మొహ్సిన్ నఖ్వీ: ఆసియా కప్ ట్రోఫీని పాక్ క్రికెట్‌బోర్డ్ చెైర్మన్ చేతుల మీదుగా తీసుకోరాదని ఎందుకు నిర్ణయించారు?

ఆసియా కప్ 2025

ఫొటో సోర్స్, Getty Images

ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత, గ్రౌండ్‌లో జరిగిన పరిణామాలు ఇంతకు ముందెప్పడూ జరగలేదు.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకోవడానికి భారత జట్టు నిరాకరించింది.

ఆటగాళ్ళు అప్పటికే నిర్ణయం తీసుకున్నారని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా అన్నారు.

ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అజేయంగా 69 పరుగులు చేయగా, శివం దూబే 33 పరుగులు, కుల్‌దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు.

కానీ, భారత్ విజయం కంటే, భారత ఆటగాళ్లు ట్రోఫీని అందుకోవడానికి వేదికపైకి చేరుకోలేదనేదాని గురించే ఎక్కువ చర్చ జరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

మ్యాచ్ తర్వాత ఏం జరిగింది?

విజయం తర్వాత వెంటనే జరగాల్సిన అవార్డు ప్రదానం కార్యక్రమం దాదాపు గంట ఆలస్యంగా మొదలైంది. ప్రసార సమయంలో, న్యూజీలాండ్ మాజీ ఆల్ రౌండర్ సైమన్ డౌల్ భారత జట్టు ఈ ట్రోఫీని తీసుకోబోదని ప్రకటించాడు.

తరువాత, భారత ఆటగాళ్ళు ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించకూడదని నిర్ణయించుకున్నారని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ధ్రువీకరించారు.

దీంతో గెలిచిన జట్టు వేదికపైకి రాలేదు. కెప్టెన్‌ ట్రోఫీని అందుకోలేదు.

తిలక్ వర్మ (మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్), అభిషేక్ శర్మ (మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్), కుల్దీప్ యాదవ్ తమ వ్యక్తిగత అవార్డులను స్వీకరించడానికి వేదికపైకి వచ్చారు. కానీ వారు మొహ్సిన్ నఖ్వీని పట్టించుకోలేదు.

వేదికపై ఉన్న ఏకైక వ్యక్తి మొహ్సిన్ నఖ్వీ. ఆయన భారత ఆటగాళ్లకు స్టేజ్ మీదకు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టలేదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

ఏసీసీ, స్టేడియం మేనేజ్‌మెంట్ గెలిచిన జట్టుకు ట్రోఫీని ఎవరు ప్రదానం చేయాలో నిర్ణయించడానికి ప్రయత్నిస్తుండగానే, ఈ కార్యక్రమాన్ని అకస్మాత్తుగా నిలిపివేసిన నిర్వాహకులు, ట్రోఫీని డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

భారత జట్టు ట్రోఫీని తీసుకోలేదు. కానీ మైదానంలో ఉన్న ఆటగాళ్లు తమదైన శైలిలో విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

‘‘ఒక గొప్ప ఫైనల్‌ను చూడటానికి ఉత్సుకతతో ఉన్నా, గెలిచిన జట్టుకు ట్రోఫీని అందజేయడానికి ఎదురు చూస్తున్నా’’ అని ఫైనల్‌కు ఒక రోజు ముందు మొహ్సిన్ నఖ్వీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

భారత్, పాకిస్తాన్, మ్యాచ్

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, రన్నరప్ పాకిస్తాన్ జట్టుకు మొహ్సీన్ నఖ్వీ ప్రైజ్‌మనీ చెక్ అందజేశారు.

ప్రధాని మోదీ పోస్ట్, మొహ్సిన్ నఖ్వీ స్పందన

భారతదేశం విజయం సాధించిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో జట్టును అభినందించారు . ఆయన తన పోస్ట్‌లో 'ఆపరేషన్ సిందూర్' గురించి ప్రస్తావించారు.

"క్రీడా మైదానంలో ఆపరేషన్ సిందూర్. ఫలితం మాత్రం అదే - భారత్ గెలిచింది. మన క్రికెటర్లకు అభినందనలు" అని మోదీ రాశారు.

