శంబాల దేవి: తొలి మహిళా మావోయిస్టు మిలిటరీ కమాండర్ 25 ఏళ్ల పోరాటం తర్వాత ఎందుకు లొంగిపోయారు?

ఫొటో సోర్స్, Shambala Devi
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక చేతిలో ఏకే 47 తుపాకీ, మరో చేతికి వాచ్, నడుముకున్న బెల్టుకు వేలాడుతున్న వాకీ టాకీ, ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న చొక్కా, ప్యాంట్ వేసుకున్న తన ఫోటోను శంబాల దేవి నాకు చూపించారు.
అది ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు తీసిన ఫోటో. ఆమె దగ్గర అలాంటి ఫోటోలు రెండే ఉన్నాయి. ఆ ఫోటో 25 ఏళ్ల క్రితం నాటిది.
సాయుధ మావోయిస్ట్ ఉద్యమంలో ఒక మహిళ తొలిసారిగా కమాండర్ స్థాయికి ఎదిగిన సమయమది.
ఉద్యమ కాలంలో ఆమె పేరు అనేకసార్లు మారింది. ఉద్యమంలో చేరినప్పుడు ఆమెను దేవక్కగా పిలిచేవారు. అంతకు ముందు ఆమె పేరు వట్టి అదిమే
2014లో ఆమె ఆయుధాల్ని వదిలేసి లొంగిపోయారు.
మేము ఆమెను కలిసినప్పుడు బట్టలు ఉతుకుతూ కనిపించారు. ఆకుపచ్చ, నీలం రంగు చీర కట్టుకుని..అది తడవకుండా ఉండేందుకు పైకి కట్టుకున్నారు.
ఆమెకిప్పుడు 50 ఏళ్లు. మాకోసం టీ పెట్టి ఇచ్చి, తన పొలంలో పని చేసేందుకు కొడవలి తీసుకుని వెళ్లారు.
ఉద్యమాలు, పోరాటాల్లో మహిళలకు పెద్దగా గుర్తింపు దక్కదు. మావోయిస్టు కమాండర్‌గా ఆమె భర్త రవీందర్ గురించి అనేక వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. అయితే దేవి గురించి పెద్దగా తెలియదు.
తన గురించి చెప్పేందుకు మొదట ఇష్టపడకున్నా, ఎట్టకేలకు తన సొంతూళ్లో మాతో మాట్లాడేందుకు అంగీకరించారు.


మావోయిస్టు ఉద్యమంలోకి..
మావోయిస్టు దళాల్లో మహిళల సంఖ్య చాలా తక్కువ.
అలాంటి సమయంలో దేవి తన సొంతూరిని, సాధారణ జీవితాన్ని వదిలేసి గెరిల్లా యుద్ధంలో భాగస్వామిగా మారాలని నిర్ణయించుకున్నారు.
"మాకు భూమి లేదు. పేదవాళ్లం. పస్తులతో పడుకోవాల్సి వచ్చేది. కనీస వైద్య సౌకర్యాలు కూడా లేవు" అని ఆమె చెప్పారు
"అటవీ భూముల్ని దున్నేందుకు ప్రయత్నించినప్పుడు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు, పోలీసులు కుమ్మక్కై మమ్మల్ని కొట్టారు" అని దేవి అన్నారు.
అటవీ భూముల్లో వ్యవసాయం చేయడం చట్ట విరుద్దం. అలా సాగు చేసే వారిని బలవంతంగా ఖాళీ చేయించడం సహజమేనని స్థానికులు, కార్యకర్తలు చెప్పారు.
తనకు 13 ఏళ్లున్నప్పుడు తన తండ్రిని ఫారెస్ట్ అధికారులు కొట్టడం, పోలీసులు జైలులో పెట్టడం చూసిన తర్వాత ఇల్లు వదిలేసి ఉద్యమంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు దేవి చెప్పారు.
"మా గోడు వినిపించాలంటే తుపాకీ పట్టుకోవడమే మార్గం అనిపించింది" అని ఆమె అన్నారు.
గ్రామస్థులు అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించినప్పుడు పోలీసులు తమ గోడు పట్టించుకోరని "మావోయిస్టులు వచ్చిన తర్వాతే అటవీశాఖ అధికారులు వెనక్కి తగ్గారు" అని ఆమె చెప్పారు.

‘పేద ఆదివాసీ ప్రాంతాల్లో అతి పెద్ద సమస్య’
1988లో ఆమె నక్సలైట్లలో చేరారు. 2000 నాటికి వేల మంది దళ సభ్యులతో పది రాష్ట్రాల్లో విస్తరించిన మావోయిస్ట్ ఉద్యమం పతాక స్థాయికి చేరింది.
మధ్య, తూర్పు భారతదేశంలోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకు బలమైన పట్టుంది.
