వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ప్రాణాలకే ప్రమాదమా? పొరపాటున ఎక్కిస్తే ఏం చేయాలి?

రక్త పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు, ఆపరేషన్లు చేసే సమయంలో, లేదా రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి రక్తం అవసరమవుతుంది. అలాంటి సమయంలో బ్లడ్ బ్యాంకుల నుంచి లేదా అదే బ్లడ్ గ్రూప్ కలిగిన దాతల నుంచి రక్తం సేకరించి రోగులకు ఎక్కిస్తారు.

అయితే, ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 34 ఏళ్ల మహిళ అనారోగ్య సమస్యతో చేరగా, అక్కడి వైద్య సిబ్బంది ఆమెకు 'O' పాజిటివ్ రక్తానికి బదులుగా 'B' పాజిటివ్ రక్తం ఎక్కించారు.

ఒక రోజు తర్వాత ఆ రోగికి వేరే గ్రూప్ రక్తం ఎక్కించామనే విషయాన్ని వైద్యులు గుర్తించారు. అప్పటికే రోగికి కడుపునొప్పి, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ నిర్థరించారు.

రక్తంతో ప్రాణాలు కాపాడినట్లే, అదే తప్పు గ్రూపు రక్తం ఎక్కిస్తే అది ప్రాణాల మీదకు కూడా తెస్తుందనడానికి ఈ వరంగల్ సంఘటన ఓ ఉదాహరణ.

ఈ సంఘటనతో... అసలు ఒక రోగికి తప్పు గ్రూపు రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది? రక్తం ఎక్కించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ తప్పు గ్రూపు రక్తం ఎక్కిస్తే వెంటనే ఏం చేయాలి? ఇలాంటి అంశాలపై చర్చ మొదలైంది.

ఈ విషయాలపై విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రి హెమటాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ మైథిలీని బీబీసీ సంప్రదించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రక్తపరీక్ష

‘శరీరంలోకి వేరే గ్రూపు రక్తం వస్తే శత్రువులెక్క...’

"మనిషి శరీరంలో రక్తం నాలుగు ప్రధాన గ్రూపులుగా ఉంటుంది. A, B, AB, O. వీటికి పాజిటివ్, నెగటివ్ అనే ఉప వర్గాలు కలిపితే ఎనిమిది రకాల రక్త గ్రూపులు వస్తాయి. ప్రతి వ్యక్తి శరీరం ఒక బ్లడ్ గ్రూపును మాత్రమే కలిగి ఉంటుంది. వేరే బ్లడ్ గ్రూపు ఎక్కిస్తే, శరీరం దాన్ని శత్రువుగా భావించి ప్రతిస్పందిస్తుంది" అని డాక్టర్ లక్ష్మీ మైథిలీ వివరించారు.

సాధారణంగా ఉండే ఈ బ్లడ్ గ్రూపులతో పాటు ప్రపంచంలో కొన్ని అరుదైన బ్లడ్ గ్రూపులు కూడా ఉంటాయని ఆమె చెప్పారు.

Bombay Blood Group (hh): సాధారణంగా బాంబే బ్లడ్ గ్రూపు దొరకని పక్షంలో O గ్రూప్ సరిపోతుందని అనుకుంటారు. ఈ బ్లడ్ గ్రూప్‌లో H యాంటిజెన్ ఉండదు. కాబట్టి బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న రోగికి సాధారణ O గ్రూప్ రక్తం ఇవ్వకూడదు. కేవలం hh గ్రూప్ రక్తం మాత్రమే ఇవ్వాలి.

Rh-null: దీనిని 'golden blood' గా పిలుస్తారు. ప్రపంచంలో సుమారు 50-60 మందికి మాత్రమే ఉంటుందని అంచనా.

ఇతర అరుదైన గ్రూపులు: లాటిన్ అమెరికా జాతుల్లో కనిపించే ప్రత్యేకమైన యాంటిజెన్లు ఉన్న Diego గ్రూపు, అలాగే Jka, Jkb వంటి యాంటిజైన్లు ఉన్న Kidd గ్రూప్, ఇంకా Fy(a), Fy(b) వంటి ప్రత్యేక యాంటిజెన్ కలిగిన Duffy గ్రూపులు ఉన్నాయి. అయితే ఇవి కొన్ని జాతులు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి.

"ఈ రేర్ బ్లడ్ గ్రూపుల కోసం ప్రత్యేకంగా సేకరణ, నిల్వ, ట్రాన్స్‌ఫ్యూజన్ జాగ్రత్తలు అవసరం. అలాంటి రేర్ రక్తం ఉండే రోగులకు అత్యంత జాగ్రత్త అవసరం. సరైన రక్తం లేకపోతే పరిస్థితి సీరియస్ అవుతుంది" అని డాక్టర్ లక్ష్మీ మైథిలీ చెప్పారు.

బ్లడ్ గ్రూప్‌ ఎలా నిర్ధరిస్తారు?

