అమెరికా షట్‌డౌన్: అసలేమిటీ షట్‌డౌన్, ట్రంప్ ప్రభుత్వంపై ప్రభావమేంటి?

వైట్ హౌస్, అమెరికా, షట్‌డౌన్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, WHITE HOUSE

ఫొటో క్యాప్షన్, వైట్‌హౌస్ వెబ్‌సైట్‌లో షట్‌డౌన్ క్లాక్

అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్ షట్‌డౌన్ మొదలైంది.

దీని కారణంగా, వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా బలవంతంగా సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది.

అంతేకాకుండా, అత్యవసరంకాని ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది.

అసలు అమెరికా షట్‌డౌన్ అంటే ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుంది? డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై అది ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వాస్తవానికి, ప్రభుత్వ వ్యయంపై ఏకాభిప్రాయం సాధించడంలో అమెరికా సెనేట్ విఫలమైంది. అందువల్ల, దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందలేదు.

2018 తర్వాత అమెరికాలో ప్రభుత్వం షట్‌డౌన్ కావడం ఇదే తొలిసారి. దీనివల్ల అత్యవసరంకాని ఉద్యోగులు జీతం లేకుండానే సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది.

ప్రభుత్వానికి నిధులు సమకూర్చాలన్న డెమోక్రాట్ల ప్రతిపాదన అమెరికా సెనేట్‌లో వీగిపోయింది. ఈ బిల్లు 47 : 53 ఓట్ల తేడాతో ఆమోదం పొందలేకపోయింది.

షట్‌డౌన్‌ను నివారించే ఉద్దేశంతో రూపొందించిన ఈ ప్రతిపాదన, 100 మంది సభ్యులున్న సెనేట్‌లో అవసరమైన 60 ఓట్లు సాధించలేకపోయింది. ఆ తర్వాత, రిపబ్లికన్ ఫండింగ్ బిల్లు కూడా 55 : 45 ఓట్ల తేడాతో వీగిపోయింది.

అనంతరం, వైట్‌హౌస్ వెబ్‌సైట్‌లో 'షట్‌డౌన్ కౌంట్‌డౌన్' క్లాక్ తెరపైకి వచ్చింది. "డెమోక్రాట్ షట్‌డౌన్, ప్రజలు డెమోక్రాట్ల చర్యతో ఏకీభవించరు" అని పేర్కొన్నారు.

వైట్ హౌస్, అమెరికా, షట్‌డౌన్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

'షట్‌డౌన్' అంటే ఏమిటి?

అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రతి ఏటా కచ్చితంగా బడ్జెట్‌ను ఆమోదించాలి. ఈ నిధుల బిల్లుపై సెనేట్, హౌస్ విభేదిస్తే ప్రభుత్వ సంస్థలు నిధులు పొందలేవు. ఆయా విభాగాల్లో ఉద్యోగులకు జీతాలు ఉండవు.

ఫలితంగా, అత్యవసరం కాని సేవలు, కార్యాలయాలు మూతపడతాయి. దీన్నే 'షట్‌డౌన్'గా వ్యవహరిస్తారు.

వైట్ హౌస్, అమెరికా, షట్‌డౌన్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

వైట్‌హౌస్ ఏమందంటే..

ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి షట్‌డౌన్ అవుతుందని 'వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్' కూడా ఒక మెమో జారీ చేసింది. దీనిపై డైరెక్టర్ రసెల్ వాట్ సంతకం చేశారు.

ఈ 'షట్‌డౌన్'కు మీరంటే మీరే కారణమని డెమోక్రాట్లు, రిపబ్లికన్లు నిందించుకుంటున్నారు.

రిపబ్లికన్లు కాంగ్రెస్‌ను నియంత్రిస్తారు. కానీ, ఏదైనా వ్యయ బిల్లును ఆమోదించడానికి వారికి సెనేట్‌లో అవసరమైన 60 ఓట్లు లేవు.

షట్‌డౌన్ ప్రభావం భారీగానే ఉంటుంది. నేషనల్ పార్కులు మూసేశారు. కార్మిక శాఖ పరిధిలోని 'బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్' కూడా మూతపడుతుంది.

అంటే, శుక్రవారం విడుదల చేయాల్సిన ఉద్యోగాల నెలవారీ నివేదిక విడుదలకాదు. ఇటీవలి నెలల్లో నియామకాలు తగ్గించిన నేపథ్యంలో ఈ నివేదిక విడుదలపై ఆసక్తి నెలకొంది.

