అమెరికా: గుర్తు తెలియని వ్యక్తి కాల్పుల్లో హైదరాబాద్‌ విద్యార్థి మృతి.. అసలేం జరిగింది?

అమెరికా, కాల్పులు, తెలుగు విద్యార్థి, హైదరాబాద్

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, కాల్పుల్లో మృతిచెందిన చంద్రశేఖర్
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి చంద్రశేఖర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

ఎల్బీ నగర్‌కి చెందిన పోలె చంద్రశేఖర్ 2023లో అమెరికా వెళ్లారు. అక్కడే చదువుకుని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఒక పెట్రోల్ బంకులో తాత్కాలికంగా పనిచేస్తున్నారు.

శుక్రవారం(అక్టోబరు 4) రాత్రి చంద్రశేఖర్ పెట్రోలు బంకులో ఉన్న సమయంలో కారులో పెట్రోల్ కోసం వచ్చిన ఒక గుర్తు తెలియని వక్తి చంద్రశేఖర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. ఆ వ్యక్తి కాల్పులు ఎందుకు జరిపాడనేదానిపై స్పష్టత లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. చంద్రశేఖర్ స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

28 ఏళ్ల చంద్రశేఖర్ హైదరాబాద్‌లో బీడీఎస్ (దంత వైద్యం) చదువుకున్నారు. ఆయన తండ్రి కొన్నాళ్ల క్రితమే మరణించారు.

ఆయన సోదరులు, తల్లి ఎల్బీనగర్ దగ్గరలోని బీఎన్ రెడ్డి నగర్ లో ఉంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

చంద్రశేఖర్ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

అమెరికా, కాల్పులు, తెలుగు విద్యార్థి, హైదరాబాద్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఉన్నత చదువుల కోసం చంద్రశేఖర్ అమెరికా వెళ్లారు.

‘ఎంతో కష్టపడి అమెరికా పంపాం’

అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం దీనిపై స్పందించింది.

''హైదరాబాద్ కి చెందిన విద్యార్థి చంద్రశేఖర్ డెంటన్‌లో జరిగిన కాల్పుల్లో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులతో మేం మాట్లాడుతున్నాం. అవసరమైన సహాయం చేస్తాం. స్థానిక యంత్రాంగం ఘటనపై విచారణ చేపడుతోంది. మేం వారితో సంప్రదింపులు జరుపుతున్నాం'' అని ఎ రాయబార కార్యాలయ అధికారులు క్స్ లో పోస్ట్ చేశారు.

అమెరికాలో దుండగులు, పోలీసుల కాల్పుల్లో భారతీయులు చనిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల కాలిఫోర్నియా రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన నిజాముద్దీన్ చనిపోయారు.

''ఎంతో కష్టపడి, ఖర్చు పెట్టి మా తమ్ముడిని అమెరికా పంపాం. మా తమ్ముడి మృతదేహాన్ని తీసుకురావడానికి సహకరించాలని కోరుతున్నాం. ఈ ఘటన గురించి తమ్ముడి స్నేహితులు చెప్పారు. తప్పు చేసిన వారిని శిక్షించాలి'' అని చంద్రశేఖర్ సోదరులు ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు.

అమెరికా, కాల్పులు, తెలుగు విద్యార్థి, హైదరాబాద్

ఫొటో సోర్స్, Harishrao office

ఫొటో క్యాప్షన్, చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను హరీశ్‌రావు పరామర్శించారు.

‘నల్లజాతి వ్యక్తి కాల్పులు జరిపినట్టు తెలిసింది’

''మా అబ్బాయి రెండేళ్ళ క్రితం అమెరికా వెళ్లాడు. ఇక్కడ బీడీఎస్ చదివాడు. పీజీ చేస్తానని వెళ్లాడు. బాబు స్నేహితుల తల్లితండ్రులు వచ్చి మాకు ఈ విషయం చెప్పారు. అక్కడ నల్లజాతి వ్యక్తి హత్య చేశాడని మాకు తెలిసింది. నా కుమారుడి మృతదేహం వీలైనంత త్వరగా తెప్పించాలని కోరుతున్నాను. అలాగే అక్కడి భారతీయులకు రక్షణ కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి'' అని ఆయన తల్లి కోరారు.

బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు కుటుంబ సభ్యులను వారి ఇంటికి వెళ్లి కలిశారు. ''బీడీఎస్ పూర్తి చేసి, పై చదువుల కోసం అమెరికా వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం'' అని హరీశ్ రావు చెప్పారు.

''అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఎల్బీ నగర్ కు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించింది. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం'' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్‌లో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)