ట్రంప్ శాంతి ఒప్పందం: గాజా ప్రజలు ఏమంటున్నారు, బందీల కుటుంబాలు ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, రష్దీ అబులోఫ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శాంతి ఒప్పందంపై హమాస్ సానుకూల ప్రతిస్పందనను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్వాగతించడంపై గాజా ప్రజలు వివిధరకాలుగా స్పందిస్తున్నారు. వారి స్పందనలో ఆశ్చర్యం, భయం, అనిశ్చితి కనిపిస్తున్నాయి.
"యుద్ధం ముగిసిందా?" "ఇదంతా కలా, నిజమా?" అంటూ వందలాది మంది పాలస్తీనియన్లు పంపిన సందేశాలు నా సోషల్ మీడియా ఖాతాలో వెల్లువెత్తాయి.
రాత్రికి రాత్రే మారిపోయిన పరిణామాలను ప్రజలు వెంటనే అర్థం చేసుకోలేకపోతున్నారు.

మధ్యవర్తుల సహాయంతో వ్యూహాత్మకంగా రాసినట్లుగా భావిస్తున్న హమాస్ స్పందనలో, నేరుగా ప్రతిపాదనను తిరస్కరించకుండా, కొన్ని షరతులతో స్పష్టంగా ఒప్పుకున్నట్లు కనిపిస్తోంది.
బందీల విడుదల, గాజా పాలనను పాలస్తీనా టెక్నోక్రాట్లకు అప్పగించడం వంటి ట్రంప్ నిబంధనలను హమాస్ అంగీకరించింది కానీ ట్రంప్ 20 అంశాల ప్రణాళికలోని మరెన్నో విషయాలపై స్పష్టమైన సమాధానం మాత్రం ఇవ్వలేదు.
హమాస్ వ్యూహాత్మక సమాధానం బంతిని ఇజ్రాయెల్ కోర్టులో పడేసిందని అనేకమంది పాలస్తినీయన్లు చెబుతున్నారు.
ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే "హమాస్ శాంతికి సిద్ధంగా ఉందని నమ్ముతున్నాను. గాజాపై ఇజ్రాయెల్ బాంబుదాడులను ఆపాలి." అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఫొటో సోర్స్, Reuters
హమాస్ ఉచ్చులో చిక్కుకుందా?
ఈ విషయంపై పాలస్తీనా ప్రజలు ఆశనిరాశలతో స్పందిస్తున్నారు.
హమాస్ ఉచ్చులో పడిందని, యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించడానికే ఇజ్రాయెల్ తన బందీలను విడిపించుకుంటోందని కొందరు భయపడుతున్నారు. కానీ రెండేళ్లనుంచి సాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి చరిత్రాత్మక అవకాశం వచ్చిందని మరికొందరు నమ్ముతున్నారు.
ఇప్పుడు ఓపికగా ఉండడం ముఖ్యం అని ఇబ్రహీం ఫరెస్ బీబీసీతో అన్నారు.
"అత్యుత్సాహంతో ఆశలు పెట్టుకోకండి. ఇంకా వివరాలపై అనేక చర్చలు జరగాలి. అసలైన ముప్పు తరచూ చిన్న వివరాల్లోనే దాగి ఉంటుంది," అని ఆయన చెప్పారు. "లెబనాన్‌ను చూడండి. అక్కడ ఇప్పటికీ నిరాశ్రయులున్నారు, విమానదాడులు కొనసాగుతూనే ఉన్నాయి'' అన్నారు.
హమాస్ స్పందన సహజంగా సూటిగా కాకుండా ఈసారి భిన్నంగా ఉంది. అని ఫేస్‌బుక్‌లో రాశారు మహ్మూద్ దహేర్.
సాధారణంగా ‘యస్’ అంటూ వచ్చే స్పందన తరువాత 'కానీ' అనే షరతు ఈసారి కనిపించలేదు.
బందీల విడుదలకు , యుద్ధం ముగింపుకు, అధికారాన్ని పాలస్తీనా పరిపాలనకు అప్పగించడానికి అన్నీటికీ హమాస్ అంగీకరించింది. 'కానీ' అనే పదాలు తరువాతే వచ్చాయి. హమాస్ ట్రంప్‌పై ఈసారి ప్రశంసలు కురిపించింది అన్నారు.
కానీ హమాస్ స్పందనను అందరూ సులభంగా నమ్మట్లేదు.
గాజాకు చెందిన సామాజిక కార్యకర్త, హమాస్ విమర్శకుడు ఖలీల్ అబూ షమ్మాలా ఈ నిర్ణయం ఉద్యమ ఉనికికి సంబంధించిందని చెప్పారు.
"ఇది ప్రజల మేలు కోసం కాదు, హమాస్ తన ఉనికిని నిలబెట్టుకోవడానికే పన్నిన వ్యూహం. దీన్ని వారు జ్ఞానోదయం అనుకుంటున్నారు కానీ ఇది అధికార పోరాటం. నిజానికి ఆ ప్రకటన హమాస్ రాసినదేనా అన్నదానిపై కూడా నాకు సందేహం ఉంది"
కాగితం మీద రాసిన ఈ మాటలు యుద్ధాన్ని నిజంగా ఆపగలవా అన్నది తెలుసుకునేందుకు గాజా ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ఫొటో సోర్స్, Thierry Monasse/Getty Images
బందీల కుటుంబాలు ఏం చెబుతున్నాయి?
