చైనా కె-వీసా ఏంటి, ఇది హెచ్‌-1బీ వీసాను భర్తీ చేయగలదా?

కె వీసా, చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా H-1B వీసా ఫీజు పెంచడంతో, చైనా కె-వీసా చర్చలోకి వచ్చింది.
    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్-1బీ వీసా ఫీజును అమెరికా లక్ష డాలర్లకు అంటే, దాదాపు రూ. 88 లక్షలకు పెంచడంతో చైనా కె-వీసా మళ్లీ చర్చలోకి వచ్చింది.

1990లో అమెరికాలో హెచ్-1బీ వీసాను ప్రవేశపెట్టారు. దీన్ని ఎక్కువగా సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, గణితంలో నైపుణ్యమున్న వర్కర్లకు ఇస్తుంటారు. ఇందులో భారతీయులకే ఎక్కువగా హెచ్-1బీ వీసాలు జారీ అయ్యాయి, తరువాతి స్థానంలో చైనా పౌరులు ఉన్నారు.

మరోవైపు, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించేందుకు కె-వీసాను ప్రారంభించినట్లు చైనా 2025 ఆగస్టులో ప్రకటించింది. చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా కథనం ప్రకారం, ఈ పథకం అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది.

అమెరికా కొత్త వీసా విధానంపై వ్యాఖ్యానించబోమని.. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ ప్రతిభావంతులను చైనా స్వాగతిస్తుందని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పినట్లు న్యూస్‌వీక్ తెలిపింది.

ఈ ప్రణాళికను ఆమోదించే ఉత్తర్వుపై ప్రధాని లీ కెకియాంగ్ ఇప్పటికే సంతకం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కె-వీసా ప్రత్యేకతలేంటి?

చైనాలో ప్రస్తుతమున్న 12 రకాల వీసాల మాదిరి కాకుండా, కె-వీసాపై వచ్చే వారికి దేశంలోకి ప్రవేశం, చెల్లుబాటు వ్యవధి, బస పరంగా మరిన్ని సౌకర్యాలు లభిస్తాయని వార్తాసంస్థ జిన్హువా రిపోర్టు చేసింది.

కె-వీసాపై చైనాకు వచ్చే వ్యక్తులు విద్య, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ రంగాలలో పని చేయవచ్చు. పరిశ్రమలు, వ్యాపారాలను కూడా ప్రారంభించవచ్చు. కె-వీసాలో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, దరఖాస్తుదారులకు దానిని పొందడానికి వారి చైనీస్ యజమాని లేదా కంపెనీ నుంచి ఆహ్వానం అవసరం లేదు. జారీ ప్రక్రియ కూడా సరళీకృతం చేశారు. కె-వీసా కొత్త గ్రాడ్యుయేట్లు, స్వతంత్ర పరిశోధకులు, పరిశ్రమల వ్యవస్థాపకులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.

అంతేకాదు, కె-వీసా కోసం, ఇప్పటికే చైనాలో ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ ఉండవలసిన అవసరం లేదు. చైనా వచ్చిన తర్వాత ఉద్యోగం వెతుక్కోవచ్చు.

ఇపుడు, హెచ్-1బీ వీసాల గురించి కూడా తెలుసుకుందాం.

హెచ్-1బీ వీసా నిబంధనల ప్రకారం, ఇది అమెరికన్ కంపెనీల యజమానులు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి వీలు కల్పిస్తుంది. వీసా కోసం కంపెనీ యజమాని దరఖాస్తు చేయాలి. ఈ ప్రక్రియ సమయం తీసుకుంటుంది, సంక్లిష్టంగా కూడా ఉంటుంది. ఈ వీసాకు కోటా వ్యవస్థ ఉంటుంది, అంటే నిర్ణీత సంఖ్యలో వీసాలు మాత్రమే జారీ అవుతాయి.

హెచ్-1బీ వీసా 3 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఆరేళ్ల వరకు పొడిగించవచ్చు. మీరు ఉద్యోగాలు మారితే, కొత్త యజమాని కొత్త దరఖాస్తు దాఖలు చేయాలి. హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు ఫీజు ఇప్పుడు లక్ష డాలర్లు.

మరోవైపు, చైనాలో కె-వీసాలు ఏటా ఎన్ని జారీ చేస్తారనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కె-వీసాకు సంబంధించిన నియమాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఖర్చు గురించి కూడా స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు.

చైనా, కె వీసా, భారతీయ ఇంజినీర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

చైనా లేదా విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయం లేదా పరిశోధనా సంస్థ నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ లేదా గణితంలో డిగ్రీ లేదా ఆపై చదువులు చదివిన విదేశీ యువత దరఖాస్తు చేసుకోవచ్చు.

గుర్తింపు కలిగిన సంస్థలో బోధన(టీచింగ్) లేదా పరిశోధన చేస్తున్న నిపుణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుదారులు వయసు, విద్య, అనుభవం తదితర నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలను సమర్పించాలి.

కె-వీసా అనేది చైనా జారీ చేసే R(ఆర్) వీసాకు పొడిగింపు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ప్రతిభను ఆకర్షించేందుకు 2013లో దీనిని ప్రవేశపెట్టారు.

