షాబాజ్ షరీఫ్ ప్రసంగానికి భారత్ స్పందన: 'ధ్వంసమైన రన్‌వేలు, కాలిపోయిన హ్యాంగర్లు కూడా ఓ విజయమైతే, దానిని పాకిస్తాన్‌ ఆస్వాదించొచ్చు'

షాబాజ్ షరీఫ్, పేటల్ గహ్లోత్

ఫొటో సోర్స్, Getty Images/UNTV

ఫొటో క్యాప్షన్, షాబాజ్ షరీఫ్, పేటల్ గహ్లోత్

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ప్రసంగానికి భారత్ స్పందించింది.

ఐక్యరాజ్యసమితిలోని భారత దౌత్యవేత్త పెటల్ గహ్లోత్ తన 'రైట్ టూ రిప్లై'(జవాబు ఇచ్చే హక్కు)ను ఉపయోగించుకుని పాకిస్తాన్ ప్రధాని ప్రసంగానికి బదులిచ్చారు.

''ధ్వంసమైన రన్‌వేలు, కాలిపోయిన హ్యాంగర్లు కూడా ఒక విజయమైతే, పాకిస్తాన్‌ దానిని ఆస్వాదించవచ్చు'' అని ఆమె అన్నారు.

నిజానికి, దీనికి ముందు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ యూఎన్‌లో మాట్లాడుతూ, '‘భారత్‌తో యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించింది. ప్రస్తుతం, మా దేశం శాంతిని కోరుకుంటోంది'' అన్నారు.

అయితే దీనికి భారత్ స్పందిస్తూ.. అలా జరగాలంటే, పాకిస్తాన్ వారి దేశంలో చురుగ్గా ఉన్న తీవ్రవాద శిబిరాలను మూసేసి, భారత్ కోరుతున్న తీవ్రవాదులను అప్పగించాల్సి ఉంటుందని పేర్కొంది.

"అది పాకిస్తాన్, ఒసామా బిన్ లాడెన్‌ను దశాబ్దం పాటు దాచి, ఆశ్రయం కల్పించిన దేశం" అని పెటల్ గహ్లోత్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత్ ఏమందంటే..

''ఈ సమావేశం పాకిస్తాన్ ప్రధాని అసంబద్ధమైన డ్రామాకు సాక్ష్యంగా నిలిచింది. ఆయన విదేశాంగ విధానంలో ప్రధాన భాగమైన టెర్రరిజాన్ని, మరోసారి కీర్తించారు'' అని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌కు ఫస్ట్ సెక్రటరీగా ఉన్న పెటల్ గహ్లోత్ అన్నారు.

ఎన్ని నాటకాలు, అబద్ధాలు ఆడినా నిజాన్ని దాచలేవని ఆమె అన్నారు.

పహల్గాం దాడిని ఉద్దేశిస్తూ, ''2025 ఏప్రిల్ 25న జరిగిన యూఎన్ భద్రతా మండలి సమావేశంలో, జమ్మూకశ్మీర్‌లో పర్యటకులపై దారుణ మారణహోమానికి పాల్పడిన రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను (తీవ్రవాద సంస్థను) జవాబుదారీతనం నుంచి కాపాడింది ఇదే పాకిస్తాన్'' అన్నారామె.

'' టెర్రరిజంపై యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూ.. దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్తాన్ దాచిపెట్టిన విషయం మర్చిపోవద్దు.''

''నిజం ఏంటంటే, మునుపటిలానే భారత్‌లోని అమాయక పౌరులపై టెర్రరిస్టు దాడులకు పాకిస్తాన్‌దే బాధ్యత'' అని పెటల్ అన్నారు.

''దశాబ్దాలుగా వారి దేశం టెర్రరిస్టు క్యాంపులను నడుపుతున్నట్లు పాకిస్తాన్ మంత్రులే ఇటీవల అంగీకరించారు'' అని చెప్పారు.

''పాకిస్తాన్ కపటత్వం మరోసారి బహిర్గతం కావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే, ఈసారి ప్రధాన మంత్రి స్థాయిలో. ఒక ఫోటో వెయ్యి మాటలకు సమానం. బహావల్‌పూర్, మురిద్కేలో టెర్రరిస్ట్ క్యాంపులపై జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన టెర్రరిస్టుల ఫోటోలను మనం చూశాం'' అని పెటల్ గహ్లోత్ అన్నారు.

'' పాకిస్తాన్ సీనియర్ సైనిక అధికారులు, పౌరులు బహిరంగంగా ఈ టెర్రరిస్టులను కీర్తిస్తూ, నివాళులు అర్పించడం చూశాం. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా?'' అని ప్రశ్నించారు.

ఆపరేషన్ సిందూర్

ఫొటో సోర్స్, FAROOQ NAEEM/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌లోని మురిద్కేలో ఉన్న పలు మిలిటెంట్ క్యాంపులను లక్ష్యంగా చేసుకున్నట్లు భారత సైన్యం చెప్పింది.

'శాంతి కావాలనుకుంటే, టెర్రరిస్టులను అప్పగించాలి'

''భారత్‌తో జరిగిన తాజా ఘర్షణ గురించి పాకిస్తాన్ ప్రధాని ఒక విచిత్రమైన వాదన వినిపించారు. అయితే, ఈ విషయంలో రికార్డ్ చాలా స్పష్టంగా ఉంది. మే 9 వరకు, మరిన్ని దాడులు చేస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. కానీ, మే 10న ఆ దేశ సైన్యం నేరుగా దాడులను ఆపివేయాలని మమ్మల్ని అభ్యర్థించింది'' అని గహ్లోత్ చెప్పారు.

