తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైంది?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
ఏటా తొమ్మిదిరోజులపాటు జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తులు ఎంతో ప్రత్యేకంగా చూస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ ఉత్సవాలను అంతే ఘనంగా చేస్తుంది.
తిరుమలకు ‘నిత్యకల్యాణం పచ్చతోరణం’ అనే పేరు ఉంది. ప్రతిరోజూ అక్కడ ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. అయితే ఏడాదిలో 9రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం ప్రత్యేకం.
ఈ తొమ్మిదిరోజులు తిరుమల పుష్పశోభితంగా ఉంటుంది. వివిధ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారి వాహన సేవలతో భక్తులకు కనువిందుగా ఉంటుంది.

ఏటా ఒకసారి మాత్రమే జరిగే బ్రహ్మోత్సవాలు అధికమాసం వచ్చినప్పుడు స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
ఒకప్పట్లో కొండపైన ఏడాదికి 10 బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారని చరిత్రకారులు చెబుతున్నారు.
అసలింతకీ ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
చరిత్రకారులు, పండితులు ఏం చెబుతున్నారు?
బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటి?
తిరుమలేశునికి బ్రహ్మదేవుడు నిర్వహించిన ఉత్సవాలు కనుకే వీటిని బ్రహ్మోత్సవాలు అంటారని పండితుల మాట.

ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
తిరుమలేశుని చరిత్రకు సంబంధించి క్రీస్తుశకం 3,4 శతాబ్దాల మధ్యకాలంలో సంగం సాహిత్యానికి చెందిన ‘‘మామూలనార్’’ అనే కవి ‘‘తిరువేంగడం’’ ప్రాంతం చాలా సుందరమైన ప్రాంతమనీ, పండుగపబ్బాలు జరుపుకొంటున్నారని రాశారు.
అలాగే 8వ శతాబ్దిలో ఆళ్వారులలో శ్రీనివాసుని కీర్తివైభవాల ప్రసక్తి, ప్రశస్తి ప్రారంభమయ్యాయి.
క్రీస్తు శకం 614లో పల్లవుల పాలనా కాలంలో తిరుమలకు వచ్చిన పల్లవరాణి సమవై శ్రీవారికి బ్రహ్మోత్సాలు చేయాలని ఆదేశించారని తిరుమలశాసనాల్లో ఉన్నట్టు టీటీడీ శాసన అధ్యయనకారుడు సాధు సుబ్రమణ్యశాస్త్రికి శిష్యుడైన చరిత్రకారుడు కృష్ణారెడ్డి అలియాస్ పెన్ గోపీకృష్ణ బీబీసీతో చెప్పారు.
తిరుమల ఆలయ ఉత్తరపు గోడపైన ఒకటవ కొప్పాత్ర మహేంద్ర పన్మార్ పరిపాలనాకాలంలోని 14వ సంవత్సరంలో శక్తి విటంకన్ రాణి అయిన పెరుందేవి అని పిలిచే సమవై వేయించిన శానసనంలో ‘‘కోయిల్ ఆళ్వారుక్కు కోవిలుక్కు కోవిల్ శెయ్యి’’ అని ఉంది. అంటే కోవిల్ ఆళ్వారుకు దేవాలయ నిర్మాణం అని అర్థం.
''తిరుమలలో శక్తిమంతమైన దేవుడున్నాడని తెలుసుకున్న సమవై ఆయనను దర్శించుకుందామని వచ్చారు. అప్పట్లో ఆమె భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని, దానికి సరిపడా నగలు తయారు చేయించి బహుమతిగా ఇచ్చారు. అక్కడ ఒక శాసనం కూడా వేశారు. అందులో ప్రతి పురటాసి మాసంలో స్వామివారికి ఉత్సవం జరపండి అని రాసి ఉంది. అలా దానికి బ్రహ్మోత్సవం అని పేరు పెట్టారు. పల్లవుల కాలంలోనే మొట్టమొదటి బ్రహ్మోత్సవం ప్రారంభం అయింది" అని ఆయన చెప్పారు.
సమవై ఈ వేడుకలు నిర్వహించిన తర్వాతే ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించే విధానం మొదలైందని పండితులు చెబుతున్నారు.
16వ శతాబ్దం నాటికి వైశాఖం, ఆడి మాసాలు మినహాయిస్తే స్వామివారికి ఏడాదికి పది బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారని ఆలయ శాసనాలు చెబుతున్నాయని కృష్ణారెడ్డి వివరించారు.
అవి కూడా మొత్తం 12 రోజులపాటు జరిగేవని, మిగిలిన రెండు మాసాలు కూడా ఖాళీగా ఎందుకు ఉండాలని అప్పటి రాజులు తిరుపతిలోని గోవిందరాజస్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారని కృష్ణారెడ్డి వివరించారు.
''పల్లవుల తర్వాత బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యాన్ని గుర్తించినవారు తొండమ రాజులు, విజయనగర చక్రవర్తులు. వీరు ఒక్కొక్కరు ఒక్కో నెలలో తమ తమ పేర్ల మీద ఆ ఉత్సవాలు జరిపిస్తూ వచ్చారు. అలా దాదాపు విజయనగర సామ్రాజ్యం పతనమయ్యే నాటికి మొత్తం 10 బ్రహ్మోత్సవాలు జరిగేవి. అంటే ఏడాదిలో 12నెలలుంటే పది మాసాలు బ్రహ్మోత్సవాలే ఉండేవి. ఇంకా రెండు మాసాలు కూడా ఎందుకు ఖాళీగా ఉండాలి అని భావించిన రాజులు ఆ రెండు బ్రహ్మోత్సవాలు తిరుపతి గోవిందరాజు స్వామికి జరుపుతూ వచ్చారు''అని ఆయన అన్నారు.
తర్వాత ఈ బ్రహ్మోత్సవాలను ఏటా నాలుగు సార్లు నిర్వహించేలా పరిమితం చేశారు.
వాటిని పురటాశి, రథసప్తమి, కార్తీక మాసంలో కైశిక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి సమయాల్లో నిర్వహించేవారు.
తర్వాత తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ, ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో వాటికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఏడాదికి ఒక్కసారి మాత్రమే బ్రహోత్సవం నిర్వహించే ఆనవాయితీ మొదలైందని ఆయన తెలిపారు.

