కర్నూలు ఉల్లి మార్కెట్‌: ఉల్లిపాయల ధర పడిపోయినా, ప్రజలకు ప్రయోజనం ఎందుకు దక్కడం లేదు?

ఉల్లి పాయలు, రైతులు, కర్నూల్ వ్యవసాయ మార్కెట్, ఉల్లి ధరలు
ఫొటో క్యాప్షన్, కర్నూల్ వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి పంటను ఇలా పారబోశారు

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఎటు చూసినా ఉల్లిపాయ రాశులు, మూటలే కనిపిస్తాయి.

వాటిలో చాలా భాగం కుళ్లిపోయినవే.

వాటిని లారీల్లో ఎత్తి చెత్తలో వేస్తోంది మార్కెట్ కమిటీ.

కుళ్లిపోయిన ఉల్లిపాయల మూటల్లోంచి మంచివి ఉంటే ఏరుకుంటున్నారు కొందరు స్థానికులు.

ప్రభుత్వం నుంచి చవగ్గా ఉల్లిని కొన్న కొందరు చిరు వ్యాపారులు, పాడైపోయిన ఉల్లిపాయలను కూలీలతో ఏరించారు.

విశాలమైన ఆ మార్కెట్ యార్డులో ఇప్పటికీ వందల టన్నుల ఉల్లిపాయలు అలా పడి ఉన్నాయి.

మరోవైపు రైతులు ఇప్పటికీ కొత్తగా లారీలు, చిన్న ట్రక్కుల్లో ఉల్లిపాయలు తీసుకువస్తున్నారు .

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కర్నూలు నుంచి కొంత దూరం ప్రయాణించిన తర్వాత రోడ్డుకు ఇరువైపులా కనిపించే పంట చేలల్లో ఇంకా కొన్ని చోట్ల కాపుకొచ్చిన ఉల్లి , మరి కొన్నిచోట్ల ఉల్లిని కోయకుండా పొలంలోనే ఉంచిన దృశ్యాలు, కొన్ని పొలాల్లో గొర్రెలు ఉల్లిని మేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి.

వారం క్రితం వరకూ కర్నూలు పరిసరాల్లో, ఎక్కడ చూసినా రోడ్లపక్కన ఉల్లిపారేస్తున్న వీడియోలు, ఉల్లిపంటను రైతులు దున్నేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

ఉల్లి ధర ఒక దశలో కేజీ అర్థ రూపాయి మాత్రమే పలికింది.

కానీ తెలుగు రాష్ట్రాల్లోని చాలా మార్కెట్లలో ఉల్లిపాయ ధర కనీసం కేజీ రూ.20కి తక్కువ లేదు. మరోవైపు కర్నూలు మార్కెట్లో ఉల్లిపాయలు గుట్టలుగా పేరుకుపోతే వాటిని లారీల్లోకి ఎక్కించి చెత్తకుప్పల్లోకి తరలిస్తున్నారు.

ఉచితంగా ఇచ్చినా ఆ ఉల్లి ఎవరూ తీసుకోవడం లేదు.

అటు రైతు, ఇటు వ్యాపారి సంతోషంగా లేడు, కొనేవారికీ చవగ్గా రావడం లేదు.

ఉల్లి పంట విషయంలో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎందుకు ఏర్పడింది?

ఉల్లి పాయలు, రైతులు, కర్నూల్ వ్యవసాయ మార్కెట్, ఉల్లి ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కర్నూలు ప్రాంతంలో ఈ ఏడాది ఉల్లి దిగుబడి పెరిగింది

పంట పెరిగింది

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ప్రాంతంలో ఉల్లి బాగా పండిస్తారు. అక్కడ కొద్దిగా నీరు ఉన్న పొలాల్లో ఒక రకం, నీరు తక్కువ ఉన్న పొలాల్లో మరో రకం ఉల్లి పండిస్తున్నారు.