రాజ్యం అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలనే చైనా విప్లవ నాయకుడు మావో జెడాంగ్ సిద్ధాంతం పునాదిగా ఈ ఉద్యమం విస్తరించింది.
పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరి గ్రామంలో 1967లో మొదలైన సాయుధ రైతు పోరాటం తర్వాతి కాలంలో నక్సలైట్ ఉద్యమంగా గుర్తింపు పొందింది.
అనేక ప్రాంతాలకు విస్తరించిన ఈ హింసాత్మక పోరాటం కొన్ని దశాబ్దాలు కొనసాగినా.. ఇటీవలి కాలంలో బలహీనపడింది.
పేదలకు భూ పంపిణీ, సాయుధ పోరాటం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసి సమసమాజ స్థాపన కోసం పోరాడుతున్నట్లు ప్రకటించుకున్న గెరిల్లా గ్రూపుల నాయకత్వంలో ఈ ఉద్యమం నడిచింది.
అటవీ భూముల్ని వేలంపాట ద్వారా కార్పోరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న ప్రభుత్వం దశాబ్దాల తరబడి గ్రామాలను నిర్లక్ష్యం చేసిందనేది నక్సలైట్ల వాదన.
అయితే అటవీ భూములు గ్రామ ప్రజల సొంతం కాదని, అందులో వారు వ్యవసాయం చేయకూడదని, పరిశ్రమల ఏర్పాటు ద్వారా అభివృద్ధి, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
"నక్సలిజం పేద ఆదివాసీ ప్రాంతాల్లో అతి పెద్ద ముప్పు. దాని కారణంగా ఆదివాసీలకు ప్రాథమిక అవసరాలైన ఆహారం, విద్యుత్, విద్య, గృహాలు, మరుగుదొడ్లు, పరిశుభ్రమైన నీరు అందడం లేదు" అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ ఏడాది జూన్‌లో చెప్పారు.
లొంగిపోయేందుకు ఇష్టపడని మావోయిస్టుల విషయంలో ప్రభుత్వం ‘రాజీ లేని వైఖరి’తో వ్యవహరిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
మావోయిస్టులే లక్ష్యంగా భద్రతా బలగాలు ఇటీవల తమ ఆపరేషన్లను తీవ్రం చేశాయి.
2026 మార్చ్ 31 నాటికి దేశంలో మావోయిస్టు సమస్యను లేకుండా చేస్తామని అమిత్‌షా ప్రకటించారు.

ఫొటో సోర్స్, Shambala Devi
‘ఎంత మందిని చంపేశారు?’
1980ల్లో నక్సలైటుగా ఉన్నప్పుడు, తాను వివిధ రాష్ట్రాలలో పర్యటించానని 30 మంది సభ్యులున్న దళానికి నాయకత్వం వహించానని, ప్రభుత్వ దళాలకు చెందిన అనేకమందిని తాను హతమార్చినట్లు దేవి చెప్పారు.
1980ల నాటి ఘటనలు కావడంతో ఆమె వ్యాఖ్యల్ని స్వతంత్రంగా ధృవీకరించడం ప్రస్తుతం సాధ్యం కాని అంశం.
"తొలిసారి ఆకస్మిక దాడికి నాయకత్వం వహించిన విషయం నాకింకా గుర్తుంది. 45 కేజీల మందుపాతరతో మైన్‌ప్రూఫ్ వాహనాన్ని పేల్చివేశాము. అందులో భద్రతా సిబ్బంది చనిపోయారు" అని ఆమె చెప్పారు.
తన నాయకత్వంలో జరిగిన ఆకస్మిక దాడుల పట్ల తాను గర్వంగా ఉన్నట్లు అనిపించింది. భద్రతా బలగాలను హతమార్చినందుకు ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు.
అయితే, మీరు ఎంతమందిని చంపి ఉంటారని పదేపదే అడిగినప్పుడు, తాను హత్య చేసిన వారిలో సాధారణ పౌరులు కూడా ఉండటం పట్ల చింతిస్తున్నట్లు చెప్పారు.
పోలీస్ ఇన్‌ఫార్మర్లు అని కొంతమందిని, భద్రతా బలగాలపై దాడుల్లో పొరపాటున మరి కొంతమందిని చంపేసినట్లు వివరించారు.
"మా వాళ్లను మేమే చంపుకోవడం తప్పుగా అనిపిస్తుంది. నేను వాళ్ల గ్రామానికి వెళ్లి, వాళ్లకు క్షమాపణ చెబుతా" అని ఆమె అన్నారు.
