90 లక్షల ఏళ్లనాటి రహస్యం: బంగాళాదుంపకు తల్లి టమోటాయేనా?

టమోటా, బంగాళదుంప, ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టమోటా లేకుంటే బంగాళాదుంప ఉండేది కాదని నిపుణులు విశ్వసిస్తారు.

దాదాపు 90 లక్షల ఏళ్ల కిందట దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాలు పెరుగుతూ ఉన్నాయి.

అప్పట్లో మానవుల ఉనికి లేదు. కానీ, రెండు రకాల మొక్కలు పక్కపక్కనే పెరుగుతున్నాయి.

ఈ మొక్కల్లో ఒకటి సోలెనమ్ లైకోపెర్సికమ్ (టమోటా), ఇంకోటి సోలెనమ్ ఎట్యూబెరోసమ్ అని లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియానికి చెందిన వృక్ష శాస్త్ర నిపుణురాలు డాక్టర్ సాండ్రా నాప్ చెప్పారు.

వీటికి చెందిన మూడు జాతులు ఇప్పటికీ చిలీ, హువాన్ పెర్నాండేజ్ దీవుల్లో కనిపిస్తాయని ఆమె తెలిపారు.

ఈ రెండు మొక్కల పేర్లను పరిశీలిస్తే, ఈ రెండు మొక్కలకూ పరస్పర సంబంధం ఉందని, ఇవి రెండూ పరస్పర సంకరం చెందినట్లు అర్థం అవుతుంది.

''ఈ సంకరం వల్ల జన్యువుల్లో మార్పు జరిగి ఒక కొత్త జాతి ఆవిర్భవించింది. ఈ కొత్త జాతి ఆండీస్ పర్వతాల్లోని చలి, పొడి వాతావరణాన్ని తట్టుకోగలిగింది'' అని డాక్టర్ సాండ్రా చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సోలెనమ్ లైకోపెర్సికమ్ (టమోటా), ఇంకోటి సోలెనమ్ ఎట్యూబెరోసమ్, టమోటా, బంగాళదుంప, ఆహారం

ఫొటో సోర్స్, LOC/Biodiversity Heritage Library

ఫొటో క్యాప్షన్, సోలెనమ్ లైకోపెర్సికమ్ (ఎడమ), సోలెనమ్ ఎట్యూబెరోసమ్ (కుడి)‌లు సంకరం చెందడంతో బంగాళాదుంప ఆవిర్భవించింది.

మొక్కల్లోనూ సంకరణం జరుగుతుందా?

నిపుణులు దీన్ని 'ఇంటర్‌స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్' అని పిలుస్తారు. ఇలా తరచుగా జరుగుతుంది. అయితే, కొన్నిసార్లు దీని ఫలితాలు అంతగా బాగుండవు.

ఉదాహరణకు ఒక ఆడ గుర్రం, గాడిద కలయికతో కంచర గాడిద జన్మిస్తుంది.

ఇది ఒక విజయవంతమైన హైబ్రిడైజేషన్ (సంకరణం). కానీ దీనికి పునరుత్పత్తి సామర్థ్యం ఉండదు.

''మొక్కల ప్రపంచంలో కూడా సంకరణం జరుగుతుంది. అందుకే మనకు తోటలో చాలా కొత్త మొక్కలు కనిపిస్తుంటాయి'' అని సాండ్రా వివరించారు

టమోటా, బంగాళదుంప, ఆహారం

ఫొటో సోర్స్, Thompson & Morgan

ఫొటో క్యాప్షన్, టామ్‌టైటో మొక్క. దీన్ని హార్టికల్చరల్ ఫార్మ్ థామ్సన్ అండ్ మోర్గాన్ బృందం తయారు చేసింది

బంగాళాదుంప విషయంలో ఏం జరిగిందంటే..

సంకరణం అనేది సహజంగా లేదా మానవ జోక్యంతో జరగవచ్చు. దీనివల్ల తల్లిదండ్రుల మొక్కల లక్షణాలు కలిగిన మొక్కలు ఉత్పన్నమవుతాయి.

