గూగుల్ క్రోమ్ రేటు అడిగిన, ఈ 31 ఏళ్ల భారతీయ బిలియనీర్ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్‌నారాయణన్ సుడలై
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీరు ఎప్పుడైనా ఆరోగ్య బీమా(హెల్త్ ఇన్సూరెన్స్) సమాచారం కోసం గూగుల్‌లో వెతికారా?
అలా వెతుకుతున్నప్పుడే, మనం ఇంటర్నెట్‌లో చాలా సులభంగా సమాచారం దొరుకుతుందని భావిస్తాం కానీ.. అది అంత సులువు కాదని ఒక యువకుడికి అర్థమైంది. ఆయనే చెన్నైకి చెందిన అరవింద్ శ్రీనివాస్, ఆ ప్రశ్న నుంచి ఐటీ దిగ్గజం గూగుల్‌ను కూడా రేటు అడిగే ధైర్యం చేసేంత ఎత్తుకు ఎదిగారు.
గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లు సాధారణంగా ప్రకటనల(యాడ్స్) ఆదాయంపై ఎక్కువగా ఆధారపడతాయి.
అయితే, పర్‌ప్లెక్సిటీ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహ వ్యవహస్థాపకుల్లో ఒకరైన అరవింద్ శ్రీనివాస్, తన స్టార్టప్ అయిన పర్‌ప్లెక్సిటీ ఏఐ ఉత్తమ వెబ్‌సైట్‌ల నుంచి డేటాను సమీకరించి యూజర్లకు నమ్మదగిన సమాచారం, నిజమైన లింక్స్‌ను అందజేస్తుందని చెబుతున్నారు.
బ్లూమ్‌బర్గ్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన పర్‌ప్లెక్సిటీ ఏఐ ఇతర ఏఐ టెక్నాలజీల కంటే ఎందుకు ప్రత్యేకమో వివరించారు.
"ఇతర ఏఐ టెక్నాలజీలు, వాటంతట అవే స్వయంగా ఆలోచించుకుని వినియోగదారుడికి సంతృప్తికరమైన ఆప్షన్స్(సమాధానాలు, నిర్ణయాలు) అందించేందుకు ప్రయత్నిస్తాయి. కానీ, అవి వాటిని ఎలా సూచిస్తున్నాయనే దానికి సంబంధించిన ఆధారాలను అందించవు. కానీ, పర్‌ప్లెక్సిటీ సమాచారం సమీకరించిన వెబ్‌సైట్‌లను కూడా సూచిస్తుంది" అని అరవింద్ శ్రీనివాస్ చెప్పారు.

భారత అతిచిన్న వయస్కుడైన బిలియనీర్
2000ల ప్రారంభంలో గూగుల్ ఇంటర్నెట్‌ను ఆక్రమించుకుంటున్న సమయంలో అరవింద్ చెన్నైలో కంప్యూటర్ల గురించి కలలు కంటున్న ఒక బాలుడు. ప్రస్తుతం, కేవలం 31 ఏళ్లకే భారతదేశంలో అతిచిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు.
ఎం3ఎం హురున్ ఇండియా 2025 సంపన్నుల జాబితా ప్రకారం, ఆయన సంపద విలువ దాదాపు రూ.21 వేల కోట్లు. అంతేకాకుండా, ఆయన గూగుల్ యాజమాన్యంలోని క్రోమ్ బ్రౌజర్ ధర అడిగేంత ధైర్యం ఆయనది.
"మీరు ఎవరు? ఎక్కడి నుంచి వెతుకుతున్నారనేది (సెర్చ్ చేస్తున్నారనేది) ముఖ్యం కాదు. మీ ప్రశ్న ఏంటనేదే మాకు ముఖ్యం" అంటున్నారు అరవింద్. గూగుల్ డీప్‌మైండ్, ఓపెన్‌ఏఐలలో పనిచేసిన అనుభవంతో, వాటిలోని సమస్యలను అర్థం చేసుకున్న ఈయన.. వాటికి పర్‌ప్లెక్సిటీ, కామెట్‌లను పరిష్కారంగా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్
చెన్నైలో ఒక సాధారణ విద్యార్థి మాదిరిగానే అరవింద్ ప్రయాణం ప్రారంభమైంది. దేశంలోనే అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్‌లో చదవాలన్న తన తల్లి కోరికను నెరవేరుస్తూ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం, అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ కూడా పొందారు.
