దగ్గుమందు తాగిన తర్వాత 11 మంది చిన్నారులు మృతి, డాక్టర్‌తో సహా ఫార్మా కంపెనీపై కేసు.. అసలేం జరిగింది?

- రచయిత, విష్ణుకాంత్ తివారి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో దగ్గుమందు తాగిన తర్వాత 11 మంది చిన్నారులు మృతి చెందిన విషాద ఘటనకు సంబంధించి కేసు నమోదైంది. ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ ప్రవీణ్ సోనీ, దగ్గుమందు తయారీ సంస్థ శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ యాజమాన్యంతో పాటు ఇతర బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్టోబర్ 5న, పరాసియా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అంకిత్ సహ్లామ్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
జిల్లా యంత్రాగం తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన 11 మందిలో 10 మంది ప్రభుత్వ పీడియాట్రిషన్‌గా డాక్టర్ ప్రవీణ్ సోని పనిచేస్తున్న పరాసియా బ్లాక్ పరిధిలోని వారే.
బీబీసీకి అందిన ఎఫ్‌ఐఆర్ కాపీ ప్రకారం, "2025 ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఐదేళ్లలోపు వయసున్న అనేక మంది చిన్నారులు జలుబు, దగ్గు, జ్వరంతో పరాసియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేరారు. వీరిలో చాలామందికి డాక్టర్ ప్రవీణ్ సోనీ 'కోల్డ్రిఫ్' దగ్గుమందు(కాఫ్ సిరప్)తో పాటు ఇతర మందులు ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత పిల్లల్లో మూత్రం ఆగిపోవడం, ముఖం ఉబ్బడం, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. విచారణలో వీరికి కిడ్నీ ఫెయిల్యూర్ అయినట్లు తేలింది."

ఎఫ్‌ఐఆర్ ప్రకారం, బాధితులలో పలువురిని నాగ్‌పూర్ తరలించగా చికిత్స పొందుతూ 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
సెప్టెంబర్ 4న తొలి మరణం నమోదైంది. నాలుగేళ్ల శివమ్ రాథోడ్ చనిపోయారు. చివరిగా, అక్టోబర్ 4న రెండేళ్ల యోగితా ఠాక్రే మరణించారు.
మరణాల నేపథ్యంలో, మధ్యప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1న తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాసింది. సిరప్ తయారీ సంస్థపై దర్యాప్తు చేయాలని అందులో కోరింది.
దీనిపై తమిళనాడు డ్రగ్ కంట్రోల్ విభాగం పరిశీలన జరిపి, శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్‌లో "కల్తీ జరిగింది" అని నిర్ధరించింది.
తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ విభాగం అక్టోబర్ 2న విడుదల చేసిన నివేదికలో, కోల్డ్రిఫ్ సిరప్ బ్యాచ్ SR-13 'కల్తీ'గా ప్రకటించింది.

