అరుణాచలంలో ఆంధ్ర యువతిపై లైంగిక దాడి, ఇద్దరు తమిళనాడు పోలీసులు డిస్మిస్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాయాకృష్ణన్ కన్నన్
- హోదా, బీబీసీ కోసం
దైవదర్శనం కోసం వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిపై అరుణాచలం(తిరువణ్ణామలై)లో ఇద్దరు తమిళనాడు పోలీసులు లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో కలకలం రేగింది.
యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఇద్దరు పోలీసులను కూడా విధుల నుంచి తొలగించారు. వారిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా (డిస్మిస్) తొలగించారు. ఈ మేరకు తిరువణ్ణామలై పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఆరోజు అసలేం జరిగింది?
తిరువణ్ణామలై అసిస్టెంట్ సూపరింటెండెంటగ్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) సతీష్ కుమార్ బీబీసీతో చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి..


ఫొటో సోర్స్, UGC
''సెప్టెంబర్ 29న అరటి గెలలతో ఒక కార్గో వాహనం ఆంధ్రప్రదేశ్ నుంచి తిరువణ్ణామలైకు చేరుకుంది. తిరువణ్ణామలైని దర్శించుకునేందుకు ఆ వాహన డ్రైవర్ చెల్లెలు, ఆమె 19 ఏళ్ల కూతురు కూడా ఆయనతో పాటు అదే వాహనంలో వచ్చారు'' అని సతీష్ కుమార్ తెలిపారు.
''తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో తిరువణ్ణామలై బైపాస్‌కు సమీపంలోని ఎంథాల్‌కు చేరుకుంది వారి వాహనం. ఆ సమయంలో రాత్రి పెట్రోలింగ్‌లో ఉన్న తిరువణ్ణామలై ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు సురేష్ రాజ్, సుందర్ ఆ వాహనాన్ని ఆపి, తనిఖీ చేశారు.''
'' అరటి గెలలను తీసుకెళ్తున్నానని, ఆలయానికి వెళ్లేందుకు తనతో పాటు బంధువులు కూడా వచ్చారని డ్రైవర్ వారికి చెప్పాడు'' అని సతీష్ కుమార్ బీబీసీతో అన్నారు.

అయితే, "పోలీసులు ఆ డ్రైవర్‌ను బెదిరించి.. 19 ఏళ్ల యువతిని, ఆమె తల్లిని తమతో తీసుకెళ్లారు. అటవీ ప్రాంతానికి సమీపంలో 19 ఏళ్ల యువతిపై ఆ ఇద్దరు పోలీసులు లైంగిక దాడికి పాల్పడ్డారు" అని ఏఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు.
''అనంతరం, వారిని తీసుకొచ్చి బైపాస్‌కు సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు ఏడుస్తూ ఉండడం అక్కడి స్థానికులు చూసి, ఏం జరిగిందో అడిగి తెలుసుకుని, వారిని రక్షించి తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో చేర్పించారు'' అని సతీష్ కుమార్ తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న తిరువణ్ణామలై జిల్లా ఎస్పీ ఎం.సుధాకర్ నేరుగా ఆస్పత్రికి వెళ్లి, బాధితులను విచారించారు.
లైంగిక దాడి అభియోగాలపై సురేష్ రాజ్, సుందర్‌పై ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
ఆ తర్వాత ఆ ఇద్దరినీ అరెస్టు చేసి, జైలుకు తరలించారు. తొలుత ఈ ఇద్దరినీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయగా.. ఆ తర్వాత ఉద్యోగాల నుంచి తొలగించారు.

విచారణ చేపట్టిన తమిళనాడు మహిళా కమిషన్
తమిళనాడు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఏ.ఎస్ కుమారి తిరువణ్ణామలైకి చేరుకుని, ఈ ఘటన గురించి అధికారులతో చర్చించారు. బాధితురాలిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ''తిరువణ్ణామలైలో ఏపీకి చెందిన యువతిపై ఇద్దరు పోలీసులు లైంగిక దాడికి పాల్పడడం షాక్‌కు గురిచేసింది. ఆ ఇద్దరు పోలీసులను కఠినంగా శిక్షించాలి. పది రోజుల్లో బాధితురాలికి ప్రభుత్వం నుంచి న్యాయం అందుతుంది'' అని ఆమె అన్నారు.
బాధితురాలికి రక్షణ, కౌన్సిలింగ్ అందించనున్నట్లు ఏ.ఎస్ కుమారి చెప్పారు.

ఫొటో సోర్స్, X/EDAPPADI PALANISAMY
ఘటనను ఖండించిన నేతలు
తిరువణ్ణామలైలో జరిగిన లైంగిక దాడి ఘటనను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో పాటు పలువురు రాజకీయ నేతలు ఖండించారు.
"తిరువణ్ణామలైలో పోలీసులు ఒక యువతిపై లైంగిక దాడికి పాల్పడడం రాష్ట్రంలో మహిళల అభద్రతకు పరాకాష్ట" అని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత పళనిస్వామి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
''తిరువణ్ణామలై సమీపంలో ఇద్దరు పోలీసులు ఒక యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వార్త బాధాకరం. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇంతటి దారుణానికి ఒడిగట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. బాధితురాలికి న్యాయం జరగాలి'' అని డీఎంకే ఎంపీ కనిమొళి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
భారతీయ జనతా పార్టీ నేత నైనార్ నాగేంద్రన్ కూడా తిరువణ్ణామలై ఘటనను ఖండించారు.
'' డీఎంకే పాలనలో తమిళనాడులో మహిళలకు భద్రత లేదు. ఇతర రాష్ట్రాల మహిళలకు కూడా భద్రత లేదని ఈ ఘటన ద్వారా తేటతెల్లమవుతోంది. తమిళనాడుకి ఇది మాయని మచ్చ. నేరాలను అడ్డుకోవాల్సిన పోలీసులే నేరస్తులుగా మారడం భయాందోళనకు గురిచేస్తోంది'' అని ఆయన అన్నారు.
అలాగే, పీఎంకే నేత అన్బుమణి రాందాస్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఈ ఘటనను ఖండించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














