మొహ్సిన్ నఖ్వీ: ఆసియా కప్ ట్రోఫీ అందజేత వ్యవహారంలో కేంద్ర బిందువుగా నిలిచిన ఈ పాకిస్తానీ నేత ఎవరు?

మొహ్సిన్ నఖ్వీ

ఫొటో సోర్స్, Getty Images

ఆసియా కప్ టోర్నీలో విజయం కంటే, భారత ఆటగాళ్లు ట్రోఫీని అందుకోవడానికి వేదికపైకి వెళ్లలేదన్న విషయంపైనే ఎక్కువగా చర్చ జరిగింది.

ఈ తిరస్కరణకు కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ.

మ్యాచ్ గెలిచిన తర్వాత, భారత జట్టు ట్రోఫీ తీసుకోవడానికి రాలేదు. తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా మాట్లాడుతూ.. భారత ఆటగాళ్ళు ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోకూడదని నిర్ణయించుకున్నారని చెప్పారు.

‘‘మొహ్సిన్ నఖ్వీ పాకిస్తాన్ ప్రముఖ నాయకులలో ఒకరు. అందుకే మేం ఆయననుంచి ట్రోఫీ అందుకోకూడదని నిర్ణయించుకున్నాం’’ అని వేదికపైకి రాకపోవడానికిగల కారణాన్ని ఏఎన్ఐ వార్తాసంస్థకు తెలిపారు సైకియా.

ట్రోఫీని తీసుకోకూడదనేది జట్టు సమష్టి నిర్ణయం అని భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పారు.

గొప్ప ఫైనల్‌ను చూడటానికి తాను ఉత్సుకతతో ఉన్నానని, గెలిచిన జట్టుకు ట్రోఫీ అందజేయడానికి ఎదురు చూస్తున్నానని ఫైనల్‌కు ముందురోజు నఖ్వీ కూడా అన్నారు.

కానీ ఆ అవకాశం ఆయనకు రానేలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని మోదీ పోస్ట్‌కి స్పందించిన తీరు చర్చనీయాంశం

భారత జట్టును అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌పై.. నఖ్వీ స్పందించిన తీరు కూడా చర్చనీయాంశమైంది.

"క్రీడా మైదానంలో ఆపరేషన్ సిందూర్. ఫలితం మాత్రం అదే - భారత్ గెలిచింది. మన క్రికెటర్లకు అభినందనలు" అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

దీనిపై ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ స్పందిస్తూ .. "యుద్ధం మీ గర్వానికి కొలమానమైతే, పాకిస్తాన్ చేతిలో భారతదేశం అవమానకరమైన ఓటమిని చరిత్ర ఇప్పటికే నమోదు చేసింది. ఏ క్రికెట్ మ్యాచ్ కూడా ఆ వాస్తవాన్ని మార్చలేదు. యుద్ధాన్ని ఆటలోకి లాగడం నిరాశపరిచింది. క్రీడాస్ఫూర్తికి అవమానం" అని రాస్తూ మోదీ పోస్ట్‌ను రీపోస్ట్ చేశారు.

మొహ్సిన్ నఖ్వీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెక్ అందిస్తున్న మొహ్సిన్ నఖ్వీ.

నఖ్వీ ప్రస్తుతం మూడు ముఖ్యమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు: ఆయన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు, ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు చైర్మన్. అలాగే పాకిస్తాన్ హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.

సయ్యద్ మొహ్సిన్ నఖ్వీ 1978లో లాహోర్‌లో జన్మించారు. ఆయన కుటుంబానికి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఝాంగ్ నగరంతో అనుబంధం ఉంది.

క్రెసెంట్ మోడల్ స్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. తరువాత లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాల (జీసీ)లో చదివారు. గ్రాడ్యుయేషన్ తర్వాత, పైచదువుల కోసం అమెరికాలోని ఒహాయో యూనివర్సిటీకి వెళ్లారు.

అమెరికాలో జర్నలిజం చేసి, ఆ తర్వాత అమెరికన్ న్యూస్ చానల్ సీఎన్ఎన్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు.

మొహ్సిన్ నఖ్వీ, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొహ్సిన్ నఖ్వీ చాలా కాలం పాటు జర్నలిస్టుగా పనిచేశారు.

జర్నలిజంలోకి ప్రవేశం

అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా చానల్ సీఎన్ఎన్‌ వార్తలు కవర్ చేయడానికి నఖ్వీని పాకిస్తాన్‌కు రిపార్టర్‌గా పంపింది. చిన్న వయసులోనే ప్రమోషన్ సంపాదించి, ఆ చానల్ దక్షిణాసియా ప్రాంతీయ అధిపతి అయ్యారు నఖ్వీ.

అది 9/11 దాడుల తర్వాత కాలం, అమెరికా నేతృత్వంలోని విదేశీ దళాలు అఫ్గానిస్తాన్‌కి ప్రవేశించాయి. అప్పుడు మొహ్సిన్ నఖ్వీ సీఎన్ఎన్‌‌కు రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకున్నారు.

ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, 2009 వరకు సీఎన్ఎన్‌తో పనిచేశారు.

ఆ తరువాత, సిటీ న్యూస్ నెట్‌వర్క్‌ను స్థాపించారు. జర్నలిజం వృత్తిలో తనదైన స్వతంత్ర గుర్తింపును ఏర్పరచుకున్నారు. అప్పటికి ఆయనకు కేవలం 31 ఏళ్లే.

సయ్యద్ మొహ్సిన్ నఖ్వీ కుటుంబానికి ఒక ప్రైవేట్ చానల్ ఉండటంతో పాటు, దేశ రాజకీయాల్లోని ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. పీపుల్స్ పార్టీ నాయకుడు, పాకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి నఖ్వీ చాలా సన్నిహితుడిగా చెప్పుకుంటారు.

పాకిస్తాన్ పంజాబ్ కు తాత్కాలిక ముఖ్యమంత్రి

2023లో, అప్పటి పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నాయకుడు పర్వేజ్ ఎలాహి అసెంబ్లీని రద్దు చేసినప్పుడు, కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాల్సివచ్చింది.

అటువంటి పరిస్థితిలో, అప్పటి పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకుడు, షాబాజ్ షరీఫ్ కుమారుడు హంజా షాబాజ్ తాత్కాలిక ముఖ్యమంత్రి పదవికి ఇద్దరి పేర్లను సూచించారు. వారిలో ఒకరు మొహ్సిన్ నఖ్వీ.

కానీ ప్రభుత్వం, ప్రతిపక్షం ఒక పేరుపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో, ఈ విషయం పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లింది. ఆ తర్వాత కమిషన్ నఖ్వీ పేరును ఆమోదించింది.

నఖ్వీ 22 జనవరి 2023 నుంచి 26 ఫిబ్రవరి 2024 వరకు పంజాబ్ తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత, దేశంలో షాబాజ్ షరీఫ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, నఖ్వీకి హోం, మాదకద్రవ్యాల నియంత్రణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్

ఫిబ్రవరి 2024లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 37వ చైర్మన్‌గా మొహ్సిన్ నఖ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పీసీబీ చైర్మన్‌గా ఆయన పదవీకాలం మూడేళ్లు.

అయితే, నఖ్వీ పీసీబీ చైర్మన్‌గా నియమితులైనప్పుడు, దేశపగ్గాలు తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్-ఉల్-హక్-కకాడ్ చేతుల్లో ఉన్నాయి.

క్రికెట్ బోర్డు చైర్మన్‌ను తాత్కాలిక ప్రధానమంత్రి నియమించగలరా అనే ప్రశ్నలు కూడా అప్పట్లో వినిపించాయి. ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టులో విచారణ కూడా జరిగింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు నఖ్వీ.

పీసీబీ ఛైర్మన్‌, మొహ్సిన్ నఖ్వీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పీసీబీ ఛైర్మన్‌గా మొహ్సిన్ నఖ్వీ సామర్థ్యాన్ని ప్రశ్నించిన వారిలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నారు.

నఖ్వీ అర్హతలపై ప్రశ్నలు

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయినప్పటి నుంచి, నఖ్వీ సామర్థ్యం గురించి ఎప్పటికప్పుడు ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలు ఎక్కువగా పాకిస్తాన్ రాజకీయ నాయకులు, మాజీ క్రికెటర్ల నుంచి వినిపించాయి.

ఉదాహరణకు, గత ఏడాది సెప్టెంబర్‌లో, రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఓటమి తర్వాత, నఖ్వీ దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నుంచి విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది.

పార్టీ నాయకుడు సయ్యద్ అలీ జాఫర్ ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ , "ఇతర క్రీడల మాదిరిగానే క్రికెట్ కూడా వినాశనం అంచున ఉంది. పీసీబీ చీఫ్ పదవికి పూర్తిగా అనర్హుడైన వ్యక్తిని నియమించడమే ఈ వినాశనానికి కారణం" అని అన్నారు.

పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో నఖ్వీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. "పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఎవరైనా మార్పు తీసుకురాగలిగితే అది నఖ్వీయే అని మాకు చెప్పారు. కానీ మేం ఎలాంటి మార్పులనూ చూడలేదు. ఇప్పటివరకు చేసింది చూస్తే ఆయనకు క్రికెట్‌పై అవగాహన లేదని తెలుస్తోంది" అని ఆయన రాశారు.

నఖ్వీని విమర్శించే వారిలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నారు.

2024 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్‌లో ఓటమి తర్వాత, "టీవీలో మొత్తం దేశం అత్యంత శ్రద్ధతో చూసే ఏకైక క్రీడ క్రికెట్. కానీ దానిని కూడా శక్తివంతమైన అధికారులు నాశనం చేస్తున్నారు. తమ నియంత్రణను కొనసాగించడానికి, ఈ అధికారులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారంలో ఒక అసమర్థ వ్యక్తిని పెట్టారు" అని ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)