మీ మెడ మందంగా అవుతోందా? అది చెప్పే ఆరోగ్య రహస్యాలివీ..

మందపాటి మెడ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బరువు ఎక్కువగా ఉండటం లేదా బెల్లీ ఫ్యాట్ కనిపిస్తుండటాన్ని చాలామంది ఊబకాయంతో ముడిపెడుతుంటారు.

ఈ రకమైన ఊబకాయంపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, తమ బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

కానీ, మన శరీరంలో మెడ కూడా ఒక భాగమే. ఇది ఆరోగ్యానికి సంబంధించి చాలా విషయాలను మనకు చెబుతుంది. కానీ, చాలామంది దీనిపై పెద్దగా దృష్టిపెట్టరు.

మెడపై ఏమైనా మచ్చలు కనిపించినా లేదా చర్మం రంగు మారినా, వెంటనే దాన్ని పోగొట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఎందుకంటే, ముఖం కింద ఉండే ఈ భాగం ఎదురుగా ఉండేవారికి స్పష్టంగా కనిపిస్తుంటుంది.

మెడ సాధారణంగా ఉండే దాని కంటే మందంగా లేదా సన్నగా ఉంటే దానర్థమేంటి? ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండాలా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అందమే కాదు, ఆరోగ్యానికి సంబంధించి కూడా..

మహిళలే కాదు, పురుషులు కూడా తమ మెడ అందంగా కనిపించాలని కోరుకుంటుంటారు.

కొన్ని ఆఫ్రికా దేశాల్లో మెడను సన్నగా మార్చేందుకు దాని చుట్టూ గాజులాంటి లోహపు రింగులు ధరిస్తుంటారు.

దీంతో, మెడ క్రమంగా సన్నగా, పొడవుగా మారుతుందని నమ్మకం.

మెడను ఆకర్షణీయంగా మార్చేందుకు, జిమ్‌కు వెళ్తూ ప్రత్యేక వ్యాయామాలు కూడా చేస్తుంటారు కొందరు.

ఈ వ్యాయామాల వల్ల మొత్తం శరీరంలో లేదా మెడలో మార్పులు రావడం మామూలే అయినా, శరీరంతో పోలిస్తే మెడ చాలా సన్నగాగానీ, మందంగాగానీ మారితే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం అంటున్నారు నిపుణులు.

ఆఫ్రికా దేశస్థురాలు

ఫొటో సోర్స్, Getty Images

మెడ మందంగా ఉండడం దేనికి సంకేతం?

నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రెసిడెంట్, దిల్లీ ఐఎల్‌బీఎస్ డైరెక్టర్ డాక్టర్ శివ్ కుమార్ సరీన్ తన పుస్తకం 'ఆన్ యువర్ బాడీ'లో మెడ గురించి వివరించారు.

''మెడ చుట్టుకొలత మహిళలకు సాధారణంగా 33 నుంచి 35 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే, పురుషులకు 37 నుంచి 40 సెంటీమీటర్ల మధ్య ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సంకేతం'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

మెడ మందం ఆధారంగా వ్యాధుల గురించి చెప్పే ఎన్నో కొత్త వైద్య పరిశోధనలు ఉన్నాయని ఆయన చెప్పారు.

''మెడలో కొంచెం అదనపు కొవ్వు ఉన్నా లేదా మెడ చిన్నగా కనిపిస్తున్నా అలాంటి వ్యక్తుల్లో ఫ్యాటీ లివర్, ఊబకాయం వంటి సమస్యలను తరచూ చూస్తాం. కొన్నిసార్లు అలాంటి వ్యక్తులు ఎక్కువ గురక పెడతారు'' అని దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) గ్యాస్ట్రోఎంటరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షాలిమార్ చెప్పారు.

ఒక వ్యక్తి మెడ సాధారణం కంటే మందంగా కనిపిస్తే, మెటబాలిక్ సిండ్రోమ్‌ను సూచిస్తుంది.

''మెడ మందంగా ఉండే వ్యక్తులకు అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్‌ ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు ప్రత్యేక పరీక్షలు చేయించుకోవాలి'' అని దిల్లీలోని సర్ గంగా‌రామ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మొహ్సిన్ వలీ చెప్పారు.

దీంతోపాటు మందపాటి మెడ ఊబకాయాన్ని సూచిస్తుందట.

మెడ

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని వ్యాధుల వల్ల మెడ వెనక చర్మం నల్లగా మారుతుంది. అలా మారిందంటే అది కేవలం చర్మ సమస్య మాత్రమే కాదు. మరేదైనా ఆరోగ్య సమస్య ఉందనడానికి సూచన కావొచ్చు.

