హెచ్1బీ వీసా: అమెరికా వెళ్లిన భారతీయ నిపుణుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకురాగలదా? అడ్డంకులేంటి...

హెచ్1బీ వీసా, భారత ప్రభుత్వం, అమెరికా, డోనల్డ్ ట్రంప్, వీసా దరఖాస్తు రుసుం, టెక్ నిపుణులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిఖిల్ ఇనాందార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ డోనల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్కడ ఉంటున్న నిపుణులైన భారతీయుల్ని వెనక్కి తీసుకురావచ్చన్న ఆలోచనను ఇక్కడి పాలకుల్లో కల్పించింది.

విదేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి వచ్చి దేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితంగా ఉండే అధికారి ఒకరు చెప్పారు.

హెచ్1బీ వీసాలు అమెరికాకు ఉపయోగపడతాయని, వాటి దరఖాస్తు ఫీజు పెంచడం వల్ల అంతర్జాతీయ ప్రతిభను భారతదేశంవైపు ఆకర్షించే అవకాశం ఏర్పడుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యుడొకరు చెప్పారు.

ఈ వాదనల సారాంశం ఏంటంటే...

30 ఏళ్లుగా టెక్నాలజీ, మెడికల్, ఇతర ఇన్నోవేటివ్ రంగాలలో భారత్ నుంచి వలస వెళ్లిన అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ ద్వారా తిరిగి రప్పించాల్సిన సమయం ఆసన్నమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో వలసదారులు, ముఖ్యంగా భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ప్రవాసులను ఈ దిశగా ఆలోచించేలా చేస్తోందని చెప్పడానికి కొన్ని సంఘటనలు ఉన్నాయి.

అయితే లక్షల మందిని బెల్లేవ్ (వాషింగ్టన్‌లోని ఒక ప్రాంతం. ప్రముఖ టెక్ కంపెనీలకు ఇక్కడ కార్యాలయాలు ఉన్నాయి ) నుంచి బెంగళూరు తీసుకురావడం చెప్పినంత తేలిక్కాదని కొంతమంది నిపుణులు బీబీసీతో అన్నారు.

హెచ్1బీ వీసా, భారత ప్రభుత్వం, అమెరికా, డోనల్డ్ ట్రంప్, వీసా దరఖాస్తు రుసుం, టెక్ నిపుణులు

ఫొటో సోర్స్, Nithin Hassan

ఫొటో క్యాప్షన్, నితిన్ హాసన్ మెటాలో మిలియన్ డాలర్ల ఉద్యోగాన్ని వదిలేసి భారత్ వచ్చారు

భారత్ రావాలనుకునే వారి సంఖ్య పెరిగింది

20 ఏళ్ల కిందట అమెరికాలో స్థిరపడిన కొంతమంది భారతీయుల్లో నితిన్ హాసన్ ఒకరు. గతేడాది ఆయన బెంగళూరు రావాలని హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు.

అయితే అదంత తేలికైన నిర్ణయం కాదు. ఎందుకంటే, మెటాలో లక్షల రూపాయల జీతాన్ని వదులుకుని భారత్‌లో అనిశ్చితిలో ఉన్న స్టార్టప్‌ల రంగంలోకి వెళ్లాలని తీసుకున్న నిర్ణయమది.

"సొంతంగా ఏదో ఒకటి చేయాలని అనుకునేవాడిని. అయితే వలసదారుడిగా అమెరికాలో అందుకు నాకున్న స్వేచ్ఛ చాలా తక్కువ" అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఆయన భారత్ తిరిగొచ్చిన తర్వాత రెండు స్టార్టప్‌లు ప్రారంభించారు. ఇందులో అమెరికాలో స్థిరపడిన భారతీయులు ‘‘స్వదేశానికి తిరిగి రావడం వల్ల కలిగే భావోద్వేగ, ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లను అధిగమించడంలో సాయపడే బీ2ఐ (బ్యాక్2 ఇండియా) అనే ప్లాట్‌ఫామ్ కూడా ఉంది.

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక వలసదారులతో వ్యవహరిస్తున్న తీరు చూసి, అమెరికా వెళ్లాలని భావిస్తున్న అనేకమంది తమకు ఫోన్ చేస్తున్నారని, హెచ్1బీ గొడవల వల్ల ఇది ఇంకా పెరగవచ్చని ఆయన బీబీసీతో చెప్పారు.

"తమకు ఇకపై గ్రీన్ కార్డు రాకపోవచ్చని అనేకమంది నిపుణులు భావిస్తున్నారు. బ్యాక్‌2 ఇండియాను సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత మాకు వచ్చే కాల్స్ మూడురెట్లు పెరిగాయి. గత 6 నెలల్లో 200 మందికి పైగా ఎన్ఆర్ఐలు, తిరిగి రావడానికి ఉన్న అవకాశాల గురించి అడిగారు" అని హసన్ చెప్పారు.

అమెరికా యూనివర్సిటీల్లో భారతీయ ప్రతిభావంతుల కోసం వెదుకుతున్న వాళ్లు ఈ మార్పు నిజమేనంటున్నారు.

"ఐవీ లీగ్ యూనివర్సిటీల్లో చదువుతూ, చదువు పూర్తైన తర్వాత ఇండియా వెళ్లిపోవాలని భావిస్తున్న విద్యార్థుల సంఖ్య ఈ సీజన్‌లో 30శాతం పెరిగింది" అని బీడీఓ ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సీఈఓ శివానీ దేశాయ్ బీబీసీతో చెప్పారు.

