కాఫీ తాగడం తగ్గిస్తే.. కలలు కంటూ హాయిగా నిద్రపోవచ్చా? దీని వెనకున్న సైన్స్ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చార్లోట్ గుప్తా, కారిసా గార్డినర్
కెఫీన్ తీసుకోవడం తగ్గించిన తర్వాత కలలు చాలా స్పష్టంగా ఉంటున్నాయా..? నిద్రలేచిన తర్వాత కూడా అవి ఎక్కువసేపు గుర్తుండిపోతున్నాయా?
కెఫీన్ తీసుకోవడం తగ్గిస్తే అనేక లాభాలు కలిగే అవకాశం ఉంది. పళ్లు తెల్లగా మారడం, టాయిలెట్‌కు పదేపదే వెళ్లాల్సిన అవసరం తగ్గడం వంటివి. మనం తరచుగా వినే మరో విషయం కెఫీన్ తగ్గించడం వల్ల కలలు స్పష్టంగా ఉంటున్నాయని. అయితే, కొన్నిసార్లు భయంకరమైన కలలు కూడా వస్తుంటాయి.
కెఫీన్ తీసుకోవడం తగ్గించిన కొన్ని రోజుల్లోనే విచిత్రంగా, ప్రత్యేకమైన ప్రభావం కనిపిస్తుందని చాలామంది చెబుతున్నారు.
దీని వెనక ఏదైనా సైన్స్ ఉందా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, Getty Images
నిద్రపై కెఫీన్ ప్రభావం..
కెఫీన్ మనల్ని అప్రమత్తంగా ఉంచే ఒక ప్రేరకం. మన మెదడులో అడెనోసిన్ అనే రసాయనాన్ని బ్లాక్ చేయడం ద్వారా అది పనిచేస్తుంది.
పగలు మనం మేలుకుని ఉన్నప్పుడు, యాక్టివ్‌గా ఉన్నప్పుడు అడెనోసిన్ పెరుగుతుంటుంది. సాయంత్రం అయ్యేసరికి అది మనకు నిద్ర వస్తున్న భావన కలిగిస్తుంది. మనం నిద్రపోయేటప్పుడు అడెనోసిన్ మొత్తం ఖర్చయిపోతుంది. మనం ఫ్రెష్‌గా నిద్రలేస్తాం. మళ్లీ అడెనోసిన్ ఉత్పత్తి చేసేందుకు శరీరం సిద్ధంగా ఉంటుంది.
కెఫీన్‌ను తగ్గించడానికి, స్పష్టమైన కలలకు నేరుగా సంబంధం ఉండదు. అయితే, వాటి మధ్య పరోక్షంగా సంబంధం ఉంటుంది.
మనం కెఫీన్ తీసుకున్నప్పుడు అది అడెనోసిన్ సంకేతాన్ని బ్లాక్ చేస్తుంది. దీంతో మనకు నిద్రపోవాలనిపించదు. కెఫీన్ ప్రభావం తగ్గిపోయేకొద్దీ ఒక్కసారిగా నిద్రకు ఉపక్రమించాలని అనిపిస్తుంటుంది.
మనం తీసుకున్న కెఫీన్ ప్రభావం 3 నుంచి 6 గంటలపాటు ఉంటుంది. మనం తీసుకున్న కెఫీన్‌లో సగ భాగం ఆ సమయం తర్వాత కూడా మన శరీరంలో ఉంటుంది. అడెనోసిన్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే, మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో కెఫీన్ తీసుకునేవాళ్లలో చాలామంది రాత్రిపూట నిద్రపోవడానికి కష్టపడుతుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
కెఫీన్‌తో నిద్రలేమి
అడెనోసిన్‌కు అంతరాయం కలిగించడం ద్వారా కెఫీన్ నిద్రకు భంగం కలిగిస్తుంది. అలాగే, మనం నిద్రపోయే మొత్తం సమయాన్ని కూడా తగ్గిస్తుంది. మన గాఢనిద్రపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కెఫీన్‌ను మనం సాయంత్రం, రాత్రి వేళల్లో ఎక్కువగా తీసుకుంటే నిద్ర విషయంలో నష్టం జరుగుతుందని పరిశోధన స్పష్టంగా తెలియజేసింది.
కెఫీన్ తగ్గించడం మన కలలను స్పష్టంగా గుర్తుంచుకునేలా చేస్తుందనే దానిపై నేరుగా చేసిన పరిశోధనలు ఎక్కువగా లేవు.
మన కలల్లో ఏం జరుగుతుందనే దానిపైకన్నా.. కెఫీన్ నిద్రపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ఎక్కువ అధ్యయనాలు దృష్టిపెట్టాయి.
అలాగని, దీనిపై అసలు పరిశోధనలే లేవని కాదు. మంచినిద్రకు, కలలకు సంబంధం ఉందన్న విషయం మనకు తెలుసు.

ఫొటో సోర్స్, Getty Images
కెఫీన్‌కు, కలలకు సంబంధముందా?
దీనికి స్పష్టమైన ఆధారం లేకపోయినప్పటికీ.. కెఫీన్ తగ్గించుకున్న కొన్నిరోజుల్లోనే తమ కలలు మరింత స్పష్టంగా గుర్తుండడం మొదలైందని చెబుతుంటారు.
