'నా కొడుకు కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌తో పోరాడి కూడా ప్రాణాలతో బతికొచ్చాడు. కానీ, ఇక్కడ పోలీసులు వాడిని చంపేశారు'

ఫొటో సోర్స్, Majid Jahangir
- రచయిత, మజీద్ జహంగీర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'' నా కొడుకు పోలీసుల చేతిలో చనిపోయాడు. వాడికి నలుగురు పిల్లలు. వాళ్లు ఇంకా చదువుకుంటున్నారు. ఇప్పుడు, నేనేం చేయాలి? నా గుండె రగిలిపోతోంది. నా కొడుకు కాదు, నేను చనిపోయి ఉండాల్సింది. నేనూ నిరాహార దీక్షలో పాల్గొన్నా. నాకు కళ్లు తిరిగినట్లు అనిపించి, తిరిగొచ్చేశాను.''
లేహ్‌లో జరిగిన పోలీసుల కాల్పుల్లో తన కొడుకు సెవాంగ్ థార్చిన్‌ను కోల్పోయిన సెరిన్ డోల్కర్ చెబుతున్న మాటలివి.
సెవాంగ్ థార్చిన్ 22 ఏళ్లు భారత సైన్యంలో పనిచేశారు. హవల్దార్‌గా రిటైర్ అయ్యారు.
కార్గిల్ యుద్ధంలో సెవాంగ్ థార్చిన్ పాల్గొన్నారు.
ఈ కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని గత ఐదేళ్లుగా లద్దాఖ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
దీనికోసం సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు లేహ్ అపెక్స్ బాడీ నిరాహార దీక్ష చేపట్టింది.
సెప్టెంబర్ 24న పెద్దసంఖ్యలో యువతీ, యువకులు నిరాహార దీక్ష ప్రాంతానికి చేరుకున్నారు.

ఆ తర్వాత వీధుల్లో నిరసనలు ప్రారంభించారు.
పలుచోట్ల ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. లేహ్ హిల్ కౌన్సిల్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ భవనాలపై నిరసనకారులు రాళ్లు విసిరారు.
బీజేపీ కార్యాలయానికి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. దాన్ని ధ్వంసం చేశారు.
ఆందోళనకారులను నిలువరించేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించాయి.
భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు చనిపోగా.. భద్రతా సిబ్బందితో పాటు పలువురు గాయపడ్డారు.
లేహ్‌లో హింస అనంతరం, 15 రోజులుగా తాను చేపట్టిన నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటించారు.
ఆ తర్వాత రెండు రోజులకు జాతీయ భద్రత చట్టం (ఎన్ఎస్ఏ) కింద వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, జోధ్‌పూర్ జైలుకు తరలించారు.
ఈ ఘటన తర్వాత లేహ్ నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
లేహ్‌లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 163 విధించింది అక్కడి పాలనా యంత్రాంగం.
ఈ సెక్షన్ కింద ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడటం నిషేధం.
నగరంలో కఠినమైన భద్రతా నిబంధనలు అమల్లో ఉన్నాయి.
కర్ఫ్యూ లాంటి పరిస్థితి నేపథ్యంలో లేహ్‌లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు కూడా నిలిపివేశారు.

ఫొటో సోర్స్, Majid Jahangir
నలుగురి మృతి
హింసాత్మక పరిస్థితులు చెలరేగడంతో, నిరసనకారులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు పోలీసులు చెప్పారు.
కానీ, నిరసనకారులు ముందుకు కదులుతూ, పలు ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసేందుకు యత్నించినట్లు తెలిపారు.
ఆత్మ రక్షణ కోసం భద్రతా బలగాలు కాల్పులు జరపాల్సి వచ్చిందని సెప్టెంబర్ 27న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లద్దాఖ్ డీజీపీ డాక్టర్ ఎస్‌డీ సింఘ్ జామ్వాల్ చెప్పారు.
46 ఏళ్ల సెవాంగ్ థార్చిన్‌తో పాటు 25 ఏళ్ల జిగ్మెత్ దోర్జే, 23 ఏళ్ల స్టాంజిన్ నామ్‌గ్యాల్, 20 ఏళ్ల రించెన్ దాదుల్ ఈ కాల్పుల్లో మరణించారు.
చనిపోయిన నలుగురిలో ముగ్గురి ఇళ్లను బీబీసీ బృందం సందర్శించింది. వీరు లేహ్‌లోని మారుమూల ప్రాంతాలకు చెందిన వ్యక్తులు.

