ముంబైలో తొక్కిసలాట: 22 మంది మృతి, 39 మందికి గాయాలు

ముంబై లోని ఎల్ఫిన్‌స్టన్ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాటలో 22 మంది మరణించారు. మరో 39 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దీపక్ సావంత్ తెలిపారు.

వర్షాల కారణంగా ఈ బ్రిడ్జిపై కొంత మంది ఆశ్రయం తీసుకుంటున్నారు. స్టేషన్‌కు ట్రెయిన్స్ వచ్చిన సమయంలో ఈ బ్రిడ్జిపైకి ఒకేసారి ఎక్కువ మంది రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలిసింది.
బ్రిడ్జి ఇరుకుగా ఉండడం వల్ల ఎటూ వెళ్లలేని పరిస్థితిలో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ బ్రిడ్జి సమస్యపై గతంలోనే కొందరు ప్రజా ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. "రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. అన్ని రకాల సహాయం అందేలా చూస్తున్నారు" అని ఆయన ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Twitter
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి చికిత్స అందజేస్తుందని ట్వీట్ ద్వారా తెలిపారు.

ఫొటో సోర్స్, Twitter
రైల్వేశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)





