ద 2025 జులైలో జరిగిన సమావేశంలో, హైదరాబాద్‌లో మున్ముందు చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ప్రభుత్వం తమను కోరిందని ఎల్ అండ్ టీ తెలిపింది.

కానీ ఆర్థిక భారంతోపాటు రవాణా సంబంధిత ప్రాజెక్టులు చేపట్టే బాధ్యతల నుంచి ఎల్ వైదొలుగుతున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 2025 ఆగస్టు 4న రాసిన లేఖలో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు.

''హైదరాబాద్‌లో చేపట్టే ఫేజ్- 2ఏ, ఫేజ్- 2బి లో పీపీపీ పద్ధతిలో భాగస్వామ్యం కాలేం'' అని స్పష్టం చేశారు.

హైదరాబాద్ మెట్రో రైలు నష్టాల్లో నడుస్తోందని ముందు నుంచీ ఎల్ అండ్ టీ కంపెనీ చెబుతోంది. 2024-25 వార్షిక నివేదిక ప్రకారం, 2025 మార్చి 31 నాటికి మొత్తం ఆదాయం రూ.1,108.54 కోట్లుగా ఉన్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. ఖర్చులు రూ.1,734.45 కోట్లు కావడంతో నష్టాలు రూ.625.91 కోట్లు ఉన్నట్లుగా చూపించింది.

అలాగే మెట్రో మొదలైనప్పటి నుంచి మొత్తం రూ.6605.51 కోట్ల నష్టాలున్నట్లుగా వార్షిక నివేదికలో పేర్కొంది.

మెట్రో రైలు

ఫొటో సోర్స్, ltmetro.com

ఆ ‘లింకు’ కుదరదు

మెట్రో మొదటి దశ ప్రైవేటు(ఎల్ అండ్ టీ) భాగస్వామ్యంలో ఉంది. రెండో దశను ప్రభుత్వం చేపట్టదలచుకుంటే రైళ్ల ఆపరేషన్స్, నిర్వహణ ప్రొటోకాల్స్, రైళ్ల ఆపరేషన్ విధానాలు, రేట్లు, ఆదాయం, ఖర్చుల పంపకాలు ఇలా ఎన్నో ఇబ్బందులు ఏర్పడే వీలుందని ఎల్ అండ్ టీ గుర్తించింది.

ఉదాహరణకు మొదటి దశ కారిడార్-1 కింద ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ఉంది. రెండో దశలో ఇటు హయత్ నగర్ వరకు, అటు పటాన్‌చెరు వరకు విస్తరించాలనే ఆలోచన ఉంది. అప్పుడు విస్తరించిన మార్గాలు వేరొకరి ఆధ్వర్యంలో లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే నిర్వహణ సాధ్యం కాదని ఎల్ అండ్ టీ అభ్యంతరం చెప్పింది.

''ఈ పరిస్థితుల్లో మొదటి దశలోని మా ఈక్విటీని కొత్తగా స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం'' అని ఆ లేఖలో చెప్పారు కేవీబీ రెడ్డి.

అయితే, ఈ విషయంలో ఎల్ అండ్ టీ ప్రతినిధిని ఫోన్‌లో సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించగా, వారు అందుబాటులోకి రాలేదు.

హైదరాబాద్ మెట్రో

ఫొటో సోర్స్, ltmetro.in

ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేస్తోంది..?

తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్ విస్తరణలో భాగంగా రెండో దశను పార్ట్- ఏ, బీ గా విభజించింది.

ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.

మొదటి దశ ప్రైవేటు నిర్వహణలో ఉండటంతో రెండో దశను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుండటంతో రెండింటిని కలుపుకొని డెఫినెటివ్ అగ్రిమెంట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చెప్పింది.

ఇది జరిగితే అనుమతులు ఇవ్వగలమని గతంలోనే స్పష్టం చేసింది.