ఫొటో సోర్స్, Majid Jahangir
సెవాంగ్ తండ్రి ఏమన్నారంటే..
లేహ్‌లోని సెవాంగ్ థార్చిన్ ఇంటికి బీబీసీ బృందం వెళ్లింది.
''వాళ్లు నిరాహార దీక్షలో ఉన్నారు. నా కొడుకు కూడా ఈ దీక్షలో పాల్గొన్నాడు. అక్కడి నుంచే ఊరేగింపు మొదలైంది. నా కొడుక్కి సమయం దొరికినప్పుడల్లా నిరాహార దీక్షకు వెళ్లేవాడు'' అని సెవాంగ్ థార్చిన్ తండ్రి చెప్పారు.
''నా కొడుకు 22 ఏళ్లు ఆర్మీలో పనిచేశాడు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. కార్గిల్ యుద్ధ సమయంలో ద్రాస్‌లో (పర్వత ప్రాంతంలో) పోరాడాడు. యుద్ధంలో ఆ పర్వత ప్రాంతానికి ఎక్కుతూ, కింద పడిపోయాడు. గాయాలయ్యాయి'' అని తన కొడుకు ఆర్మీ కెరీర్ గురించి చెప్పారు.
'' 15 రోజులకు కోలుకుని, ఆస్పత్రి నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన వెంటనే తిరిగి యుద్ధానికి వెళ్లాడు. కాల్పుల విరమణ వరకు నా కొడుకు పోరాడుతూనే ఉన్నాడు'' అని తెలిపారు.
''పాకిస్తాన్ పోస్టును భారత్ స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్‌పై పోరాడి కూడా నా కొడుకు ప్రాణాలతో బతికి వచ్చాడు. కానీ, ఇక్కడ లద్దాఖ్‌లో పోలీసులు వాడిని చంపేశారు'' అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయకపోతే, తాను కేసు వేస్తానని సెవాంగ్ థార్చిన్ తండ్రి చెప్పారు.
'' నా కొడుకు మరణ వార్త విన్నప్పుడు మిన్నువిరిగి మీదపడినట్లు అనిపించింది. నేనేం చేయగలను? కొద్దిసేపు నాకేమీ కనపించలేదు. కళ్లు బైర్లు కమ్మాయి. చుట్టూ చీకటి అలుముకుంది. రాత్రింబవళ్లు నా కొడుకుని తలుచుకుని ఏడుస్తూ ఉన్నాను'' అని సెవాంగ్ థార్చిన్ తండ్రి చెప్పారు.

ఫొటో సోర్స్, Majid Jahangir
పుట్టెడు దు:ఖం
ఈ నిరసనల్లో మరణించిన 25 ఏళ్ల జిగ్మెత్ దోర్జే కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు వారి ఇంటికి వచ్చి జిగ్మెత్ దోర్జేకు నివాళులు అర్పిస్తున్నారు. జిగ్మెత్ కుటుంబాన్ని ఓదారుస్తున్నారు.
లేహ్‌లోని ఖర్నాక్లింగ్ ప్రాంతానికి చెందిన జిగ్మెత్ మామ చోతర్ సిరింగ్ కూడా ఈ ఘటనపై విచారణను డిమాండ్ చేస్తున్నారు.
''ఆ రోజు లద్దాఖ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు, పెద్దవాళ్లు కూడా నిరసనల ప్రాంతానికి వెళ్లారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని మేం కోరుతున్నాం. నలుగురిపై కాల్పులు ఎలా జరిగాయి? కాల్పులు జరపాలని ఎవరు ఆదేశాలిచ్చారు?'' అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Majid Jahangir
చనిపోయిన వారిలో స్టాంజిన్ నామ్‌గ్యాల్ కూడా ఒకరు. లేహ్ నగరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో స్టాంజిన్ ఇల్లు ఉంది.
వారి ఇంటికి వెళ్లినప్పుడు, ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో ఉంది. ఎవరూ మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు.
కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారో విచారణ జరపాలని వారి పొరిగింటి వ్యక్తి జిగ్మిత్ డిమాండ్ చేశారు.
ప్రాణాలను పణంగా పెట్టిన వారి గౌరవార్థం లద్దాఖ్‌ను ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని సెవాంగ్ తండ్రి కోరారు.
'' ప్రజలు ఆరవ షెడ్యూల్‌ను కోరుతున్నారు. కానీ, ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఆరవ షెడ్యూల్ మేం కచ్చితంగా పొందుతాం. మా నిరసనను కొనసాగిస్తాం. నిరాహార దీక్ష చేస్తాం'' అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