ఏడాదికి రెండుసార్లు..
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో ఏటా అధికమాసం వస్తుంది.
ఇలా వచ్చిన సమయంలో కన్యామాసం ( భాద్రపదం)లో ఒక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రుల్లో (అశ్వయుజ మాసం) మరో బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు.
ఆ సమయంలో భాద్రపదంలో నిర్వహించే వాటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని, కన్యామాసంలో నిర్వహించేవాటిని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటారని కృష్ణారెడ్డి వివరించారు.
అధికమాసం రాని ఏడాదిలో సాధారణంగా కన్యామాసం, నవరాత్రులు కలిసేవస్తాయి కాబట్టి ఒకే బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు.
ఏడాదికి పన్నెండు నుంచి పది రోజులకు పరిమితమైన బ్రహ్మోత్సవాలు తర్వాతి పరిణామాలతో ఇప్పుడు జరుగుతున్నట్లు 9 రోజులకు చేరుకున్నాయి.
వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల కోసం చక్రవర్తులు, రాజులు మాత్రమే కాదు, ఎందరో నవాబులు కూడా గ్రామాలు, భూములు, ఆభరణాలు, బంగారం, వెండి, ఆహార పదార్థాలు ఇచ్చి వేడుకలను కొనసాగించారు.
తర్వాత ఈస్టిండియా కంపెనీ ప్రతినిధులతోపాటు, బ్రిటిష్ అధికారులు మహంతుల కాలంలోనూ ఈ బ్రహ్మోత్సవాల పరంపర కొనసాగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం 1933లో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాదికోసారి
బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