ప్రస్తుతం నీటి సౌకర్యం ఉన్న పొలాల నుంచి ఉల్లి మార్కెట్లోకి వచ్చింది.

అయితే ఈసారి పంట భారీ ఎత్తున, ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో కర్నూలు మార్కెట్ కి వచ్చింది.

  • 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ 1 లక్షా 49 వేల 132 క్వింటాళ్ల ఉల్లి కర్నూలు మార్కెట్ కి వచ్చింది.
  • అదే 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు 24 వరకూ 2 లక్షల 3 వేల 618 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది.
  • గతేడాది ఇదే సమయంలో (2024 సెప్టెంబరు)లో కేజీ ఉల్లిపాయ ధర (రైతుకు) అత్యధికంగా 43 రూపాయలకు, సగటున 35 రూపాయలకు చేరుకుంది.
  • 2025 సెప్టెంబరులో అత్యధికంగా 13 రూపాయలకు, సగటున 5 రూపాయలకు వెళ్లింది.
  • ధర పడిపోవడంతో, ప్రభుత్వం రంగంలోకి దిగి రైతులకు మద్దతు ధర ఇచ్చింది. వంద కేజీలు అంటే క్వింటాలుకు 1200, (కేజీకి 12 రూపాయలు) మద్దతు ధర ప్రకటించింది.
  • ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 20 వరకూ ఈ మద్దతుధర పథకం అమలైంది.
  • ఈ స్కీమ్ కింద 1,272 మంది రైతులు తమ సరుకు అమ్మారు.
  • మొత్తం 69 వేల 310 క్వింటాళ్లను ప్రభుత్వం ఈ ధరకు కొన్నది.
  • ఆ తరువాత మద్దతు ధర ఆపేసి తాజాగా ఎకరాకు 20 వేల చొప్పున ఉల్లి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.
ఉల్లి పాయలు, రైతులు, కర్నూల్ వ్యవసాయ మార్కెట్, ఉల్లి ధరలు

ధర పడిపోవడానికి కారణం ఏంటి?

సాధారణంగా ప్రతిసారీ రబీ కంటే ఖరీఫ్ నాటికి అంటే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో దిగుబడి వచ్చే ఉల్లి పంటకు ఎక్కువ ధర ఉంటుంది.

గతేడాది కూడా కేజీ ఉల్లి రైతు దగ్గరే 55 రూపాయలకు వెళ్లిందని ప్రభుత్వ అధికారులే చెప్పారు.

కానీ ఈసారి వర్షాలు నిరంతరం కురవడం వల్ల ఉల్లి ధర పడిపోయింది.

ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

మిగిలిన పంటల్లా కాకుండా అధిక వర్షాలు ఉల్లికి నష్టం చేస్తాయి.

పొలాల్లో నీరు నిలవడం లేదా పంట కోత సమయంలో, కోత తరువాత వర్షాల వల్ల ఉల్లి ఆరడానికి అవకాశం లేకుండా పోయింది.

దీంతో ఎక్కువ మొత్తంలో ఉల్లి పాడవుతోంది.

''దిగుబడి బాగా పెరిగింది. కర్నూలు ప్రాంత ఉల్లి మంచి నాణ్యత ఉండి, బాగా ఆరబెడితే ఎక్కువ రోజులు మన్నుతుంది. కానీ తడిసిన ఉల్లి ఎక్కువ రోజులు నిలవదు. అందుకని వ్యాపారులు దీన్ని కొనడానికి ఇష్టపడరు. దీనికితోడు ఈసారి దిగుబడి కూడా పెరిగింది’’ అని కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జయలక్ష్మి వివరించారు.

