ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌కు గట్టి సమాధానం చెప్పిన పెటల్ గహ్లోత్ ఎవరు?

ఐఎఫ్‌ఎస్ అధికారి పెటల్ గహ్లోత్

ఫొటో సోర్స్, ANI/@petal_gahlot

ఫొటో క్యాప్షన్, ఐఎఫ్‌ఎస్ అధికారి పెటల్ గహ్లోత్

పెటల్ గహ్లోత్. శనివారం ఉదయం నుంచి ఈ పేరు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ ఇచ్చిన గట్టి సమాధానమే.

ఐక్యరాజ్య సమితిలో భారత దౌత్యవేత్త పెటల్ గహ్లోత్.

షాబాజ్ వ్యాఖ్యలకు 'భారతదేశానికి ఉన్న ప్రత్యుత్తర హక్కు' కింద పెటల్ గహ్లోత్ సమాధానం చెప్పారు.

''ధ్వంసమైన రన్‌వేలు, కాలిపోయిన హ్యాంగర్లు ఒక విజయమైతే, పాకిస్తాన్ దాన్ని ఆస్వాదించవచ్చు'' అన్నారు.

వాస్తవానికి, యూఎన్‌లో అంతకుముందు షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, ''భారత్‌తో యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించింది, ప్రస్తుతం మా దేశం శాంతిని కోరుకుంటోంది'' అన్నారు.

కానీ, శాంతి కావాలంటే పాకిస్తాన్ ముందుగా తన దేశంలో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాద శిబిరాలను మూసివేయాలని, భారతదేశం కోరుతున్న ఉగ్రవాదులను అప్పగించాలని భారత్ స్పష్టం చేసింది.

పెటల్ గహ్లోత్ ప్రతిస్పందన విస్తృత చర్చకు దారితీసింది. ఆమె ప్రకటనపై భారతీయ సోషల్ మీడియాలో భారీస్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పెటల్ గహ్లోత్

ఫొటో సోర్స్, X/@petal_gahlot

ఫొటో క్యాప్షన్, పెటల్ గహ్లోత్

ఎవరీ పెటల్ గహ్లోత్?

పెటల్ గహ్లోత్ దిల్లీకి చెందినవారు. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఫ్రెంచ్ లిటరేచర్ సబ్జెక్టులతో ముంబయిలోని సెయింట్ జేవియర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

దిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తిచేశారు. అత్యుత్తమ ప్రతిభతో బంగారు పతకం అందుకున్నారు.

ఆమె లింక్డిన్ ప్రొఫైల్ వివరాల ప్రకారం, విద్యార్థి దశ నుంచే ఆమె ఇండియన్ మ్యూజిక్ గ్రూప్, మల్హార్ ఫెస్టివల్ తదితర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

గిటార్ వాయించడం, సంగీతం వినడం ఆమె హాబీలు. అవి దినచర్యలో భాగం. పరీక్షలకు సన్నద్ధమవుతూ క్షణం తీరికలేని సమయంలోనూ ఆ హాబీలకు కొంత సమయం కేటాయించేవారు.

తన రెండో ప్రయత్నంలో యూపీఎస్‌సీ ర్యాంకు సాధించారు. ఈ పరీక్షలకు తాను ఎలా సిద్ధమైందీ తన అనుభవాలను పంచుకునేందుకు 'తపస్య' పేరుతో ఒక బ్లాగ్ నిర్వహించేవారు.

2015లో ఆమె ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)లో చేరారు.

దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సహాయ కార్యదర్శిగా తొలుత పనిచేశారు.

తర్వాత, పారిస్‌లోని భారత దౌత్య కార్యాలయంలో నియమితులయ్యారు. అక్కడ తొలుత థర్డ్ సెక్రటరీగా, తర్వాత సెకండ్ సెక్రటరీగా సేవలందించారు.

2020-2023 మధ్యకాలంలో విదేశాంగ మంత్రిత్వశాఖలో అండర్-సెక్రటరీగా పనిచేశారు.

తర్వాత, అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్‌లో కాన్సుల్‌గా పెటల్ నియమితులయ్యారు.

న్యూయార్క్‌లోని పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియాలో 2023 జులై నుంచి ఫస్ట్ సెక్రటరీగా పనిచేశారు.

ఐక్యరాజ్య సమితిలో 2024 సెప్టెంబర్ నుంచి సేవలందరిస్తున్నారు.

