ఆసియా కప్ : ఇండియా శ్రీలంక మ్యాచ్‌లో సూపర్‌ఓవర్‌లో ఏం జరిగింది, అభిషేక్ శర్మ ఎవరి రికార్డును సమం చేశాడు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దినేశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పోరాడితే పోయేదేముందన్నట్టుగా ఆడిన శ్రీలంక నామమాత్రమపు మ్యాచ్‌ను సూపర్ ఓవర్ దాకా తీసుకువెళ్లి అభిమానుల మనసు దోచుకుంది.
ఆసియాకప్‌లో భాగంగా సూపర్ ఫోర్స్ మ్యాచ్‌లో శుక్రవారం రాత్రి ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

ఇరు జట్లు నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది.
తొలుత భారత్ చేసిన భారీ స్కోరును చూసి శ్రీలంక పనైపోయిందనుకున్నారు.
కానీ పట్టువదలని శ్రీలంక మాత్రం ఎవరూ ఊహించని విధంగా స్కోరును సమం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
దుమ్ముదులిపిన అభిషేక్
భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్స్‌కు చేరుకోవడంతో, భారత్-శ్రీలంక మ్యాచ్ నామమాత్రపు మ్యాచ్‌గా మారింది.
శ్రీలంక జట్టులో కరుణరత్నేను తప్పించి, లియానేజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. భారత జట్టులో బుమ్రా, శివం దూబేలకు విశ్రాంతి ఇచ్చారు. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలను జట్టులోకి తీసుకున్నారు.
శ్రీలంక కెప్టెన్ అసలంక టాస్ గెలిచి, భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై, నువాన్ తుషార మంచి స్వింగ్‌తో తొలి ఓవర్ బౌలింగ్ వేశాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి.
తీక్షణ వేసిన రెండో ఓవర్‌లోనే అభిషేక్ శర్మ తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. కానీ, 4 పరుగుల వద్ద తీక్షణ క్యాచ్ ఇచ్చి గిల్ అవుట్ అయ్యాడు. తరువాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పెద్దగా పరుగులేవీ చేయకుండానే మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.
22 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన అభిషేక్ శర్మ, టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 7 ఇన్నింగ్స్‌లలో 30కి పరుగులు చేసిన రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు.
ఇక నాలుగో వికెట్‌గా వచ్చిన తిలక్ వర్మ ప్రారంభం నుంచే బ్యాట్ ఝుళిపించాడు.
అయితే అద్భుతంగా ఆడుతున్న అభిషేక్ శర్మ (61)ను శ్రీలంక కెప్టెన్ అసలంక డీప్ మిడ్-వికెట్‌లో అవుట్ చేశాడు.
పది ఓవర్లు ముగిసేసరికి, మూడు వికెట్లు నష్టపోయి భారత్ జట్టు 100 పరుగులు స్కోర్ చేసింది.
హసరంగ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన సంజూ శామ్సన్, 16వ ఓవర్‌లో షనక వేసిన నోబాల్‌ను ఎక్స్‌ట్రా కవర్ ఆఫ్ మీదుగా మరో సిక్స్‌గా మలిచాడు. తర్వాత సామ్సన్ (39) మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అసలంకకు దొరికిపోయాడు.
తర్వాత బ్యాంటింగ్‌కు వచ్చిన పాండ్యా వెంటనే అవుట్అయ్యాడు. తర్వాత తిలక్ వర్మ-అక్షర పటేల్ జోడీ భారత్ స్కోరును 200 పరుగులు దాటించింది.
ప్రస్తుత ఆసియా కప్పులో ఒక జట్టు 200 పరుగుల స్కోరు దాటడం ఇదే మొదటిసారి.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంక పోరాటం
203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఛేదనను పేలవంగా మొదలుపెట్టింది. పాండ్యా తొలి ఓవర్లో కుశాల్ మెండిస్ డకవుట్ అయ్యాడు . ఇది అతని వరుసగా రెండవ 'గోల్డెన్ డక్'. అయితే మరో ఓపెనర్ నిశ్శాంక 58 బంతుల్లోనే 7 ఫోర్లతో 107 పరుగులు చేశాడు. వన్ డౌన్‌లో వచ్చిన కుశాల్ పెరీరా కూడా 32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 58 పరుగులు చేశాడు.
వీరిద్దరూ ఏడు పరుగులకు ఒక వికెట్ నుంచి రెండు వికెట్లకు 134 పరుగులకు శ్రీలంకను చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆఖరి మూడు ఓవర్లలో ఉత్కంఠ...
ఆఖరి మూడు ఓవర్లలో 33 పరుగులు చేయాల్సిన శ్రీలంక మ్యాచ్‌ను ఉత్కంఠ భరితంగా మార్చింది. అక్షర పటేల్ బౌలింగ్‌లో షనక 10 పరుగులు చేయడంతో చివరి 12 బంతుల్లో శ్రీలంక విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి.
19వ ఓవర్ వేసిన హర్షదీప్ బౌలింగ్‌లో శ్రీలంక 11 పరుగులు మాత్రమే చేసింది.
దీంతో, చివరి ఓవర్లలో ఆ జట్టుకు 12 పరుగులు అవసరమయ్యాయి. అయితే, హర్షిత్ రాణా మొదటి బంతికే నిస్సంకను అవుట్ చేశాడు. తర్వాత రెండు బంతులను ఎదుర్కొన్న లియనాగే కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగో బంతికి షనక మరో 2 పరుగులు చేశాడు. ఐదో బంతిని ఫోర్‌గా మలిచాడు. దీంతో చివరి బంతికి 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అయితే షనక రెండు పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో స్కోరు సమం కావడంతో మ్యాచ్ టై అయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images
సూపర్ ఓవర్‌లో ఏం జరిగింది?
సూపర్ ఓవర్ వేయడానికి అర్షదీప్ బంతిని అందుకున్నాడు. అర్షదీప్ వేసిన తొలిబంతికే శ్రీలంక బ్యాటర్ కుశాల్ పెరీరా అవుటైపోయాడు. పెరీరా ఇచ్చిన క్యాచ్‌ను రింకూసింగ్ అందింపుచ్చుకుని, బంతిని ముద్దాడి తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. దీంతో సున్నా పరుగులకు శ్రీలంక్ ఒక వికెట్ కోల్పోయినట్టయింది. ఇక రెండో బంతిని అర్షదీప్ మెండిస్‌కు సంధించాడు. ఒక పరుగు వచ్చింది. మూడో బంతికి పరుగులేవీ రాలేదు. అర్షదీప్ నాలుగోబంతిని షనకా ఎదుర్కొన్నాడు. కానీ అది వైడ్‌గా మారింది. దీంతో శ్రీలంక మూడు బంతుల్లో రెండు పరుగులు చేసినట్టయింది. ఇక అదనంగా వచ్చిన 4వ బంతికి కూడా పరుగులేవీ రాలేదు. ఐదోబంతికి షనక జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో భారత్ మూడు పరుగులు చేస్తే గెలిచే పరిస్థితి.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగారు. హసరంగ వేసిన మొదటిబంతినే సూర్య అవుట్ ఫీల్డ్ వరకు బాదడంతో ఓపెనర్లు ఇద్దరు మూడు పరుగులు తీయడంతో విజయం ఇండియా వశమైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