‘‘మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. రెండు నెలలకు సరిపడా మహారాష్ట్ర ఉల్లి అందరి దగ్గరా అందుబాటులో ఉంది. మహారాష్ట్ర ఉల్లి పెద్దపాయలు ఉండడమే కాకుండా, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. సాధారణంగా ఈ సీజన్ వచ్చేసరికి మహారాష్ట్ర ఉల్లి స్టాక్ అయిపోయి, కర్నూలు ఉల్లి రావాలి. కానీ వారి స్టాక్ డిసెంబరు వరకూ రావచ్చంటున్నారు. మహారాష్ట్ర ఉల్లి ఆరు నెలలైనా నిల్వ ఉంటుండగా, కర్నూలు ఉల్లి 20 రోజులకు మించి ఉండకపోవడం కూడా ఒక సమస్య'' అంటూ ధర పడిపోవడానికి కారణాలను ఆమె తెలిపారు.

సాధారణంగా కర్నూలు ఉల్లి నాణ్యమైనది వస్తే ఒడిశా, బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ కు ఎగుమతి అవుతుంది.

ఒకవేళ తక్కువ రోజులు నిల్వ ఉండే తరహావి వస్తే ఆంధ్రలోనే ఎక్కువగా అమ్ముతారు.

''ఆగస్టు 25న ఒకేరోజు 35 వేల బస్తాల ఉల్లి కర్నూలు మార్కెట్ కి వచ్చింది. మార్కెట్ సామర్థ్యమే 15-20 వేల బస్తాలు. అప్పటి నుంచి నిరంతరం వస్తూనే ఉంది. పైగా అప్పటి వరకూ కిలో 5 రూపాయల కంటే తక్కువ ధర రైతుకు దక్కుతుండగా, ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుకు కనీసం కిలో 12 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆగస్టు 30నుంచి ఇంకా ఉల్లి రావడం మొదలైంది'' అని జయలక్ష్మి చెప్పారు.

ఉల్లి పాయలు, రైతులు, కర్నూల్ వ్యవసాయ మార్కెట్, ఉల్లి ధరలు
ఫొటో క్యాప్షన్, 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు 24 వరకు 2 లక్షల 3 వేల 618 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది

ఎందుకిలా జరిగింది?

రోజూ వేల టన్నుల కొద్దీ ఉల్లి కర్నూలు మార్కెట్ కి వచ్చి పడింది.

మార్కెట్‌లో ఎవరూ ఉల్లి అడక్కపోవడంతో ప్రభుత్వం దాన్ని రైతు బజార్లకు సరఫరా చేసింది. కొంత పంటను హైదరాబాద్‌కు పంపించారు. అయినా చాలా మిగిలిపోయింది.

కానీ అది నిల్వ ఉండే పరిస్థితి లేదు. దానికి కారణం రైతులు చేసిన తప్పిదం.

మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ప్రభుత్వం ఉల్లి కొంటుండడంతో రైతులు గ్రేడింగ్ చేయకుండానే మార్కెట్ కు తెచ్చారు.

సాధారణంగా రైతులు దెబ్బతిన్న ఉల్లిపాయలను తొలగించి, మంచివాటిని బాగా తడి ఆరిన వాటిని సంచుల్లో నింపుకుని మార్కెట్ కు తెచ్చి వ్యాపారులకు విక్రయిస్తారు.

వాటి నాణ్యతను బట్టి వ్యాపారులు ధర ఇస్తారు.

కానీ రైతు తెచ్చిన సరకు ఎలా ఉన్నా, ప్రభుత్వం తిరస్కరించదన్న ధీమాతో గ్రేడింగ్ చేయకుండా గంపగుత్తగా ఉల్లి సంచుల్లో నింపేసి తెచ్చారు రైతులు.

దాంతో చాలా వరకూ ఉల్లి నిల్వ చేయడానికి వీలు లేకుండా పెద్ద ఎత్తున కుళ్లిపోయింది. ఉల్లిలో ఒక గడ్డ చెడిపోతే చుట్టూ ఉన్నవి కూడా చెడిపోతాయి. రైతులు డబ్బు తీసుకుని మార్కెట్లో ఉల్లి వదిలేసి వెళ్లారు.

