K వీసా: భారతీయులను ఆకర్షిస్తున్న ఈ టెక్ వీసాపై చైనీయుల్లో ఆగ్రహం ఎందుకు? 3 ప్రధాన ప్రశ్నలు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫాన్ వాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సైన్స్, టెక్నాలజీ రంగాల్లో విదేశీ నిపుణులను లక్ష్యంగా చేసుకుని ఆగస్టులో చైనా కొత్త వీసాను తొలిసారి ప్రకటించినప్పుడు, దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
అయితే బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన "కె" వీసా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఒక భారతీయ సంస్థ దీన్ని 'చైనా హెచ్1బీ' అని పేర్కొంది. అమెరికాలో వృత్తి నిపుణులకు హెచ్1బీ వీసా ఇస్తున్నారు. అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాపై ఆంక్షలు తీసుకొచ్చారు. అమెరికా హెచ్1బీ వీసాగ్రహీతల్లో భారతీయులు 70శాతం ఉన్నారు.

ఓ భారతీయ మీడియా సంస్థ రాసిన కథనం చైనాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అంతంత మాత్రంగా ఉన్న ఉద్యోగాల మార్కెట్‌లోకి విదేశీ నిపుణులు వస్తే, అసలు తమకు ఉద్యోగాలు వస్తాయా అని చైనీయులు భయపడుతున్నారు.
సంప్రదాయంగా విదేశీ నిపుణులకు చైనా వలసదేశం కాకపోవడం కూడా ఈ చర్చకు తావిచ్చింది.
అయితే కె వీసాపై వచ్చే విదేశీయులకు దేశంలో పనిచేసేందుకు అనుమతిస్తారా, లేక వారు తేలికగా దేశంలోకి ప్రవేశించేందుకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ కార్యక్రమాన్ని లక్షల మంది చైనీయులు సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు.

ఫొటో సోర్స్, Cheng Xin/Getty Images

"మా దగ్గర అనేకమంది పట్టభద్రులున్నారు. మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీల గురించి చెప్పనవసరం లేదు. మన దగ్గర కావల్సినంత ప్రతిభ ఉంది. ఇప్పుడు మీరు విదేశీ కాలేజీ గ్రాడ్యుయేట్లను తీసుకొస్తున్నారా?" అని ఒక నెటిజన్ రాశారు.
"యూనివర్సిటీ విద్యార్థులు ఒకరితో ఒకరు పోటీ పడేందుకు మేం అనేక కొత్త కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. అయితే విదేశీ పాస్‌పార్ట్‌ను ఎదుర్కోలేకపోతున్నాం" అని మరొకరు చైనీస్ సోషల్ మీడియాప్లాట్‌ఫామ్ 'వీబో'లో రాశారు.
"అధికారులు మరింత ఉన్నత ప్రతిభావంతులను తీసుకురాగలరా" అని మరి కొందరు ప్రశ్నించారు. కఠినమైన నియంత్రిత రాజకీయ వ్యవస్థ, భాషాపరమైన అడ్డంకుల మధ్య విదేశీయులు చైనీయుల జీవనశైలిని అలవరచుకోగలరా అని కొంతమంది ప్రశ్నించారు.
ఈ కామెంట్ల వరదలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని ద్వేష, వివక్షపూరితమైనవి ఎక్కువగా ఉన్నాయి.
ఇది ఏ స్థాయిలో ఉందంటే ఈ అలజడిని కట్టడి చేసేందుకు చైనా అధికారిక మీడియా సంస్థలు రంగంలోకి దిగాయి.
"కొత్త యుగంలో ఆత్మ విశ్వాసంతో ఉన్న చైనా ప్రపంచం చూసేందుకు ఇదొక అవకాశం" అని గ్లోబల్ టైమ్స్ పత్రిక సోమవారం ఒక కథనాన్ని ప్రచురించింది. ఇందులో 'కె వీసా' కార్యక్రమాన్ని సమర్థించింది.
"కె వీసా గురించి తప్పుడు ప్రచారం ప్రజలను తప్పుదారి పట్టించడమే" అనే పతాక శీర్షికతో పీపుల్స్ డైలీ ఒక వ్యాసం రాసింది.
"చైనా అంతర్జాతీయ యవనిక మీదకు అడుగు పెడుతున్న సమయంలో, గతంలో ఎన్నడూ లేనంత ప్రతిభ కోసం ఎదురు చూస్తోంది" అని ఆ వ్యాసంలో వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images

