ఆంధ్రప్రదేశ్: అక్కడి మరణాలకు కారణం ఎందుకు తెలియడం లేదు? రోగనిర్థరణలో జాప్యం దేనికి?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరానికి ఆనుకుని ఉండే తురకపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో 5నెలల్లో 29 మంది చనిపోయారు.
అధికారిక లెక్కల ప్రకారం కేవలం రెండు నెలల వ్యవధిలో అదే కాలనీకి చెందిన 20మంది ప్రాణాలు కోల్పోయారు.
సెప్టెంబర్ తొలివారంలో అక్కడ వైద్యశిబిరం ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చామని అధికారులు చెప్పారు.
అయితే గ్రామస్తులు అర్ధంతరంగా చనిపోవడం వెనుక కారణాలు ఏంటనేది మాత్రం కనుక్కోలేక పోయారు.

విజయవాడలోని న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన 358మంది కిందటినెల సెప్టెంబర్‌లో కేవలం రెండు, మూడు రోజుల వ్యవధిలోనే వాంతులు, విరోచనాలతో ఆస్పత్రుల పాలయ్యారు.
ఇప్పుడు పరిస్థితి బాగానే ఉందని, అతిసారతోనే అక్కడి వారు అనారోగ్యం పాలయ్యారని అధికారులు చెబుతున్నారు.
కానీ విజయవాడ కార్పొరేషన్ పరిధిలో అతిసార ప్రబలడానికి కారణాలేంటనే దానిపై మాత్రం స్పష్టతనివ్వలేకపోతున్నారు.
యాదృచ్చికమే కావచ్చు.. పేదలు ఎక్కువగా ఉండే తురకపాలెం, బడుగు బలహీనవర్గాలు ఉండే రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లోనే వ్యాధులు ప్రబలడం చర్చనీయాంశమైంది.

తురకపాలెంలో.. అర్ధంతరంగా..
తురకపాలెంలో వయస్సుతో సంబంధం లేకుండా యువకులు మహిళలు, వృద్ధులు ఉన్నట్టుండి చనిపోవడంతో కలకలం రేగింది.
సెప్టెంబర్ తొలివారంలో స్పందించిన ప్రభుత్వం అక్కడ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. ఎస్సీ కాలనీలోని అందరికీ 42రకాల రక్తపరీక్షలు నిర్వహించింది. జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయించింది.
సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
అనుమానిత లక్షణాలపై లోతైన అధ్యయనం చేసి వారంలో రోజుల్లో వ్యాధిని గుర్తించాలని ఆదేశించారు.

వీడని అనుమానాలు
తురకపాలెంలో ప్రధానంగా ఎస్సీకాలనీలోనే మరణాలు సంభవించడంతో స్థానికుల్లో ఎన్నో అనుమానాలు తలెత్తాయి.
కాలనీకి మంచినీరు అందించే చెరువులో నీరు కలుషితం అయిందని కొందరు స్థానికులు ఆరోపించారు.
ఎక్కువగా మద్యం సేవించడం వల్ల చనిపోయింటారని ఎమ్మెల్యే రామాంజనేయులు అనుమానం వ్యక్తం చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
తురకపాలెం నుంచి వెళ్లిన రోగులకు చికిత్స చేసిన గుంటూరుకి చెందిన చర్మవ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ కల్యాణ్ కొందరికి మెలియాయిడోసిస్ ఇన్‌ఫెక్షన్ వచ్చినట్టు వెల్లడించారు. బర్ఖోల్డేరియా సూడోమాలీ అనే బాక్టీరియా వల్ల వచ్చే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌ను మెలియాయిడోసిస్‌గా ఆయన పేర్కొన్నారు.
దీంతో కలుషిత నీటి వల్ల మరణాలు సంభవిస్తున్నాయా? మద్యం వల్ల చనిపోతున్నారా? లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై అధ్యయనం చేస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాతే సరైన కారణం తెలుస్తుందని ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండ్యన్ 2025 సెప్టెంబర్ 4న ప్రకటించారు.