చివరకు ప్రభుత్వం ఆ ఉల్లిపాయల్ని తక్కువ ధరకు అమ్మగలిగినంత అమ్మి మిగిలిన వాటిని డంపింగ్ యార్డులో చెత్తలాగా పారేయాల్సి వచ్చింది.

ఓ దశలో ఉల్లి ఉచితంగా ఇస్తున్నారన్న ప్రచారంతో జనం ఎగబడ్డారు.

కానీ ఇప్పుడు అయితే ఎవరూ ఆ ఉల్లిపాయలను తీసుకువెళ్లే పరిస్థితి లేదు.

కర్నూలు ఉల్లిపాయ అసలు తడి లేకుండా సగటున 25 రోజులు మాత్రమే నిల్వ ఉండగలగడం, ఇప్పుడు వచ్చిన స్టాక్ లో తడి ఉండడం వల్ల దూర ప్రాంతాలకు ఎగుమతికి అవకాశం లేకుండా పోయింది.

ఉల్లి పాయలు, రైతులు, కర్నూల్ వ్యవసాయ మార్కెట్, ఉల్లి ధరలు
ఫొటో క్యాప్షన్, వర్షాలు ఆగకుండా కురువడంతో ఉల్లి పాడైంది.

ఒక ఏడాది ధర వస్తే.. అందరూ అదేపంట

సాధారణంగా ఏదైనా పంట ధర పెరగగానే తరువాత సీజన్‌లో రైతులంతా అటు మళ్లడం కనిపిస్తుంది.

ఉల్లి విషయంలో కూడా ఇదే జరిగింది.

గతేడాది ఉల్లికి కిలో 55-60 రూపాయల వరకూ రైతులకు దక్కడంతో ఈసారి భారీ విస్తీర్ణంలో ఉల్లి సాగు చేశారు.

దీంతో ఆ ప్రభావం ధరలపై పడింది.

''ఈ ఏడాది రేటు ఉండేసరికి రైతులందరూ ఒకేసారి ఉల్లి వేశారు. తగ్గింది అనేసరికి మొత్తం అందరూ మానేస్తారు. దాంతో ఆ తరువాతి ఏడాది భయంకరంగా పెరుగుతుంది. దీనికి ఏం మార్గం లేదు. ఒకర్ని చూసి ఒకరు పంట పెట్టి దెబ్బతింటారు. నష్టం వస్తే ఇక దాని జోలికి వెళ్లొద్దు అనుకుంటారు. అప్పుడు మళ్లీ కొరత వచ్చి ధర పెరుగుతుంది. మళ్లీ మామూలే. ఉల్లి మాత్రమే కాదు, చాలా పంటల్లో ఇదే స్థితి'' అని చెప్పారు కోడుమూరుకు చెందిన పెద్ద రైతు కాకర్ల శివారెడ్డి.

మద్దతు ధర కంటే ఎకరాకు 20 వేలు చొప్పున ఇచ్చి ఉంటేనే బావుండేదని కొందరు పెద్ద రైతులు భావిస్తున్నారు.

''రైతు 20 వేల రూపాయల లబ్ధి పొందిన తరువాత మిగిలిన సరకును తమకు నచ్చినట్టు గ్రేడింగ్ చేసి వ్యాపారులకు అమ్ముకునేవారు. ప్రభుత్వం కొనడం వల్ల వ్యాపారులకూ లాభం లేదు.. పంటా పోయింది. గ్రేడింగ్ చేయకపోడం రైతులు చేసిన తప్పు'' అన్నారు శివారెడ్డి.

ఉల్లి పాయలు, రైతులు, కర్నూల్ వ్యవసాయ మార్కెట్, ఉల్లి ధరలు
ఫొటో క్యాప్షన్, కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో మార్కెట్ సిబ్బంది ఉల్లిని చెత్తలో పారబోశారు

రైతులు.. వ్యాపారులు.. ఇద్దరూ సంతోషంగా లేరు

తాజా పరిణామాలతో రైతులు కానీ, వ్యాపారులు కానీ.. ఎవరూ సంతోషంగా లేరు.