కె వీసా ఉద్దేశం ఏంటనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అయితే ఇది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్- స్టెమ్ రంగాలలో పని చేస్తున్న వారి కోసమని చైనా ప్రభుత్వం చెబుతోంది.
"విద్య, సైన్స్, టెక్నాలజీ, సాంస్కృతిక విభాగాలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వాణిజ్య కార్యకలాపాలలో మార్పిడికి" సంబంధించిన వీసా అని అధికారులు చెబుతున్నారు.
"చైనా లేదా విదేశాలలోని ప్రముఖ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినవాళ్లు, స్టెమ్ రంగాలలో ఉన్నత చదువులు చదివిన వాళ్లు లేదా ఆయా సంస్థల్లో పరిశోధనలు చేస్తున్నవారు, బోధిస్తున్న వాళ్లు" కె వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆగస్టులో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఈ కార్యక్రమానికి అర్హత పొందిన యూనివర్సిటీలు, దరఖాస్తులదారుల వయసు ఎంత ఉండాలనే వివరాలేవీ వెల్లడించలేదు.
ఈ కార్యక్రమంలో భాగంగా కె వీసా ఇవ్వడానికి స్థానికంగా ఉండే కంపెనీల సాయం అవసరం లేదు. ఎంత మంది రావచ్చు, ఎంతకాలం ఉండవచ్చు అనే అంశాలు సరళంగా ఉన్నాయి.
ప్రజల్లో ఉన్న ఆందోళనలను తొలగించేందుకు చైనా ప్రభుత్వ మీడియా ప్రయత్నిస్తున్నప్పటికీ, వీసా కవర్ చేసే రంగాల పరిధిని స్పష్టం చేయలేకపోతోంది. అర్హులైన విదేశీయులను చైనాలో పని చేసేందుకు ఈ వీసా అనుమతిస్తుందా? అని అనేక మంది అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పడంలో విఫలమైంది.
గ్లోబల్ టైమ్స్ తాజా కథనంలో కె వీసా హెచ్1బీ వీసా తరహాది కాదని స్పష్టం చేస్తూ "ఇది సాధారణ ఉద్యోగ అనుమతి" కాదని పేర్కొంది
పీపుల్స్ డైలీ కూడా "కె వీసా విదేశీ యువ సైన్స్, టెక్నాలజీ నిపుణులు చైనాలో పని చేయడానికి, నివసించడానికి సౌకర్యాన్ని కల్పిస్తుంది" అని తెలిపింది. అయితే దీన్ని' వలసలతో సమానంగా' చూడకూడదని స్పష్టం చేసింది.
కె వీసా గురించి విదేశాల్లోని చైనా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లకు త్వరలో మరిన్ని వివరాలు అందిస్తామని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే అది ఎప్పటిలోగా అనేది స్పష్టం చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images