కారణం తెలియలేదు: డీఎంహెచ్‌వో
తురకపాలెంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అయితే ఎస్సీ కాలనీలో ఆకస్మిక మరణాలకు, కాలనీవాసులు అర్ధంతరంగా అనారోగ్యానికి గురికావడానికి కల కారణాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విజయలక్ష్మి బీబీసీతో చెప్పారు.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ) అధికారులు ఇంకా పరిశోధన చేస్తున్నారని, కారణాలను వాళ్లే చెప్పాలని ఆమె వ్యాఖ్యానించారు.
దీనిపై ఎన్‌సీడీసీ ఏపీ అధికారి డాక్టర్ ఎం.ప్రవీణ్‌ను బీబీసీ సంప్రదించింది.
"అధ్యయనం జరుగుతోంది. పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నాం. ఈ దశలో వివరాలను బహిర్గతం చేయలేం" అని ఆయన చెప్పారు.
మరోవైపు ఆ గ్రామంలో స్వయంగా సీఎం చంద్రబాబు హెల్త్‌ఎమర్జెన్సీ ప్రకటించినా ఇప్పటికీ అక్కడి ఎస్సీ కాలనీ వాసులు ఎందుకు చనిపోయారు. ఎందుకు అనారోగ్యం పాలయ్యారనేదానిపై రోగ నిర్ధరణ జరక్కపోవడం అన్యాయమని జన చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, గుంటూరుకి చెందిన లక్ష్మణ రెడ్డి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, DMHO/NTR DISTRICT
రాజరాజేశ్వరిపేటలో పరిస్థితిపై భిన్న వాదనలు
విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో సెప్టెంబర్ రెండోవారంలో ఒక్కసారిగా వందలమంది అతిసారతో ఆస్పత్రుల్లో చేరారు.
ఆ ప్రాంతానికి చెందిన మొత్తం 358మంది అతిసారతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్‌వో సుహాసిని బీబీసీకి తెలిపారు.
ఇప్పుడు పరిస్థితి అంతా అదుపులో ఉండటంతో వైద్య శిబిరాన్ని తీసేశామని, అతిసారతో ఎవరూ చనిపోలేదని చెప్పారు.
రాజరాజేశ్వరిపేటలో కుళాయి నీటి కాలుష్యంతో పాటు వినాయక చవితి సమయంలో సామూహిక భోజనాల వల్ల ఏమైనా ఆహారం కలుషితమైందా అన్న అనుమానాలు తలెత్తాయి.
అయితే అక్కడ అతిసార ప్రబలడానికి కారణాలపై మాత్రం అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు.
"కార్పొరేషన్ సరఫరా చేసే నీరు కలుషితం కాలేదని, అక్కడ ఆర్వో ప్లాంట్ల నుంచి స్థానికులు తెచ్చుకుంటున్న నీరు కలుషితమై ఈ కొలి బ్యాక్టీరియాతో అతిసార ప్రబలినట్టు మా అధ్యయనంలో తేలింది" అని విజయవాడ నగరపాలకసంస్థ చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి బీబీసీకి తెలిపారు.
అయితే ఆర్వో ప్లాంట్ల నీళ్లు తాగిన వారితో పాటు కార్పొరేషన్ కుళాయిల నీళ్లు తాగిన వాళ్లు కూడా అనారోగ్యం పాలయ్యారని, దానికి వాళ్లు ఏం సమాధానం చెబుతారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సిహెచ్. బాబూరావు ప్రశ్నించారు.
ఫుడ్ పాయిజన్ అయ్యిందనే వాదనల్లో వాస్తవం లేదని తాము అన్ని పరీక్షలు నిర్వహించామని ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణ బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, DMHO/NTR DISTRICT
రోగ నిర్ధరణ ఎందుకు జరగలేదు?
''వ్యాధులు ప్రబలి వారాలు గడిచినా కారణం ఏంటనేది ఇప్పటి వరకు నిర్ధరించకపోవడం దారుణం. ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటనలు చేసి వెళ్తున్నారు. రాష్ట్రంలో వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందిందని చెబుతున్న పాలకులు వ్యాధులకు కారణాలు గుర్తించలేక పోవడంపై ఏం సమాధానం చెబుతారు" అని సీపీఎం నేత బాబూరావు ప్రశ్నించారు.
తురకపాలెంలో వ్యాధి నిర్ధరణలో జాప్యంపై స్పందించేందుకు ఏపీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి నిరాకరించారు.
బీబీసీ ఫోన్ ద్వారా ఆమెను సంప్రదించినప్పుడు, ఈ విషయంలో ఇప్పుడు మాట్లాడలేనని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