కెఫీన్ తగ్గించడం కలల స్పష్టతను నేరుగా కారణం కాదు. కానీ, ఈ రెండింటికీ సంబంధం ఉంది. కెఫీన్ నిద్ర సమయాన్ని తగ్గిస్తుంది. రాత్రిపూట పదేపదే మేల్కొనడానికి కారణమవుతుంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో తీసుకుంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కెఫీన్ తగ్గించడం వల్ల శరీరం తిరిగి శక్తి పుంజుకుంటుంది. మనం ఎక్కువ నిద్రపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా నిద్ర పోయినప్పుడు, రాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్ఈఎం) నిద్ర దశ పెరుగుతుంది. ఆర్ఈఎం నిద్ర దశ ఎక్కువగా ఉన్నప్పుడు స్పష్టమైన కలలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
కలలు స్పష్టంగా ఉండడమంటే ఏంటి?
నిజంగా జరుగుతున్నాయా అనే భావన కల్పించే కలలను స్పష్టమైన కలలు అంటాం. ఆ కలల్లో అన్ని విషయాలూ అర్థమవుతుంటాయి. బలమైన దృశ్యాలు, భావోద్వేగాలుంటాయి. అందుకే కొన్నిసార్లు నిద్రలేచిన చాలా గంటల తర్వాత కూడా అన్నీ స్పష్టంగా గుర్తుంటాయి.
ఆర్ఈఎం అనేది మన శరీరం సంపూర్తిగా విశ్రాంతి తీసుకునే దశ. అయితే, ఈ సమయంలో మెదడు మాత్రం చాలా చురుగ్గా పనిచేస్తుంటుంది. ఇలాంటి నిద్రకు, కలలకు సంబంధముంది. ఎక్కువ ఆర్ఈఎం నిద్ర కలిగిన వారి మెదడు మరింత స్పష్టమైన కలలకు కారణమవుతుంది.
ఆర్ఈఎం నిద్రపోయేటప్పుడు, రాత్రి వేళల్లో మనం నిద్రలేచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో మేల్కొన్నప్పుడు కలలను గుర్తుపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి మన జ్ఞాపకాల్లో తాజాగా ఉంటాయి.
అంటే కెఫీన్‌ను తగ్గించుకోవడం ద్వారా, మనం మరింత ఆర్ఈఎం నిద్రపోగలగడం.. కలలు కనడానికి, వాటిని గుర్తుంచుకోవడానికి మరింత అవకాశం లభిస్తుంది.
నిద్ర క్లిష్టమైన విషయం. కలలకు, నిద్రకు సంబంధముంది. కెఫీన్ తగ్గంచిన వెంటనే ప్రతి ఒక్కరికీ కలల్లో స్పష్టత రాదు. కొన్నిరోజులు, వారాలు తర్వాతే ప్రభావం కనిపిస్తుంది.
కెఫీన్‌ను తగ్గించడానికి, కలల స్పష్టతకు సంబంధముందన్న విషయంపై కచ్చితమైన ఆధారాలు లేవు. కెఫీన్ మన నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్ర మన కలలపై ప్రభావం చూపుతుంది. మనం తక్కువ కెఫీన్ తీసుకుంటే, ఆర్ఈఎం నిద్రలో ఎక్కువసేపు ఉండే అవకాశం మన మెదడుకు కలుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
కెఫీన్‌తో ప్రయోజనాలేంటి?
కెఫీన్ అనగానే మనం కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ అనుకుంటాం. అయితే కెఫీన్ ఫిజీ డ్రింక్స్, చాకొలేట్స్, టీ, వర్కవుట్‌కు ముందు తీసుకునే సప్లిమెంట్స్, మందుల్లో కూడా ఉంటుంది.
కెఫీన్‌తో చాలా లాభాలున్నాయి. మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, కాఫీ తాగేవారికి డిప్రెషన్ ప్రమాదం తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
అలాగే కెఫీన్‌తో పార్కిన్సన్ వంటి నాడీ సంబంధిత రోగాల ప్రమాదాలు తగ్గుతాయి. కాఫీలో బి విటమిన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో ఇది భాగం.
షిఫ్టుల్లో పనిచేసే వారికి, ప్రత్యేకించీ రాత్రివేళల్లో పనిచేసే వారికి అలసటను తగ్గించడానికి కెఫీన్ పనికొస్తుంది. అలాగే చాలా మంది, షిఫ్టులతో పనిచేయాల్సిన అవసరం లేకపోయినా ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగకుండా రోజువారీ పనులు మొదలుపెట్టలేరు.
కెఫీన్‌ను పూర్తిగా తగ్గించలేకపోయినా, నిద్ర విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కెఫీన్ తీసుకునేటప్పుడు సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
నిద్రపోవడానికి కనీసం 8 గంటల ముందు కెఫీన్ తీసుకోవడం ఆపేయాలి. 12 గంటలు ముందు ఎక్కువ స్థాయిలో కెఫీన్ తీసుకోకూడదు. అప్పుడు మంచి నిద్రతో వచ్చే కలలు మనల్ని ఆశ్చర్యానుభూతి కలిగిస్తాయి.
చార్లోట్ గుప్తా ఆస్ట్రేలియాలోని సీక్యూ యూనివర్సిటీలో స్లీప్ రీసర్చర్. కారిసా గార్డినర్ ఆస్ట్రేలియా క్యాథలిక్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెలో.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