దీనిపై ఏసీసీ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ స్పందిస్తూ .. "యుద్ధం మీ గర్వానికి కొలమానమైతే, పాకిస్తాన్ చేతిలో భారతదేశం అవమానకరమైన ఓటమిని చరిత్ర ఇప్పటికే నమోదు చేసింది. ఏ క్రికెట్ మ్యాచ్ కూడా ఆ వాస్తవాన్ని మార్చలేదు. యుద్ధాన్ని ఆటలోకి లాగడం నిరాశపరిచింది. క్రీడా స్ఫూర్తికి అవమానం" అని రాస్తూ మోదీ పోస్ట్‌ను రీపోస్ట్ చేశారు.

"గొప్ప విజయం. మన ఆటగాళ్ల అపారమైన శక్తి మరోసారి ప్రత్యర్థులను చిత్తు చేసింది. నేల ఏదైనా సరే, భారతదేశం విజయం ఖాయం" అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

భారతజట్టు

ఫొటో సోర్స్, Surjeet Yadav/MB Media/Getty Images

ఫొటో క్యాప్షన్, స్టేడియంలో సంబరాలు చేసుకుంటున్న భారత జట్టు

ట్రోఫీని స్వీకరించకూడదనే నిర్ణయం గురించి విలేఖరుల సమావేశంలో మాట్లాడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇది జట్టు సమష్టి నిర్ణయం అని ఆయన అన్నారు.

చాంపియన్స్ జట్టుకు ట్రోఫీని ఇవ్వకపోవడం ఎప్పుడూ చూడలేదని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.

"ఇది కూడా కష్టపడి గెలిచిన ట్రోఫీ. మేం దానికి అర్హులమని నేను నమ్ముతున్నా. చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పా, ఇంకేమీ చెప్పలేను. ట్రోఫీల గురించి మీరు నన్ను అడిగితే, నా ట్రోఫీలు నా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాయి. నాతో ఉన్న 14 మంది ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది నిజమైన ట్రోఫీలు" అని ఆయన అన్నారు.

మొహ్సిన్ నఖ్వీ చేతులమీదుగా ట్రోఫీ తీసుకోకూడదనే నిర్ణయం అధికారికమా, కాదా అని ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు, "మేం ఈ నిర్ణయం మైదానంలోనే తీసుకున్నాం. ఎవరూ మాకు అలా చేయమని చెప్పలేదు. మీరు టోర్నమెంట్ బాగా ఆడి గెలిచినప్పుడు, ట్రోఫీకి అర్హులా కాదా? మీరు చెప్పండి?" అని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.

"ఏసీసీ అధ్యక్షుడి నుంచి 2025 ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించకూడదని మేం నిర్ణయించుకున్నాం. ఆయన పాకిస్తాన్ ప్రముఖ నాయకులలో ఒకరు. అందుకే మేం దానిని స్వీకరించకూడదనుకున్నాం. కానీ ట్రోఫీ, పతకాలు ఆయన వద్దే ఉంటాయని దీని అర్థం కాదు. వీలైనంత త్వరగా వాటిని భారతదేశానికి తిరిగి ఇస్తారని ఆశిస్తున్నాం. నవంబర్‌లో దుబాయ్‌లో ఐసీసీ సమావేశం ఉంది. తదుపరి సమావేశంలో, ఏసీసీ అధ్యక్షుడి చర్యకు వ్యతిరేకంగా మేం నిరసనను నమోదు చేస్తాం" అని ఏఎన్ఐ వార్తా సంస్థతో దేవ్‌జిత్ సైకియా తెలిపారు.

"ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించినందుకు బీసీసీఐ చాలా సంతోషంగా ఉంది. భారత క్రికెట్ జట్టును అభినందిస్తుంది. పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లు ఏకపక్షంగా జరిగాయి. మా జట్టుపట్ల మేం చాలా గర్వపడుతున్నాం. సరిహద్దు ప్రాంతంలో మన సాయుధ దళాలు కూడా అలాగే చేశాయి. ఇప్పుడు దుబాయ్‌లో కూడా అదే జరిగింది. భారత జట్టుకు రూ. 21 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని మేం నిర్ణయించుకున్నాం" అని ఆయన అన్నారు.

పాక్ కెప్టెన్

ఫొటో సోర్స్, Getty Images

పాక్ కెప్టెన్ ఏమన్నాడు?

మ్యాచ్ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాను ట్రోఫీ వివాదం, టీం ఇండియా గురించి విలేఖరులు అనేక ప్రశ్నలు అడిగారు.

