'ఇడ్లీ కొట్టు' రివ్యూ: ధనుష్, నిత్యా మేనన్ జంటగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?

ఇడ్లీ కొట్టు, ధనుష్, నిత్యా మేనన్

ఫొటో సోర్స్, X/dhanushkraja

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం

శంకరాపురంలో శివ‌కేశ‌వ (రాజ్‌కిర‌ణ్‌) ఇడ్లీ హోట‌ల్ న‌డుపుతుంటాడు.

చిన్న‌పాక‌లో ఉన్న హోట‌లంటే ఆయ‌న‌కి ప్రాణం.

తెల్లారి 3 గంట‌ల‌కి లేచి స్వ‌యంగా పిండి రుబ్బి ఇడ్లీలు చేసి త‌న ప‌ల్లె ప్ర‌జ‌ల‌కి వ‌డ్డిస్తేనే తృప్తి.

ఆయ‌న కొడుకు ముర‌ళికి (ధ‌నుష్‌) ఈ హోట‌ల్ వ్యాపారాన్ని విస్త‌రించాల‌ని కోరిక‌.

అయితే, ఉన్న ఊరు వదిలి రావ‌డానికి తండ్రి ఒప్పుకోడు.

జీవితంలో ఎద‌గాల‌నే కోరిక‌తో హీరో బ్యాంకాక్ వెళ్లి అక్క‌డ హోట‌ల్ వ్యాపారంలో స‌త్య‌రాజ్‌కి కుడి భుజంగా నిలుస్తాడు.

అత‌ని కూతురు షాలిని హీరోని ఇష్ట‌ప‌డుతుంది.

సైకో ల‌క్ష‌ణాల‌తో ఉన్న ఆమె అన్న అరుణ్‌విజ‌య్‌కి ఈ పెళ్లి ఇష్ట‌ముండ‌దు.

పెళ్లి ఏర్పాట్లు జ‌రుగుతూ ఉండ‌గా.. ప‌ల్లె నుంచి హీరోకి ఫోన్ వ‌స్తుంది.

బ్యాంకాక్ నుంచి ప‌ల్లెకి వ‌చ్చిన హీరోకి తండ్రి జ్ఞాప‌కాలు వెంటాడుతాయి.

ఒక‌వైపు పెళ్లి, మరోవైపు తండ్రి, ఎంతో ప్రేమించిన ప‌ల్లెటూరి ఇడ్లీకొట్టు... ఈ సమయంలో హీరో ఏం చేశాడ‌నేది మిగ‌తా క‌థ‌.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎక్క‌డో ఉన్న హీరో, త‌న మూలాల‌ని వెతుక్కుంటూ.. ప‌ల్లెకి వెళ్ల‌డం చాలా సినిమాల్లో చూసేశాం.

ఇడ్లీ కొట్టు కొత్త పాయింట్‌. దీని చుట్టూ బ‌ల‌మైన ఎమోష‌న్‌ని, క్యారెక్ట‌ర్ల‌ని సృష్టించి ఉంటే ఇది చాలా అద్భుత‌మైన లైన్‌, మంచి సినిమా అయి ఉండేది.

అయితే, ఈ సినిమాకి ర‌చ‌న కూడా చేశారు ధ‌నుష్‌.

రైటింగ్ బ‌ల‌హీనంగా ఉండే స‌రికి సంగీతం, ఫొటోగ్ర‌ఫీ, ప‌ల్లెటూరి నేప‌థ్యం ఇవ‌న్నీ వేస్ట్‌గా మిగిలిపోయాయి.

హీరోలే డైరెక్ట‌ర్ల‌యితే స‌మ‌స్య ఏమంటే.. ఎంతసేపూ త‌న క్యారెక్ట‌ర్‌ని, ఎలివేష‌న్‌ని చేసుకుంటారు త‌ప్ప‌, చుట్టూ ఉన్న మిగ‌తా క్యారెక్ట‌ర్ల‌కి స‌రిపోయే స‌న్నివేశాలు, ఎమోష‌న్స్ మ‌రిచిపోతారు.

ఈ మిస్టేక్ వ‌ల్ల స‌త్య‌రాజ్‌, నిత్యా మేన‌న్ లాంటి గొప్ప న‌టులు కూడా వృథా అయిపోయారు.

న‌టించే అవ‌కాశం లేన‌ప్పుడు, రొటీన్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో లాగించారు.

స‌ముద్ర‌ ఖ‌నికి అంతోఇంతో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది కానీ, ఆ ర‌కం ప‌ల్లెటూరి విల‌న్ల‌ని సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచి చూస్తూనే ఉన్నాం.

ఇడ్లీ కొట్టు, ధనుష్, నిత్యా మేనన్

ఫొటో సోర్స్, X/dhanushkraja

ఎమోష‌న్ ఇడ్లీ కొట్టులో లేదు, తండ్రి ఇష్ట‌ప‌డే ఆ ఊరి జ‌నంలో ఉంది.

ఇది మ‌ర్చిపోయి తండ్రి పిండి రుబ్బ‌డం, ఇడ్లీలు వేయ‌డం ఈ సీన్స్ రిపీటెడ్‌గా వ‌స్తే ప్ర‌యోజ‌నం ఉంటుందా?

మొద‌టి అర‌గంట మంచి సినిమా చూస్తున్నామ‌న్న ఫీలింగ్ నుంచి తొంద‌ర‌గానే బ‌య‌ట‌ప‌డి, ఇది ఇంకో రొడ్డ‌కొట్టుడు, యాక్ష‌న్ రివేంజ్ టైప్ అని అర్థ‌మ‌య్యేస‌రికి సినిమా ఎప్పుడైపోతుందా? అని ఎగ్జిట్ వైపు చూస్తుంటాం.

దీనికి ప్ర‌ధాన కార‌ణం ధనుష్‌. ఆయ‌న మంచి న‌టుడు, కానీ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంలోకి అన‌వ‌స‌రంగా వేలుపెట్టి దెబ్బ‌తింటున్నాడు.

సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఎక్క‌డో దారిత‌ప్పాం అని.

ఇడ్లీకొట్టు మ‌ళ్లీ తెరిచి, ఇడ్లీ ఎలా రుబ్బాలి, ఎలా చేయాల‌నే సీన్స్ వ‌రుస‌గా ప‌డిన‌ప్పుడే క‌థ దారిత‌ప్పింది.

దీనికి తోడు కాంతారాలోలాగా హీరో తండ్రి గ‌జ్జ‌లు క‌ట్టుకుని ఆత్మరూపంలో వ‌చ్చి భ‌య‌పెడ‌తాడు.

ఇడ్లీ మీద ప్రేమ ఉంటే తినండి. అంతేకానీ, ఇడ్లీ సినిమాలు తీసి ప్రేక్ష‌కుల్ని చ‌ట్నీ చేయ‌కండి.

ఇడ్లీ కొట్టు, ధనుష్, నిత్యా మేనన్

ఫొటో సోర్స్, X/dhanushkraja

ప్లస్ పాయింట్స్‌

1.కెమెరా

మైన‌స్ పాయింట్

1.బ‌ల‌హీన‌మైన రొటీన్ క‌థ‌నం

2.ఎమోష‌న్స్ పండ‌క‌పోవ‌డం

3.పాట‌లు

గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)