ఈ అనిశ్చితి భారత సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను అమెరికాలో తమ కెరీర్ గురించి తీవ్రంగా ఆలోచించేలా చేస్తోందని ఆమె అన్నారు.

"అనేకమంది ఇప్పటికే ఇక్కడ స్థిరపడినప్పటికీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర సీనియర్ మేనేజర్లు భారత్‌కు వెళ్లిపోవడాన్ని సీరియస్‌గా ఆప్షన్‌గా భావిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది’’ అని దేశాయ్ చెప్పారు.

భారత్‌లోని బహుళజాతి కంపెనీల రిమోట్ కార్యాలయాలు లేదా గ్లోబల్ కేపబలిటీ సెంటర్లు (జీసీసీ) పెరిగాయి. ఈ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉండటం కూడా సొంత దేశానికి వెళ్లాలనుకునే భారతీయుల ఆలోచనకు బలం చేకూరుస్తోంది.

టెక్ నిపుణులకు అమెరికా ద్వారాలు మూస్తే, ఈ కార్యాలయాలు అలాంటి నిపుణులకు కేంద్రంగా మారవచ్చు. దీని వల్ల జీసీసీలు ప్రతిభావంతులకు మరింత ఆకర్షణీయంగా మారతాయని అస్సెట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెలిపింది.

హెచ్1బీ వీసా, భారత ప్రభుత్వం, అమెరికా, డోనల్డ్ ట్రంప్, వీసా దరఖాస్తు రుసుం, టెక్ నిపుణులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజు పెంచిన తర్వాత భారతీయ టెకీలకు జర్మనీ రెడ్ కార్పెట్ పరుస్తోంది.

ప్రభుత్వం సీరియస్‌గా ఉందా?

అమెరికాకు వలస వెళ్లిన మేథో సంపత్తిని తిరిగి తీసుకు రావడానికి ప్రభుత్వం వైపు నుంచి సీరియస్‌గా ప్రయత్నం జరగాలని, అయితే ప్రస్తుతం అది కనిపించడం లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహదారుగా పని చేసిన సంజయ్ బారు చెప్పారు.

"తాను వెనక్కి రప్పించాలని భావిస్తున్న అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు, నిపుణులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను విదేశాలకు వెళ్లి గుర్తించాలి. ఈ ప్రయత్నం ప్రభుత్వంలో ఉన్నత స్థాయి నుంచి జరగాలి" అని ఆయన బీబీసీతో అన్నారు.

అంతరిక్షం, అణు సాంకేతికతవంటి రంగాలలోని ప్రతిభావంతుల్ని స్వదేశానికి తీసుకురావడానికీ, ఇండియన్ ఇన్‌స్టిట్‌ట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేయడానికీ భారత తొలి ప్రధాని నెహ్రూ ఆ రోజుల్లో ఇలాగే చేశారని సంజయ్ బారు గుర్తు చేశారు.

"నెహ్రూ స్థిరమైన నిర్ణయాలు, జాతీయవాదంతో ముందుకు సాగారు. తిరిగి వచ్చే వారికి ఇప్పుడు అలాంటి ప్రోత్సాహం ఎక్కడుంది?" అని ఆయన ప్రశ్నించారు.

హెచ్1బీ వీసా, భారత ప్రభుత్వం, అమెరికా, డోనల్డ్ ట్రంప్, వీసా దరఖాస్తు రుసుం, టెక్ నిపుణులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత నగరాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ విధానాలే పెద్ద సమస్యగా కనిపిస్తోంది.

ప్రతికూలతలు తగ్గించాలి

ఇక్కడి ప్రతికూలతలు అంటే చట్టపరమైన నిబంధనలు, అధికార యంత్రాంగపు నిర్లక్ష్య వైఖరి, వ్యాపారానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించకపోవడం వంటివి దశాబ్దాలుగా సంపన్నులు, అధిక సంపాదన కలిగిన భారతీయులు వలస వెళ్లి పోవడానికి ప్రధానమైన కారణాలు.

2020 నుంచి దాదాపు 5 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు పౌరసత్వం వదులుకోవడం, ఇతర దేశాలలో స్థిరపడుతున్న మిలియనీర్లు అధికంగా ఉన్న టాప్ 5 దేశాలలో భారత్ కూడా ఒకటి.

విదేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి తీసుకు వచ్చే విషయంలో ప్రభుత్వం నిజంగా సీరియస్‌గా ఉంటే, అనేక అడ్డంకులను తొలగించాలని హాసన్ అన్నారు.

ఇందులో సరళమైన పన్నుల విధానం, స్పెషల్ స్టార్టప్ వీసాలవంటి ప్రోత్సాహకాలతోపాటు, మౌలిక సదుపాయాలు, పెరిగిపోతున్న పట్టణ రద్దీ వంటి సమస్యలను కూడా పరిష్కరించాల్సి ఉంటుంది.

అంటే దీని అర్ధం, మేధావులు, విద్యావంతులు ఎదగడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలని.

‘‘వారి సొంత దేశంలో పరిశోధన, అభివృద్ధిని మెరుగుపరచడం, విద్యలో స్థాయిని పెంచడం కూడా ఇందులో భాగంగా ఉండాలి’’ అని సంజయ్ బారు అన్నారు.

ఎందుకంటే, గత 50 ఏళ్లలో భారతీయ ప్రతిభను అమెరికాకు ఇంతగా ఆకర్షించిన అంశాలు ఇవే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)