తమకు మద్దతు ధర పథకం కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.

ఎకరాకు 20 వేల రూపాయలతో లాభం లేదనేది వారి వాదన.

''మద్దతు ధర 1200 ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ ఆపేశారు. ఇప్పుడు 20 వేలు ఇస్తాం అంటున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. కూలీ ఖర్చులు కూడా రావు. దాని బదులు 1200 ఇచ్చేస్తే సరిపోతుంది. నారు పోసి 40 రోజులు పెంచడానికి, తరువాత ఎరువుల ఖర్చు, మధ్యలో కూలీల ఖర్చు, కోత ఖర్చు, కోసిన సరకు బస్తాల్లో నింపి, రవాణా ఖర్చు.. అవన్నీ పెడితే, ప్రభుత్వం ఇచ్చే 20 వేలు కూలీలకే సరిపోదు'' అని బీబీసీతో చెప్పారు వర్కూరు గ్రామానికి చెందిన రైతు మద్దిలేటి.

ఆయన తన పొలంలో పంటను పీకి, కటింగ్ చేయకుండా ధర కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది రైతులు పంటను వదిలేశారు.

''నాకు తెలిసి చాలా మంది రైతులు దున్నేయడమో, గొర్రెలకు వదిలేయడమో చేస్తున్నారు. గవర్నమెంటు మద్దతు ధర ఇస్తుందనుకున్నాం. మద్దతు ధర పథకం ఇప్పుడు అయిపోయింది కాబట్టి మేం కూడా దున్నేస్తాం లేదా గొర్రెలకు విడిచేస్తాం'' అన్నారు మద్దిలేటి.

''వర్షాలు ఆగితే ఉపయోగం ఉండవచ్చు. ఎండలు లేవు. కనీసం కొద్ది రోజులు వానలు పడకుండా ఆగాలి. కూలీలే నయం. వారికి నికరంగా 500 వస్తుంది. కుటుంబం మొత్తం దీంట్లో పనిచేసినా మాకు అంత డబ్బు రావడం లేదు'' అని అసంతృప్తి వ్యక్తం చేశారు రైతు మద్దిలేటి.

ప్రభుత్వం రూ.20 వేలు ఇచ్చాక మిగిలిన సరకు అమ్ముకోవచ్చుగా అని ప్రశ్నించినప్పుడు, మిగిలిన సరకు అమ్ముకున్నా ఏమీ పెద్దగా రాదని ఆయన అన్నారు.

కిలో రూ.3 నుంచి 5 రూపాయల కంటే ధర రావడం లేదని, అటువంటి సమయంలో పెద్దగా ఉపయోగం ఉండదనేది వారి వాదన.

ఈ వాదనతో ప్రభుత్వం విభేదిస్తోంది.

హార్టికల్చర్ శాఖ లెక్క ప్రకారం, ఎకరాకు సగటు పెట్టుబడి 60 వేలు, సగటు ఉత్పత్తి 80 నుంచి 100 క్వింటాళ్లని అధికారులు చెబుతున్నారు.

ఆ ప్రకారం చూసుకున్నా, ప్రభుత్వం క్వింటాలుకు 1200 చొప్పున ఇచ్చినప్పుడు 80 క్వింటాళ్లకు 96 వేలు రైతుకు దక్కింది కాబట్టి రైతు నష్టపోయే అవకాశం లేదనేది ప్రభుత్వ వాదన.

తాజాగా ఆ పథకం ఆపేసినా, రూ.20వేలతో పాటు పంట బయట అమ్ముకోవచ్చు కాబట్టి లాభమేనని కొందరు అధికారులు అంటున్నారు.