భద్రతా సిబ్బందిలో ఒకరి బైక్ మీద ఎక్కివెళుతున్న ఓ వ్యక్తి, తమ దళం చేసిన ఆకస్మిక దాడిలో చనిపోయిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆ దాడిలో చనిపోయిన వ్యక్తి తల్లి ఏడుస్తూ కోపంతో ‘‘రాత్రి పూట దాడులకు ఎందుకు ప్లాన్ చేశారు, సాధారణ పౌరుల్ని గుర్తించడం కష్టం కదా’’ అని అడిగినట్లు దేవి చెప్పారు.
ప్రభావం ఎక్కువగా ఉంటుందనే రాత్రిపూట దాడులు చేస్తామని ఆమె మాతో చెప్పారు.
తాను ఎంతమందిని చంపానో తనకు తెలియని దేవి అన్నారు.
అయితే ఇటీవలి సంవత్సరాలలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన హింసాత్మక దాడుల్లో వేల మంది చనిపోయారు.
అందులో ఎక్కువ మంది ఆదివాసీలు.
2000 సంవత్సరం నుంచి 2025 మధ్య 12 వేల మంది చనిపోయినట్లు టెర్రరిజం, స్వల్ప తీవ్రతతో యుద్ధం జరిగే ప్రాంతాల్లో మరణాల సంఖ్యను నమోదు చేసే సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Shambala Devi
సవాళ్లు, విముక్తి
హింస వల్ల ఆప్తుల్ని కోల్పోయిన వారి నుంచి విమర్శలు ఎదురైనప్పటికీ, స్థానికులు తమకు ఆహారం, నిత్యవసరాలు అందిస్తూ అండగా నిలిచే వారని దేవి చెప్పారు.
మావోయిస్టులు తమకు రక్షణగా ఉన్నారని ఆదివాసీలు భావించే వారని ఆమె అన్నారు. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో అటవీ భూముల్ని సమానంగా పంచడంతో పాటు ప్రజలకు ఆరోగ్యం, తాగునీరు అందుబాటులోకి తెచ్చినట్లు ఆమె చెప్పారు. ఆమె చెప్పింది నిజమేనని కొంతమంది గ్రామస్థులు చెప్పారు.
గెరిల్లా యుద్ధం ఆమెకు మానసికంగా, శారీరంగా పూర్తిగా కొత్తది. అంతకు ముందెన్నడూ మగాళ్ల ముందు మాట్లాడలేదు. దీంతో దళాన్ని నడిపించడం, దళ సభ్యులకు ఆదేశాలివ్వడం గురించి నేర్చుకోవాల్సి వచ్చింది.
పోరాటంలో తాను ఎదిగిన తీరు చూసి వాళ్లు తనను గౌరవించే వారని దేవి చెప్పారు.
ప్రభుత్వ భద్రతా బలగాలు వాగులు, నీరు ప్రవహించే ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉండటంతో ఆమె దళం నీటి ప్రవాహాలకు దూరంగా క్యాంపు చేసేది. దళ సభ్యులకు అవసరమైన నీళ్లు తీసుకువచ్చే డ్యూటీ మహళలు చేయాల్సి వచ్చేది. అదిచాలా కష్టమైన పని.
దళాలు ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కఠినమైన అడవులు, కొండ ప్రాంతాల్లో పీరియడ్స్ వల్ల ఒళ్లంతా విపరీతమైన నొప్పులు ఉన్నా విరామం లేకుండా ప్రయాణించాల్సి వచ్చేదని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, ShambalaDevi
దళం ఇచ్చిన గుర్తింపు
దళంలో చేరిన తనకు లభించిన స్వేచ్ఛ గురించి కూడా ఆమె మాట్లాడారు. అక్కడ తనను తాను నిరూపించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పారు.
"ఆదివాసీల్లో మహిళలను చెప్పుల మాదిరిగా భావిస్తారు. వాళ్లకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండదు. ఎవరో ఒకరి భార్యగా, తల్లిగా, కూతురిగా గుర్తిస్తారు. అయితే మావోయిస్టు సంస్థలో మేము సాధించిన వాటి ఆధారంగా మా గుర్తింపు ఉంటుంది. కమాండర్ కావడం ద్వారా నాకు అలాంటి గుర్తింపు వచ్చింది" అని ఆమె చెప్పారు.
తాను ఊళ్లో ఉండి ఉంటే తనకు చిన్న వయసులోనే పెళ్లి చేసి ఉండేవారని, అయితే దళంలోకి వెళ్లిన తర్వాత తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని దేవి చెప్పారు.
రెండువైపులా దాడులు పెరగడం, భద్రతా బలగాలు, మావోయిస్టుల దాడుల్లో అనేక మంది చనిపోవడంతో తన జీవితం, భవిష్యత్ గురించి పునరాలోచనలో పడినట్లు దేవి చెప్పారు.
ఉద్యమ లక్ష్యాలను సాధించే పరిస్థితి కనుచూపు మేరలో ఎక్కడా లేదని అనిపించిందన్నారు.
