తిలక్ వర్మది తెలంగాణనా, ఆంధ్రనా? సోషల్ మీడియాలో ఎందుకీ చర్చ..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పారా పద్దయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
"తెలంగాణ బిడ్డ అక్కడ, తిలక్ వర్మ నిన్ను చూసి గర్విస్తున్నాను" అని తిలక్ వర్మ ఫోటో పక్కన కేటీఆర్ రాశారు.
"20 పరుగులకే మూడు వికెట్ల నుంచి ఉత్కంఠకు దారితీసిన ఫైనల్ ఇది. ఆసియా కప్ 2025లో భారత్ జైత్రయాత్ర అద్భుతం. ఒక టోర్నీలో పాకిస్తాన్‌ను వరుసగా మూడుసార్లు ఓడించడం గొప్ప విజయం" అని కేటీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశారు.


ఫొటో సోర్స్, @TilakV9
అయితే "తెలంగాణ బిడ్డ అక్కడ" అన్న కామెంట్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
కేటీఆర్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ, తిలక్ వర్మ గుంటూరు జిల్లాలో పుట్టాడని చెబుతూ 'క్రిక్‌బజ్' వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని స్క్రీన్ షాట్లు తీసి పెడుతున్నారు కొందరు.
క్రిక్ బజ్ వెబ్‌సైట్‌లో తిలక్ వర్మ ప్రొఫైల్‌లో ఆయన జన్మస్థలం గుంటూరు అని ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులుగా చెప్పుకుంటున్న వాళ్లు, ఏపీలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు కేటీఆర్ పోస్టుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.
అయితే, వీరికి కౌంటర్‌గా తిలక్ వర్మ నాలుగేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూను కొందరు పోస్ట్ చేస్తున్నారు.
మ్యాడ్ డాగ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో తిలక్ వర్మ తన కుటుంబ నేపథ్యం, కెరీర్‌తో పాటు అనేక అంశాలు పంచుకున్నారు.
ఈ ఇంటర్వ్యూ ఇచ్చే నాటికి ఠాకూర్ తిలక్ వర్మ ఇండియా అండర్ 19 టీమ్‌లో ఆడాడు.
సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ పెనుమర్తి ఈ ఇంటర్వ్యూ చేశారు.
ఇందులో ఆయన తిలక్ వర్మను.. మీరు వేరే రాష్ట్రం నుంచి వచ్చి సెటిల్ అయ్యారా? అని ప్రశ్నించారు. దీనికి తిలక్ వర్మ బదులిస్తూ, "డాడీ చిన్నప్పటి నుంచి మేడ్చల్, మమ్మీ భీమవరం, వాళ్లంతా పుట్టింది, పెరిగింది ఇక్కడే. నేను కూడా ఇక్కడే కూకట్‌పల్లిలోనే పుట్టాను. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంతా ఇక్కడే (హైదరాబాద్‌లోనే)" అని చెప్పారు.
తిలక్ వర్మ తెలంగాణ బిడ్డ అని చెబుతూ కొంతమంది నెటిజన్లు ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"తమ్ముడు" అని ట్వీట్ చేసిన లోకేష్
ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు 20 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో తిలక్ వర్మ వీరోచిత పోరాటం చేసి జట్టుని గెలిపించాడు.
ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ చివరి వరకు నిలిచి 53 బంతుల్లో 69 పరుగులు చేశాడు.
మ్యాచ్ పూర్తైన తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చారు.
అక్కడికి రాగానే తిలక్ వర్మ భారత టీమ్ ధరించే క్యాప్ తీసుకుని.. "డియర్ లోకేష్ అన్న.. లాట్స్ ఆఫ్ లవ్.. ఇది నీ కోసమే అంటూ" క్యాప్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.
ఈ వీడియోను మంత్రి లోకేష్ ట్వీట్ చేస్తూ "తమ్ముడూ, ఇది చాలా ప్రత్యేకం. నువ్వు ఇండియాకి వచ్చాక.. నిన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్నా, చాంప్" అని పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, Getty Images
పీవీ సింధు విషయంలోనూ ..
తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వివాదం ఇదే తొలిసారి కాదు. గతంలో షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు విషయంలోనూ ఇలాగే జరిగింది.
2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్యం గెలిచాక రెండు రోజుల పాటు గూగుల్ ట్రెండ్స్‌లో ఆమె టాప్‌లో నిలిచారు.
అయితే, ఇదంతా ఆమె ఆట గురించి, ఆమె సాధించిన విజయాల గురించి కాదు.
గూగుల్‌లో పీవీ సింధు గురించి సెర్చ్ చేసిన వర్డ్స్‌లో 'క్యాస్ట్' అనేది మోస్ట్ సెర్చ్‌డ్‌గా నిలిచింది.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, హరియాణాలో ఈ పదాన్ని ఎక్కువగా వెతికినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనంలో రాసింది.
అంతకుముందు రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం గెలిచినప్పుడు కూడా ఆమె కులం కోసం వెతికినా, టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన తర్వాత అది తీవ్రమైంది.
అలాగే పీవీ సింధుది ఏపీ అని కొందరు, తెలంగాణ అని మరికొందరు ఇంటర్నెట్‌లో మెసేజ్‌లు పోస్ట్ చేయడంతో ఇదొక వివాదంగా మారింది.
పీవీ సింధు తల్లిదండ్రుల పేర్లు, వారి మూలాలపైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.
'ఈనాడు' పత్రిక సింధు గురించి హైదరాబాద్ ఎడిషన్‌లో తెలంగాణ బిడ్డ అని, విజయవాడ ఎడిషన్‌లో విజయవాడ బిడ్డ అని రాసింది.
పీవీ సింధు అమ్మవారికి బోనం సమర్పించే ఫోటో పెట్టి ఆమె తెలంగాణ బిడ్డ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఫొటో సోర్స్, @BFI_official
రాష్ట్రం విడిపోయిన తర్వాత..
సమైక్య రాష్ట్రంలో ఇలాంటి వివాదాలు లేకున్నా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత తరచుగా కనిపిస్తున్నాయి.
ఎవరైనా ఫేమ్‌లోకి రాగానే వాళ్లను 'తమవారిగా' చెప్పుకునేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన వారు ప్రయత్నిస్తున్నారు.
మొహమ్మద్ అజారుద్దీన్, సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ హైదరాబాదీలు. వీళ్లు విజయాలు సాధించినప్పుడల్లా తెలుగు బిడ్డ విజయం అని పత్రికలు, ప్రసార సాధనాలు రాసేవి.
క్రీడాభిమానుల్లోనూ అలాంటి స్ఫూర్తి కనిపించేది.
అయితే సింధు, తిలక్ వర్మ విషయంలో పరిస్థితి వేరుగా ఉంది.
ఇలాంటి పరిస్థితి ప్రమాదకరమని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
"ఇది ప్రమాదకరమైన ధోరణి. క్రీడాకారులు దేశానికి చెందినవారు. వాళ్లను ఒక ప్రాంతానికి లేదా కులానికి, మతానికి ముడిపెట్టి చూడకూడదు. సచిన్‌ను మహరాష్ట్ర వాసి అని అనుకోగలమా! క్రికెట్‌లో ఆయన సాధించిన విజయాలు ప్రతి ఒక్కరికీ గర్వకారణం. క్రీడాకారులు ఎవరు ఆడినా, గెలిచినా వాళ్లు దేశానికి ప్రతినిధులు. వాళ్లను ఒక ప్రాంతానికి ముడిపెట్టి చూడటం సంకుచితత్వం" అని స్పోర్ట్స్ జర్నలిస్ట్ విజయ్ భాస్కర్ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














