లద్దాఖ్‌ : సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్, ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేశారన్న కేంద్రం.. అసలేం జరిగింది?

సోనమ్ వాంగ్‌చుక్, జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లేహ్‌లో బుధవారం జరిగిన హింసాత్మక నిరసనల నేపథ్యంలో విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆయన స్వగ్రామం ఉలే టోక్పోలో అరెస్టు చేశారు. లేహ్ అపెక్స్ బాడీకి చెందిన న్యాయవాది హాజీ ముస్తఫా ఈ విషయాన్ని బీబీసీకి ధ్రువీకరించారు.

ఇంజినీర్, ఇన్నోవేటర్, విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త అయిన సోనమ్ గత ఏడాది కాలంగా వివిధ సందర్భాల్లో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ దిల్లీకి పాదయాత్ర కూడా చేశారు.

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ రాజధాని లేహ్‌లో యువత చేపట్టిన నిరసన ప్రదర్శన బుధవారం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఆరో షెడ్యూల్‌ కింద రక్షణ కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఏబీ), కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్‌ ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తోన్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (ఎడమ)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (ఎడమ) డిమాండ్ చేస్తున్నారు.

రెచ్చగొట్టే ప్రకటనలు : కేంద్ర హోం శాఖ

కార్గిల్‌లో ముస్లింలు, లేహ్‌లో బౌద్ధులు ఎక్కువగా ఉంటారు.

రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ గిరిజనుల హక్కులు, వారి గుర్తింపు, ప్రయోజనాలను రక్షిస్తుంది.

తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ లేహ్ అపెక్స్ బాడీ సెప్టెంబర్ 10న నిరాహార దీక్ష ప్రారంభించింది.

ఈదీక్షలో ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా పాల్గొన్నారు. బుధవారం జరిగిన హింస తర్వాత నిరాహార దీక్షను తాత్కాలికంగా నిలిపేశామని, ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని సోనమ్ వాంగ్‌చుక్ బీబీసీకి చెప్పారు.

  • బుధవారం నాడు ఈ ఆందోళన హింసాత్మకంగా ఎలా మారింది?

''ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. వారికి ఓర్పు నశించింది. ఇంతమంది ఇన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే, ప్రభుత్వం మాత్రం అక్టోబర్ 6న మాట్లాడదాం అని చెప్పడం వారికి కోపం తెప్పించింది. కానీ, పోలీసులు కాస్త సంయమనం పాటించి ఉండాల్సింది. ప్రాణనష్టం లేకుండా పోలీసులు హెచ్చరించాల్సింది. మొదట్లో పోలీసుల తప్పు లేదు. కానీ, ఆ తర్వాత వారు నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరిపారు'' అని సోనమ్ వాంగ్‌చుక్ వివరించారు.

బుధవారం రాత్రి (సెప్టెంబర్ 24) జరిగిన హింసకు సోనమ్ వాంగ్‌చుక్ కారణమని పేర్కొంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

"సోనమ్ వాంగ్‌చుక్ తన ప్రకటనల ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టారు. హింస మొదలవగానే నిరాహార దీక్ష ముగించి అంబులెన్స్‌లో తన గ్రామానికి వెళ్లిపోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సోనమ్ వాంగ్‌చుక్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. లద్దాఖ్ ప్రజల ఆశయాలకు తగినంత రాజ్యాంగ రక్షణ కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'' అని ఆ ప్రకటనలో పేర్కొంది.

లేహ్ హింసాత్మక ప్రదర్శనలు

ఫొటో సోర్స్, Getty Images

సోనమ్ వాంగ్‌చుక్ పాకిస్తాన్ పర్యటన

  • హోం మంత్రిత్వ శాఖ చేసిన ఈ వ్యాఖ్య గురించి సోనమ్ వాంగ్‌చుక్‌ను అడిగినప్పుడు 'ఇదేమంత ఆందోళన చెందాల్సిన విషయం కాదు' అన్నారు.

''ప్రభుత్వం నా గొంతును అణచివేయాలని చూస్తోంది. బుధవారం జరిగిన దానికి నన్నే బాధ్యుడిని చేస్తోంది. ప్రభుత్వం నన్ను జైల్లో వేయచ్చు. నా స్కూల్‌కు చెందిన భూమిని తిరిగి తీసుకున్నారు. చాలా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. రాజద్రోహం ఆరోపణ కూడా మోపారు. నన్ను లద్దాఖ్‌కు దూరంగా ఉంచాలనుకుంటున్నారు. అందుకే పీఎస్‌ఏ విధించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు'' అని ఆయన బదులిచ్చారు.