కృత్రిమ మేధస్సు(AI) గురించి, ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు దానిని ఎలా వినియోగించవచ్చో లోతైన అవగాహన కలిగేందుకు తన విద్యా నేపథ్యం తనకు ఉపయోగపడిందని శ్రీనివాస్ అంటున్నారు.
పర్‌ప్లెక్సిటీ ఎలా పనిచేస్తుంది?
మీరు పర్‌ప్లెక్సిటీని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, అది వెంటనే శోధించి.. వార్తా సంస్థలు, పరిశోధనా పత్రాల వంటి విశ్వసనీయ సోర్సుల నుంచి సమాచారాన్ని సమీకరిస్తుంది. అనంతరం ఆ సమాచారాన్ని సరళమైన, చదివేందుకు సులువైన సమాధానంగా మారుస్తుంది. అంతేకాకుండా, ఆ సమాచారం విశ్వసించదగినదో కాదో తెలుసుకునేలా ఆయా వెబ్‌సైట్ల లింకులను కూడా సూచిస్తుంది.
సాధారణ ఏఐ ఇంజిన్లకు భిన్నంగా, పర్‌ప్లెక్సిటీ ధ్రువీకరించిన సమాచారాన్ని సేకరిస్తుంది.
"పర్‌ప్లెక్సిటీ ఇచ్చే ప్రతి సమాధానం వెబ్ నుంచి సైటేషన్ల రూపంలో వస్తుంది. దీనర్థం.. మీకు వచ్చిన సమాచారంతో పాటు అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మీరు ధ్రువీకరించుకోవచ్చు. అది నమ్మకాన్ని పెంచుతుంది" అన్నారు అరవింద్ శ్రీనివాస్.
ఏఐ రంగంలో ఇదొక పెద్ద మార్పు. ఎందుకంటే, చాలా ఏఐ సాధనాలు సమాచారం అందిస్తాయి కానీ, అది ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు అందించవు.

ఫొటో సోర్స్, Getty Images
గూగుల్‌ను సవాల్ చేయడానికి కారణమిదేనా..
2022లో ప్రారంభమైన పర్‌ప్లెక్సిటీ వేగంగా వృద్ధి చెందింది. ఇప్పుడు నెలకు దాదాపు 780 మిలియన్లు, అంటే 78 కోట్లకు పైగా శోధనలు(సెర్చ్) చేస్తోంది. ఎయిర్‌టెల్ వంటి కంపెనీల భాగస్వామ్యంతో భారత్‌లోనూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
గూగుల్‌తో పోటీపడడం వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి అరవింద్ శ్రీనివాస్ బహిరంగంగానే మాట్లాడారు. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా బిలియన్లు ఆర్జిస్తోంది. "గూగుల్.కామ్‌ను పర్‌ప్లెక్సిటీలా ఎందుకు అభివృద్ధి చేయకూడదు? ఎందుకంటే, వాళ్లు అలా చేస్తే.. యాడ్స్ నుంచి వచ్చే ఆదాయం కోల్పోతారు" అని బ్లూమ్‌బర్గ్ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. గూగుల్ క్రోమ్ రేటు అడిగే ధైర్యం చేయడానికి అసలు కారణం ఇదే.
పర్‌ప్లెక్సిటీ వంటి ఏఐ సాధనాలు మనిషి ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తాయని, తెలుసుకోవడాన్ని మరింత సంతోషకరంగా, వేగంగా మారుస్తాయని ఆయన అంటున్నారు.
"ప్రతి సమాధానం కొత్త ప్రశ్నలకు దారితీస్తుంది. దీనివల్ల మెరుగైన ప్రశ్నలు అడగడంలోనూ.. వేగవంతమైన, మెరుగైన సమాచారం పొందడంలోనూ ఏఐ మనకు సాయపడుతుంది."
(అరవింద్ శ్రీనివాస్ TED టాక్, బ్లూమ్‌బర్గ్ టీవీతో పంచుకున్న సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ ప్రచురితమైంది.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














