పిల్లల ఆరోగ్యానికి సీసంతో పెను ముప్పు... పసుపు, ఎండుమిర్చిల నిల్వకూ లెడ్ వినియోగం

పసుపు, మిర్చి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
    • హోదా, బీబీసీ పర్యావరణ ప్రతినిధి

ప్రపంచంలో సీసం బారిన పడుతున్న పిల్లలు భారత్‌లో అత్యధిక సంఖ్యలో ఉన్నారని, సీసపు విషతుల్యతపై జరిపిన ఒక అంతర్జాతీయ పరిశోధన పేర్కొంది.

ప్రపంచంలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు సీసం వల్ల వచ్చే విషం వల్ల కోలుకోలేని రోగాల బారిన పడుతున్నారని యునిసెఫ్, ప్యూర్ ఎర్త్ సంయుక్తంగా వెలువరించిన నివేదిక తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ విషం బారిన 80 కోట్ల మంది పిల్లలు పడుతుండగా, వీరిలో అత్యధిక మంది పిల్లలు పేద, మధ్య స్థాయి ఆదాయం ఉన్న దేశాలలోనే నివసిస్తున్నారు.

వీరిలో సగం మంది దక్షిణ ఆసియాలో ఉండగా, ఒక్క భారత్‌లోనే 27. 5 కోట్ల మంది పిల్లలు దీని బారిన పడినట్లు తెలిసింది.

వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ ప్రచురించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ నివేదిక నుంచి సేకరించిన వివరాలను ఈ నివేదికలో విశ్లేషించారు.

పిల్లల మెదడు, నాడీ వ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు సీసం కోలుకోలేని నష్టాన్ని కలగచేస్తుంది.

అతి తక్కువ మోతాదులో సీసం శరీరంలోకి వెళ్లడం వలన నరాలకు సంబంధించిన వ్యాధులు, ఐక్యూ స్కోర్ తగ్గడం, ఏకాగ్రత మందగించడంతో పాటు క్రమంగా హింసాత్మక, నేర ప్రవృత్తికి కూడా దారితీయవచ్చని ఈ రిపోర్ట్ వెల్లడించింది.

గర్భంలో ఉన్న శిశువులు, అయిదేళ్ల లోపు పిల్లలు దీని బారిన పడితే జీవితాంతం నరాలు, ఏకాగ్రతకు సంబంధించిన సమస్యలతో పాటు అవయవలోపాలు కూడా తలెత్తి చివరకు మరణానికి కూడా దారి తీసే ప్రమాదం ఉంది.

సంఖ్యాపరంగా చూస్తే సీసం వలన ప్రభావితమైన దేశాలలో భారత్ తర్వాత ఆఫ్రికా (నైజీరియా) ఉండగా, మూడో స్థానంలో పాకిస్తాన్, నాలుగో స్థానంలో బంగ్లాదేశ్ ఉన్నాయి.

బీహార్లో చేతులతో వేరు చేస్తున్న బ్యాటరీలు

ఫొటో సోర్స్, PURE EARTH

ఫొటో క్యాప్షన్, బీహార్లో చేతులతో వేరు చేస్తున్న బ్యాటరీలు

సీసం ఎలా విషం అవుతుంది?

సీసంతో కూడిన బ్యాటరీలను రీసైకిల్ చేసేందుకు చవకబారు విధానాలను అవలంబించడం వలన విషతుల్యమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, గనుల తవ్వకాలు, ఈ-వ్యర్ధాలు, సీసంతో కూడిన మసాలా దినుసులు, పెయింట్లు , బొమ్మల ద్వారా కూడా విషపూరితం అయ్యే అవకాశం ఉంది.

"అల్ప, మధ్యాదాయ దేశాల్లో వాహనాల వినియోగం 2000 సంవత్సరం నుంచి మూడింతలు పెరిగింది. దీంతో లెడ్-యాసిడ్ బ్యాటరీల రీసైక్లింగ్ విపరీతంగా పెరిగింది. చాలాసార్లు ఇది సురక్షితం కాని విధానాల్లో జరుగుతోంది" అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన నికోలస్ రీస్ బీబీసీతో అన్నారు.

ప్రపంచంలో 85 శాతం సీసాన్ని యాసిడ్ బ్యాటరీల తయారీలో వాడతారు. ఇందులో అధిక భాగం రీసైకిల్ చేసిన ఆటోమొబైల్ బ్యాటరీల నుంచి వస్తుంది.