బ్లడ్ గ్రూప్‌ నిర్ధరించడానికి రెండు ముఖ్యమైన పరీక్షలు చేస్తారు. అందులో ఎర్ర రక్తకణాలపై ఉండే యాంటిజెన్లను నిర్ధరించే ఫార్వర్డ్ గ్రూపింగ్ పరీక్ష. అలాగే రక్తంలో ఉండే వేరు రక్త కణాలను గుర్తించే అంటే యాంటీబాడీలను గుర్తించే రివర్స్ గ్రూపింగ్ పరీక్ష.

ప్రతి బ్లడ్ గ్రూప్‌కు ప్రత్యేకమైన యాంటిజెన్లు ఉంటాయి.

"A గ్రూప్ లో A యాంటిజెన్, B గ్రూప్ లో B యాంటిజెన్, AB గ్రూప్ లో A, B రెండు రకాల యాంటిజెన్లు ఉంటాయి. O గ్రూప్‌లో ఏ రకమైన యాంటిజెన్లు ఉండవు. అందుకే O బ్లడ్ గ్రూపుని యూనివర్సల్ డోనర్ గ్రూప్ అంటారు. ఫార్వర్డ్ గ్రూపింగ్ పరీక్షలో రక్తంలో యాంటిజెన్లను గుర్తిస్తూ బ్లడ్ గ్రూప్ నిర్ధరిస్తారు. యాంటిజెన్ అంటే రక్తకణాల ‘ఐడీ కార్డు’గా చెప్పవచ్చు" అని డాక్టర్ లక్ష్మీ మైథిలీ చెప్పారు.

అలాగే రివర్స్ గ్రూపింగ్ పరీక్షలో రక్తంలో ఉండే యాంటీబాడీలను గుర్తిస్తారు. ఇవి శరీరంలో ఉండే ఇతర రక్త కణాలను గుర్తించి దాడి చేస్తాయి. అంటిజన్లు లాగే ప్రతి రక్త గ్రూప్‌కు ప్రత్యేకమైన యాంటీబాడీలు ఉంటాయి.

"A గ్రూప్ రక్తంలో B యాంటీబాడీ, B గ్రూప్ రక్తంలో A యాంటీబాడీ, AB గ్రూప్ రక్తంలో ఎటువంటి యాంటీబాడీలు ఉండవు. O గ్రూప్ రక్తంలో A, B రెండూ ఉంటాయి. రివర్స్ గ్రూపింగ్ పరీక్షలో ఈ యాంటీబాడీలను చూసి బ్లడ్ గ్రూప్‌ను ధ్రువీకరిస్తారు. యాంటీబాడీలంటే "ఇది నా గ్రూప్ కాకపోతే నాశనం చేయాలి" అని అనుకునే శరీర రక్షణ దళం. ఈ రెండు పరీక్షల ఫలితాలు సరిపోతేనే బ్లడ్ గ్రూప్ కచ్చితంగా నిర్ధరిస్తారు" అని డాక్టర్ లక్ష్మీ మైథిలీ చెప్పారు.

రక్తం

ఫొటో సోర్స్, Getty Images

వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది?

హెమటాలజిస్ట్ డాక్టర్ మూలం లక్ష్మీ మైథిలీ చెప్పిన వివరాల ప్రకారం, రక్తం తప్పుగా ఎక్కినప్పుడు శరీరంలో హీమోలిటిక్ రియాక్షన్ (ఎర్ర రక్త కణాలు పగిలిపోవడం) జరుగుతుంది.

"రక్తంలోని రెడ్ బ్లడ్ సెల్స్ ఒక్కసారిగా పగిలిపోతాయి. దాంతో రోగికి జ్వరం, వణుకు, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు, ఛాతీ నొప్పి, ఊపిరి బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వెంటనే గుర్తించకపోతే, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అటువంటి పరిస్థితి ప్రాణాపాయం కలిగించవచ్చు.

తప్పు గ్రూపు రక్తం ఎక్కితే, రోగిలోని రోగనిరోధక వ్యవస్థపై ఆ రక్తమే దాడి చేస్తుంది. దీన్నే ‘అక్యూట్ హీమోలిటిక్ ట్రాన్స్‌ఫ్యూజన్ రియాక్షన్’ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. అనుమానం వచ్చిన వెంటనే మొదట ట్రాన్స్‌ఫ్యూజన్ (రక్తం ఎక్కించడం) ఆపాలి" అని డాక్టర్ లక్ష్మీ మైథిలీ సూచించారు.

"ఆ తర్వాత రోగికి ద్రవాలు, మందులు ఇచ్చి కిడ్నీలను కాపాడే ప్రయత్నం చేయాలి. ఇన్ఫెక్షన్లు రాకుండా యాంటీబయాటిక్స్, అవసరమైతే ఐసీయూలో మానిటరింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. రోగి రక్త నమూనా, బ్లడ్ బ్యాగ్ లేబుల్‌ని మళ్లీ చెక్ చేసి, తప్పు ఎక్కడ జరిగిందో కనుక్కోవాలి. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం అవుతుంది" అని ఆమె హెచ్చరించారు.

రక్తపరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఇలాంటి తప్పులు ఎందుకు జరుగుతాయి?

