పురుషుల కంటే మహిళలకు ఎక్కువ చలిగా అనిపిస్తుంది, ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇంట్లో, లేదా ఆఫీసుల్లో మీరో విషయం గమనించే ఉంటారు. ఏసీ టెంపరేచర్ విషయంలో పురుషులకు, మహిళలకు వాదన జరుగుతుంటుంది.
మాకు ఏసీ సరిపోవడం లేదు, కాస్త ఏసీ చల్లదనం పెంచమని పురుషులు అడిగితే.. మహిళలు మాత్రం చలి ఎక్కువగా ఉంది, తగ్గించాల్సిందేనని పట్టుబడుతుంటారు.
ఇలా ఎందుకు అవుతుంటుంది? పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా చలేస్తుందా?
చలిని తట్టుకునే సామర్థ్యం మహిళల్లో తక్కువగా ఉంటుందా? లేదంటే అది కేవలం మహిళల భావన మాత్రమేనా? లేక, నిజంగాగా అలా జరుగుతుందా?

మహిళలు ఎక్కువగా చలిని ఫీల్ కావడంపై పరిశోధకులు అధ్యయనం చేశారు.
'సైన్స్‌డైరెక్ట్', నేచర్ వంటి ప్రముఖ సైన్స్ జర్నల్స్ లో ప్రచురితమైన నివేదికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ చలిగా ఉన్నట్లు భావిస్తారని వెల్లడైంది.
ఆ అధ్యయనంలో మగవారితో పోలిస్తే మహిళలు 2.5 సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, అంటే 24 నుంచి 25 సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో సౌకర్యవంతంగా ఉంటారని నేచర్.కామ్‌లో ఓ నివేదిక ప్రచురితమైంది.

ఫొటో సోర్స్, Getty Images
మెటబాలిక్ రేటు కారణమా?
పురుషులతో పోలిస్తే మహిళల్లో సగటు మెటబాలిక్ రేటు తక్కువగా ఉంటుందని, దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గుతుందని ది కన్జర్వేషన్ ఒక రిపోర్ట్‌లో పేర్కొంది.
ఈ కారణంతో బయటి ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు, మహిళలకు ఎక్కువ చలిగా అనిపిస్తుందని ‘ది కన్జర్వేషన్’ పేర్కొంది.
పురుషులకు మెటబాలిక్ రేటు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే వారికి అసౌకర్యంగా అనిపిస్తుందని, వేడి ఎక్కువగా ఉన్నట్లు భావిస్తుంటారని సైన్స్ డైరెక్ట్ డాట్ కామ్ తెలిపింది.
ఇంగ్లండ్‌లోని వార్‌విక్ మెడికల్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ పాల్ థార్నోల్లీ చెప్పిన వివరాల ప్రకారం.. మహిళలు, పురుషుల్లోని సగటు మెటబాలిక్ రేటు, శరీరం ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రతల్లో మార్పులు.. వాతావరణంలో తేడాలను తట్టుకునే స్రీ, పురుషుల సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు మెటబాలిక్ రేటు అంటే ఏంటి?
మెటబాలిక్ రేటు అనేది ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో మీ శరీరం ఖర్చు చేసే మొత్తం ఎనర్జీ.
అలాగే, విశ్రాంతి సమయంలో మన శరీరం ప్రాథమిక కర్తవ్యాలను నిర్వహించేందుకు ఎంత కేలరీలను కరిగించుకుంటుందో తెలియజేసే దాన్ని బాసల్ మెటబాలిక్ రేటు (బీఎంఆర్) అంటారని అపోలో ఆస్పత్రుల విజిటింగ్ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సుజీత్ కుమార్ చెప్పారు.
శరీర శక్తి అవసరాలకు, పోషణకు, బరువు నిర్వహణకు ఇది చాలా కీలకమైనదన్నారు.
ఒక వ్యక్తి మెటబాలిక్ రేటు చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. జన్యువులు, జీవక్రియ, జీవనశైలి దీన్ని ప్రభావితం చేస్తుంటాయి.
వ్యాయామం వంటివి చేసేటప్పటితో పోలిస్తే విశ్రాంతి సమయంలో బీఎంఆర్ తక్కువగా ఉంటుంది.
విశ్రాంతి సమయంలో గుండె, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలక అవయాలు సరిగ్గా పనిచేసేందుకు మాత్రమే శరీరం శక్తిని వాడుకుంటూ ఉంటుంది.
మెటబాలిక్ రేటును ఈ కింద చూపిన మూడు రకాలుగా కొలుస్తుంటారు.
- ఆక్సిజన్ వినియోగం
- కార్బన్ డయాక్సైడ్ విడుదల
- ఉష్ణోగ్రతల ఉత్పత్తి