''కొన్నిసార్లు అలాంటి మొక్కలకు పునరుత్పత్తి సామర్థ్యం ఉండదు. కాబట్టి కొత్త రకం మొక్కలు పుట్టవు'' అని సాండ్రా చెప్పారు.

కానీ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, సంకరణం ఫలితాలు ఊహించిన దానికంటే ఎక్కువగా రావొచ్చు.

బంగాళాదుంప విషయంలో ఇదే జరిగింది. లక్షల ఏళ్ల క్రితం, సోలెనెసీ కుటుంబానికి చెందిన రెండు జాతుల కలయికతో బంగాళాదుంప ఆవిర్భవించింది.

''మనం దాదాపు ప్రతిరోజూ ఉపయోగించే, మనకు చాలా ముఖ్యమైన బంగాళాదుంప మూలం ఇంత పురాతనమైనది, అసాధారణమైనది కావడం చాలా ఆసక్తికరం'' అని సాండ్రా అన్నారు.

బంగాళాదుంప తల్లి టమోటా, తండ్రి ఎట్యుబెరోసమ్ అని చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ప్రొఫెసర్ సాన్‌వెన్ హువాంగ్ చెప్పారు.

బంగాళాదుంప మూలాలపై జరిగిన ఇంటర్నేషనల్ స్టడీకి ప్రొఫెసర్ సానెవెన్ నాయకత్వం వహించారు. ఈ అధ్యయనం జూలైలో సెల్ జర్నల్‌లో ప్రచురితమైంది.

టమోటా, బంగాళదుంప, ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగాళాదుంప మొక్కకు కాసే పండ్లు, చిన్న టమోటాల్లా కనిపిస్తాయి

రహస్యం బహిర్గతం

గట్టిగా, పిండి పదార్థాలతో నిండిన బంగాళాదుంప ఏ రకంగానూ ఎర్రటి, రసవంతమైన టమోటా లాగా కనిపించదు.

కానీ, ఈ రెండూ చాలా సారుప్యంగా ఉంటాయని ఈ అధ్యయనంలో భాగమైన డాక్టర్ సాండ్రా నాప్ అన్నారు.

సాండ్రా చెప్పినదాని ప్రకారం.. బంగాళాదుంప, టమోటా మొక్కల ఆకులు, పువ్వులకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. బంగాళాదుంప మొక్కకు కాసే పండు ఒక చిన్న ఆకుపచ్చ టమోటా లాగా కనిపిస్తుంది.

''బంగాళాదుంప, టమోటా, ఎట్యూబెరోసమ్‌ మొక్కలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయని మనకు చాలా కాలం క్రితమే తెలుసు. అయితే, బంగాళాదుంపకు వీటిలో దేనితో దగ్గరి సంబంధం ఉందో కచ్చితంగా తెలియదు. ఎందుకంటే వివిధ జన్యువులు మనకు వేర్వేరు కథలను చెబుతాయి'' అని సాండ్రా వివరించారు.

బంగాళాదుంప మూలం రహస్యాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నించారు. కానీ, బంగాళాదుంప 'జెనెటిక్స్' చాలా ప్రత్యేకం కావడంతో వారికి కష్టాలు తప్పలేదు.

ఆహారం, టమోటా, బంగాళదుంప, అధ్యయనం

ఫొటో సోర్స్, BBC/Natural History Museum

మానవులతో సహా చాలా జాతుల్లో ప్రతి కణంలోనూ క్రోమోజోమ్‌ల రెండు కాపీలు ఉంటాయి. కానీ, బంగాళాదుంపలో అవి నాలుగు ఉంటాయి.

పరిశోధన బృందం, ఈ వైరుధ్యాన్ని పరిష్కరించడానికి బంగాళాదుంప, టమోటా, ఎట్యూబెరోసమ్‌ సహా డజన్ల కొద్దీ జాతుల 120 కంటే ఎక్కువ జీనోమ్‌లను విశ్లేషించింది.