అమెరికా ప్రభుత్వం హెచ్ -1బీ వీసా ఫీజు పెంచడంతో భారతీయులు తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే, భారతీయ ఇంజినీర్లు, టెక్ నిపుణులకే అత్యధిక సంఖ్యలో జారీ అయ్యాయి.

ఇటీవలి డేటా ప్రకారం, హెచ్ -1బీ వీసాల్లో 71 శాతం భారతీయులకే జారీ అయ్యాయి. 11.7 శాతం వీసాలతో చైనీయులు తరువాతి స్థానంలో ఉన్నారు.

అమెరికా తన సాంకేతిక రంగ నిబంధనలను కఠినతరం చేయడంతో భారతీయ ఇంజినీర్లు, టెక్ నిపుణులకు చైనా ఇష్టమైన గమ్యస్థానంగా మారవచ్చు. ఇటీవలి సంవత్సరాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. కృత్రిమ మేధస్సు రంగంలో అమెరికాను సవాల్ చేసేందుకు సిద్ధమవుతోంది.

చైనా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రధాన శక్తిగా ఎదగాలని కోరుకుంటోందని నిపుణులు అంటున్నారు. ఇది శాటిలైట్ టెక్నాలజీ, స్పేస్ మిషన్స్, మెటల్ టెక్నాలజీ, ఐటీ సెక్టార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో భారీగా పెట్టుబడులు పెడుతోంది.

దీని వల్ల కె-వీసాతో భారతీయ ఇంజినీర్లు ప్రయోజనం పొందవచ్చు. చైనా కూడా భారతీయ ఇంజనీర్లు, టెక్ నిపుణుల నుంచి ప్రయోజనం పొందవచ్చు. అంతేకాదు, సిలికాన్ వ్యాలీలో ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లు చైనాకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

ఇరుదేశాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడడంతో, భారతీయులు చైనాకు ప్రయాణించడం సులభం కానుంది.

2025లో మొదటి ఆరు నెల్లలో చైనాకు, చైనా నుంచి 3.8 కోట్లకు పైగా రాకపోకలు జరిగాయని చైనా నేషనల్ ఇమ్మిగ్రేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డేటాను ఉటంకిస్తూ జిన్హువా రిపోర్టు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 30.2 శాతం పెరుగుదల. ఇందులో 1.36 కోట్ల ట్రిప్పులు వీసా రహితమైనవి, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 53.9 శాతం పెరుగుదల ఉంది.

చైనా, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతీయ నిపుణుల నుంచి చైనా చాలా ప్రయోజనం పొందగలదని నిపుణులు అంటున్నారు.

భారతీయులకు ప్రయోజనమా?

"షాంఘై, షెన్‌జెన్‌తో సహా అనేక ప్రావిన్సులలో చైనా హై-టెక్నాలజీ పార్కులను నిర్మించింది. వీటిలో భారీగా పెట్టుబడులు పెట్టింది. 2006-2007 నుంచి చైనా ప్రభుత్వం భారత ఐఐటీల నుంచి పెద్దయెత్తున ఇంజినీర్లను నియమించుకుంటోంది'' అని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో, సెంటర్ ఫర్ చైనా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ అరవింద్ యెలెరి అన్నారు.

"భారత్‌లో క్రిటికల్ ఇంజనీరింగ్‌లో పెద్ద సంఖ్యలో ఇంజినీర్లు ఉన్నారు. ఇందులో ఒక శాతం చైనాకు వెళ్లినా, అది పైచేయి సాధిస్తుంది. సాంకేతిక పరిశోధన, ఆవిష్కరణల కోసం చైనా కంపెనీలు తమ ప్రభుత్వం నుంచి చౌకగా రుణాలు తీసుకుంటాయి. కానీ, వాటి పనితీరు పేలవంగా ఉంది. కాబట్టి భారత ఇంజినీర్లు వారిని ఈ సంక్షోభం నుంచి రక్షించగలరు" అని ఆయన అన్నారు.

"చైనా మాత్రమే కాదు, తైవాన్ కూడా టెక్ నిపుణులకు తలుపులు తెరిచింది" అని అరవింద్ అన్నారు.

"కాబట్టి, హెచ్-1బీ వీసాలు పొందని వారు తైవాన్‌కు వెళ్లవచ్చు. వీసా ఫీజుల పెరుగుదల అమెరికాను దెబ్బతీస్తుంది. అభివృద్ధి చెందుతున్న ఆసియా ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

"ఇది చైనాకు ఒక అవకాశం. అందుకే వారు కె-వీసాను ముందుకు తీసుకొచ్చారు. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభకు చైనా పుష్కలమైన అవకాశాలను అందిస్తుందని వారు పదేపదే చెబుతున్నారు" అని అన్నారు అరవింద్.

చైనాలో పనిచేశానని ఆయన చెప్పారు.

"చైనాలో బలమైన సింగిల్ విండో వ్యవస్థ ఉంది. దరఖాస్తు ప్రక్రియ నుంచి విదేశీ నిపుణుల నియామకం, వారికి గృహనిర్మాణం వరకు ప్రతీదీ చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది. చైనాలో వృత్తిపరమైన వాతావరణం చాలా బాగుంటుంది'' అన్నారు అరవింద్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)