కర్ణాటకలోని గుహలో నివసించిన రష్యన్ మహిళ స్వదేశానికి..

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ న్యూస్, బెంగళూరు
కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో ఒక గుహలో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తున్న రష్యా మహిళ నీనా కుటినా(40)ను కొద్ది నెలల కిందట పోలీసులు గుర్తించారు.
ఆమె ఇప్పుడు స్వదేశానికి చేరుకున్నారని అధికారులు ‘బీబీసీ’కి చెప్పారు.
ఈ ఏడాది జులైలో కర్ణాటక పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ గోకర్ణ అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు అక్కడ ఒక గుహలో తన ఇద్దరు కుమార్తెలతో కలసి నివసిస్తున్న నీనాను గుర్తించారు.
గుహలో ఆమెతో పాటు నివసించిన కుమార్తెలలో ఒకరి వయసు అయిదేళ్లు కాగా మరొకరి వయసు ఆరేళ్లు.

భారత్‌లో ఉండేందుకు అవసరమైన పత్రాలు లేని ఆమెను ఇద్దరు కుమార్తెలతో కలిపి ఒక ఫారినర్స్ డిటెన్షన్ సెంటర్‌కు పంపించారు.
అనంతరం గత వారం కర్ణాటక హైకోర్ట్ వారు ముగ్గురికీ తగిన పత్రాలు జారీ చేసి స్వదేశానికి పంపించాలని కేంద్రానికి సూచించింది.
దాంతో సంబంధిత ప్రక్రియలన్నీ పూర్తయ్యాక సెప్టెంబర్ 28న నీనా కుటినా, ఆమె ఇద్దరు కుమార్తెలు రష్యాకు పయనమయ్యారని పేరు చెప్పడానికి ఇష్టపడని ‘ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్’ అధికారి ఒకరు ‘బీబీసీ హిందీ’కి చెప్పారు.
కాగా నీనాకు ఇద్దరు కుమార్తెలే కాకుండా మరో కుమారుడు ఉండగా ఆ బాలుడిని గోవాలో గుర్తించారు. నీనా, ఇద్దరు కుమార్తెలతో పాటు బాలుడినీ రష్యా పంపించారు.

ఫొటో సోర్స్, x.com/PTI_News
నీనా కుమార్తెలిద్దరికీ తండ్రిగా చెప్పుకొంటున్న ఇజ్రాయెల్‌కు చెందిన వ్యాపారవేత్త డ్రార్ షోల్మో గోల్డ్‌స్టెయిన్ .. ఆ బాలికలు ఇద్దరినీ రష్యా పంపించొద్దని, తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు.
గోల్డ్‌స్టెయిన్ గోవాలో నివసిస్తున్నారు. వారిని రష్యా పంపించాలన్న హైకోర్ట్ తీర్పుపై ఆయన ఇప్పటివరకు ఏమీ వ్యాఖ్యానించలేదు.
కాగా గోల్డ్‌స్టెయిన్ గతంలో ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. నీనా గోవాలో తనతో ఉంటూ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని.. ఆ తరువాత తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
నీనా ఇద్దరు కుమార్తెల బాగోగులు తానే చూసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Karnataka Police
ఎవరీ నీనా కుటినా?
కాగా గుహ నుంచి రక్షించిన తరువాత గత జులైలో నీనా కుటినా ఏఎన్ఐ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూల్లో తన జీవనశైలిని సమర్థించుకున్నారు.
తన కుమార్తెలతో గుహలో ఆనందంగా జీవించానని ఆమె చెప్పారు. ప్రకృతి మంచి ఆరోగ్యం అందించిందని అన్నారు.
తాను రష్యాలోనే పుట్టినప్పటికీ అక్కడ 15ఏళ్లకు మించి పెరగలేదని కోస్టారికా, మలేసియా, బాలి, థాయిలాండ్, నేపాల్, యుక్రెయిన్ సహా అనేక దేశాల్లో పర్యటించినట్లు నీనా కుటినా పీటీఐ, ఏఎన్ఐ వార్తా సంస్థలకిచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు
తనకు 5 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న నలుగురు పిల్లలు ఉన్నారని ఆమె రెండు వార్తా సంస్థలకిచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. గతేడాది గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన పెద్ద కుమారుడు చనిపోయాడని అన్నారు.
కాగా ఆమె రెండో కుమారుడికి 11ఏళ్లని అతను రష్యాలో ఉన్నాడని అధికారులు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














