‘‘ట్రంప్ జోక్యం చేసుకోకపోతే భారత్, పాకిస్తాన్ మధ్య వినాశకర యుద్ధమే జరిగేది,ఆయనకు నోబెల్ ఇవ్వాలి’’

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, UN

ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌దేనని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ అసెంబ్లీలో చెప్పారు.

''తూర్పు సరిహద్దులో శత్రువుల రెచ్చగొట్టే చర్యలకు పాకిస్తాన్ ప్రతిస్పందించింది, పహల్గాం దాడిపై నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని భారత్‌కు ప్రతిపాదించాం'' అని ఆయన అన్నారు.

''తమ దేశ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నా దార్శనికతకు అనుగుణంగా పాకిస్తాన్ ప్రతి సమస్యను సంభాషణలు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటుంది'' అని షరీఫ్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పహల్గాం ఘటనను భారతదేశం రాజకీయంగా వాడుకుంటోందని షాబాజ్ షరీఫ్ ఆరోపించారు.

''బాహ్య దురాక్రమణ నుంచి పాకిస్తాన్ తనను తాను పూర్తిగా రక్షించుకుంటుంది'' అని షరీఫ్ అన్నారు.

''భారత్‌తో యుద్ధంలో మనం గెలిచాం, ఇప్పుడు మనం శాంతి కోరుకుంటున్నాం. అపరిష్కృత సమస్యలపై భారతదేశంతో సమగ్రమైన, ప్రభావవంతమైన చర్చలు జరపడానికి పాకిస్తాన్ సిద్దంగా ఉంది'' అని షరీఫ్ ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

ట్రంప్‌కు 'నోబెల్' కోసం పాక్ అభ్యర్థన...

''పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకోకపోతే, యుద్ధం తాలూకా పరిణామాలు వినాశకరంగా ఉండేవి'' అని షాబాజ్ షరీఫ్ అన్నారు.

''పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధాన్ని నిరోధించినందుకు నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడు'' అని అభిప్రాయపడ్డారు.

భారత విదేశాంగ మంత్రి జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్

భారత్ ఏం చెబుతోంది?

అదే సమయంలో, భారత్-పాకిస్తాన్ మధ్య వివాదాన్ని ఆపడంలో ఏ మూడో పక్షం (థర్డ్ పార్టీ) పాత్ర లేదని భారతదేశం నిరాకరిస్తోంది.

ఇదే విషయమై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఒక ప్రశ్నకు స్పందిస్తూ, పాకిస్తాన్‌తో తమ సమస్యలన్నీ పరస్పరం, అంటే ద్వైపాక్షికమైనవనే జాతీయ ఏకాభిప్రాయం చాలా సంవత్సరాలుగా ఉందని చెప్పారు.

పహల్గాం దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'తో పాకిస్తాన్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని భారతదేశం స్పష్టంచేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)