పాకిస్తాన్ కారణంగా సౌదీ అరేబియాతో భారత్ సంబంధాలు దెబ్బతింటాయా?

ఫొటో సోర్స్, Pakistan PM office
అణ్వాయుధ దేశం పాకిస్తాన్‌కు సౌదీ అరేబియాకు మధ్య ఇటీవల ఒక కీలకమైన ఒప్పందం జరిగింది.
దీన్ని రక్షణ రంగంలో పరస్పర భాగస్వామ్యానికి సంబంధించిన రెండు దేశాల మధ్య జరిగిన దౌత్య ఒప్పందంగా చెబుతారు.
ఈ ఒప్పందంలో అత్యంత ఎక్కువగా చర్చనీయమైన అంశం ఏంటంటే.. ఒక దేశంపై ఎలాంటి దురాక్రమణ జరిగినా, దాన్ని రెండు దేశాలు తమ మీద జరిగిన దాడిగా పరిగణిస్తాయి.

భారత్‌లో చాలామంది విశ్లేషకులు దీన్ని మే నెలలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ కోణంలో చూస్తుండగా, పాశ్చాత్య విశ్లేషకులు మాత్రం హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడుల కోణంలో చూస్తున్నారు.
బీబీసీ హిందీ వీక్లీ ప్రొగ్రామ్ 'ది లెన్స్'లో కలెక్టివ్ న్యూస్‌రూమ్ డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం ముకేశ్ శర్మ ఇదే అంశంపై పలువురు నిపుణులతో చర్చించారు.
ఈ ఒప్పందం వల్ల కలిగే పర్యవసనాలు ఏంటి? అంతర్జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య సంబంధాల్లో కీలకమైన మైలురాయిగా ఇది నిలుస్తుందా?
అమెరికా వైఖరి దృష్ట్యా, సౌదీ అరేబియా కొత్త భాగస్వాముల కోసం చూస్తోందా? మరీ ముఖ్యంగా, ఇది సౌదీ అరేబియాతో భారత్‌కు ఉన్న సంబంధాలను దెబ్బతీస్తుందా? అనే విషయాలను ఈ కథనంలో చూద్దాం..
ఈ ప్రశ్నలకు సమాధానం కోసం దుబాయికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎహతేషామ్ షాహిద్, దిల్లీలోని కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కనికా రఖ్రా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
ఈ రక్షణ ఒప్పందాన్ని ఎలా చూడాలి?
దుబాయికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఎహతేషామ్ షాహిద్ దీనిలో రెండు విషయాలను ముఖ్యంగా ప్రస్తావించారు. ఒకటి భద్రత, మరొకటి ఆర్థిక అంశం.
సౌదీ అరేబియాకు భద్రతను, పాకిస్తాన్‌కు ఆర్థిక సాయాన్ని ప్రస్తావించిన ఆయన, ఈ రెండు దేశాలు ఒకదానికొకటి మద్దతు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
''సౌదీ అరేబియాకు ఈ సమయంలో భద్రత చాలా అవసరం. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. అక్కడ ఇరాన్ ఉంది, ఇజ్రాయెల్ ఉంది. కొన్ని రోజుల క్రితమే ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి కూడా చేసింది. ఈ ప్రాంతంలో భద్రతా హామీదారుగా ఉన్న అమెరికా పాత్ర లోపించినట్లు కనిపిస్తుంది'' అని ఎహతేషామ్ షాహిద్ అన్నారు.
''ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం సౌదీ అరేబియాకు చాలా అవసరం. ఆ కోణంలో చూస్తే పాకిస్తాన్ వారి వ్యవస్థకు చాలా బాగా సరిపోతుంది'' అని అన్నారు.
''పాకిస్తాన్‌కు సైనిక శక్తి ఉంది. కానీ, దీనికి ఆర్థిక సాయం కావాల్సి ఉంది. ఈ ఒప్పందం కచ్చితంగా పాకిస్తాన్‌కు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది. ఇదే ఆ దేశ తొలి ప్రాధాన్యత'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Win McNamee/Getty Images
అమెరికా వైఖరి మారడం కూడా ఒక కారణమా?
డోనల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత, చాలా అమెరికా మిత్రదేశాలకు ఆయనపై నమ్మకం సన్నగిల్లుతూ వస్తోంది.
సౌదీ అరేబియా తన భద్రత కోసం అమెరికాపై ఆధారపడుతోంది. అలాగే, రక్షణ రంగంలో అమెరికా సహకారం కొనసాగుతోంది. కానీ, హమాస్ పేరుతో ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం సౌదీ అరేబియాకు ఆందోళనకరంగా మారింది.
ఇరాన్‌తో కూడా సంబంధాలు క్షీణించాయి.
అమెరికా స్నేహితులు, అమెరికా శత్రువులు రెండూ కూడా సౌదీ అరేబియాకు ఆందోళనకరంగా మారాయి.