అంతర్జాతీయంగా ప్రతిభకు, సందర్శకులకు కేంద్ర స్థానం అనే హోదా నుంచి అమెరికా వెనక్కి తగ్గడంతో, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు చైనా వేగంగా కదులుతోంది.
కె వీసాను అధికారికంగా ప్రారంభించాలని రెండు నెలల క్రితమే నిర్ణయించారు. అదే సమయంలో ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా రుసుమును గణనీయంగా పెంచింది. ఈ చర్య భారత్, చైనాలో కలకలం రేపింది. ఎందుకంటే ఈ రెండు దేశాల నుంచి నిపుణులు ఎక్కువ మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు.
పర్యటకం, పరిశోధన, వ్యాపార రంగాల్లోకి విదేశీయులను ఆకర్షించేందుకు చైనా చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో కె వీసా తాజా అడుగు మాత్రమే.
విదేశీ పర్యటకుల సంఖ్యను పెంచుకోవడానికి జులై నాటికి చైనా 75 దేశాలతో వీసా మినహాయింపు ఒప్పందాలు కుదుర్చుకుంది. అగ్రశ్రేణి విద్యావేత్తలను ఆకర్షించాలనే బీజింగ్ ప్రయత్నం వల్ల ఇప్పటికే కొంతమంది హై ప్రొఫైల్ స్కాలర్లు అమెరికా విడిచి పెట్టి చైనాలోని విశ్వ విద్యాలయాల్లో చేరారు.
"కొన్ని దేశాలు అంతర్జాతీయ ప్రతిభావంతులను బయటకు పంపించేస్తున్న సమయంలో చైనా ఈ అవకాశాన్ని విజయవంతంగా ఉపయోగించుకుంటోంది. అందుకు అవసరమైన విధానాలను వెంటనే అమలు చేస్తోంది" అని ది పీపుల్స్ డైలీ రాసింది.
దీనికి పరిమితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
విదేశీయులకు ప్రాధాన్యం ఇచ్చే చికిత్సగా చైనా భావిస్తున్న వీసా విధానంపై చైనీయుల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఆన్‌లైన్‌లో విమర్శలు ప్రతిబింబిస్తున్నాయని ఏషియా బ్రీఫింగ్ ఎడిటర్ గియులియా ఇంటెరెస్సే చెప్పారు.
సోషల్ మీడియాలో చర్చ పూర్తిగా ప్రజల మనోభావాలకు అద్దం పట్టకపోవచ్చు. అయితే ఈ వివాదం "ఒక విధానాన్ని రూపొందించి అమలు చేయడం మాత్రమే కాదు, దాని గురించి ప్రజలకు వివరించడం, వారి మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడం" అనేది ఎంత కీలకమో చెప్పిందని ఆమె అన్నారు.
భాష మరో అడ్డంకి. ఇటీవల అమెరికాను వీడి చైనాకు వచ్చినవారిలో ఎక్కువమంది చైనీయులే. వారు మాండరిన్ అనర్గళంగా మాట్లడగలరు.
చైనాలో పని చేసేందుకు వచ్చే విదేశీ నిపుణులు, తమ చైనా సహచరులతో సంభాషించడం, సమాచారాన్ని పంచుకోవడం సవాలుగా మారనుంది. ఈ సమస్య ఉద్యోగుల్లోనే కాక యజమానుల్లోనూ ఉంది.
చైనాలో నియంత్రిత రాజకీయ వాతావరణానికి విదేశీ టెక్ నిపుణులు, సైన్స్ పరిశోధకులు అలవాటు పడటం అనేది మరో పెద్ద సమస్యని సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నోలాజికల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్టెఫానీ కామ్ అన్నారు.
"అమెరికా సహా అనేక యూరోపియన్ దేశాల్లో ఉదారవాద వాతావరణం ఉంది. ఇలాంటి చోట క్రియేటివిటీ, ఇన్నోవేషన్‌కు అవకాశం, ప్రోత్సాహం లభిస్తాయి. అయితే చైనాలో పరిస్థితి భిన్నంగా ఉంది" అని స్టెఫానీ బీబీసీతో అన్నారు.
విదేశీ నిపుణులు "చైనాలో ఆవిష్కరణలకు అనువైన వాతావరణాన్ని కనుక్కోగలరా" అనేది బీజింగ్ నిర్ణయాలను ఆసక్తిగా పరిశీలిస్తున్న వారిలో కీలకమైన ప్రశ్నగా మిగిలింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