ఫొటో సోర్స్, Getty Images
హార్మోన్లు కూడా కారణమా?
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు మహిళల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా కోర్ బాడీ, స్కిన్ టెంపరేచర్లకు కారణమవుతుంటాయని ది కన్జర్వేషన్ తన కథనంలో పేర్కొంది.
ఈస్ట్రోజెన్ హార్మోన్ శరీరంలో పెరిగినప్పుడు, రక్తనాళాలు రిలాక్స్ అవుతుంటాయని, అప్పుడు కొంతమంది మహిళలు చల్లదనాన్ని ఫీలవుతుంటారని డాక్టర్ బి.సుజీత్ కుమార్ చెప్పారు.
ప్రొజెస్టెరాన్ చర్మంలోని నాళాలను కుచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల అంతర్గత అవయాలను వెచ్చగా ఉంచేందుకు, కొన్ని ప్రాంతాలకు తక్కువ రక్తసరఫరా అవుతుంది. ఇలా జరిగినప్పుడు కూడా కొంతమంది మహిళలు చల్లగా ఉన్నట్లు భావిస్తారు.
రుతుక్రమంతో పాటు నెలంతా ఈ హార్మోన్ల సమతుల్యతలో మార్పులు చోటు చేసుకుంటుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
పురుషులతో పోలిస్తే మహిళల కాళ్లు, చేతులు, చెవుల వద్ద సుమారు మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల, వారికి ఎక్కువ చలి కలగడానికి ఈ హార్మోన్లు కారణమవుతాయని ‘ది కన్జర్వేషన్’ తన కథనంలో తెలిపింది.
ఓవులేషన్ (అండం విడుదలయ్యే సమయం) తర్వాత వారంలో ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరగడంతో శరీరంలో ఛాతి నుంచి నడుము వరకూ ముఖ్య అవయవాల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.
అంటే, ఈ సమయంలో మహిళలు ముఖ్యంగా బయట ఉష్ణోగ్రతలకు ప్రభావితమవుతారని డాక్టర్ బి.సుజీత్ కుమార్ అన్నారు.
అయితే, మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ప్రభావాలు తగ్గడం వల్ల హాట్ ఫ్లషెష్ పెరుగుతాయని, దీనివల్ల చిరాకుగా ఫీల్ కావడం, కోపంగా ఉండటం, వేడిగా ఉన్నట్లు ఫీల్ కావడం వంటివి మహిళల్లో కనిపిస్తుంటాయని డాక్టర్ సుజీత్ కుమార్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
స్త్రీ, పురుషుల శరీర నిర్మాణంలో తేడాలు
పురుషుల్లో కండర ద్రవ్యరాశి (మజిల్ మాస్) ఎక్కువగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. దీనివల్ల వేడి ఉత్పత్తి మగవారిలో ఎక్కువగా ఉంటుందని డాక్టర్ సుజీత్ కుమార్ చెప్పారు.
మజిల్ మాస్ ఎక్కువగా ఉన్నప్పుడు, బాసల్ మెటబాలిక్ రేటు ఎక్కువగా ఉంటుందన్నారు.
అదే మహిళల విషయానికి వస్తే, కండర ద్రవ్యరాశి తక్కువగా ఉండి, కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వేడి ఉత్పత్తి తగ్గి మహిళలకు చలి ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.
శరీర ఉష్ణోగ్రతలు మహిళలకు, పురుషులకు ఇద్దరికీ వేరువేరుగా ఉంటాయని, బీఎంఆర్ కూడా మజిల్ మాస్ ప్రకారమే ఉంటుందన్నారు.
జంతువుల విషయంలో కూడా ఇదే జరుగుతుందా?
జంతువులు రెండు రకాలుగా ఉంటాయని, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ అని డాక్టర్ సుజీత్ కుమార్ తెలిపారు.
చిన్న జంతువులకు ఎక్కువ మెటబాలిక్ రేటు ఉంటుందన్నారు.
పెద్ద జంతువులతో పోలిస్తే చిన్న జంతువుల్లో ఒక్కో యూనిట్ బాడీ మాస్‌లో బీఎంఆర్ ఎక్కువగా ఉంటుంది.
పెద్ద జంతువులకు అయితే తక్కువ మెటబాలిక్ రేటు ఉంటుందని చెప్పారు.
అయితే, మగవారి కంటే మహిళలు ఎందుకు ఎక్కువ చలిగా భావిస్తారనే విషయంపై తక్కువ శాస్త్రీయ పరిశోధనలు ఉండటంతో, మరింత అధ్యయనాలు జరగాల్సి ఉందన్న వాదనలు కూడా ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