''పాకిస్తాన్ సైన్యం ఈ అభ్యర్థన ఎందుకు చేసిందంటే.. భారత వైమానిక దళ దాడుల్లో పలు పాకిస్తానీ సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. వాటి ఫోటోలు కూడా బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. పాక్ ప్రధాని చెప్పినట్లు ధ్వంసమైన రన్‌వేలు, కాలిపోయిన హ్యాంగర్లను కూడా ఒక విజయమైతే, దానిని పాకిస్తాన్‌‌ను ఆస్వాదించవచ్చు'' అని పెటల్ గహ్లోత్ వ్యాఖ్యానించారు.

''గతంలో మాదిరిగానే, నిజమేంటంటే.. అమాయక భారత పౌరులపై టెర్రరిస్టులు జరిపిన దాడులకు పాకిస్తాన్‌దే బాధ్యత. మా ప్రజలను రక్షించుకునే హక్కును మేం వినియోగించుకున్నాం. ఈ చర్య దాడులకు పాల్పడిన వారికి, వాటిని ప్లాన్ చేసిన వారికి తగిన సమాధానం ఇచ్చింది."

''భారత్‌తో శాంతిని కోరుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రధాన మంత్రి చెబుతున్నారు. నిజంగా ఆయన ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నట్లయితే, అందుకు మార్గం సుస్పష్టం. పాకిస్తాన్ తక్షణమే అన్ని టెర్రరిస్టు క్యాంపులను మూసేసి, భారత్ కోరుతున్న టెర్రరిస్టులను అప్పగించాలి'' అని ఆమె అన్నారు.

''ద్వేషం, మతతత్వం, అసహనంతో నిండిపోయిన దేశం మాకు సిద్ధాంతాలు బోధించడం విడ్డూరం. పాకిస్తాన్‌లో జరుగుతున్న రాజకీయ, బహిరంగ చర్చలు దాని నిజస్వరూపాన్ని వెల్లడిస్తున్నాయి. పాకిస్తాన్ చాలాకాలంగా తనను తాను అద్దంలో చూసుకోలేదన్నది అర్థమవుతోంది.''

''ఇరుదేశాల మధ్య జరిగే ఏ విషయమైనా ద్వైపాక్షిక అంశమని భారత్-పాకిస్తాన్‌లు చాలాకాలం క్రితమే అంగీకరించాయి. మూడో పార్టీకి అసలు దీనిలో చోటు ఉండదు. ఎంతోకాలంగా అనుసరిస్తున్నది ఇదే.''

''టెర్రరిజం విషయానికి వస్తే.. టెర్రరిస్టులను, వారిని పెంచి పోషిస్తున్న వారి మధ్య వ్యత్యాసం ఉండదని మేం స్పష్టంగా చెబుతున్నాం. ఇద్దరూ బాధ్యత వహించాల్సిందే. అణు బెదిరింపుల ముసుగులో జరిగే టెర్రరిస్టు కార్యకలాపాలను కూడా సహించం. ఇలాంటి బెదిరింపులకు భారత్ తలొగ్గదు. ప్రపంచానికి మేమిచ్చే సందేశం స్పష్టం. టెర్రరిజం విషయంలో జీరో-టోలరెన్స్ పాలసీ అనుసరిస్తున్నాం'' అని పెటల్ పేర్కొన్నారు.

షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఇంతకీ షాబాజ్ షరీఫ్ ఏమన్నారు?

''తూర్పు సరిహద్దులో శత్రువుల రెచ్చగొట్టే చర్యలకు పాకిస్తాన్ స్పందించింది. పహల్గాం దాడిపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తామని భారత్‌కు పాకిస్తాన్ చెప్పింది'' అని షాబాజ్ షరీఫ్ అన్నారు.

''పాకిస్తాన్ వ్యవస్థాపకులు మహమ్మద్ అలీ జిన్నా దార్శనికతకు అనుగుణంగా చర్చల ద్వారా ప్రతి సమస్యనూ పరిష్కరించుకోవాలని కోరుకుంటోంది'' అని తెలిపారు.

పహల్గాం ఘటనను భారత్ రాజకీయంగా ఉపయోగించుకుంటోందని పాకిస్తాన్ ప్రధాని ఆరోపించారు.

ఈ విషయంలో పాకిస్తాన్‌కు పూర్తిగా సమర్థించుకునే హక్కు ఉంటుందని అన్నారు.

''భారత్‌తో యుద్ధంలో మేం గెలిచాం. మాకు శాంతి కావాలి. పరిష్కారం లేకుండా ఉన్న అన్ని అంశాలపై భారత్‌తో సమగ్రమైన, సమర్థవంతమైన చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉంది'' అని అన్నారు.

''పాకిస్తాన్ విదేశాంగ విధానం పరస్పర గౌరవం, సహకారంపై ఆధారపడి ఉంది. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం'' అని షాబాజ్ షరీఫ్ అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు నోబెల్ పురస్కారం ఇవ్వాలని షాబాజ్ షరీఫ్ తన వాదన వినిపించారు.

''పాకిస్తాన్, భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకోకపోతే, యుద్ధ పరిణామాలు తీవ్రంగా ఉండేవి'' అని వ్యాఖ్యానించారు.

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు ట్రంప్‌ నోబెల్ శాంతి పురస్కారానికి అర్హులని షాబాజ్ పేర్కొన్నారు.

భారత్ - పాకిస్తాన్ ఘర్షణలను ఆపడంలో ఏ మూడో వ్యక్తికి సంబంధం లేదని భారత్ ఖండిస్తూ వస్తోంది.

పహల్గాం దాడి తర్వాత భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌లో ఉన్న 9 టెర్రరిస్టు క్యాంపులు ధ్వంసమయ్యాయని, 100 మందికి పైగా టెర్రరిస్టులు మరణించినట్లు భారత్ చెబుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)