బంగాళాదుంప జన్యువులను జీనోమ్ సీక్వెన్స్ చేయగా అందులో టమోటా-ఎట్యూబెరోసమ్‌తో బంగాళాదుంపకు విస్తృతంగా సారూప్యతలు ఉన్నట్లు తేలింది.

బంగాళాదుంపకు ఈ రెండింటితో సంబంధం ఉన్నట్లు గుర్తించారని డాక్టర్ సాండ్రా చెప్పారు.

పరిశోధకులు ఈ విధంగా లక్షల ఏళ్ల క్రితం దక్షిణ అమెరికాలోని పర్వతాల వద్ద అభివృద్ధి చెందిన బంగాళాదుంప, టమోటా మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొన్నారు.

''ఇది ఒక విజయవంతమైన కలయిక. ఎందుకంటే ఇది కొత్త జన్యు కలయికలను సృష్టించింది. ఆండీస్‌లో ఈ కొత్త వంశం వృద్ధి చెందడానికి సహాయపడింది'' అని డాక్టర్ సాండ్రా చెప్పారు.

నేలలో పెరిగే బంగాళాదుంప మొక్కకు దాని తల్లిదండ్రులతో సంబంధం ఉంటుంది. అయితే, దాని తల్లిదండ్రుల్లో లేని మరొక విషయం కూడా బంగాళాదుంపలో ఉంది.

నేలలో పెరిగే ఈ ఆలూలో ట్యూబర్ అంటే దుంప ఉంటుంది.

'జెనెటిక్ లాటరీ'

జెనెటిక్ లాటరీ ఫలితంగా ఇలా దుంపతో కూడిన ఆలూ మొక్క ఉద్భవించిందని శాస్త్రవేత్తలు నమ్ముతారు. దాని తల్లిదండ్రుల మొక్కల్లోని ఒక ముఖ్యమైన జన్యువు కారణంగా ఈ దుంపలు ఏర్పడినట్లు చెబుతున్నారు.

ఈ తల్లిదండ్రుల మొక్కలు కలిసినప్పుడు నేలలో ఉన్న కాండాలు రుచికరమైన దుంపలుగా మారే ప్రక్రియ ప్రారంభమైంది.

సోలెనమ్ లైకోపెర్సికమ్ (టమోటా), ఇంకోటి సోలెనమ్ ఎట్యూబెరోసమ్, టమోటా, బంగాళదుంప, ఆహారం

ఫొటో సోర్స్, Shenzhen Institute of Agricultural Genomics, Chinese Academy of Agricultural Sciences

ఫొటో క్యాప్షన్, సోలెనమ్ లైకోపెర్సికమ్ (టమోటా), ఇంకోటి సోలెనమ్ ఎట్యూబెరోసమ్

విత్తనాల నుంచి బంగాళదుంపలు పండించాలని ఎందుకు అనుకుంటున్నారు?

విత్తనాలు లేకుండా పెరిగే ఈ సామర్థ్యం బంగాళాదుంపలకు హానికరం కూడా.

''వీటిని పెంచడానికి మీరు బంగాళాదుంప మొక్కకు చెందిన చిన్న చిన్న ముక్కలను నాటుతారు. అంటే, మీ వద్ద ఒకే రకమైన బంగాళాదుంప పొలం ఉన్నట్లు. ఒక రకంగా ఇది క్లోన్ అవుతుంది'' అని డాక్టర్ సాండ్రా తెలిపారు.

జన్యుపరంగా ఒకేలా ఉండటం వల్ల, బంగాళాదుంపల ఏ రకానికైనా కొత్త వ్యాధి నుంచి రక్షించుకునే సామర్థ్యం ఉండదు.

అందుకే విత్తనాల నుంచి పెంచగలిగే, జన్యు మార్పులు సాధ్యమయ్యే బంగాళ దుంపలను తయారు చేయాలని చైనీస్ బృందం భావిస్తోందని డాక్టర్ సాండ్రా చెప్పారు.

అడవి జాతుల నుంచి జన్యువులను తీసుకొచ్చి, పర్యావరణ సవాళ్లను బాగా ఎదుర్కోగలిగే రకాలను తయారు చేయవచ్చని ఆ బృందం భావిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)