"నియంత్రణ లేని, చట్ట వ్యతిరేక రీసైక్లింగ్ వంటి చర్యల వలన బ్యాటరీ కేసులు తెరుచుకుని ఆమ్లాన్ని, సీసపు ధూళిని బయటకు విడుదల చేస్తాయి. ఓపెన్-ఎయిర్ ఫర్నేస్‌లో కరిగించే సీసం వలన విషపూరిత వాయువులు, ధూళి గాలిలోకి విడుదలై చుట్టు పక్కల ప్రాంతాలను విషతుల్యం చేస్తుంది" అని నివేదిక తెలిపింది.

నియంత్రణ లేని సీసపు రీసైక్లింగ్ ప్రాంతాలు

ఫొటో సోర్స్, PURE EARTH

ఫొటో క్యాప్షన్, నియంత్రణ లేని సీసపు రీసైక్లింగ్ ప్రాంతాలు

అక్రమంగా జరిగే బ్యాటరీ రీసైక్లింగ్

భారతదేశంలో ఇదో పెద్ద సమస్య అని నిపుణులు చెబుతున్నారు.

"దేశంలో సీసం బారిన పడి విషతుల్యమైన 300 ప్రదేశాలను గుర్తించాం. వీటిలో ఎక్కువగా అనధికారిక బ్యాటరీ రీసైక్లింగ్, విభిన్న రకాల పరిశ్రమలు ఉన్న పారిశ్రామిక ప్రాంతాలే” అని నివేదికను ప్రచురించిన ప్యూర్ ఎర్త్ సభ్యురాలు ప్రమీల శర్మ చెప్పారు.

పర్యావరణంపై ప్రభావం గురించి అంచనా వేసే తమ సంస్థ ఐఎన్జీవో ఈ పరిశోధనను ప్రత్యేకంగా చేసిందని ఆమె చెప్పారు.

"అనధికారికంగా, చట్ట వ్యతిరేకంగా సీసపు బ్యాటరీలను రీసైకిల్ చేసే పనులు చాలా వరకు గోప్యంగా ఇళ్లలోనో, ఇంటి వెనక భాగంలోనో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటి వలన ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా ప్రమాదం బారిన పడతారు” అని ప్రమీల శర్మ అన్నారు.

అనధికారికంగా చేసే నియంత్రణ లేని రీసైక్లింగ్ కార్యకలాపాలు పశ్చిమ బెంగాల్, బిహార్ , ఉత్తర్ ప్రదేశ్‌లలో ఎక్కువగా జరుగుతున్నట్లు తమ సంస్థ గుర్తించిందని ఆమె తెలిపారు.

ఈ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా బంగ్లాదేశ్, నేపాల్ నుంచి దిగుమతి చేసుకుని వాడి పడేసిన బ్యాటరీలను రీసైకిల్ చేస్తున్నట్లు తమ సంస్థ గుర్తించిందని చెప్పారు.

బ్యాటరీ రీసైక్లింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఇన్వర్టర్ల నుంచి లీకేజీలు

భారత్‌లో కరెంటు కోతల నుంచి బయట పడేందుకు ఇళ్లలో వాడే ఇన్వర్టర్ల వలన కూడా ఈ సీసం బారిన పడే ప్రమాదం ఉంది.

ఉత్తర్ ప్రదేశ్‌లో ఇన్వర్టర్ ద్వారా లీక్ అయిన సీసం కారణంగా ఓ చిన్నారి అనారోగ్యం బారిన పడ్డారని, లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ అబ్బాస్ మహది చెప్పారు.

"ఇన్వర్టర్ నుంచి లీక్ అయిన ద్రవాన్ని ఇంట్లో ఫ్లోర్ శుభ్రం చేసే సమయంలో పని మనిషి గుడ్డతో తుడుస్తూ, దాన్ని ఇల్లంతా వ్యాపింపచేసింది. దీంతో అది ఆ నేలపైనే ఆడుకునే చిన్నారి శరీరంలోకి ప్రవేశించినట్లు తల్లిదండ్రులకు తెలియదు”.

ఈ-వ్యర్ధాలు, గనుల తవ్వకాల్లో నియంత్రణ లేకపోవడం కూడా భారత్‌లో సీసం ద్వారా కలిగే ముప్పుకు కారణమవుతున్నాయి.

