ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి ఒకేసారి మరణశిక్ష, ఎందుకు? అసలేం జరిగింది?

మింగ్ కుటుంబం

ఫొటో సోర్స్, CCTV

    • రచయిత, జోనాథన్ హెడ్, టెస్సా వాంగ్
    • హోదా, సౌత్ ఈస్ట్ ఏషియా కరెస్పాండెంట్, ఏషియా డిజిటల్ రిపోర్టర్

మియన్మార్‌లో స్కామ్ సెంటర్లు నడిపిన ఓ మాఫియా కుటుంబానికి చెందిన 11 మందికి చైనా కోర్టు మరణ శిక్ష విధించిందని అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది.

మింగ్ కుటుంబానికి చెందిన డజన్ల కొద్ది సభ్యులకు నేర కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు తేలడంతో కోర్టు వారిని దోషులుగా పేర్కొంది. ఈ కుటుంబంలో చాలామందికి దీర్ఘకాలిక జైలు శిక్షలు పడ్డాయి.

చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న మియన్మార్‌లోని లౌకైంగ్ పట్టణం పెద్దగా ఎవరిచూపు పడని ప్రాంతం. ఈ ప్రాంతాన్ని నియంత్రించే నాలుగు వంశాల్లో మింగ్ కుటుంబం కూడా ఒకటి.

ఈ ప్రాంతాన్ని ఆ కుటుంబం గ్యాంబ్లింగ్‌, డ్రగ్స్, స్కామ్‌ సెంటర్లకు నెలవుగా మార్చింది.

చివరికు మియన్మార్ గట్టిగా చర్యలు తీసుకుంది. 2023లో ఈ కుటుంబాలకు చెందిన అనేకమందిని అరెస్ట్ చేసి, వారిని చైనా అధికారులకు అప్పగించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చైనాలో తూర్పు నగరమైన వెన్జౌలో మింగ్ కుటుంబంలో మొత్తం 39 మందికి సోమవారం కోర్టు శిక్షలు విధించినట్లు చైనా ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ రిపోర్టు పేర్కొంది.

11 మందికి మరణ శిక్ష విధించడంతో పాటు.. మరో ఐదుగురికి రెండేళ్ల సస్పెన్షన్‌తో మరణ శిక్ష వేసింది కోర్టు.

11 మందికి జీవితకాల జైలు శిక్ష, మిగిలిన వారికి ఐదు నుంచి 24 ఏళ్లవరకు జైలు శిక్షలు పడ్డాయి.

2015 నుంచి మింగ్ కుటుంబం, ఇతర నేర ముఠాలు టెలికమ్యూనికేషన్స్ మోసాలు, అక్రమ క్యాసినోలు, డ్రగ్స్ రవాణా, వ్యభిచారం వంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు కోర్టు గుర్తించింది.

వారు గ్యాంబ్లింగ్, స్కామ్ కార్యకలాపాలతో 10 బిలియన్ యువాన్లకు పైగా అంటే 1.4 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.12,414 కోట్లకు పైగా) సంపాదించినట్లు కోర్టు పేర్కొంది.

ఇప్పటి వరకు వచ్చిన అంచనాల ప్రకారం, నాలుగు కుటుంబాల క్యాసినోలు ప్రతీ సంవత్సరం బిలియన్ల డాలర్ల నగదు లావాదేవీలు చేసినట్టు అనుమానాలు ఉన్నాయి.

అలాగే, మింగ్ కుటుంబం సహా ఇతర అక్రమ గుంపులు మోసపూరిత కేంద్రాల్లో పనిచేసే పలువురు కార్మికుల మరణాలకు కారణమయ్యారని, కొంతమందిని చైనాకు తిరిగి వెళ్లకుండా కాల్చేశారన్న విషయంలో కోర్టు స్పష్టతకు వచ్చింది.