ఫొటో సోర్స్, ANSHUL JAIN
శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన కోల్డ్రిఫ్ సిరప్‌లో డైఎతిలీన్ గ్లైకాల్ అనే ప్రమాదకర రసాయనం 48.6 శాతం ఉన్నట్లు తేలింది.
అంటే, ప్రతి 100 మిల్లీ లీటర్ల సిరప్‌లో 48.6 గ్రాముల డైఎతిలీన్ గ్లైకాల్ రసాయనం ఉన్నట్లు అర్థం. ఈ రసాయనం అత్యంత ప్రమాదకరమైనదిగా వైద్య నిపుణులు చెబుతున్నారు.
భోపాల్‌కు చెందిన వైద్యురాలు డాక్టర్ హర్షితా శర్మ బీబీసీతో మాట్లాడుతూ, "డైఎతిలీన్ గ్లైకాల్, ఎతిలీన్ గ్లైకాల్ రసాయనాలు సాధారణంగా కూలెంట్లుగా ఉపయోగిస్తారు. ఇవి అత్యంత విషపూరిత పదార్థాలు. పిల్లలకు ప్రాణాంతకంగా మారొచ్చు" అని అన్నారు
ఈ సిరప్ పిల్లలకు హానికరమని తెలిసినా మార్కెట్లోకి విడుదల చేసి, చిన్నారులకు ఇచ్చినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
దీని ఆధారంగా పోలీసులు డాక్టర్ ప్రవీణ్ సోనీ, శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ నిర్వాహకులు, ఇతర బాధ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
డాక్టర్ ప్రవీణ్ సోనీ, శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ నిర్వాహకులు, ఇతరు బాధ్యులపై బీఎన్ఎస్ 105(హత్యకు సమానమైన), సెక్షన్ 276 (కల్తీ మందులు), డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లోని సెక్షన్ 27ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజల్లో ఆగ్రహం, అధికారులు అప్రమత్తం
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నమూనాలను సేకరించి మరిన్ని ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు హామీ ఇచ్చాయి.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎక్స్ ద్వారా స్పందించారు. "కోల్డ్రిఫ్ సిరప్ కారణంగా ఛింద్వారాలో చిన్నారులు మరణించడం చాలా బాధాకరం. ఈ సిరప్ విక్రయాలను మధ్యప్రదేశ్‌లో నిషేధించాం. ఈ సిరప్ తయారీ కంపెనీ ఇతర ఉత్పత్తులను కూడా నిషేధించాం" అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజస్థాన్‌లోనూ కేసులు
మధ్యప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న రాజస్థాన్‌లోని భరత్‌పూర్, ఝుంఝును జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రి సిఫార్సు చేసిన దగ్గుమందు ఇద్దరు చిన్నారులు మరణించారు. శనివారం, చురు జిల్లాలో మరో చిన్నారి మరణించారు. చనిపోయిన చిన్నారుల కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలు చేశారు.
చురు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలుడు జైపూర్‌లోని జేకే లోన్ ఆస్పత్రిలో మరణించాడు. నాలుగు రోజుల కిందట ఆ చిన్నారికి దగ్గుమందు ఇచ్చారని, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో జైపూర్‌కు తీసుకెళ్లాలని చెప్పినట్లు చిన్నారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
భరత్‌పూర్‌కి చెందిన రెండేళ్ల చిన్నారిని జైపూర్‌కు రిఫర్ చేశారు. మూడు రోజుల అనంతరం ఆ చిన్నారి చనిపోయారు. ఝుంఝునుకి చెందిన ఐదేళ్ల చిన్నారిని సికార్‌కు రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందారు.
మధ్యప్రదేశ్ డ్రగ్ కంట్రోలర్ దినేశ్ కుమార్ మౌర్య బీబీసీతో మాట్లాడుతూ, "మేం సెంట్రల్ డ్రగ్ ఏజెన్సీతో టచ్‌లో ఉన్నాం. మేం 12 శాంపిళ్లు, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ఏజెన్సీ ఆరు శాంపిళ్లు సేకరించింది. మా మూడు శాంపిళ్లతో పాటు సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ సేకరించిన ఆరు శాంపిళ్లలో ఇప్పటి వరకూ డైఇథిలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ గ్లైకాల్ అవశేషాలను గుర్తించలేదు. మిగిలిన శాంపిళ్లను పరీక్షలు కొనసాగుతున్నాయి" అని చెప్పారు.
మధ్యప్రదేశ్ ఆరోగ్య మంత్రి రాజేంద్ర శుక్లా శుక్రవారం మధ్యాహ్నం మాట్లాడుతూ, "ఇప్పటి వరకూ 12 రకాల సిరప్‌లను పరీక్షల నిమిత్తం స్టేట్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌కు పంపారు. వాటిలో మూడింటి రిపోర్టులు వచ్చాయి. అందులో చిన్నారుల మరణానికి కారణమని చెప్పే అవశేషాలు ఏవీ గుర్తించలేదు" అని అన్నారు.
దగ్గుమందు మరణాలపై రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ మాట్లాడుతూ, "ఆ ఔషధాలకు పరీక్షలు నిర్వహించారు. వాటిలో ప్రాణాంతకమైన పదార్థాలేవీ ఉన్నట్లు తేలలేదు. సిరప్ వల్ల ఎలాంటి మరణం సంభవించినట్లు తేలలేదు. ఈ విషయంపై దర్యాప్తుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం" అని చెప్పారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరణాలు చోటుచేసుకోవడంతో, సెంట్రల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్గ్ సర్వీసెస్(డీజీహెచ్‌ఎస్) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది. చిన్నారులకు దగ్గుమందు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