పాకిస్తాన్‌తో జరిగిన తాజా రక్షణ ఒప్పందం తన భద్రతకు మరో ఆప్షన్‌గా సౌదీ అరేబియా చూస్తుందా?
మిడిల్ ఈస్ట్‌లో అమెరికా పాత్ర మెల్లమెల్లగా కుంచించుకుపోతూ, క్షీణిస్తోందని కనికా రఖ్రా అన్నారు.
''ఖతార్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తీరు ఒక మెట్టు మాత్రమే. అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్‌కు అందుతున్న మద్దతు, గాజాలో జరుగుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇవి చాలా దురదృష్టకరం'' అని కనికా పేర్కొన్నారు.
కనికా రఖ్రా చెబుతున్న వివరాల ప్రకారం.. ఇలాంటి పరిస్థితుల్లో మిడిల్ ఈస్ట్‌లో ఉన్న దేశాలు తమ కోసం ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లను చూసుకుంటున్నాయి.
కానీ, సౌదీ అరేబియాకు అమెరికా ప్రత్యామ్నాయమైతే పాకిస్తాన్ కాదని ఆమె అన్నారు.
''ట్రంప్ రాక, అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా వెళ్లిపోవడం ఒక కీలక మలుపుగా పరిగణించాలని నేను భావిస్తున్నా. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్నప్పటి నుంచే మిడిల్ ఈస్ట్ వ్యవహారాల్లో అమెరికా ప్రమేయం తగ్గడం ప్రారంభమైంది'' అని ఎహతేషామ్ షాహిద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ అరేబియాతో భారత సంబంధాలు ప్రభావితమవుతాయా?
పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్యలో కుదిరిన రక్షణ ఒప్పందం భారత్‌కు అంత పెద్ద ఆందోళనకర అంశం కాదని నిపుణులు చెబుతున్నారు.
''సౌదీ అరేబియాతో భారత సంబంధాలు పాకిస్తాన్‌ను ఆధారంగా చేసుకుని లేవు. పశ్చిమాసియాలో ప్రతి దేశంతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకుంది'' అని కనికా రఖ్రా అన్నారు
''భారత్‌తో సౌదీ అరేబియాకు బహుళ అంచెలు(మల్టీలేయర్)గా సంబంధాలు ఉన్నాయి. ఎనర్జీ, ఆర్థిక విషయాల్లో ఒకదానిపై మరొకటి ఆధారపడుతున్నాయి'' అని ఎహతేషామ్ షాహిద్ చెప్పారు.
''భారతీయులు చాలావరకు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఈ సంబంధాలను దెబ్బతీసుకునే ఉద్దేశ్యం సౌదీ అరేబియాకు లేనట్లు కనిపిస్తోంది. భారత్‌తో సౌదీ అరేబియా తన సంబంధాలు దెబ్బతీసుకుని, పాకిస్తాన్‌తో మెరుగుపరుచుకోవాలని కోరుకుంటోందని సూచించే ఏ విషయాలను వారు చెప్పడం లేదు'' అని తెలిపారు.
సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత్‌కు వచ్చినప్పుడు భారత్-సౌదీ సంబంధాలకు పాకిస్తాన్-సౌదీ రిలేషన్స్‌తో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పినట్లు ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, @Spa_Eng
భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ నేపథ్యంలో, పరస్పర భద్రత హామీలుగా పేర్కొంటోన్న పాకిస్తాన్-సౌదీ ఒప్పందం ఏంటసలు?
దీనిపై మాట్లాడిన కనికా రఖ్రా.. ఇరు దేశాలు ఏ రకమైన పరస్పర మద్దతును ఇచ్చుకుంటాయో తెలుపుతూ.. పాకిస్తాన్-సౌదీ మధ్య జరిగిన ఒప్పందపు కాపీని బయటకు ఎక్కడా విడుదల చేయలేదని తెలిపారు.
''భారత్-పాకిస్తాన్ కోణంలో ఈ ఒప్పందాన్ని మనం చూస్తున్నాం. కానీ, సౌదీ-ఇరాన్ విషయంలో కనుక మనం చూస్తే, ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏవైపు ఉంటుంది? ఎందుకంటే, ఇరాన్, సౌదీ అరేబియాతో రెండింటితో దీనికి సంబంధాలున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం చూస్తే పాకిస్తాన్ తన పొరుగు దేశమైన ఇరాన్‌పై దాడి చేస్తుందని అర్థమా?'' అని ప్రశ్నించారు.
భారత్-పాకిస్తాన్ పరిస్థితులతో పోలిస్తే మిడిల్ ఈస్ట్‌లో భద్రతా పరిస్థితుల్లో మార్పులు ఈ ఒప్పందానికి ప్రధాన కారణమని ఎహతేషామ్ షాహిద్ భావిస్తున్నారు.
ప్రస్తుతం భారత్-సౌదీ సంబంధాలు దెబ్బతిన్నట్లు ఏమీ కనిపించడం లేదని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