పురాణాలలో ఏం ఉంది?
తిరుమలపై వెంకటేశ్వరుడు శిలగా ఏర్పడిన తర్వాత ఆయనే బ్రహ్మదేవుడిని పిలిపించి తనకు బ్రహ్మోత్సవాలు చేయాలని చెప్పారని టీటీడీ పండితుడు విభీషణ శర్మ బీబీసీకి వివరించారు.
''శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ శిలగా ఏర్పడిన తర్వాత వారు బ్రహ్మదేవుని పిలిపించి నాయనా బ్రహ్మోత్సవాలు చేయి అని చెప్పి ఎలా చేయాలో కూడా చెప్పారు. అందుకే వీటికి నిజమైన బ్రహ్మోత్సవాలు అని పేరు. అనేక క్షేత్రాలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి కానీ తిరుమలలో జరిగే వాటికి ఎంతో విశిష్టత ఉంది. '44 లక్షల జీవ రాశులని సృష్టించిన ఓ బ్రహ్మ నువ్వు నాకు ఉత్సవాలు చెయ్యి' అని పరబ్రహ్మమైన శ్రీనివాసుడు చతుర్ముఖ బ్రహ్మని అడిగి చేయించుకున్న ఉత్సవాలు, నవబ్రహ్మలు దీక్షతో చేస్తున్న వేడుకలు కనుకే ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయి'' అని శర్మ అన్నారు.
అయితే ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అనేదానికి స్పష్టమైన ఆధారాలు లేవని, ఈ బ్రహ్మోత్సవాలు జరిపించిన వారి గురించి ఆలయంలో 10 దాన శాసనాలు ఉన్నాయని, పురాణాలలో కూడా బ్రహ్మోత్సవాల ప్రస్తావన ఉందని విభీషణ శర్మ చెప్పారు.
''భవిష్యత్ పురాణంలో శ్రీనివాసుడు బ్రహ్మను ఆజ్ఞాపించిన తర్వాత ఈ బ్రహ్మోత్సవాలు వస్తాయి అని చెప్పారు. ఈరోజు కూడా అలాగే జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను ఏయే రాజులు వైభవంగా శ్రీవారికి పుణ్య భక్తితో చేయించారో వారి పేర్లు దేవాలయం దాన శాసనాల్లో ఉన్నాయి. వాళ్లు ప్రత్యేకంగా ఫలానా రోజున చేశారు అని చెప్పడానికి చరిత్ర లేదు'' అని ఆయన వివరించారు.

విజయాలకు కృతజ్ఞతగా
బ్రహ్మదేవుడు ప్రారంభించినట్లు చెబుతున్న ఈ బ్రహ్మోత్సవాలను కాలానుగుణంగా ఎందరో రాజులు, చక్రవర్తులు, తమ విజయ పరంపరకు కృతజ్ఞతగా నిర్వహించేవారని పండితులు చెబుతున్నారు. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు తన విజయపరంపరల నేపథ్యంలో తన ఇద్దరు భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవితో కలిసి స్వామివారిని ఏడుసార్లు దర్శించుకున్నట్టు ఆలయ రికార్డులు చెబుతున్నాయి.
తిరుమల వెంకటేశ్వరుడిని బ్రహ్మాండనాయకుడు అంటారు కాబట్టి బ్రహ్మోత్సవాలంటారని, అలాగే వీటిని విశేషోత్సవాలు అని కూడా అంటారని ఆలయ పురోహితులు చెబుతున్నారు.
పురాణశాస్త్రాల్లో బ్రహ్మ ఈ ఉత్సవాలను ఎలా ప్రారంభించారో ఇప్పటికీ ఆలాగే చేస్తామని విభీషణ శర్మ చెప్పారు. దీని వెనుక ఉన్న పురాణం గురించి వివరించారు.
''ఈ కలియుగం ప్రారంభ అయ్యాక కొన్ని వందల ఏళ్ల తర్వాత ఋషులు ఇక్కడకు రమ్మని చెప్తే స్వామి ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడ తపస్సు చేసి ఆది వరాహ స్వామి దగ్గర స్థలం తీసుకుని, ఆ స్థలంలో గుడి గోపురాలు కట్టించుకుని ఉత్సవాలు చేయించుకున్నారు. అలాగే తొండమాను చక్రవర్తి కూడా శ్రీవారికి ఉత్సవాలు చేయించాడు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Thulasi prasad Reddy/ BBC
స్వామివారి వాహన వైభవం
తిరుమలలో అంకురార్పణతో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగుస్తాయి.
ఈ వేడుకల సమయంలో ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 10 వరకూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు.
ధ్వజారోహణం అంటే ముక్కోటిదేవతలకు స్వామివారి ఉత్సవాలకు రండి అని ఆహ్వానం పలకడం. ఇందుకోసం స్వామివారి వాహనమైన గరుత్మంతుడిని ధ్వజపటంపై చిత్రించి దానిని ఎగురవేస్తారు. ఈ క్రతువును ధ్వజారోహణం అంటారు. ఈ కార్యక్రమమే స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పడానికి గుర్తు. ఇక ఆ రోజు సాయంత్రం నుంచి వాహనసేవలు ప్రారంభమవుతాయి.
'బ్రహ్మోత్సవాలలో మొదటి వాహనం పెద్ద శేష వాహనం, రెండో రోజు ఉదయం చిన్న శేష వాహనం, సాయంత్రం హంసవాహనం, మూడో రోజు ఉదయం సింహ వాహనం, సాయంత్రం ముత్యపు పందిరి వాహనం, నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వ భూపాల వాహనం, ఐదో రోజు ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడ వాహనంలో స్వామివారు ఊరేగుతారు. ఆరో రోజు ఉదయం హనుమంత, సాయంత్రం గజ వాహన సేవలు ఉంటాయి. ఏడో రోజు ఉదయం సూర్యప్రభ , సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయి. ఎనిమిదవ రోజు ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనంపై ఉరేగింపు ఉంటుంది.
ఇక చివరి రోజైన తొమ్మిదవ రోజు వరాహస్వామి ఆలయ పుష్కరిణిలో చక్ర స్నానం జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ధ్వజావరోహణంతో అధికారికంగా బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

