దగ్గుమందు: ఇది ఎప్పుడు ప్రమాదకరం, నిపుణులు ఏం చెబుతున్నారు? 5 ప్రశ్నలు-జవాబులు

ఫొటో సోర్స్, Anshul Jain
- రచయిత, భామిని మురుగన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దగ్గుమందు తాగడం వల్ల దాని ప్రభావంతో మధ్యప్రదేశ్‌లో చిన్న పిల్లలు చనిపోయారని ఆరోపణలు వస్తున్నాయి.
తమిళనాడులోని కాంచీపురంలో ఈ డ్రగ్ తయారైందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.ఈ డ్రగ్‌లో డైఎథిలీన్ గ్లైకాల్ అనే ప్రమాదకర రసాయనం ఉన్నట్లు తేలింది.
ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ...తమిళనాడు ప్రభుత్వానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. దీంతో, రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు దగ్గుమందు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
ఆ కంపెనీ తయారు చేసిన దగ్గుమందును కేవలం పిల్లలే కాకుండా, ఏ వయసు వారు కూడా వాడొద్దని తమిళనాడు వైద్య, ప్రజా సంక్షేమ శాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ చెప్పారు.
డైఎథిలీన్ గ్లైకాల్ పిల్లలకు ఎలా ప్రాణాంతకంగా మారుతుంది? పిల్లలకు దగ్గుమందు కొనేటప్పుడు మనం ఏం చేయాలి ? ఏం చేయకూడదు?

మధ్యప్రదేశ్‌లో ఏం జరిగింది?
అక్టోబర్ 3 నాటికి మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో దగ్గుమందు తాగిన తర్వాత వచ్చిన ఆరోగ్య సమస్యలతో 11 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్టు చేసింది.
సెప్టెంబర్ 7 నుంచి వీరు కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో బాధపడి చనిపోయినట్లు పేర్కొంది.
ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ ప్రవీణ్ సోనీ, దగ్గుమందు తయారీ సంస్థ శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ యాజమాన్యంతో పాటు ఇతర బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బీబీసీకి అందిన ఎఫ్‌ఐఆర్ కాపీ ప్రకారం, "2025 ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఐదేళ్లలోపు వయసున్న అనేక మంది చిన్నారులు జలుబు, దగ్గు, జ్వరంతో పరాసియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేరారు. వీరిలో చాలామందికి డాక్టర్ ప్రవీణ్ సోనీ 'కోల్డ్రిఫ్' దగ్గుమందు (కాఫ్ సిరప్)తో పాటు ఇతర మందులు ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత పిల్లల్లో మూత్రం ఆగిపోవడం, ముఖం ఉబ్బడం, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. విచారణలో వీరికి కిడ్నీ ఫెయిల్ అయినట్లు తేలింది" అని ఉంది.

ఫొటో సోర్స్, ANI
‘‘తమిళనాడుకు చెందిన శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ తయారు చేసిన దగ్గుమందులో ప్రమాదకరమైన డైఎథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలింది. పిల్లలకు ఈ మందు ప్రమాదకరమని తెలిసినా, ఈ మందును మార్కెటింగ్ చేస్తూ, ప్రిస్క్రైబ్ చేస్తున్నారు'' అని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
తమిళనాడులోని కాంచీపురంలో తయారైన 'కోల్డ్రిఫ్' దగ్గుమందును బ్యాన్ చేసినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
కేవలం దగ్గుమందును మాత్రమే కాక, ఈ కంపెనీ తయారు చేసే ఇతర ప్రొడక్టులను కూడా బ్యాన్ చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
దీనిపై తమిళనాడు డ్రగ్ కంట్రోల్ విభాగం పరిశీలన జరిపి, శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన ‘కోల్డ్రిఫ్’ దగ్గు సిరప్‌లో ‘కల్తీ జరిగింది’ అని నిర్ధరించింది.