చైనాలో, ఇతర సరిహద్దు దేశాల్లో జూదం చట్టవిరుద్ధం కావడంతో చైనా వ్యక్తుల నుంచి వస్తోన్న డిమాండ్‌ను మింగ్ కుటుంబం అవకాశంగా తీసుకుంది.

లౌకైంగ్‌లో క్యాసినోలు మనీలాండరింగ్‌కు, ట్రాఫికింగ్‌కు, డజన్ల కొద్ది స్కామ్ సెంటర్లకు లాభాదాయకమైనవిగా నిలిచాయి.

లౌక్కింగ్ పట్టణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్యాంబ్లింగ్, డ్రగ్స్, స్కామ్ సెంటర్లకు కేంద్రంగా మారిన లౌకైంగ్ పట్టణం

ఐక్యరాజ్యసమితి ''కుంభకోణంగా (scamdemic)'' పేర్కొన్న వాటికి ఇవి కేంద్రంగా మారాయి. ఈ స్కామ్ సెంటర్లు బారిన పడిన వారిలో లక్షల మందికిపైగా విదేశీయులు ఉన్నారు. వారిలో చాలామంది చైనా వ్యక్తులే.

ఈ కేంద్రాలలో గంటల కొద్ది పనిచేయాల్సి వచ్చేది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది బాధితులను లక్ష్యంగా చేసుకుని ఈ అధునాతన ఆన్‌లైన్ మోస కార్యకలాపాలు నడిపేవారు.

మియన్మార్‌లోని షాన్ రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన వారిలో మింగ్ కుటుంబం ఒకటి. లౌకైంగ్ స్కామ్ సెంటర్లను ఈ కుటుంబం నడిపింది. ఈ కేంద్రాలలో కనీసం 10 వేల మంది వర్కర్లు ఉండేవారు.

క్రౌచింగ్ టైగర్ విల్లాగా పేరున్న కాంపౌండ్ ఈ కుటుంబానిదే. ఇక్కడే వర్కర్లను కొట్టడం, వేధించడం చేసేవారు.

రెండేళ్ల క్రితం తిరుగుబాటు గ్రూపుల కూటమి ప్రారంభించిన దాడితో షాన్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి సైన్యం బయటికి వెళ్లిపోయింది. లౌకైంగ్‌ను తిరుగుబాటు గ్రూప్‌ల కూటమి స్వాధీనం చేసుకుంది.

తిరుగుబాటు గ్రూపులపై గణనీయమైన ప్రభావం చూపే చైనా, ఈ దాడికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు చాలామంది భావించారు.

కుటుంబ పెద్ద అయిన మింగ్ షెచాంగ్ (Ming Xuechang) ఆత్మహత్య చేసుకున్నారు. ఇతర కుటుంబ సభ్యులను చైనా అధికారులకు అప్పగించారు. కొంతమంది అధికారుల ముందు తమ తప్పును ఒప్పుకుని పశ్చాత్తాపానికి గురయ్యారు.

ఈ స్కామ్ సెంటర్లలో పనిచేసిన వేలాదిమందిని చైనా పోలీసులకు అప్పగించారు. సరిహద్దుల్లో స్కామ్ బిజినెస్‌లు నిర్వహించే వారితో కఠినంగా వ్యవహరించనున్నామనే సంకేతాన్ని ఈ శిక్షతో చైనా వారికి ఇచ్చింది.

ఈ ఏడాది ప్రారంభంలో మియన్మార్‌తో ఉన్న సరిహద్దు గుండా స్కామ్ సెంటర్లు నడుపుతోన్న వారిపై చర్యలు తీసుకోవాలని థాయిలాండ్‌పై కూడా బీజింగ్ ఒత్తిడి చేస్తోంది.

అయినా, ఈ వ్యాపారం ఇంకా నడుస్తూనే ఉంది. దీనిలో ఎక్కువ భాగం ఇప్పుడు కంబోడియా నుంచి సాగుతోంది. అయినప్పటికీ, మియన్మార్‌లో దీని ఉనికేమీ తగ్గలేదు, అదే స్థాయిలో నడుస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)