ఉల్లి పాయలు, రైతులు, కర్నూల్ వ్యవసాయ మార్కెట్, ఉల్లి ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పంట విస్తీర్ణం పెరగడం వల్లే ధరలు పడిపోయాయని రైతులు చెబుతున్నారు

వ్యాపారుల మాట కూడా అదే

''అసలు ప్రభుత్వం ఈ 1200 పెట్టి కొనే బదులు ఎకరాకు 20 వేలు ముందుగానే ఇచ్చి ఉంటే బావుండేది. అప్పుడు రైతులు ఆ 20 వేలు తీసుకుని, బాగున్న పంట గ్రేడింగ్ చేసుకుని ప్రైవేటు వ్యాపారులకు అమ్మేవారు. వారు కొంత ధర ఇస్తారు. రెండూ కలసి సరిపోయేవి. రైతుకు కూడా మంచి రేటు వస్తుంది. మా దగ్గరకు వచ్చిన మంచి పాయలకు మేం 10 రూపాయల రేటు (1200 క్వింటాలుకు) కూడా ఇచ్చాం'' అని బీబీసీతో చెప్పారు కర్నూలు మార్కెట్ కమిటీలో ఉల్లి వ్యాపారి వెంకటేశ్వర్లు.

''మేం ఏ రాష్ట్రానికి పంపించినా కర్నూలు సరుకు అంటే దించుకోవడం లేదు. రైతులతో పాటు వ్యాపారులూ నష్టపోయారు. చాలా సరుకు దెబ్బతింది. దీనికితోడు చేనులో వర్షం పడకుండా నీటుగా కోస్తే ఉల్లిపాయ బావుంటుంది. కొంచెం పాడైన పాయలు ఒకట్రెండు ఉన్నా చాలా దెబ్బతింటుంది. రవాణాలో ఇంకా దెబ్బతింటాయి. ఇక ప్రభుత్వం కొంటోందని వ్యాపారులు కొనడం తగ్గించేశారు. వ్యాపారులు కూడా స్టాక్ పెట్టలేదు'' అని బీబీసీతో అన్నారు వెంకటేశ్వర్లు.

కొందరు చిరు వ్యాపారులు ఈ మార్కెట్లో ఉల్లి టోకున కొని అందులో మంచి పాయలు కూలీల చేత ఏరించి స్థానికంగా అమ్మే ప్రయత్నం చేశారు.

కానీ తమకు నష్టం వచ్చిందని చెప్పారు.

''మహారాష్ట్ర గడ్డ పొడిగా నిల్వ ఉంటుంది. దీంతో కర్నూలు గడ్డ నిలబడదని తీసుకోవడం లేదు. మేం రైతు దగ్గర నుంచి కొన్న తరువాత హమాలీ కూలీ ఖర్చు, గ్రేడింగ్, తూకం, లారీ రవాణా, మార్కెట్ పన్నులు వంటి ఖర్చులు ఉంటాయి. వ్యాపారులూ నష్టపోయారు'' అని చెప్పారు వెంకటేశ్వర్లు.

మొత్తంగా రైతు పంట ఎక్కువ పండించినా, వర్షాల వల్ల, ఎక్కువ నిల్వ ఉండే సామర్థ్యం లేకపోవడం వల్ల, ఉన్న కొంచెం మొత్తమైనా నాణ్యమైన సరకు గ్రేడింగ్ చేయకపోవడం వల్ల, అంతిమంగా వినియోగదారుడికి చేరే సరికి అన్ని ఖర్చులూ కలసి ధర పెరుగుతుంది. టన్నుల ఉల్లిపాయలు చెత్తలో చేరుతున్నాయి.

''మళ్లీ వర్షాలు తగ్గి కాస్త పొడి అంటే.. డ్రై అయిన సరకు వస్తే ధర పెరిగే అవకాశం ఉంది'' అని చెప్పారు ఏఎంసీ కార్యదర్శి జయలక్ష్మి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)