''ఎవరి మెడ అయినా సాధారణంగా ఉండే దానికంటే మందంగా మారితే, ఆ వ్యక్తి కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సూచిస్తుంది. ముఖ్యంగా వారి శరీరం ఊబకాయం బారిన పడుతుందని అర్థం. ఊబకాయంతో చాలా వ్యాధులు ముడిపడి ఉంటాయి'' అని పుణెలోని డీవై మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ అమితావ్ బెనర్జీ చెప్పారు.

''సమాన శరీర నిర్మాణం, బరువు ఉన్న ఇద్దరు వ్యక్తులను పోల్చి చూస్తే, వారిలో ఒకరి మెడ మందంగా ఉంటే..అతని శరీరంలో ఎక్కువ కొవ్వు ఉందని అర్థం. ఊబకాయం బారిన పడే అవకాశం ఉందనడానికి అది సూచిక'' అని డాక్టర్ అమితావ్ తెలిపారు.

మెడ భాగం

ఫొటో సోర్స్, Getty Images

సన్నమెడ థైరాయిడ్ సంబంధిత వ్యాధులకు సంకేతమా?

మెడ సన్నగా ఉండటం అందం అనుకుంటారు చాలామంది. కానీ, ఇది థైరాయిడ్ సంబంధిత వ్యాధులకు సంకేతం అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

సన్నని మెడ ఉన్న వ్యక్తులకు తరచూ వర్టేబ్రేలు (వెన్నుపూసలు) అదనంగా ఉంటాయి.

సర్వికల్ స్పైన్‌లో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. కొంతమంది వ్యక్తుల్లో ఈ సంఖ్య ఎనిమిది కూడా కావొచ్చు.

అంటే కొందరిలో చేతికి ఐదు వేళ్లకు బదులు ఆరు వేళ్లు ఉన్నట్లు. వర్టేబ్రే (వెన్నుపూసలు) వెన్నెముకను తయారు చేసే బ్యాక్‌బోన్లు. స్పైనల్ కార్డుకు (వెన్నుపాము), నరాలకు ఇవి రక్షణగా, మద్దతుగా ఉంటాయి.

ఏడు కాకుండా ఎనిమిది వెన్నుపూసలు పుట్టుకతో వస్తాయి. చాలా సందర్భాలలో మెడ ఎక్స్-రేలో వీటిని చూడవచ్చు. ఇది సాధారణంగా ఎటువంటి సమస్యలను కలిగించవు.

'' ఇవి ఎటువంటి సమస్యకు కారణం కావు. కానీ, కొన్నిసార్లు సర్వికల్ రిబ్స్ (వర్టేబ్రే) సాధారణంకంటే ఒకటి ఎక్కువగా ఉంటే, చేతుల్లో తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి'' అని డాక్టర్ వలీ చెప్పారు.

''కొన్నిసార్లు ఎనీమియా వల్ల కొందరికి మెడ సాధారణంకంటే సన్నగా ఉంటుంది. అలాంటి వారికి ఐరన్, విటమిన్లు, ఇతర పోషకాలు ఇస్తారు. చాలా కేసుల్లో రక్తమార్పిడి కూడా అవసరం కావొచ్చు'' అని బెంగళూరుకు చెందిన డాక్టర్ ఆత్రేయ నిహార్‌చంద్ర చెప్పారు.

‘‘ఇది కొన్నిసార్లు ఇది జన్యుపరమైన సమస్య కూడా కావొచ్చన్నారు. ఉదాహరణకు తండ్రి మెడ పొడవుగా, సన్నగా ఉంటే.. కొడుకు లేదా కూతురి మెడ కూడా అలా ఉండొచ్చు. ఇది ఎనీమియాకు సంకేతం కావొచ్చు'' అని నిహార్ చంద్ర తెలిపారు.

మెడసన్నగా ఉన్నవారు ప్రత్యేకంగా ఫిజియోథెరపీ చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. దీనివల్ల మెడిసిన్లు, ఇతర విధానాల ద్వారా శరీరంలోని పోషకాలను సమతుల్యం చేయొచ్చు. మెడ కండరాలు బలపడి, ఆరోగ్యంగా మారతాయి.

డాక్టర్ల అభిప్రాయం ప్రకారం...సాధారణంకంటే మెడ మందంగా ఉన్నవారు తొలుత తమ బరువును తగ్గించుకోవడంపై దృష్టిపెట్టాలి.

పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మహిళలు లావుగా మారుతుంటారు. దీంతో, వారు తమ డైట్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.

మీ శరీరం లేదా మీ ఆరోగ్యం ఏదైనా ప్రమాదకరంగా మారుతుందో లేదో తెలుసుకోవడం కోసం ముందు మీరు అద్దం ముందు నిలబడి మీ మెడను చూసుకోవాలని అంటున్నారు నిపుణులు.

(గమనిక: ఇందులో అంశాలు పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. మెడ సంబంధిత ఆరోగ్యం గురించి నిపుణులైన వైద్యులను సంప్రదించండి)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)