ఈ వివాదం మీ జట్టు ఆటతీరును మరుగుపరిచిందా అని అడిగినప్పుడు, "మేం ఎప్పుడూ విమర్శలకు గురవుతున్నాం. క్రికెట్‌ను అర్థం చేసుకున్న వ్యక్తులు క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడతారు. మిగతావన్నీ సెకండరీ. ఈ టోర్నమెంట్‌లో మా బ్యాటింగ్ ఉండాల్సిన విధంగా లేదు, మేం మెరుగుపరచుకోవాల్సిన విషయాలు ఏమిటో మాకు తెలుసు. దానిపై దృష్టి పెడతాం" అని అన్నారు.

కరచాలనాలు, క్రీడా స్ఫూర్తి గురించి అడిగినప్పుడు, సల్మాన్ ఆఘా భారత ఆటగాళ్ల ప్రవర్తన తనకు నిరాశ కలిగించిందని అన్నారు.

"మీరు క్రికెట్‌ను పరిశీలిస్తే, వారు కరచాలనం చేయడానికి నిరాకరించడం లేదా వారి ప్రవర్తన...మాపట్ల అగౌరవం కాదు, క్రికెట్ పట్ల అగౌరవం. క్రికెట్‌ను అగౌరవపరిచే ఎవరైనా ఎక్కడో ఒకచోట బయటపడతారు. ఏ మంచి జట్టు కూడా ఈ రోజు వారు చేసినట్లు చేస్తుందని నేను అనుకోను. మంచి జట్టు మేం చేసినట్లు చేస్తుంది. ఒంటరిగా వెళ్లి, ట్రోఫీతో ఫోటో తీయించుకోండి. మా పతకాలను తీసుకోండి" అని ఆయన అన్నారు.

టోర్నమెంట్ ప్రారంభంలో భారత కెప్టెన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో లేదా రిఫరీ సమావేశాలలో తనతో కరచాలనం చేశాడని, కానీ మైదానంలో బహిరంగ ప్రదర్శనల విషయానికి వస్తే అలా చేయలేదని సల్మాన్ పేర్కొన్నాడు.

"అతను తనకు ఇచ్చిన సూచనలను పాటిస్తున్నాడని నేను అనుకుంటున్నా. అలా అయితే అతనిష్టం" అని సల్మాన్ అన్నాడు.

భారత జట్టు చేతిలో పదే పదే ఓటమి గురించి అడిగినప్పుడు, జట్టు ప్రదర్శన బాగా లేదని ఆయన ఒప్పుకున్నారు. దీనిని ఒక దశగా పేర్కొన్నారు. "మేం ప్రస్తుతం వారిపై మంచి క్రికెట్ ఆడటం లేదని మాకు తెలుసు. కానీ మీరు మొత్తంగా చూస్తే, మేం ఇంకా వారికంటే ముందున్నాం. దీని అర్థం ప్రతి జట్టుకు ఒక దశ ఉంటుంది. బహుశా వారు ప్రస్తుతం వారు ఉన్నత దశలో ఉన్నారు. 90లలో మేం వారిని ఓడించినట్లే, నేడు వారి ఉన్నత దశలో మమ్మల్ని ఓడిస్తున్నారు. కానీ అతి త్వరలో మేం కూడా వారిని అదే విధంగా ఓడించడం మీరు చూస్తారు" అని అన్నాడు.

ట్రోఫీ

ఫొటో సోర్స్, FADEL SENNA/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, గెలిచిన జట్టుకు ట్రోఫీని ఇవ్వకపోవడం తానెప్పుడూ చూడలేదని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు.

ఆసియా కప్‌ 2025లో భారత్, పాకిస్తాన్ మూడుసార్లు తలపడ్డాయి. తొలి రెండు మ్యాచ్‌లను భారత్ సులభంగా గెలిచింది. కానీ ఈ మ్యాచ్‌లలో కూడా మైదానం వెలుపల చాలా ఉద్రిక్తత కనిపించింది.

తొలి మ్యాచ్ నుంచి భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. ఆ విజయం తర్వాత, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పహల్గామ్ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానని చెప్పాడు.

మొదటి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పుడు, టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు సంప్రదాయ ప్రకారం చేసుకునే కరచాలనం చేసుకోలేదు. దీని తర్వాత, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది.

"ఐసీసీ ప్రవర్తనా నియమావళి, క్రికెట్ స్ఫూర్తికి సంబంధించిన ఎంసీసీ చట్టాలను మ్యాచ్ రిఫరీ ఉల్లంఘించినందుకు ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది" అని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఎక్స్‌లో రాశారు.

మ్యాచ్ తర్వాత జరిగిన విలేఖరుల సమావేశంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, "కొన్ని విషయాలు క్రీడా స్ఫూర్తికంటే పెద్దవి" అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)