ఫొటో సోర్స్, Getty Images

జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నప్పుడు రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఓవర్-ది-కౌంటర్ ( డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల దుకాణాల నుంచి కొనుగోలు చేసేవి) మందులు ఇవ్వొద్దని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తెలిపింది.
ఈ మందులు అత్యంత ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవిగా పేర్కొంది.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ముఖ్యంగా పిల్లలకు జలుబు, దగ్గుమందులు కొనడం అత్యంత ప్రమాదకరమని ఎఫ్‌డీఏ హెచ్చరించింది.
దీని గల కారణాలను కూడా వివరించింది.
- పిల్లలకు రికమెండ్ చేసిన మోతాదు కంటే ఎక్కువ మోతాదు మెడిసిన్‌లో ఉండొచ్చు. పిల్లలకు వీటిని తరచూ తాగిస్తే ప్రమాదకరంగా మారొచ్చు.
- ఒకేసారి ఒకే మెడికేషన్‌లో రెండు రకాల ప్రొడక్టులను వారు వాడుతుండొచ్చు. ఉదాహరణకు..ఎసిటమైనోఫెన్ ఉన్నదాన్ని నొప్పి నివారణకు, అదే ఎసిటమైనోఫెన్ ఉన్న మందును జలుబు మందుగా తీసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో డోస్ పెరుగుతుంది.
దీనిపై మరింత స్పష్టమైన సమాచారం తెలుసుకునేందుకు చెన్నైలోని అపోలో హాస్పిటల్స్ యురాలజిస్ట్ సందీప్ బాఫ్నాను సంప్రదించాం. ఆయన మా సందేహాలకు క్లారిటీ ఇచ్చారు.
''పిల్లలు చాలా వరకు వారికొచ్చిన జలుబును, దగ్గును సొంతంగానే పోగొట్టుకుంటూ ఉంటారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సరైన మోతాదులో, క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన విధంగా మందులు ఇవ్వడం మంచిది" అని డాక్టర్ సందీప్ బాఫ్నా అన్నారు.
మందులను సరైన మోతాదులో ఇవ్వడం చాలా ముఖ్యం.
సరైన మోతాదును ఎలా గుర్తించాలన్నది కూడా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అమెరికా ఎఫ్‌డీఏ చెబుతున్న ప్రకారం..
- మందును సరైన మోతాదులో తీసుకునేందుకు వీలుగా, కొలవడానికి వీలుకల్పించే మూతను కూడా దానితోపాటు పంపిణీ చేయాలని తయారీ సంస్థలకు సూచనలు ఉన్నాయి.
- మందును తీసుకునేందుకు ఇళ్లలోని స్పూన్లను, ఇతర మెడిసిన్ సంబంధిత ఎక్విప్‌మెంట్‌ను వాడకూడదు.
- పెద్దల కోసం తయారు చేసిన మందులను పిల్లలకు ఇవ్వకూడదు. అందులో మోతాదు(డోసేజ్)లు భిన్నంగా ఉంటాయి.


మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు తాగి మరణించిన పిల్లలకు కిడ్నీ దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి.
దీని గురించి డాక్టర్ సందీప్ బాఫ్నాను అడిగినప్పుడు, ''ఫ్యాక్టరీల్లో ఉపయోగించే డైఎథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్ లాంటి అణువులు, మన శరీరంలో మూత్రపిండాల గొట్టాన్ని(రీనల్ ట్యుబుల్) ప్రభావితం చేస్తాయి'' అని తెలిపారు.
‘‘రీనల్ ట్యూబుల్ అనేది టీని వడపోసే జల్లెడలాంటిది. ఇది కిడ్నీలను ఇది వడపోస్తుంది. డైఎథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్ అణువుల వల్ల కిడ్నీ ఫ్యూరిఫికేషన్ ప్రాపర్టీలు (శుద్ధి చేసే లక్షణాలు) ప్రభావితమవుతాయి. అందుకే, కిడ్నీ డిజార్డర్లు, కాలేయ సమస్యలు, శ్వాస తీసుకోలేకపోవడం వంటివి జరుగుతాయి’’ అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

రెండేళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలకు దగ్గు, జలుబు తగ్గేందుకు కొన్ని విధానాలను అమెరికా ఎఫ్‌డీఏ సూచించింది.
- కూల్ మిస్ట్ హ్యూమిడిఫైయర్ అనేది గదిని తేమగా ఉంచే పరికరం. దీన్ని ఉపయోగించడం వల్ల నేసల్ కంజెశ్చన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
- సెలైన్ నోస్ డ్రాప్‌లు లేదా స్ప్రేలు: నేసల్ కంజెశ్చన్ నుంచి ఉపశమనం పొందేందుకు నేసల్ స్ప్రేలు వాడుకోవచ్చు.
- ముక్కు ద్వారా మందును ఇచ్చేటప్పుడు బల్బ్ సిరంజీని వాడుకోవచ్చు. ఏడాది కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఇది బాగా పనిచేస్తుంది.
- ఎసిటమైనోఫెన్ లేదా ఐబుప్రోఫెన్ కూడా వాడొచ్చు. ఇది జ్వరాన్ని, నొప్పులను తగ్గిస్తుంది. కానీ, ఈ మెడిసిన్లను పిల్లలకు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుని సూచనలు పాటించడం చాలా అవసరం.
- నీరు సమృద్ధిగా ఉండే ఆహారాలను ఎంత వీలైతే అంత ఎక్కువగా పిల్లలు తినేలా చూడాలి. వారిని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఒక వ్యక్తి వయసు, శరీర బరువు బట్టి దగ్గుమందును వేసుకునే మోతాదు మారుతుంది. పెద్దలు తీసుకునే మోతాదును పిల్లలకు ఇవ్వకూడదు. ఎందుకంటే, పెద్దవారి కిడ్నీలు మెచ్యూర్‌గా ఉంటాయి. అందువల్ల, ఈ మందులు కిడ్నీలకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది'' అని డాక్టర్ సందీప్ చెప్పారు.
దగ్గుమందు తీసుకునేటప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని ఆయన వివరించారు.
చేయకూడనవి..
- వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు దగ్గుమందు ఇవ్వకూడదు.
- అర్థం చేసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే..అన్ని దగ్గులు ఒకే రకమైనవి కావు. పొడి దగ్గు, తడి దగ్గుతోపాటు ఆస్తమా వంటివి కూడా దగ్గుకు కారణమవుతాయి. వీటికి ప్రత్యేక మందులు తీసుకోవాలి.
- డాక్టర్ సూచనలు లేకుండా సొంతంగా మందులు వేసుకోకూడదు.
చేయాల్సినవి ఏంటి..
- డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ అవసరం.
- మందులను సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం.
- ఆమోదం పొందిన మందులనే సరైన మందుల దుకాణాల నుంచి కొనాలి.
- మందులకు వెనుకవైపు లేబుల్ చెక్ చేసుకోవాలి. ఈ మందుల్లో ఏ మెడికేషన్లను, ఎంత మోతాదులో వాడారో చూడాలి.
- కొన్నిసార్లు పెద్దలకు ఇచ్చే వాటిని పిల్లలకు ఇస్తారు. ఇది ఒక్క మిల్లీలీటర్ అయినా కూడా అధిక మోతాదు కావొచ్చు. ఇది పిల్లలకు హానికరం.
- మందును తయారీ తేదీ, గడువు తేదీని చూడాలి.
- ఈ మందును తయారు చేసిన కంపెనీ పేరును కూడా పరీక్షించాలి.

ఫొటో సోర్స్, Getty Images

జలుబు, దగ్గు ఉన్నప్పుడు పిల్లలకు ఎప్పుడు వైద్యుని సహాయం తక్షణం అవసరమో ఆ లక్షణాలను అమెరికా ఎఫ్‌డీఏ విడుదల చేసింది.
ఈ లక్షణాల్లో..
- రెండేళ్ల లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలకు 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా అంతకంటే ఎక్కువ జ్వరం ఉన్నప్పుడు
- ఏ వయసు పిల్లలకైనా 102 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉన్నప్పుడు
- శ్వాస తీసుకోలేనప్పుడు, వేగంగా శ్వాస తీసుకునేటప్పుడు
- తీవ్రమైన తలనొప్పి వస్తున్నప్పుడు
- ఆహారం, నీళ్లు తీసుకోలేనప్పుడు
- భరించలేని చెవి నొప్పి వచ్చేటప్పుడు
ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