''ఎల్ అండ్ టీ ని జాయింట్ వెంచర్లో భాగం కావాలని అడిగామని, అందుకు ఒప్పుకోకపోవడంతో మొదటి దశ కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

దీనివల్ల రెండో దశ, మొదటి దశను కలిపే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీబీసీతో చెప్పారు.

''మెట్రో విస్తరణలో ఇదో కీలక అడుగు. భవిష్యత్తు ఇబ్బందులు రాకుండా ఉండేందుకే మొదటి దశను కొనుగోలు చేయడం భారమైనా సరే, ప్రభుత్వం ముందుకు వచ్చింది'' అని చెప్పారు అద్దంకి దయాకర్.

టికెట్ల రేట్లు, రైళ్ల నిర్వహణ ప్రభుత్వం చేతికి వస్తే, ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

ఇప్పటివరకు ప్రైవేటు కంపెనీల చేతిలో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వచ్చినప్పుడు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ నిపుణులు, ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ ఎం.కుమార్ బీబీసీతో చెప్పారు.

''నిర్వహణ, ఆపరేషన్స్ విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ చూపాలి. టికెట్ల ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశిస్తారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం తరఫున కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి'' అని వివరించారు.

మెట్రో రైల్ నిర్వహణ కోసం స్వతంత్రంగా పనిచేసే బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పారు ప్రొఫెసర్ కుమార్.

ఎల్ అండ్ టీ అభ్యంతరాలేంటి?

మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్టు ఆలస్యం, వ్యయం పెరుగుదల కారణంగా 2017 మార్చిలో రూ.3756 కోట్లు ఈక్విటీ కింద చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ కోరింది.

ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో మెట్రో పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేనాటికి వ్యయ భారం రూ.5000 కోట్లకు చేరుకుందని అంచనా.

2022 జులై 22న జరిగిన సప్లిమెంటరీ కన్సెషన్ అగ్రిమెంట్ మేరకు రూ.3 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటే, ప్రభుత్వం తరఫున రూ.900 కోట్లు చెల్లించారని కంపెనీ ప్రభుత్వానికి చెప్పింది.

తాజాగా వన్ టైం సెటిల్మెంట్ కింద రూ.2 వేల కోట్ల ఈక్విటీని చెల్లించి, అప్పులు బదలాయించుకుని మెట్రో మొదటి దశను టేకోవర్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

హైదరాబాద్ మెట్రో

ఫొటో సోర్స్, ltmetro.in

నిధుల సమీకరణ సాధ్యమేనా?

దేశంలో రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, అత్యధికంగా దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 450.8 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్‌వర్క్ ఉంది.

ఆ తర్వాత మహారాష్ట్రలో 171.8 కిలోమీటర్లు, కర్ణాటకలో 76.9 కిలోమీటర్లు ఉండగా.. తర్వాత తెలంగాణ(హైదరాబాద్)లో 69.2 కిలోమీటర్ల పొడవైన మెట్రో ట్రాక్ ఉందని జులైలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక కథనంలో పేర్కొంది.

అయితే, హైదరాబాద్‌లో ప్రారంభ సమయంలో మెట్రో రైల్ నెట్‌వర్క్ ఏ స్థాయిలో ఉందో, ఇప్పటికీ అంతే పొడవు ఉంది.

ఇప్పుడు మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ (పార్ట్-ఏ) కింద 76.4 కిలోమీటర్లను ప్రతిపాదించింది. ఇందుకు రూ.24,269 కోట్లు అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం.

పార్ట్-బి కింద మరో 86.6 కిలోమీటర్లకు సుమారు 19 వేల కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేసింది.

మెట్రో విస్తరణలో భాగంగా ప్రభుత్వ పరంగా అధికారులు, ఇంజినీర్లు, ఇతర సిబ్బంది మెట్రో ఆపరేషన్స్ కోసం సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ కుమార్ అభిప్రాయపడ్డారు.

