18 లక్షల ఏళ్లనాటి మనిషి దవడ ఎముక కనుగొన్న ఆర్కియాలజిస్టులు, ఇది ఆది మానవుడి గుట్టు విప్పనుందా?

పురావస్తు తవ్వకాలు, జార్జియా, ఆది మానవుడి చరిత్ర, హిస్టరీ

ఫొటో సోర్స్, REUTERS/Irakli Gedenidze

ఫొటో క్యాప్షన్, జార్జియాలో తవ్వకాలు జరుపుతున్న ఈ ప్రదేశం చాలా చిన్నదే అయినప్పటికీ, చరిత్రపరంగా అద్భుతమైన ప్రదేశంగా పరిగణిస్తున్నారు.

''జార్జియాలోని పురావస్తు శాస్త్రవేత్తలు 1.8 మిలియన్ సంవత్సరాల (18 లక్షల ఏళ్ల) నాటి ప్రాచీన మానవుడి దవడ ఎముకను కనుగొన్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం, ఇది ఆదిమ మానవ జాతులలో ఒకదానికి చెందినదిగా భావిస్తున్నారు. అలాగే, ఇది యురేషియా ఖండంలో అత్యంత ప్రాచీన మానవ ఆవాసాల గురించి మరింత అర్థం చేసుకోవడానికి సాయపడుతుందని భావిస్తున్నారు'' అని వార్తా సంస్థ రాయిటర్స్ ఒక రిపోర్ట్‌లో పేర్కొంది.

జార్జియాలోని ఒరోజ్మనీలో ఉన్న ఈ ప్రదేశం, కేవలం రెండు వాహనాలను పార్క్ చేసేంత చిన్నదే అయినప్పటికీ, దీని లోతుల్లో చారిత్రక సంపద పాతిపెట్టి ఉంది.

ఇది ఆఫ్రికా వెలుపల లభ్యమైన అత్యంత ప్రాచీన మానవ అవశేషాలను అందించింది. అలాగే.. వేట, సేకరణ ఆధారంగా జీవించారని చెప్పే హోమో ఎరెక్టస్ జాతి నమూనాకు ఆధారాలను అందిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం, ఈ జాతి 2 మిలియన్ సంవత్సరాల కిందట ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సంచరించడం ప్రారంభించింది.

"ఒరోజ్మనీలో లభించిన మానవ, జంతు అవశేషాలు యురేషియా ఖండంలోని తొలి నివాసితుల జీవనశైలిని అర్థం చేసుకునేందుకు మాకు సాయపడతాయి" అని టబ్లీసీలోని ఇలియా స్టేట్ యూనివర్సిటీలో పాలియాంటాలజీ ప్రొఫెసర్ జార్జి బిడ్జినాస్విలి అన్నారు.

"ఒరోజ్మనీ మానవత్వం గురించి గొప్ప సమాచారం అందించగలదని మేం భావిస్తున్నాం."

పురావస్తు తవ్వకాలు, జార్జియా, ఆది మానవుడి చరిత్ర, హిస్టరీ

ఫొటో సోర్స్, REUTERS/Irakli Gedenidze

ఫొటో క్యాప్షన్, ఈ ప్రదేశంలో లభించిన అవశేషాలు మానవాళి ఆదిమ చరిత్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించగలవని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

ఈ దవడ దిగువ భాగాన్ని జార్జియా రాజధాని టబ్లీసీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో కనుగొన్నారు. ఇక్కడే 2022లో అదే కాలంనాటి దంతాన్ని ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. దానితో పాటు ఇక్కడికి సమీపంలోని దమానిసీ గ్రామంలోనే 1.8 మిలియన్ ఏళ్ల నాటి ప్రాచీన మానవుల పుర్రెలు కూడా లభ్యమయ్యాయి.

ఈ తాజా ఆవిష్కరణలో, సాబెర్ - టూత్ టైగర్స్ (పొడవాటి దంతాలుండే ప్రాచీన పులులు), ఏనుగులు, నక్కలు, జింకలు, జిరాఫీలతో సహా పలు శిలాజాలను, రాతి పనిముట్లను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

పురావస్తు తవ్వకాలు, జార్జియా, ఆది మానవుడి చరిత్ర, హిస్టరీ

ఫొటో సోర్స్, REUTERS/Irakli Gedenidze

ఫొటో క్యాప్షన్, జార్జియాలోని క్వెమో ఒరోజ్మనీ గ్రామంలోని తవ్వకాల ప్రదేశంలో 2025 ఆగస్టు 15న కనుగొన్న 1.8 మిలియన్ సంవత్సరాల నాటి ప్రాచీన మానవుడి దిగువ దవడ ఎముక

'ఈ అవశేషాలు మానవ చరిత్ర గుట్టు విప్పుతాయి'

ఈ దవడ ఎముకలు, జంతువుల శిలాజాలను అధ్యయనం చేయడం ద్వారా ఆఫ్రికాను విడిచిపెట్టిన తర్వాత ఆది మానవుల పరిణామ క్రమంలో వచ్చిన మార్పులేంటి, ఆ కాలంలో వారి ఆహారం, పర్యావరణం ఎలా ఉండేది వంటి కీలక ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఒరోజ్మనీలో తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో ఆర్కియాలజిస్టులు ప్రతి ఏటా కొత్త హోమో ఎరెక్టస్ అవశేషాలను కనుగొంటున్నారు.

"తవ్వడం ప్రారంభించిన రెండో రోజున నేను ఒక మడమ ఎముకను కనుగొన్నా" అని అమెరికాలోని రోడ్ ఐలాండ్ యూనివర్సిటీ నుంచి ఇటీవల ఆంత్రోపాలజీలో గ్రాడ్యుయేట్ అయిన మైల్స్ అలెగ్జాండర్ అన్నారు.

"మీరు మరో 5 సెంటీమీటర్లు కిందకు వెళ్తే.. మీరు మరేదైనా కనుగొనే అవకాశాలు చాలా ఉన్నాయి."

ఒక గది పరిమాణంలో ఉన్న చిన్న షెడ్డులో ఉంటూ, మొత్తం పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ప్రదేశంలో అన్వేషణ కొనసాగిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)