అమెరికాలో 30 ఏళ్లుగా నివసిస్తున్న ఈ వృద్ధురాలిని భారత్‌కు ఎందుకు తిప్పి పంపారు?

హర్జిత్ కౌర్‌

ఫొటో సోర్స్, Manjit Kaur

మూడు దశాబ్దాలకు పైగా తమ దేశంలో నివసించిన 73 ఏళ్ల మహిళను అమెరికా భారత్‌కు తిప్పిపంపింది.

అమెరికాలో ఆశ్రయం పొందడంలో విఫలమైన హర్జిత్ కౌర్‌ను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు సెప్టెంబర్ 8న అరెస్టు చేశారు.

పంజాబ్‌లో 1991లో కల్లోల రాజకీయ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఆమె తన ఇద్దరు చిన్న కుమారులతో కలిసి కాలిఫోర్నియాకు వెళ్లారు.

యూఎస్‌లో ఆశ్రయం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఆమె అక్కడే పనిచేస్తూ నివసించారు.

అయితే ఎటువంటి నేరచరిత్ర లేని కౌర్‌ను నిర్బంధించిన సమయంలో ఐసీఈ అధికారులు ఆమెతో "ఆమోదయోగ్యం కాని" రీతిలో ప్రవర్తించారని ఆమె న్యాయవాది దీపక్ అహ్లువాలియా ఆరోపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా సరిహద్దులో కంచె

ఫొటో సోర్స్, AFP via Getty Images

‘ఆమోదయోగ్యం’కాని రీతిలో ప్రవర్తన

కౌర్‌ను సెప్టెంబర్ 19న జార్జియాలోని తాత్కాలిక నిర్బంధ కేంద్రానికి తరలించారు. ఆపైన సెప్టెంబర్ 22న ఇండియాకు తిప్పి పంపారు. ఆమె తన ఇంటిని చూడటానికి కానీ, కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి వీడ్కోలు తీసుకునే అవకాశం కానీ ఇవ్వలేదని న్యాయవాది అహ్లువాలియా చెప్పారు.

కౌర్‌తో వ్యవహరించిన తీరు ''ఆమోదయోగ్యం'' కాదంటూ ఓ ఇన్‌స్టా వీడియోలో ఆయన పేర్కొన్నారు. ఆమెకు రెండు మోకీళ్ల మార్పడి జరిగిందని, అయినా నిద్రపోవడానికి మంచం ఇవ్వకుండా, నేలపై నిద్రించేలా చేశారన్నారు.

మందులు వేసుకోవడానికి మంచినీటికి బదులుగా ఐస్ ఇచ్చారని, ఆమె తినగలిగే ఆహారాన్ని ఇవ్వలేదని, ఆమెకు ఇచ్చిన శాండ్‌విచ్‌ను తినలేకపోయినందుకు గార్డులు ఆమెను నిందించారని తెలిపారు.

ఐసీఈ అంతకుముందు బీబీసీకి ఇచ్చిన ప్రకటనలో కౌర్ ''న్యాయప్రక్రియలో దశాబ్దాలుగా అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు'' అని 2005లోనే ఒక ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఆమెను దేశం విడిచిపెట్టి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపింది.

''హర్జిత్ కౌర్ తొమ్మిదో సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ వరకూ అనేక అప్పీళ్లు దాఖలు చేశారు. ప్రతిసారి ఆమె ఓడిపోయారు. ఇప్పుడు చట్టపరమైన పరిష్కార మార్గాలన్నీ ఉపయోగించుకున్నారు. కాబట్టి, అమెరికా చట్టాన్ని, న్యాయమూర్తి ఆదేశాలను ఐసీఈ అమలుచేస్తోంది'' అని ఐసీఈ పేర్కొంది.

కాలిఫోర్నియాలో కౌర్ మద్దతుదారులు ఆందోళన

ఫొటో సోర్స్, Deepak Ahluwalia

ఫొటో క్యాప్షన్, కాలిఫోర్నియాలో కౌర్ మద్దతుదారుల ఆందోళన (ఫైల్)

కౌర్ అరెస్టుతో..

శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలోని హెర్క్యులస్‌లో నివసిస్తూ, కౌర్ రెండు దశాబ్దాలుగా చీరల దుకాణంలో కుట్టుపని చేసేవారు. ఆమె పన్నులు కూడా చెల్లించారు. ఆశ్రయం కోరుతూ దరఖాస్తు చేసుకునేవారు తమ క్లెయిమ్‌లు పరిశీలనా ప్రక్రియలో ఉన్నప్పుడు అమెరికాలో చట్టబద్ధంగా నివాసం ఉండటానికి, పనిచేయడానికి అనుమతి ఉంది.

గురువారం దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, ''అమెరికాలో చాలాకాలంగా నివసించినా, మిమ్మల్ని అదుపులోకి తీసుకొని ఈ విధంగా బహిష్కరిస్తారు. దీన్ని ఎదుర్కోవడం కంటే చనిపోవడం మంచిది'' అని టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికతో చెప్పారు.

ఆమె అప్పీళ్లు తిరస్కరించిన తర్వాత, భారతదేశానికి తిరిగి రావడానికి సరైన పత్రాలు లేకపోవడంతో అమెరికాలోనే పనిచేసుకుంటూ ఉండిపోయారు.

అప్పటి నుంచి రిపోర్టు చేయాలని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె కోరారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో చెక్-ఇన్ కోసం వెళ్లినప్పుడు ఆమె అరెస్ట్ అయ్యారు.

ఆమె అరెస్టు అక్కడున్న సిక్కులు దిగ్భ్రాంతి చెందారు. ఆమెకు మద్దతుగా కాలిఫోర్నియాలో నిరసనలు చేపట్టారు.

అమెరికాలో వలసలపై, ముఖ్యంగా అక్రమ వలసదారులపై డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిన నేపథ్యంలో కౌర్‌ను అరెస్టు చేసి భారత్‌కు తిప్పిపంపించారు.

ఏటా లక్షలాది మంది శరణార్థులు అమెరికా దేశ సరిహద్దులకు వస్తారు. ప్రస్తుతం 37 లక్షలకు పైగా కేసులు ఇమ్మిగ్రేషన్ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి.

'వరస్ట్ ఆఫ్ ది వరస్ట్’ను బహిష్కరించాలనుకుంటున్నామని ట్రంప్ చెప్పారు. కానీ క్రిమినల్ రికార్డులేవీ లేకుండా, తగిన ప్రక్రియను అనుసరించే వలసదారులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)