పెటల్ గహ్లోత్ తండ్రి కెప్టెన్ సంజయ్ గహ్లోత్. భారత సైన్యంలో కెప్టెన్‌గా పనిచేశారు. తర్వాత 1991 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయ్యారు. కస్టమ్స్ విభాగంలో ప్రిన్సిపల్ కమిషనర్ స్థాయి వరకూ ఎదిగారు. దాదాపు 30 ఏళ్ల పాటు పనిచేశారు. ఆయన యూపీఎస్‌సీ అభ్యర్థులకు మెంటార్‌గా కూడా సేవలందించారు.

పెటల్ గహ్లోత్

ఫొటో సోర్స్, X/ @petal_gahlot

ఫొటో క్యాప్షన్, పెటల్ గహ్లోత్

పెటల్ ఏంచెప్పారు?

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రసంగంపై ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పెటల్ గహ్లోత్ ప్రతిస్పందించారు.

''పాకిస్తాన్ ప్రధానమంత్రి అసంబద్ధ నాటకానికి ఈ సభ సాక్షిగా నిలిచింది. ఆయన మరోసారి ఉగ్రవాదాన్ని కీర్తించారు. ఇది ఆయన విదేశాంగ విధానంలో ప్రధాన భాగం'' అని గహ్లోత్ వ్యాఖ్యానించారు.

డ్రామాలు అబద్దాలు వాస్తవాన్ని దాచలేవని ఆమె అన్నారు.

పహల్గాం దాడి గురించి గహ్లోత్ ప్రస్తావిస్తూ, ''ఇదే పాకిస్తాన్ జమ్మూ కశ్మీరులో పర్యటకులపై జరిగిన క్రూరమైన ఊచకోతకు కారణమైన రెసిస్టెన్స్ ఫ్రంట్ (తీవ్రవాద సంస్థ)ను 2025 ఏప్రిల్ 25న ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో కాపాడింది'' అని చెప్పారు.

''గుర్తుంచుకోండి, ఇదే పాకిస్తాన్ ఒకవైపు ఉగ్రవాదంపై యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూనే, మరోవైపు ఒసామా బిన్ లాడెన్‌ను దశాబ్దం పాటు దాచిపెట్టింది'' అని ఆమె అన్నారు.

‘‘ఇటీవల పాకిస్తాన్ మంత్రులు కూడా తమ దేశం దశాబ్దాలుగా ఉగ్రవాద శిబిరాలను నడుపుతోందని అంగీకరించారని’’ ఆమె చెప్పారు.

''పాకిస్తాన్ కపటత్వం మరోసారి బయటపడటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈసారి ప్రధానమంత్రి స్థాయిలో జరిగింది. ఒక చిత్రం వెయ్యి పదాలను చెబుతుంది. ఈసారి ఆపరేషన్ సిందూర్‌తో బహవల్పూర్, మురిడ్కేలోని ఉగ్రవాద శిబిరాల్లో మరణించిన ఉగ్రవాదుల అనేక ఫోటోలు మనం చూశాం'' అని గహ్లోత్ చెప్పారు.

''భయంకరమైన ఉగ్రవాదుల మృతదేహాలకు పాకిస్తాన్ సీనియర్ సైనికాధికారులు, ప్రజలు బహిరంగంగానే కీర్తిస్తూ నివాళులర్పించడం చూశాం. ఇక అక్కడి పరిపాలనా ధోరణి గురించి ఏదైనా సందేహం మిగిలి ఉంటుందా?'' అన్నారు.

గహ్లోత్ సమాధానంపై సామాజిక మాధ్యమాలో పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

‘‘వావ్. పటేల్ గహ్లోత్ అద్భుతమైన పని చేశారు. ఆమె షాబాజ్ షరీఫ్ నాటకాలను కట్టిపెట్టారు. పాకిస్తాన్ ఒసామాబిన్ లాడెన్ దాచిన విషయాన్ని బట్టబయలు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిజమైన చర్యలు తీసుకోవాలని ఆమె పాకిస్తాన్‌కు స్పష్టంగా చెప్పారు’’ అని మనీషా యాదవ్ అనే యూజర్ రాశారు.

‘‘పటేల్ గహ్లోత్ గిటార్ వాయిస్తారు, ఫ్రెంచ్ అనర్గళంగా మాట్లాడతారు. పాకిస్తాన్ అబద్ధాలను బ్రహ్మాండంగా బట్టబయలు చేశారు. ఆమె విశ్వాసం అద్భుతం’’ అని మంజిత్ సిన్హా అనే యూజర్ రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)