"ఒక యూనిట్ రక్తం రోగికి చేరే క్రమంలో మూడు, నాలుగు సార్లు క్రాస్ చెక్ చేస్తారు. బ్లడ్ బ్యాంకులో గ్రూపింగ్, క్రాస్ మ్యాచింగ్, లేబుల్స్ చెక్ చేయడం, మరోసారి బ్లడ్ గ్రూప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మానవ తప్పిదం, హడావిడి లేదా సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల తప్పు జరిగే అవకాశం ఉంది. అయితే చాలా అరుదు’’ అని డాక్టర్ మైథిలీ చెప్పారు.

పేషెంట్ ఐడెంటిఫికేషన్: రోగి పేరు, వయసు, వార్డు నంబర్ సరిగా చెక్ చేయాలి.

తప్పు రక్త నమూనా: ఒకరి బ్లడ్ తీసుకుని, పొరపాటున మరొకరి పేరు పెట్టడం.

తప్పు బ్లడ్ బ్యాగ్: బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకున్న బ్లడ్ బ్యాగ్‌ని సరిగా మ్యాచ్ చేయకపోవడం.

క్రాస్ మ్యాచ్‌లో పొరపాటు: ల్యాబ్ లో మరోసారి పరీక్ష చేసినప్పుడు నిర్ధరణ పరీక్షలో తప్పు జరగడం.

రక్తం

ఫొటో సోర్స్, Getty Images

రక్తం అవసరమైతే రోగులు భయపడాలా?

ఎవరికైనా, తమవారికైనా, ఇంకెవరికైనా తప్పు గ్రూపు బ్లడ్ ఎక్కించారనే విషయం తెలిస్తే... రక్తం ఎక్కించుకోవాల్సి వచ్చినప్పుడు ఆ రోగి/వ్యక్తి భయపడతారని డాక్టర్ మైథిలీ తెలిపారు. కానీ, భయపడాల్సిన అవసరం లేదని ఆమె చెబుతున్నారు.

"ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులలో చాలా కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. టెస్టింగ్ ప్రాసెస్‌లో చాలా భద్రతా చర్యలు ఉన్నాయి. తప్పు రక్తం ఎక్కించే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి. వరంగల్‌లో జరిగింది ఒక మినహాయింపు. ఈ తరహా సంఘటనలు జరగకుండా వైద్యసిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలి" అని ఆమె చెప్పారు.

రక్తం సరైనదేనా అని చూసుకోవడానికి వివిధ దశల్లో చెక్ చేస్తారు. ఇది ఒక్కరే కాకుండా కనీసం ఇద్దరు స్వతంత్రంగా చెక్ చేయాలి.

"రక్తం ఎక్కించుకోవాల్సి వచ్చినప్పుడు భయపడకండి. కానీ మీ బ్లడ్ గ్రూప్ ఏది అనేది మీ కుటుంబసభ్యులు తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి. అలాగే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ జరుగుతున్నప్పుడు, పేషెంట్ పేరు, బ్లడ్ గ్రూప్ లేబుల్ సరిపోతుందో లేదో ఒకసారి అడిగి చూడటం మంచిది. ఇది రోగి హక్కు కూడా. ఇవి కచ్చితంగా పాటిస్తే, తప్పు గ్రూపు రక్తం ఎక్కించే ప్రమాదం ఉండదు’’ అని డాక్టర్ లక్ష్మీ మైథిలీ చెప్పారు.

డాక్టర్ లక్మీమైథిలి

ఫొటో సోర్స్, Dr Lakshmi Mythili

ఫొటో క్యాప్షన్, డాక్టర్ లక్మీమైథిలి

‘రక్తదానం గొప్పది, ప్రోటోకాల్ తప్పనిసరి’

రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, తమ కుటుంబసభ్యుల పుట్టిన రోజులు లేదా ఇతర సందర్భాల్లో రక్తదానం చేస్తుండటం మనం చూస్తుంటాం. అక్కడ అనేక మంది స్వచ్చందంగా రక్తం ఇస్తారు. అయితే ప్రతి ఒక్కరి రక్తం రోగులకు అందించదగినది కాదని గుర్తించాలని అన్నారు డాక్టర్ లక్ష్మీ మైథీలీ.

రక్తం సురక్షితమని నిర్ధరించడానికి ముందు హెమటాలజిస్టులు కొన్ని టెస్టులు చేస్తారు. హైఇన్ఫెక్షన్ ప్రాబబిలిటీ (హెచ్ఐపీ), హెపటైటిస్ B, C, మలేరియా, సిఫిలిస్ వంటి సంక్రమణ వ్యాధులేమైనా ఉన్నాయా, అలాగే బ్లడ్ గ్రూప్ సరిగా ఉందా పరీక్షిస్తారు. అవన్నీ క్లియర్ అయితే, ఆ రక్తం రోగికి ఎక్కించదగినదిగా గుర్తిస్తారు.

"రక్తదానం గొప్పది. కానీ, భద్రతా ప్రోటోకాల్ పాటించడం తప్పనిసరి" అని డాక్టర్ లక్ష్మీ మైథిలీ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)