ఇప్పుడీ నివేదిక విడుదల కాకపోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థ చిత్రాన్ని మరింత అస్పష్టం చేస్తుందని, ఇప్పటికే ఉన్న అనిశ్చితిని ఇంకా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. అనేక ప్రభుత్వ విభాగాలు మూతపడతాయి.

అయినప్పటికీ మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సోషల్ సెక్యూరిటీ వంటి అత్యవసర సేవలు కొనసాగుతాయి.

వైట్ హౌస్, అమెరికా, షట్‌డౌన్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA/Shutterstock

ప్రభుత్వ విధులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

'షట్‌డౌన్' వల్ల ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నిలిచిపోవు. సరిహద్దు భద్రత, హాస్పిటల్ మెడికల్ కేర్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తదితర విధులు యథావిధిగా కొనసాగుతాయి.

సామాజిక భద్రత, మెడికేర్ చెక్‌లు ప్రభుత్వం నుంచి పంపడమనే ప్రక్రియ కొనసాగుతుంది. కానీ, బెనిఫిట్ వెరిఫికేషన్, కార్డు జారీ నిలిచిపోవచ్చు.

అవసరమైన విభాగాల్లో కార్మికులు ఎప్పటిలాగే పనిచేస్తారు.

కొంతమందికి జీతం అందదు. అత్యవసరం కాని ప్రభుత్వ ఉద్యోగులను తాత్కాలికంగా జీతం లేని సెలవుపై పంపుతారు.

దీనర్థం ఏంటంటే.. ఆహార సహాయ కార్యక్రమాలు, ప్రభుత్వ నిధులతో నడిచే ప్రీస్కూళ్లు, విద్యార్థి రుణాల జారీ, ఆహార తనిఖీలు, నేషనల్ పార్కు కార్యకలాపాలు వంటివన్నీ తగ్గించవచ్చు లేదా నిలిపేయవచ్చు.

2018 చివర్లో కాంగ్రెస్ కొన్ని ఫండింగ్ బిల్లులను ఆమోదించినప్పుడు సంభవించిన దానికంటే ఇప్పుడీ షట్‌డౌన్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వారి అంచనా ప్రకారం, ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల్లో దాదాపు 40 శాతం మంది లేదా 8 లక్షల కన్నా ఎక్కువ మందినే తాత్కాలికంగా సెలవుపై పంపించవచ్చు.

వైట్ హౌస్, అమెరికా, షట్‌డౌన్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఆర్థిక వ్యవస్థపై 'షట్‌డౌన్' ప్రభావం...

ఆర్థిక వ్యవస్థకు నష్టం ఎంతమేర ఉంటుందనేది.. షట్‌డౌన్ ఎంతకాలం కొనసాగుతుంది, ఎంత తీవ్రంగా ఉంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ఇలాంటి అంతరాయాలు గతంలో ఏర్పడినా తాత్కాలికమే. ఏదైనా ప్రభుత్వ శాఖ మూతపడితే, కొన్ని నెలల్లోనే పరిహారం చెల్లించేవారు.

ఈసారి షట్‌డౌన్ వల్ల ఆర్థిక వృద్ధి ప్రతి వారం 0.1 శాతం నుంచి 0.2 శాతం పాయింట్లు తగ్గవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కొంతమంది ఉద్యోగులను సెలవుపై పంపడమే కాదు వారిని తొలగిస్తానని కూడా ట్రంప్ హెచ్చరించారు.

ఇప్పటికే సుంకాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ) వంటి మార్పులతో సతమతమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడీ వివాదం మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.

వైట్ హౌస్, అమెరికా, షట్‌డౌన్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

షట్‌డౌన్‌ అమెరికాలో సాధారణమేనా?

గత 50 ఏళ్లుగా అమెరికాలో షట్‌డౌన్లు సర్వసాధారణమైపోయాయి.

చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన.. 36 రోజుల పాటు కొనసాగిన షట్‌డౌన్ 2019 జనవరిలో ముగిసింది. ట్రంప్ తొలిసారి పదవీకాలంలోనే మూడుసార్లు షట్‌డౌన్లు చోటుచేసుకున్నాయి.

అంతకుముందు, రోనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు (1980లలో) 8 షట్‌డౌన్‌లు జరిగాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)