''రెండు, మూడు దశల ప్రణాళికల్లో ఏటా ప్రయాణికుల సంఖ్య ఎంత పెరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కోచ్ లు ఎలా పెంచుకోవాలి. సౌకర్యాలు పెంచుకునే విషయంపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి'' అని బీబీసీతో చెప్పారు.

ఏదైనా అత్యవసరమైతే స్పందించే ఎమర్జెన్సీ యంత్రాంగం ఉండాలని వివరించారు.

మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి తీసుకువచ్చిన అప్పులు, ఆర్బీఐ లెక్కల ప్రకారం, 3.49లక్షల కోట్లకు చేరుకుంది.

అలాగే 2023-24 అంచనాల ప్రకారం, రూ.23,308 కోట్లు అప్పులపై వడ్డీలు కడుతోంది ప్రభుత్వం.

ఈ దశలో వేల కోట్లు సమీకరణ ఎలా సాధ్యమవుతుందనేది ఇక్కడ అసలు ప్రశ్న.

బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ప్రాజెక్టు రెండో దశ చేపడితే, ఆర్థిక భారం ప్రభుత్వంపై తీవ్రంగా పడే అవకాశం ఉంది.

మెట్రో నిర్వహణ భారం కూడా ప్రభుత్వంపై పడే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుతం మెట్రో ఆదాయ మార్గాలు మూడురకాలుగా ఉన్నాయి.

50శాతం ఆదాయం ఛార్జీల రూపంలో వస్తుండగా, 45శాతం రియల్ ఎస్టేట్(మాల్స్), 5శాతం అడ్వర్టైజ్ మెంట్స్ రూపంలో సమకూరుతోంది.

''ప్రభుత్వం అనేది లాభాపేక్ష చూసుకోదు. ఆర్టీసీని ఎన్నో ఏళ్లుగా నడుపుతోంది. మెట్రో విషయంలోనూ అంతే. లాభాల కోణంలో కాదు, ప్రజలకు ప్రయోజనం కోణంలో ప్రభుత్వం మెట్రోను నడిపిస్తుంది'' అని అద్దంకి దయాకర్ బీబీసీతో చెప్పారు.

నిధుల సమీకరణకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకువచ్చి తర్వాత చెల్లించే వెసులుబాటు ఉందన్నారు.

మెట్రో రైలు

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్ మెట్రో మొదటి దశ మొదలైందిలా..

దేశంలో పబ్లిక్-ప్రైవేటు పార్టనర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో నిర్మాణం జరిగిన మెట్రోగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు పేరుంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ ఆపరేట్, ట్రాన్స్ ఫర్(డీబీఎఫ్ఓటీ) పద్ధతిన మెట్రో రైల్ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నిర్మించేందుకు ముందుకు వచ్చింది.

  • 2010 సెప్టెంబరు నాలుగో తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎల్ అండ్ టీ కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకుంది.
  • 2011 మార్చి 1న ఆరు నెలల వ్యవధిలోనే ప్రాజెక్టుకు ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తయ్యింది.
  • ఎస్బీఐ ఆధ్వర్యంలో పది బ్యాంకులతో కూడిన కన్సార్షియం అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
  • 2012 ఏప్రిల్ 26న మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
  • మొదటి దశలో మూడు కారిడార్లు అందుబాటులోకి వచ్చాయి.
  • 69.2 కిలోమీటర్ల మార్గం నిర్మాణం పూర్తయ్యింది.
  • కారిడార్ – 1 ; మియాపూర్ – ఎల్బీనగర్
  • కారిడార్ – 2 ; జేబీఎస్ – ఎంజీబీఎస్
  • కారిడార్ – 3 ; నాగోలు – రాయదుర్గం
  • 2017 నవంబరు 29 న మెట్రో రైలు సర్వీసు పాక్షికంగా ప్రారంభం
  • 2020 ఫిబ్రవరి 7న మెట్రో రైలు సర్వీసు పూర్తిగా ప్రారంభం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)