గరుడ సేవ
అన్ని వాహన సేవల్లో గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.
ఆ రోజున వేరే ఏ వాహన సేవల రోజూ రానంత మంది భక్తులు తిరుమల చేరుకుంటారు.
ఈ గరుడ సేవ గురించి కృష్ణారెడ్డి వివరించారు.
''ఈ 9 రోజుల్లో దాదాపు రోజూ రెండు వాహనాలపై స్వామివారు ఊరేగుతారు. ఈ వాహనాల్లో గరుడ వాహనం ప్రసిద్ధి గాంచింది. గరుత్మంతుడు స్వామికి వాహనం ఆయనను ఎప్పుడూ మోస్తూ ఉంటాడు స్వామి దగ్గరే ఉంటాడు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ఆ ఉత్సవం'' అని కృష్ణారెడ్డి చెప్పారు.

భక్తకోటి ఆనందం కోసమే..
బ్రహ్మోత్సవాలు కలియుగంలో ఎంతోమందికి ప్రత్యక్షంగా, ప్రసార మాధ్యమాల ద్వారా ఆనందాన్ని కూడా ఇస్తున్నాయని చెప్పారు విభీషణ శర్మ.
అసలు దేవుళ్లకు ఉత్సవాలు ఎందుకు నిర్వహించేవారన్న ప్రశ్నకు కృష్ణారెడ్డి సమాధానమిచ్చారు.
మానవుడు సంఘజీవి కాబట్టి ఒకరినొకరు కలుసుకోవడానికి, మానవులకు వినోదం, ఉల్లాసం ఆనందం భక్తి బావాలు కలగడానికి, ధర్మం వైపు నడవడానికి ఉత్సవాలు నిర్వహించేవారని కృష్ణారెడ్డి అన్నారు.
''ఆ కాలంలో ఇప్పుడు మాదిరిగా సినిమాలు గాని, టీవీ సౌకర్యాలు గాని పదిమంది కలిసే సందర్భాలు కానీ ఏమీ లేవు. అప్పుడు ఉన్నదంతా పల్లెల్లో తోలుబొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు. బ్రహ్మోత్సవాల వల్ల అనేక మంది ఇక్కడకు వస్తారు. ఒకరినొకరు కలుస్తారు. ఈ వేడుకలను వీక్షిస్తారు" అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