ఈ హింస తర్వాత సోనమ్ వాంగ్‌చుక్, పాకిస్తాన్ పర్యటన గురించి సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

పాకిస్తాన్ పర్యటన గురించి ఆయన మాట్లాడుతూ, ''ఐక్యరాజ్యసమితికి సంబంధించిన పర్యావరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళాను. ఆ కార్యక్రమంలో పర్యావరణానికి సంబంధించి మోదీ సాబ్ చేస్తున్న మంచి కార్యక్రమాలను మెచ్చుకున్నాను కూడా. అది చాలా మంచి కార్యక్రమం. అందులో నేను మాత్రమే కాదు, భారత్ నుంచి మరో ఆరుగురు నిపుణులు కూడా పాల్గొన్నారు. ఇది నేను రహస్యంగా చేసిన పర్యటనేమీ కాదు'' అని వివరించారు.

లద్దాఖ్‌ చాలా కీలకం

లద్దాఖ్ ప్రజల డిమాండ్లను చాలా సున్నితత్వంతో వినాలని భారత సైన్యంలో నార్తర్న్ కమాండ్‌కు కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) దీపేంద్ర హుడా అన్నారు.

లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన కొత్తలో అక్కడి ప్రజలు ఈ నిర్ణయంపై సానుకూలంగానే ఉన్నారని, క్రమంగా ఈ నిర్ణయం తమకు అనుకూలంకాదనుకోవడం మొదలుపెట్టారని హుడా అభిప్రాయపడ్డారు.

''తమ ఉద్యోగాలను బయటివాళ్లు లాక్కుంటున్నారని, తమ సంస్కృతి దెబ్బతింటోందని లద్దాఖ్ ప్రజలు భావించారు. నా అభిప్రాయం ప్రకారం లద్దాఖ్ ప్రజల డిమాండ్లు తప్పు కాదు. కానీ, వాటిని సాధించుకోవడానికి హింస సరైన మార్గం కాదు’’

‘‘చైనా, పాకిస్తాన్ దేశాలతో సరిహద్దును పంచుకుంటున్న లద్దాఖ్, భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. చైనాతో సరిహద్దుల్లో భారత్ కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు ఎదుర్కొంటోంది. ఇక పాకిస్తాన్‌తో ఉద్రిక్తత ఎప్పుడూ ఉంటుంది. భారత్ భద్రతకు లద్దాఖ్ చాలా ముఖ్యమైన ప్రాంతం'' అని జనరల్ హుడా వివరించారు.

లేహ్

ఫొటో సోర్స్, Getty Images

''లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు. 2019లో లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినప్పుడు ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడు కోపంగా ఉన్నారు. మోసపోయినట్లుగా భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వకపోతే మేం ఎంత బాధ పడతామో, నష్టపోయినట్లుగా భావిస్తామో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. మేం మా డిమాండ్‌ను ప్రజాస్వామ్యయుతంగా, శాంతిపూర్వకంగా, బాధ్యతాయుత పద్ధతిలో చేస్తున్నాం'' అని లద్దాఖ్‌లో జరుగుతున్న నిరసనలపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

  • లద్దాఖ్‌ను 2019లో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినప్పుడు చాలా సానుకూల వాతావరణం ఉంది. హఠాత్తుగా ఈ పరిస్థితులు ఎందుకు మారాయి?లద్దాఖ్ ప్రజలు అప్పటి పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకున్నారా? అని ప్రస్తుత లద్దాఖ్‌ ఉద్యమం వెనుక ఉన్న ప్రధాన వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్‌ను ప్రశ్నిస్తే..

‘‘మేమెప్పుడు చట్టసభలతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాన్ని డిమాండ్ చేశాం. కశ్మీర్ తరహాలో లద్ధాఖ్ కూడా శాసనసభతో కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుందని భావించాం. ఇక్కడ ఒక వ్యక్తే పాలిస్తారు. ఆయన చేతుల్లోనే సర్వాధికారాలు ఉంటాయి. ఇక్కడ ఎటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉండవు. అంతా ఏకపక్షం, అవినీతి ఉంటాయి. మీరు మా పాత బ్యానర్లు చూసి ఉంటే వాటిపై చట్టసభలతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాన్ని డిమాండ్ చేసిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేస్తున్నాం’’

  • రాష్ట్ర హోదా ఇస్తే నిరుద్యోగం, అవినీతి సమసిపోతాయా?