"ఒకవైపున భద్రతా బలగాలు మావోయిస్టుల్ని పట్టుకునేందుకు ఆపరేషన్లు తీవ్రం చేశాయి. మరోవైపు మా పైనా దాడులు పెరిగాయి. మా వాళ్లు ఎక్కువ మంది చనిపోయారు" అని దేవి వివరించారు.
ఆమెకు క్షయ వ్యాధి సోకడంతో చికిత్స కోసం అడవుల్లో నుంచి నగరంలోని ఆసుపత్రులకు రహస్యంగా రాకపోకలు సాగించాల్సి రావడం కూడా పోలీసుల ఎదుట లొంగిపోయేలా చేసింది.
"ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటే ఏదైనా మార్పు వచ్చి ఉండేది. అయితే మేము అలసిపోయాము. మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో ప్రజల నుంచి మద్దతు కూడా తగ్గింది" అని దేవి చెప్పారు.
ఉద్యమంలోకి వచ్చే వారి సంఖ్య తగ్గినట్లు మావోయిస్టుల అంతర్గత అంచనాల్లో తేలిందని ఆమె అన్నారు.
ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమంతో బాగా కలిసిపోయిన మారుమూల ప్రాంతాలకు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా కారణంగా బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగాయి.
భద్రతా బలగాలు మావోయిస్టుల్ని గ్రామాల నుంచి తరిమేసి, అడవుల్లో వారికి సహకారం అందకుండా చేసేందుకు డ్రోన్ల వంటి అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Shambala Devi
ఎందుకు లొంగిపోయారు?
25 ఏళ్లు అడవుల్లో జీవించిన దేవి 2014లో ఆయుధాలు వదిలేసి ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ పునరావాస విధానం కింద పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఈ పాలసీ ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులు భవిష్యత్‌లో తాము ఆయుధాలు చేపట్టబోమని హామీ ఇవ్వాలి. అలాంటి వాళ్లకు ప్రభుత్వం భూమి, నగదు, పశువుల్ని అందిస్తుంది.
ప్రస్తుతం ఆమె ఒకప్పుడు తాను విడిచి వెళ్లిన గ్రామీణ జీవితాన్ని గడుపుతున్నారు.
దేవి, ఆమె భర్త లొంగిపోయిన తర్వాత ప్రభుత్వం వారికి కొంత భూమి డబ్బు, రాయితీ కింద 21 గొర్రెల్ని ఇచ్చింది.
పునరావాస పథకంలో భాగంగా, మావోయిస్టులు చేసిన నేరాల విషయంలో వారికి క్షమాభిక్ష ఉంటుందనేది ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు.
అయితే వారు చేసిన నేరాలకు సంబంధించి విచారణ కొనసాగించేందుకు ప్రతీ కేసును విడివిడిగా పరిశీలిస్తారు.
తమపైన హింసకు సంబంధించి ఎలాంటి కేసులు లేవని, పెండింగ్ కేసులు ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని ఈ జంట చెబుతోంది.
పదేళ్లలో 8వేల మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మావోయిస్టు ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఉద్యమంలో ఎంత మంది ఉన్నారు, వారిలో ఇప్పుడు ఎంతమంది వెళ్లిపోయారనే దానిపై ఎలాంటి డేటా లేదు.

లొంగిపోయిన తర్వాత దేవి గ్రామ పంచాయతి వార్డ్ మెంబర్‌గా గెలిచారు. "ప్రభుత్వంతో కలిసి పని చేయడం ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నాను" అని ఆమె చెప్పారు.
2026 మార్చ్ కల్లా మావోయిస్టుల్ని నిర్మూలించాలన్న ప్రభుత్వ ప్రకటన గురించి దేవి ఏమాలోచిస్తున్నారు?
ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ఆమె ఆలోచించారు.
"ఉద్యమం అంతరించిపోయినా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ ప్రపంచం ఓ పెద్ద ఉద్యమాన్ని చూసింది. హక్కుల కోసం పోరాడేందుకు అది మరో తరానికి ఎక్కడో ఒక చోట స్ఫూర్తినిస్తుంది. వాళ్లు నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని చంపేయవచ్చు. అయితే అందర్నీ చంపగలరని అనుకోవడం లేదు. ఉద్యమాన్ని పూర్తిగా రూపుమాపలేరని అనుకుంటున్నా" అని ఆమె అన్నారు.
"మీ ఎనిమిదేళ్ల కూతురును ఏదో ఒక రోజు ఉద్యమంలోకి పంపిస్తారా" అని అడిగినప్పుడు ఆమె సమాధానం చాలా స్పష్టంగా ఉంది.
"లేదు. మేము ఇక్కడే ఇలాగే జీవిస్తాం"
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














