ఇగ్ నోబెల్ ప్రైజ్: బూట్ల వాసన మీద ఈ ఏడాది బహుమతి అందుకున్నది ఎవరు, అసలు ఈ ప్రైజ్ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దాదాపు ప్రతి ఇంట్లో కనీసం ఒక జత షూస్ ఉంటాయి. వీటి నుంచి వచ్చే దుర్వాసనను మనం అసలు భరించలేం.
ఒక్క జత బూట్లకే అలా అనిపిస్తే.. మన ఇంట్లో వారందరి బూట్లు కలిపి, ఒక ర్యాక్‌లో పెడితే.. ఇక వాటి నుంచి వచ్చే వాసన ఎంతలా ఉంటుందో..
ఇద్దరు భారతీయ పరిశోధకులు ఇది కేవలం దుర్వాసన మాత్రమే కాదని, దీని వెనుకాల సైన్స్ ఉందని భావించారు.
విపరీతమైన వాసన వచ్చే బూట్లు మన షూ ర్యాక్‌లను ఉపయోగించుకునేలా ఎలా చేశాయనే దానిపై అధ్యయనం చేశారు.
ఈ పరిశోధన చేయడం ద్వారా వారు వ్యంగ్య బహుమతి ‘ఇగ్ నోబెల్ అవార్డు’కు ఎంపికయ్యారు.
మొదట నవ్వు తెప్పించినా, ఆ తర్వాత ఆలోచనాత్మకమైనదిగా నిలిచిన శాస్త్రీయ ఆవిష్కరణలకు ఇచ్చే బహుమతే ఇగ్ నోబెల్ ప్రైజ్.
దిల్లీ శివారులోని శివ్ నాడార్ యూనివర్సిటీలో డిజైన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన 42 ఏళ్ల వికాశ్ కుమార్, సార్థక్ మిత్తల్ అనే విద్యార్థికి యూనివర్సిటీలో పాఠాలు చెప్పారు. సార్థక్ మిత్తల్‌కు ప్రస్తుతం 29 ఏళ్లు.
వాసన వచ్చే బూట్లపై పరిశోధన చేయాలనే ఆలోచన తొలుత ఈ ఇద్దరికీ యూనివర్సిటీలోనే వచ్చింది.

హాస్టల్ కారిడార్లలో వరుసగా షూలు కనిపించేవని, ఇద్దరు వ్యక్తులు షేర్ చేసుకునే గది బయటనే వీటిని విడిచేవారని మిత్తల్ తెలిపారు.
''అయితే, మొదట మాకు వచ్చిన ఆలోచన చాలా సింపుల్. విద్యార్థుల కోసం అందంగా, ఆకర్షణీయంగా ఉండే షూ ర్యాక్‌ను ఎందుకు డిజైన్ చేయకూడదు?
దీని గురించి మరింత లోతుగా అధ్యయనం చేసినప్పుడు, అసలైన కారణమేంటో తెలిసింది. గది లోపల చిందరవందరగా పడేయడం అసలైన కారణం కాదని, ముక్కుపేలిపోయే వాసనే గది బయట షూలు విడిచి వెళ్లేందుకు కారణమని తెలిసింది. అందుకే మనం వేసుకునే చెప్పులను, షూలను బయట పెడుతుంటామని అర్థమైంది'' అని చెప్పారు.
''గది లోపల సరిపడినంత చోటు లేకపోవడం లేదా షూ ర్యాక్‌లు లేకపోవడం కాదు. సరిపోయేంత స్థలం ఉంటుంది. కానీ, సమస్యేంటంటే..తరచూ చెమట పట్టడం, ఆ చెమటతో షూను ఎక్కువసేపు వేసుకుని ఉండటం వల్ల అవి వాసన వస్తాయి'' అని మిత్తల్ చెప్పారు.
మిత్తల్ ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు.

‘‘ స్నీకర్ల (షూల) నుంచి భరించలేని వాసన వస్తుంటే, షూ ర్యాక్‌ను ఉపయోగించాలంటే కూడా మీకు చిరాకు వేస్తుందా?'' అనే ప్రశ్నను అడుగుతూ యూనివర్సిటీ హాస్టల్స్‌లో ఈ ఇద్దరు ఓ సర్వే చేపట్టారు.
149 మంది యూనివర్సిటీ విద్యార్థులు ఈ సర్వేలో భాగమయ్యారు. వీరిలో 80 శాతం మంది పురుషులు.
సర్వేలో పాల్గొన్న వీరు ఇప్పటికే మనకు తెలిసిన, అరుదుగా అంగీకరించే విషయాన్ని ధ్రువీకరించారు.