కొన్ని రకాల మందులు, నిత్యం వాడే మసాలా దినుసుల వలన కూడా ప్రమాదం ఉంది.

"సీసాన్ని పసుపు, ఎండు మిర్చి వంటి కొన్ని రకాల వంటింటి దినుసులను నిల్వ ఉంచటానికి వాడతారు. కొన్నిసార్లు దీన్ని వాటి రంగును పెంపొందించేందుకు కూడా వాడతారు” అని డాక్టర్ మహది చెప్పారు.

భారత్‌లో ఉన్న 27.5 కోట్ల పిల్లల రక్తంలో ప్రతి డెసిలీటరుకి 5 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువ సీసపు స్థాయిలు ఉన్నాయని యునిసెఫ్ రిపోర్ట్ చెబుతోంది.

ఆ స్థాయిలో రక్తంలో సీసం ఉండటం పట్ల వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతున్నాయి.

స్కానింగ్

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలకు ముప్పు ఎందుకు ఎక్కువగా?

"ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు దీనివల్ల తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే వారి మెదడు పూర్తిగా అభివృద్ధి చెందకముందే దానిపై ప్రభావం పడుతుంది. దీంతో, జీవితాంతం నరాలు, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలతో పాటు అవయవలోపాలతో బాధపడే ముప్పు ఎక్కువగా ఉంది" అని ఈ నివేదిక చెబుతోంది.

శరీర బరువుతో పోల్చి చూసుకుంటే పెద్దవాళ్ల కన్నా పిల్లలు ఆహారం, ద్రవ పదార్థాలు, గాలి ఐదు రెట్లు ఎక్కువగా తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

"ఈ విషపూరితమైన లోహం భూమి, నీరు, గాలిలోకి చేరితే పిల్లలు దాని ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది” అని రీస్ చెప్పారు.

బాల్యంలో తక్కువ మోతాదులో విషం శరీరంలోకి చేరితే, చాలా రోజుల వరకు వీటి ప్రభావం బయట పడే అవకాశం ఉండదని, ఇదో పెద్ద సవాలుగా నిలుస్తోందని ఈ నివేదిక చెబుతోంది.

దీనిపై అవగాహన లేకపోవడం కూడా ఒక సమస్యేనని, కానీ ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారని డాక్టర్ మహది చెప్పారు.

లెడ్ కాలుష్యం

ఫొటో సోర్స్, Pure Earth

భారతదేశం ఏం చర్యలు తీసుకుంది?

2012లో కేంద్ర పర్యావరణ నియంత్రణ బోర్డు ఈ -వ్యర్ధాలను నిర్వహించేందుకు నియమాలను నిర్దేశించింది.

ఈ-వ్యర్ధాలను సేకరణ, రవాణా, రీసైక్లింగ్‌కు నిర్దిష్ట విధానాలు ఉన్నాయి.

రీసైక్లింగ్ ప్రక్రియలో విడుదలయ్యే ప్రమాదకర వ్యర్థాలను ప్రత్యేక ట్రీట్‌మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ కేంద్రానికి పంపాలని ఈ నిబంధనలు చెబుతున్నాయి. కానీ, ఇవి కాగితాలకే పరిమితమయ్యాయి.

"నిబంధనల అమలును ఎవరూ పర్యవేక్షించరు” అని ఇండియన్ సొసైటీ ఫర్ లెడ్ అవేర్నెస్ అండ్ రీసెర్చ్ ఛైర్మన్ డాక్టర్ వెంకటేష్ తుప్పిల్ చెప్పారు.

2000 సంవత్సరంలో భారత్‌లో సీసంతో కూడిన గాసోలిన్ వాడకాన్ని నిషేధించారు. దేశంలో ప్రస్తుతం వాడే రంగుల్లో కూడా 90 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్ మాలిక్యూల్స్) ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

బ్యాటరీ రీసైక్లింగ్, ఈ- వ్యర్ధాలు, కల్తీ చేసిన మసాలా దినుసుల్లో కనిపించే సీసం ద్వారా వచ్చే విష పదార్థాలను నియంత్రించడానికి చేపట్టే చర్యలు పూర్తిస్థాయిలో అమలవుతాయా అనేదే ఇప్పుడున్న ప్రశ్న.

దీనిపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. కానీ వారి నుంచి ఇంతవరకూ ఎలాంటి సమాధానం రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)