Preferred Sources: గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో సరికొత్త ఫీచర్, మీకు నమ్మకమైన వెబ్‌సైట్ వార్తలు పొందండిలా..

ఫొటో సోర్స్, Getty Images
చాలామందికి గూగుల్‌లో ఏదైనా వార్త గురించి సెర్చ్ చేసినపుడు, వారికి నమ్మకంగా భావించే వెబ్‌సైట్‌ల నుంచి వార్త కనిపించకపోవచ్చు. ఇప్పుడు, గూగుల్ తీసుకొచ్చిన ఓ కొత్త ఫీచర్.. అలాంటి వెబ్‌సైట్‌ల నుంచి(పబ్లిష్ అయ్యి ఉంటే) ప్రాధాన్యతా క్రమంలో స్టోరీలు అందించనుంది.
గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ 'ప్రిఫర్డ్ సోర్సెస్ (Preferred Sources)'. గూగుల్ దీన్ని సెర్చ్ ఇంజిన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన లేదా వారికి నమ్మకమైన వార్తాసంస్థల వెబ్‌సైట్లు, బ్లాగులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఎంపిక చేసిన వెబ్‌సైట్ల కంటెంట్ గూగుల్ సెర్చ్‌లోని 'టాప్ స్టోరీస్' విభాగంలో ప్రాధాన్యతా క్రమంలో కనిపిస్తుంది.
యూజర్ల అభిరుచుల ఆధారంగా సంబంధిత కంటెంట్ అందించడమే దీని లక్ష్యంగా గూగుల్ పేర్కొంది. ఇంతకీ దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేసుకోవాలి?
స్టెప్-1: మీరు గూగుల్‌లో తెలుగులో ఏదైనా వార్తను సెర్చ్ చేసినపుడు, వివిధ వెబ్‌సైట్‌ల నుంచి వార్తలు, కథనాలున్న టాప్ స్టోరీస్ విభాగం కనిపిస్తుంది.
ఉదాహరణకు, 'అమెరికా వీసా ఫీజు' గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినపుడు వివిధ వార్తా సంస్థలు పబ్లిష్ చేసిన కథనాలు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Google
మీకు సెర్చ్ ఫలితాల్లో సాధారణంగా 'టాప్ స్టోరీస్ (Top stories) ' సెక్షన్ కనిపిస్తుంటుంది. ఆ టాప్ స్టోరీస్ విభాగం పక్కన ఒక స్టార్ (*) ఐకాన్ ఉంటుంది.
స్టెప్-2: స్టార్ (*) ఐకాన్‌పై క్లిక్ చేస్తే, మీరు 'ప్రిఫర్డ్ సోర్సెస్' పేజీలోకి వెళతారు. ఇందులో సెర్చ్ ద్వారా మీకు నచ్చిన వెబ్‌సైట్లను ఎంపిక చేయాలి.

ఫొటో సోర్స్, Google
స్టెప్-3: ఉదాహరణకు సెర్చ్ చేసిన ప్రతీసారి బీబీసీ నుంచి ఆ వార్త కనిపించాలంటే, 'ప్రిఫర్డ్ సోర్సెస్' పేజీ సెర్చ్‌లో 'bbc.com' అని టైప్ చేసి, కుడి వైపున ఉన్న బాక్స్‌ను టిక్ చేయండి.
ఆ తర్వాత కింద ఉన్న 'రీలోడ్ రిజల్ట్స్' బటన్‌పై క్లిక్ చేయండి.
ఇక మీ సెట్టింగ్ పూర్తయినట్లే, ఇపుడు మరోసారి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేయండి.

ఫొటో సోర్స్, Google
మొదటిసారి టైప్ చేసినట్లు 'అమెరికా వీసా ఫీజు' అని తెలుగులో సెర్చ్ చేయగానే, మీకు బీబీసీ తెలుగు వెబ్‌సైట్ నుంచి వార్త టాప్ స్టోరీస్‌లో కనిపిస్తుంది.
బీబీసీ పక్కన మీకు 'స్టార్' గుర్తు కూడా కనిపిస్తుంది (ఇది మీ సెట్టింగ్ ఆధారంగా అందిస్తున్నట్లు అర్థం).

ఫొటో సోర్స్, Google
అదే మీరు 'US Visa Fee' అని టైప్ చేస్తే బీబీసీ ఇంగ్లిష్ వెబ్‌సైట్ 'bbc.com' నుంచి న్యూస్ టాప్ స్టోరీస్‌లో కనిపిస్తుంది.
ఇలా మీరు ఏ వార్త గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినా, ఆ విషయంపై పబ్లిష్ అయిన బీబీసీ వార్త 'టాప్ స్టోరీస్'లో కనిపిస్తుంటుంది.

ఫొటో సోర్స్, Google
గూగుల్ ఏం చెప్పింది?
గూగుల్ సెర్చ్ ప్రోడక్ట్ మేనేజర్ డంకన్ ఓస్బోర్న్ గత నెలలో ఒక బ్లాగ్ పోస్ట్‌లో 'ప్రిఫర్డ్ సోర్సెస్' ఫీచర్ ఉద్దేశాన్ని వివరించారు.
ఇది సెర్చ్ ఫలితాలను యూజర్లే కస్టమైజ్ చేసుకునే అవకాశం కల్పిస్తుందని డంకన్ అన్నారు.
దీంతో ప్రజలు తమకు ఇష్టమైన వెబ్‌సైట్‌ల నుంచి కంటెంట్‌ను పొందగలరన్నారు. డంకన్ పూర్తి పోస్ట్ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














