భారత్ చేతిలో హ్యాట్రిక్ ఓటమి, ఆటగాళ్ల ప్రవర్తన గురించి పాకిస్తాన్ మీడియా ఏం రాసింది?

భారత్, పాకిస్తాన్, క్రికెట్, ఆసియా కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌‌పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
    • రచయిత, జైనుల్ అబిద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. ఆదివారం దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ పోరు మైదానం వెలుపల వివాదాలతో నిండిపోయింది. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా మ్యాచ్‌పై కూడా ఆ ప్రభావం కనిపించింది.

తిలక్ వర్మ అజేయంగా 69 పరుగులు చేయడంతో భారత్ జట్టు 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్‌ను గెలుచుకుంది.

అయితే మ్యాచ్ తర్వాత, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ హోంశాఖ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించబోమంటూ భారత్ జట్టు ట్రోఫీ ప్రదానోత్సవాన్ని బహిష్కరించింది.

ఈ కారణంగా ప్రదానోత్సవం కాస్తా 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.

చివరికి, నఖ్వీ ఆ ట్రోఫీతో వెళ్లిపోయారు. ఈ చర్య భారత్‌లో తీవ్ర విమర్శలకు దారితీసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, పాకిస్తాన్, క్రికెట్, ఆసియా కప్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ మీడియా ఏమంది?

ట్రోఫీ ప్రదానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఈ సంఘటనకు పాకిస్తాన్ మీడియా విస్తృత కవరేజ్ ఇచ్చింది. భారత జట్టు చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని, క్రికెట్ స్ఫూర్తిని ఉల్లంఘించేలా ఉందని పేర్కొంది.

మే నెలలో జరిగిన సైనిక ఉద్రిక్తతల తర్వాత ఇరుదేశాల జట్ల మధ్య జరుగుతున్న తొలి క్రికెట్ సిరీస్ ఇదేనంటూ, ఈ సంఘటనను భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ముడిపెట్టింది.

భారత్ జట్టు చర్య 'అవమానకరమైనది' అంటూ పలువురు జర్నలిస్టులు, మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానించారు. టీమిండియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పాకిస్తాన్‌కు చెందిన ఆంగ్ల దినపత్రిక డాన్, భారత్ జట్టు విజయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'తో ముడిపెట్టింది.

భారత్ జట్టు విజయం సాధించిన తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'X'లో జట్టు సభ్యులను అభినందిస్తూ పోస్టు పెట్టారు. 'ఆపరేషన్ సిందూర్' గురించి కూడా ఆయన ఆ పోస్టులో ప్రస్తావించారు.

''క్రీడా మైదానంలో ఆపరేషన్ సిందూర్. ఫలితం ఒక్కటే- భారత్ విజయం. మన క్రికెటర్లకు అభినందనలు'' అని మోదీ రాశారు.

పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌పై చేపట్టిన సైనిక చర్యకు భారత్ పెట్టిన పేరు 'ఆపరేషన్ సిందూర్'.

ఎక్స్‌లో ప్రధాన మంత్రి పోస్టుపై ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ స్పందించారు.

''ఆత్మ గౌరవానికి యుద్ధమే మీ కొలమానమైతే, పాకిస్తాన్ చేతిలో భారతదేశం అవమానకరమైన ఓటమిని చరిత్ర ఇప్పటికే నమోదు చేసింది, ఆ సత్యాన్ని ఏ క్రికెట్ మ్యాచూ మార్చలేదు. యుద్ధాన్ని క్రీడల్లోకి లాగడం నిరాశ కలిగించింది. క్రీడాస్ఫూర్తికి అవమానం'' అని నఖ్వీ రాశారు.

ఆసియా కప్ ట్రోఫీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆసియా కప్ ట్రోఫీ

ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరణ...

ఆసియా కప్ ట్రోఫీ, పతకాలను ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి భారత్ జట్టు నిరాకరించడం ప్రధానంగా చర్చనీయమైంది.

పాకిస్తాన్‌తో సైనిక ఘర్షణలో ఓడిపోవడం జీర్ణించుకోలేక, భారత్ ఆ కోపాన్ని క్రికెట్ ద్వారా బయటపెడుతోందని పీటీవీ యాంకర్ బీనిష్ సలీం అన్నారు.

మే నెలలో ఇరుదేశాల మధ్య జరిగిన సైనిక వివాదంలో విజయం సాధించినట్లు పాకిస్తాన్ చెప్పుకుంటుండగా, పాకిస్తాన్‌లోని అనేక సైనిక స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు భారతదేశం పేర్కొంది. పాకిస్తాన్‌లో ఉన్న అనేక ఉగ్రవాదుల రహస్య స్థావరాలను కూడా ధ్వంసం చేసినట్లు భారత్ ప్రకటించింది.

రజా హరూన్ అనే రాజకీయ నాయకుడు పీటీవీతో మాట్లాడుతూ, భారత క్రికెట్ జట్టు ప్రవర్తనను ఖండించారు. ''వారు ఆటను యుద్ధంలా, యుద్ధాన్ని ఆటలా చూస్తున్నట్లు కనిపిస్తోంది'' అని అన్నారు.

ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన భారత జట్టు వైఖరిని ప్రపంచమంతా ఖండించాలని జియో న్యూస్ యాంకర్ జావేద్ బలోచ్ అన్నారు.

పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ, భారత క్రికెట్ జట్టును సస్పెండ్ చేయాలని ఐసీసీని కోరారు. అయితే, ఐసీసీలో భారత్ ఆధిపత్యం కారణంగా అలాంటి చర్య తీసుకునే అవకాశం లేదని కూడా ఆయన అన్నారు.

పాకిస్తాన్ క్రికెటర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ఆటతీరును చాలామంది మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు

'షేక్ హ్యాండ్' ఇవ్వకపోవడంపై కూడా హెడ్‌లైన్స్..

ఈ టోర్నమెంట్‌లో టాస్ వేసే సమయంలో, లేదా మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ టీమ్ కెప్టెన్ సల్మాన్ అఘాకు భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదని మీడియా పదేపదే ప్రస్తావిస్తోంది.

క్రీడాస్ఫూర్తి కొరవడిందని, ఉద్రిక్తతలను పెంచడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా విశ్లేషకులు పేర్కొన్నారు. క్రికెట్‌ను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చెబుతున్నారు.

భారత కెప్టెన్ ప్రవర్తనను స్పోర్ట్స్ జర్నలిస్ట్ మోహిసా ఖండించారు. క్రీడా రంగంలోకి రాజకీయాలను తీసుకురాకూడదని ఆయన అన్నారు.

భారత్ జట్టు ప్రవర్తన క్రికెట్ నిబంధనలను ఉల్లంఘించడమేనని, క్రికెట్‌ విలువలు, విధానాలను విస్మరించడమేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ ఖలీద్ మహమూద్ అన్నారు.

భారత్ టీమ్

ఫొటో సోర్స్, Getty Images

'భారత్' ఏమంటోంది..

మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదనేది జట్టు సమష్టి నిర్ణయమని భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేఖరుల సమావేశంలో చెప్పాడు.

భారత్ జట్టు ట్రోఫీ స్వీకరించడానికి నిరాకరించడంతో, నఖ్వీ ట్రోఫీ తీసుకెళ్లిపోయారు. ఇది భారత్‌లో తీవ్ర విమర్శలకు దారితీసింది.

చాంపియన్‌గా నిలిచిన జట్టుకు ట్రోఫీ ఇవ్వకపోవడం తాను ఎప్పుడూ చూడలేదని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.

''అది కూడా కష్టపడి గెలిచిన ట్రోఫీ. మేము దానికి అర్హులమని నమ్ముతున్నాను. అంతకుమించి ఏమీ చెప్పలేను. నా అభిప్రాయాన్ని స్పష్టం చేశాను. ట్రోఫీల గురించి మీరు నన్ను అడిగితే, నా ట్రోఫీలు నా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాయి. నాతో ఉన్న 14 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది నిజమైన ట్రోఫీలు'' అని సమాధానమిచ్చాడు.

నఖ్వీ నుంచి ట్రోఫీ స్వీకరించకూడదన్న నిర్ణయం అధికారికమా, కాదా అని ఒక జర్నలిస్టు అడిగినప్పుడు సూర్యకుమార్ స్పందిస్తూ, ''ఈ నిర్ణయాన్ని మేం మైదానంలోనే తీసుకున్నాం. అలా చేయాలని మాకు ఎవరూ చెప్పలేదు. మీరు టోర్నమెంట్ అంతా బాగా ఆడి గెలిచినప్పుడు, ట్రోఫీకి మీరు అర్హులా కాదా? మీరే చెప్పండి'' అని అన్నారు.

బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ, ''ఏసీసీ అధ్యక్షుడి నుంచి 2025 ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించకూడదని మేం నిర్ణయించుకున్నాం. ఆయన పాకిస్తాన్ ప్రముఖ నాయకులలో ఒకరు. అందుకే అతని నుంచి స్వీకరించకూడదని నిర్ణయించుకున్నాం. దీనర్థం ట్రోఫీ, పతకాలు ఆయన వద్ద ఉంచుకోవాలని కాదు. వీలైనంత త్వరగా వాటిని భారత్‌కు తిరిగి ఇస్తారని ఆశిస్తున్నాం. నవంబర్‌లో ఐసీసీ సమావేశం దుబాయ్‌లో జరుగుతుంది. ఏసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలియజేస్తాం'' అని చెప్పారు.

పాకిస్తాన్ జట్టు అభిమానులు

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్ వికెట్ కోల్పోయినప్పుడు అభిమానుల నిరాశ

పాకిస్తాన్‌లో క్రికెట్ ప్రమాణాలపై ఆందోళనలు..

పాకిస్తాన్ జట్టు పేలవమైన ప్రదర్శన తర్వాత పాకిస్తాన్‌లో క్రికెట్ ప్రమాణాలపై పలువురు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు.

పాకిస్తాన్‌లో క్రికెట్ నెమ్మదిగా దెబ్బతింటోందని, నిధుల కొరత కూడా ఉందని రాజకీయ నాయకుడు రజా హరూన్ అన్నారు.

ఏఆర్‌వై న్యూస్ యాంకర్ అష్పాక్ ఇషాక్ సత్తి మాట్లాడుతూ, పాకిస్తాన్ యావత్తూ తమ జట్టు నుంచి మెరుగైన ప్రదర్శనను ఆశించిందని, కానీ ఆసియా కప్ టోర్నమెంట్‌లో వరుస వైఫల్యాలు నిరాశ మిగిల్చాయని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)