అయితే, సగంమందికి పైగా విద్యార్థులు తమ బూట్ల నుంచైనా, వేరొకరి బూట్ల నుంచైనా వచ్చే దుర్వాసనను ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పారు.
దాదాపు అందరూ తాము వేసుకునే షూలను, చెప్పులను ఇంట్లో ర్యాక్‌లలోనే పెట్టుకుంటున్నారు.
అయితే, ఈ వాసనను తప్పించుకునేందుకు మార్కెట్లో ఉన్న డియోడరైజింగ్ ప్రొడక్టుల గురించి చాలా తక్కువ మందికే తెలుసు.
ఇంట్లో సొంతంగా తయారు చేసుకుని వాడుకునే పద్ధతులు కొన్ని ఉన్నాయి. షూలలో టీ బ్యాగ్‌లు పెట్టడం, బేకింగ్ సోడాను చల్లడం, డియోడరెంట్ స్ప్రే చేసుకోవడం వంటివి. అయితే, అవి వాసనను తగ్గించడం లేదు.
దీంతో ఈ ఇద్దరు పరిశోధకులు దీన్ని ఒక శాస్త్రీయ పరిశోధనగా మరల్చారు.
దీనికి అసలైన కారణం ఏంటన్న దాన్ని వారు చేసిన పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. అదే కైటోకాకస్ సెడెంటారియస్ బ్యాక్టీరియా.
ఈ బ్యాక్టీరియా చెమటతో తడిచిన బూట్లలో అభివృద్ధి చెందుతుంది.
అతి నీలలోహిత కాంతి కిరణాలను కొద్దిసేపు పంపడం వల్ల షూ ర్యాక్‌లలోని సూక్ష్మజీవులు చనిపోతాయని వీరి పరిశోధన నిరూపించింది.
దీనివల్ల, బ్యాక్టీరియా బెడద తొలగి, దుర్వాసన పోతుందని వారి పరిశోధన చూపించింది.
''భారత్‌లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక షూ ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్ బూట్ల నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టేలా ఉంటే చాలా బాగుంటుంది కదా'' అని తమ పరిశోధనా పత్రంలో రచయితలు రాశారు.
బూట్ల నుంచి వచ్చే వాసనను పోగొట్టేందుకు, మనం ఎంతోకాలంగా వాడుతూ వస్తున్న షూ ర్యాక్‌లను రీడిజైన్ చేసేందుకు దీన్నొక అవకాశంగా వారు చూశారు.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
వీరి పరిశోధనా ఫలితం.. కేవలం ఒక సాధారణ ఎర్గోనమిక్స్ పేపర్‌ను (పరిశోధనా పత్రాన్ని) తయారు చేయడమే కాదు. ఒక అద్భుతమైన ఆలోచనకు తెరతీసింది కూడా.
యూవీసీ లైట్‌తో రూపొందిన షూ ర్యాక్ ప్రొటోటైప్‌ను వారు తయారు చేశారు.
ఈ ర్యాక్‌లో కేవలం మన బూట్లను పెట్టుకోవడమే కాదు. బయట నుంచి వచ్చిన తర్వాత చెమటతో తడిచిన వీటి నుంచి దుర్వాసన రాకుండా స్టెరిలైజ్ చేసుకోవచ్చు(శుభ్రపరుచుకోవచ్చు).
సహజంగా క్రీడాకారుల షూల నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తుంది. ఎందుకంటే, వారి బొటనవేలు కింద ఎక్కువగా బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. అందుకే ఈ ప్రయోగం కోసం పరిశోధకులు యూనివర్సిటీలో క్రీడాకారులు ధరించిన షూలను వాడారు.
యూవీసీ లైట్ షూలో బొటనవేలు ఉండే ప్రాంతం మీద ఎక్కువగా పడేలా చేశారు.
ఎక్స్‌పోజర్ సమయాన్ని బట్టి, దుర్వాసన స్థాయిలు ఎలా తగ్గుతున్నాయో ఈ అధ్యయనంలో పరిశీలించారు.
బ్యాక్టీరియాను చంపేందుకు కేవలం 2 నుంచి 3 నిమిషాల యూవీసీ ట్రీట్‌మెంట్ సరిపోతుందని వారు గుర్తించారు. దీంతో, షూల నుంచి వచ్చే దుర్వాసనను తొలగించవచ్చని కనుగొన్నారు.