గాజాలో బందీలుగా ఉన్న తమ ఆప్తులు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శాంతి ప్రతిపాదన వల్ల తిరిగి వస్తారనే ఆశతో ఉన్నామని ఇజ్రాయెలీ బందీల కుటుంబాలు బీబీసీకి చెప్పారు.
వికీ కోహెన్ కుమారుడు అయిన 20 ఏళ్ల నిమ్రోడ్ గాజాలో ఉన్న 20మంది బందీలలో ఒకరు. ఆయన ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని భావిస్తున్నారు. శనివారం ఉదయం తాను ఎంతో ఆశతో నిద్రలేచినట్టు వికీ కోహెన్ చెప్పారు. కానీ ''ఏదైనా తప్పు జరుగుతుందేమో'' అనే భయం కూడా ఉందన్నారు.
''ఇది చాలా సున్నితమైన పరిస్థితి. ఇంకోసారి నిరాశచెందాలనుకోవడంలేదు. త్వరలోనే నేను నా కుమారుడిని చూస్తాననని, అతనిని హత్తుకోవాలని అనుకుంటున్నాను''అని చెప్పారు వికీ కోహెన్.
నిమ్రోడ్‌కు ప్రస్తుతం 21 ఏళ్లు. 19 ఏళ్ల వయసులో సైనికుడిగా ఉన్న నిమ్రోడ్‌ను గాజా సరిహద్దు హమాస్ కిడ్నాప్ చేసింది. అక్టోబరు 7, 2023 హమాస్ ఇజ్రాయెల్‌పై దాడిచేసిన సందర్భంలోనే ఈ కిడ్నాప్ చేసింది. ఆ దాడిలో మొత్తం 1200మంది చనిపోయారు. 251మందిని హమాస్ బందీలుగా పట్టుకుపోయింది.
తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీలందరినీ (చనిపోయిన, బతికున్న) విడుదల చేయడానికి హమాస్ అంగీకరించింది. కానీ అమెరికా శాంతి ప్రతిపాదనలోని అనేక కీలక అంశాలపై చర్చలు అవసరమని తెలిపింది.
హమాస్ ప్రతిస్పందన తెలియగానే ట్రంప్, ట్రూత్ సోషల్ వేదికగా "వారు శాశ్వత శాంతికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను" అఅన్నారు
ఇజ్రాయెల్ "బాంబుల దాడులను తక్షణమే నిలిపేయాలని, బందీలను సురక్షితంగా బయటకు తీసుకురావాలి" అని పిలుపునిచ్చారు.
అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు "బందీల తక్షణ విడుదలకు సంబంధించిన ట్రంప్ ప్రణాళిక మొదటి దశను అమలు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది" అని ప్రకటించారు.

రాబోయే రోజులలో చర్చల పునరుద్ధరణ
రాబోయే రోజుల్లో ఈజిప్ట్‌లొ ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు తిరిగి ప్రారంభం కానున్నాయి.శనివారం రాత్రి టెల్ అవీవ్‌లో బందీల విడుదల, యుద్ధం ముగింపు కోరుతూ వేలాది ప్రదర్శన చేశారు. హోస్టేజస్ స్వ్కేర్ వద్ద "మీరు ఒంటరిగా లేరు" అంటూ వారు నినదించారు.
బందీల తల్లులు, కుటుంబ సభ్యులు వేదికపైకి ఎక్కి తమ బంధువుల విడుదలను ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. "నెతన్యాహు, మా ఆశలను,మా ఊపిరిని ఆవిరి చేయకు," అంటూ ఐనావ్ జాంగౌకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కుమారుడు గాజాలో బందీగా ఉన్నారు.
''మీకు కేవలం వాళ్లు బందీలు. కానీ అతను నా కుమారుడు. వాడు నా సర్వస్వం. బందీలు ఈ దేశపు గుండెచప్పుడు'' అన్నారు.
తన సోదరులిద్దరూ గలీ, జివ్ గాజాలో బందీలుగా ఉన్నారన్న లిరాన్ బెర్మాన్ "ఇది చివరి అవకాశం. మళ్లీ ఒప్పందం విఫలం కాకూడదు" అన్నారు.
మాజీ బందీ ఒమర్ షెమ్ తోవ్ ట్రంప్‌ను ఉద్దేశించి, "ఈ ఒప్పందం తప్పక అమలవ్వాలి. ప్రపంచం ఇప్పుడు మమ్మల్ని గమనిస్తోంది," అని విజ్ఞప్తి చేశారు.
టెలివిజన్ ప్రసంగంలో "వచ్చే కొన్ని రోజుల్లో బందీల విడుదలపై సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు నెతన్యాహు.
బందీల కుటుంబాల్లో రెండు సంవత్సరాల తర్వాత మొదటిసారి నిజమైన ఆశ కనిపిస్తోంది, కానీ అదే సమయంలో భయమూ లేకపోలేదు.














