నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ: ఎలక్ట్రీషియన్ కొడుకు బ్యాటింగ్ ‘పవర్’

ఫొటో సోర్స్, @TilakV9
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయంతో దేశంలోని క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కీలక సమయంలో మైదానంలో దిగి చివరి వరకు క్రీజులో ఉంటూ అజేయంగా 69 పరుగులు చేసి ఫైనల్ మ్యాచ్ గెలిపించడంతో ఆయన పేరు మార్మోగుతోంది.
టీమిండియా మాజీ ఆటగాళ్లు ఆయన్ను కోహ్లీతో పోల్చుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
కీలకమైన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ కూలిపోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఆయన సంజు శాంసన్, శివమ్ దుబెలతో కలిసి మంచి భాగస్వామ్యాలు నిర్మించడం.. లక్ష్యాన్ని ఛేదించడానికి కావాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్నా మనోనిబ్బరంతో నిలకడగా, ధాటిగా ఆడిన తీరును ప్రశంసిస్తున్నారు.
మిడిల్ ఆర్డర్‌లో అత్యద్భుతంగా రాణించాడంటూ క్రీడావిశ్లేషకులూ మెచ్చుకుంటున్నారు.


ఫొటో సోర్స్, @TilakV9
సాధారణ కుటుంబం నుంచి...
నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ స్వస్థలం మేడ్చల్. సాధారణ మధ్య తరగతి కుటుంబం. అతని చిన్నప్పుడే బీహెచ్ఈఎల్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. తండ్రి నాగరాజు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటారు. తిలక్ తల్లి పేరు గాయత్రి దేవి. తిలక్ వర్మ అన్న తరుణ్ వర్మ బ్యాడ్మింటన్ ప్లేయర్.
11 ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించిన తిలక్ వర్మ, క్రికెట్ ఆడుతూనే చదువునూ కొనసాగించాడు.
తిలక్ వర్మ 2023లో టీమిండియాకు సెలక్ట్ అయినప్పుడు ఆయన తండ్రి నాగరాజు 'బీబీసీ'తో మాట్లాడారు.
''నా ఇద్దరు కొడుకులు తరుణ్ వర్మ, తిలక్ వర్మలను మెడిసన్ చదివించాలనుకున్నా. డాక్టర్లు చేసి సమాజానికి ఎంతో కొంత సేవ చేయించాలని అనుకున్నా. కానీ, తరుణ్ బ్మాడ్మింటన్ వైపు వెళ్లాడు. తిలక్ క్రికెట్‌పై ఇష్టం పెంచుకున్నాడు. తను క్రికెట్ ఆడతానని చెబితే, డాక్టర్ చదివిస్తానని చెప్పా. నేను డాక్టర్‌నయితే చుట్టుపక్కల వాళ్లకే తెలుస్తుంది. అదే క్రికెట్లో రాణించి దేశానికి ఆడితే ప్రపంచానికి తెలుస్తుంది అన్నాడు. ఆ మాటతో ఏమీ అనలేకపోయా'' అని నాగరాజు బీబీసీతో చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎలక్ర్టికల్ వర్క్స్ అదనంగా ఒప్పుకుని డబ్బులు కూడబెట్టుకున్నట్లు నాగరాజు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్ర వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి...
2019లో విజయనగరంలో జరిగిన హైదరాబాద్ వర్సెస్ ఆంధ్ర మ్యాచ్‌తో ఫస్టక్లాస్ క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు తిలక్ వర్మ. అందులో మొదటి ఇన్నింగ్స్ లో 5 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 34 పరుగులు చేశాడు. అదే ఏడాదిలో హైదరాబాద్ తరఫున సౌరాష్ట్రతో లిస్ట్ ఎ మ్యాచ్, సర్వీసెస్‌తో టీ20 మ్యాచ్ లను తొలిసారిగా ఆడాడు.
అనంతరం 2022లో ఐపీఎల్‌లో తొలిసారి ఆడాడు. ఐపీఎల్‌లో ముంబయి జట్టు తరఫున ఆడిన తిలక్ మంచి స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టే ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.
20 ఏళ్ల తిలక్ వర్మకు క్రికెటర్ సురేశ్ రైనా అంటే ఎంతో ఇష్టం.
రైనా తరహాలోనే తిలక్ వర్మ కూడా ఎడమ చేతితో బ్యాటింగ్, కుడి చేతితో బౌలింగ్ చేస్తాడు.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. కవర్ డ్రైవ్, స్ట్రయిట్ డ్రైవ్ ఆడటం ఇష్టం.
''మా అబ్బాయికి సురేశ్ రైనా అంటే ఇష్టం. అందుకే అతనిలా ఎడమచేతితో బ్యాటింగ్, కుడిచేతితో బౌలింగ్ చేస్తుంటాడు.'' అని చెప్పారు.
తిలక్ వర్మ ఎంపిక సమయంలో క్రికెట్ విశ్లేషకులు సి.వెంకటేశ్ బీబీసీతో మాట్లాడారు.
''స్థిరత్వంతో ఆడతాడు. అతని స్ట్రయిక్ రేటు బాగుంటుంది. మూడు ఫార్మట్లలో ఆడగల నైపుణ్యం ఉందని రోహిత్ శర్మ కూడా ఇప్పటికే చెప్పాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్ గా టీమిండియాకు మంచి ఆయుధం దొరికింది. రానున్న రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ఆడిన ఆశ్చర్య పోనక్కర్లేదు'' అని వెంకటేశ్ అప్పట్లో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
11 ఏళ్ల వయసు నుంచే తర్ఫీదు...
11ఏళ్ల వయసులో బార్కాస్ వద్ద కోచ్ సలామ్ బయాష్ వద్ద క్రికెట్ ఆటలో శిక్షణకు వెళ్లాడు.
అప్పుడే తిలక్ వర్మలోని ప్రతిభను గుర్తించి ఆటలో బాగా నైపుణ్యాలు నేర్పించారు. ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని భావించినా కోచ్ ఆదుకున్నట్లు కుటుంబీకులు చెప్పారు.
పాతబస్తీ నుంచి బీహెచ్ఈఎల్‌కు తీసుకెళ్లి, తీసుకురావడం వంటి బాధ్యతలను కోచ్ సలామ్ తీసుకున్నారు.
''తిలక్ వర్మకు క్రికెట్ జీవితాన్ని ఇచ్చింది కోచ్ సలామ్‌నే. కొన్నిసార్లు పాతబస్తీలో మా సోదరి ఇంట్లోనే తిలక్ ఉండేవాడు. సలామ్ లింగంపల్లిలోని అకాడమీకి మారినప్పుడు అతనే బైకుపై తీసుకువచ్చేవారు'' అని నాగరాజు బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