''వీటిలో చాలా సమస్యలు తీరతాయి. ఆరో షెడ్యూల్ రక్షణ కూడా లభిస్తే మాకు మరింత మంచి జరుగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినవన్నీ వస్తాయి'' అని ఆయన అన్నారు.

లద్దాఖ్‌లో హింసాత్మక నిరసనలు

ఫొటో సోర్స్, Disney via Getty Images

కశ్మీర్‌పైనా ప్రభావం పడుతుందా?

  • లద్దాఖ్‌లో జరుగుతున్న నిరసనల ప్రభావం జమ్మూకశ్మీర్‌పై కూడా పడుతుందా?

ఈ ప్రశ్నకు లెఫ్టినెంట్ జనరల్ హుడా సమాధానమిస్తూ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇదే జరగొచ్చేమో అనిపిస్తోందన్నారు.

''కశ్మీర్, లద్దాఖ్‌లను పోల్చలేం. కానీ, ఒక ఆందోళన ప్రభావం దాని సరిహద్దులకే పరిమితం కాదు. ప్రస్తుతం అందరూ సోనమ్ వాంగ్‌చుక్‌పైనే దృష్టి పెడుతున్నారు. ఒక వ్యక్తిపై దృష్టి పెట్టడం, అతన్ని వివాదంలోకి లాగడానికి బదులుగా ప్రజల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఈ ఉద్యమం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు" అన్నారు.

లద్దాఖ్ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులు అదుపు తప్పకుండా చూసుకోవాలని జమ్మూకశ్మీర్ పరిణామాలను నిశితంగా పరిశీలించే సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ పండిత హెచ్చరించారు.

లద్దాఖ్ ఆందోళనలను ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేకపోతే, వాటి ప్రభావం కశ్మీర్‌పై కూడా పడుతుందని రాహుల్ పండిత అన్నారు.

''దేశ అంతర్గత, బాహ్య భద్రతలకు లద్దాఖ్ చాలా కీలకం. ఇక్కడ జరిగే పరిణామాలను కశ్మీర్ యువకులు చాలా శ్రద్ధగా చూస్తుంటారని నేను అనుకుంటున్నా. కశ్మీర్ ప్రజలు రాజకీయంగా చాలా చురుకుగా ఉంటారు. 2019లో కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు అయిన తర్వాత కశ్మీర్‌లో నిరసనలు జరుగలేదు. వారిలో కోపం అలాగే ఉండొచ్చు. అందుకే లద్దాఖ్ నిరసన ప్రదర్శనల ప్రభావం కశ్మీర్‌పై కూడా పడొచ్చు'' అని రాహుల్ వివరించారు.

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వడాన్ని సోనమ్ వాంగ్‌చుక్ కూడా సమర్థిస్తున్నారు. ప్రభుత్వం వాగ్దానం చేసింది కాబట్టి దాన్ని నెరవేర్చాలని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం మొదట్లో లద్దాక్‌కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ ఇవ్వాలని కోరుకుందని, కానీ ఆ తర్వాత పారిశ్రామిక లాబీ ఒత్తిడి రావడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుందని సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ కార్పొరేట్ సంస్థలకు భూమి లభిస్తోందని వాంగ్‌చుక్ ఆరోపించారు.

ప్రభుత్వం ఏమంటోంది?

లేహ్‌లో హృదయాన్ని కలిచివేసే ఘటనలు జరిగాయని, ఇవన్నీ స్వచ్ఛందంగా జరిగినవి కావని, వీటన్నింటి వెనుక ఒక కుట్ర ఉందని లద్దాక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా అన్నారు.

''ఇక్కడి వాతావరణాన్ని చెడగొట్టే వారిని మేం వదిలిపెట్టం'' అని హెచ్చరించారు.

లద్దాఖ్‌లో 1989 ఆగస్టు 27న ఒక పెద్ద హింస జరిగిందని, అప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం హోదాను డిమాండ్ చేస్తూ నిరసనలు జరిగిన సమయంలో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించారని ఆయన గుర్తు చేశారు.

  • ఇక కేంద్రప్రభుత్వం దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ కోసం డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష ప్రారంభించారు. లేహ్, కార్గిల్ డెమొక్రటిక్ అలయెన్స్‌తో చర్చలు జరుపుతున్నాం. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వీటిల్లో కొన్ని చక్కటి ఫలితాలు కూడా వచ్చాయి’’ అని ఆ ప్రకటనలో తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)