అయితే, ఇది అంత సులభం కూడా కాదు. ఎందుకంటే, ఎక్కువ కాంతి అంటే ఎక్కువ వేడి. దీనివల్ల షూ రబ్బర్ కాలిపోయే అవకాశం ఉంది.
పరిశోధకులు కేవలం షూపై యూవీసీ ట్యూబ్ లైట్‌ను పెట్టి, మంచి ఫలితం వస్తుందేమోనని ఆశించడమే కాదు, ప్రతి వాసనను వారు క్షుణ్నంగా పరిశీలించారు.
ప్రారంభంలో ఈ దుర్వాసన చాలా ఘాటుగా, కుళ్లిపోయిన జున్నుమాదిరిగా ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు.
ఆ తర్వాత, రెండు నిమిషాల్లో ఆ వాసన చాలా వరకు పోయి, రబ్బర్ కాలిన వాసన వచ్చింది.
నాలుగు నిమిషాలకు దుర్వాసన పూర్తిగా తొలగిపోయి, దాని స్థానంలో రబ్బరు కాలినప్పుడు వచ్చే వాసన కొద్దిగా వచ్చిందని పరిశోధకులు చెప్పారు.
ఆరు నిమిషాల తర్వాత అసలు ఎలాంటి దుర్వాసన లేదు. ఆ బూట్లు వేసుకునేందుకు చాలా సౌకర్యవంతంగా అనిపించాయి.
కానీ, పది పదిహేను నిమిషాలయ్యాక మాత్రం వాటి నుంచి కాలిన రబ్బర్ వాసన చాలా ఘాటుగా వచ్చింది. షూ కూడా వేడెక్కాయి.
దీంతో, సైన్స్‌లో కూడా ప్రతీది టైమ్‌తోనే ముడిపడి ఉంటుందని నిరూపితమైంది.
చివరికి ఈ ఇద్దరు పరిశోధకులు యూవీసీ ట్యూబ్ లైట్‌ను అమర్చి షూ ర్యాక్‌ను తయారు చేసుకోవచ్చని సూచించారు.

ఫొటో సోర్స్, Sarthak Mittal
అమెరికాకు చెందిన ఇగ్ నోబెల్ ప్రైజ్ వీరి పరిశోధనను గుర్తించి, వారిని సంప్రదించేంత వరకు పెద్దగా దాని గురించి ఎవరికీ తెలియదు.
అనల్స్ ఆఫ్ ఇంప్రాపబుల్ రీసర్చ్ (Annals of Improbable Research) అనే జర్నల్ నిర్వహించిన ఈ బహుమతుల ప్రదానోత్సవానికి, హార్వర్డ్-రెడ్‌క్లిఫ్ గ్రూప్‌లు కో స్పాన్సర్ చేశాయి.
ఈ బహుమతుల కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటికీ 34 ఏళ్లు. ప్రతి ఏడాది 10 అవార్డులను ఇది అందిస్తుంది.
''తొలుత ప్రజలు నవ్వుకునేలా చేసి, ఆ తర్వాత ఆలోచింపజేసే అసాధారణమైన విషయాలను సెలబ్రేట్ చేసుకోవడం, వాటిని గౌరవించడం'' ఈ అవార్డుల ప్రధాన లక్ష్యం.
''ఈ బహుమతి గురించి మాకు తెలియదు'' అని కుమార్ అన్నారు.
ఇది తమ 2022 నాటి పరిశోధనా పత్రమని చెప్పారు. దీన్ని తాము ఎక్కడికి పంపలేదన్నారు.
ఇగ్ నోబెల్ టీమే తమని గుర్తించి, అవార్డుల కార్యక్రమానికి పిలిచిందని చెప్పారు.
‘‘ఈ అవార్డు కేవలం పరిశోధనలను గుర్తించడమే కాదు. సైన్స్‌లో ఉన్న సరదా అంశాన్ని సెలబ్రేట్ చేస్తోంది. చాలా వరకు పరిశోధనలు అభిరుచితో చేసినవే. ఈ పరిశోధనలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఇదొక మార్గం’’ అని పరిశోధకులు అన్నారు.
‘‘ గుర్తింపుతో పాటు మాపై మరింత బాధ్యతను మోపింది. ప్రజలు ఎక్కువగా దృష్టి పెట్టని విషయాలపై మనం మరింత అధ్యయనం చేయాల్సి ఉంటుంది’’ అని వికాశ్ కుమార్ అన్నారు.
ఇవాళ వాసన వచ్చే స్నీకర్లే రేపు సంచలనాత్మక శాస్త్రీయ పరిశోధనలకు కారణం కావొచ్చని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














