సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్‌పై దాడికి యత్నం.. కోర్టు లోపల ఏం జరిగింది?

భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ గవాయ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ గవాయ్

సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం కార్యకలాపాలు ప్రారంభమవుతున్న సమయంలో ఓ న్యాయవాది ప్రవర్తన వివాదాస్పదమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్‌పైకి ఆయన ఒక వస్తువేదో విసరడానికి ప్రయత్నించారని 'లైవ్ లా' పేర్కొంది.

ఈ అనూహ్య ఘటనతో కోర్టు హాల్‌లో కొద్ది నిమిషాల పాటు గందరగోళం ఏర్పడిందని ‘లైవ్ లా’ రాసింది.

సీజేఐతో పాటు ఇతర న్యాయమూర్తులు ఉన్న కోర్టు హాల్‌లో నినాదాలు చేస్తున్న ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని కోర్టు హాల్ బయటకు తీసుకెళ్లారని 'ఏఎన్ఐ' వార్తా సంస్థ పేర్కొంది.

‘ఆ న్యాయవాది పోడియం వద్దకు వెళ్లాడు. న్యాయమూర్తిపై విసరడానికి తన షూ తీశాడు. అయితే, కోర్టులోనున్న భద్రతాసిబ్బంది స్పందించి, ఆ న్యాయవాదిని బయటకు తీసుకెళ్లారు’ అని బార్ అండ్ బెంచ్ పేర్కొంది.

'లైవ్ లా' తెలిపిన వివరాల ప్రకారం... ఆ వ్యక్తి 'సనాతన ధర్మానికి అవమానం కలిగితే భారతదేశం సహించదు' అంటూ నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షి అయిన మరో న్యాయవాది చెప్పారు.

ఆ వ్యక్తి షూ విసరడానికి ప్రయత్నించారని ప్రత్యక్షంగా చూసిన కొంతమంది చెబుతుండగా... అతను కాగితాన్ని చుట్టి విసిరినట్లుగా కనిపించిందని మరికొందరు చెప్పారు.

ఒకటో నంబరు కోర్టులో ఉదయం 11:35 గంటల సమయంలో విచారణ జరుగుతున్నప్పుడు రాకేష్ కిశోర్ అనే న్యాయవాది తన స్పోర్ట్స్ షూ తీసి సీజేఐ గవాయ్ వైపు విసిరారు అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక రిపోర్టు చేసింది.

ఈ సంఘటనతో కాసేపు కోర్టు కార్యకలాపాలకు ఆటంకం కలిగినా, తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ సంయమనంతో ప్రశాంతంగా తదుపరి విచారణలను కొనసాగించారు.

తదుపరి కేసుకు సంబంధించిన న్యాయవాదిని తమ వాదనలు వినిపించాలని సీజేఐ కోరారు.

''దృష్టి మరల్చవద్దు, ఈ ఘటన వల్ల మేం దృష్టి మరల్చడం లేదు'' అని వ్యాఖ్యానించారని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ విషయాలను బీబీసీ స్వయంగా ధ్రువీకరించుకోలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, AFP via Getty Images

సీనియర్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో విచారణ...

ప్రస్తుతం, దాడికి పాల్పడిన ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నారని 'ఏఎన్ఐ' తెలిపింది.

న్యూదిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (డీసీపీ), సుప్రీంకోర్టు డీసీపీ సహా సీనియర్ పోలీసు అధికారుల బృందం ఆయన్ను విచారిస్తున్నారు.

'దాడికి పాల్పడిన ఆ వ్యక్తి లాయర్ దుస్తుల్లో, గుర్తింపు కార్డు వేసుకొని ఉన్నారు. చుట్టిన కొన్ని కాగితాలు అతని వద్ద ఉన్నాయి' అని ఘటన సమయంలో కోర్టులో ఉన్న న్యాయవాది అనాస్ తన్వీర్ ట్వీట్ చేశారు.

బెంచ్‌లో సీజేఐతో పాటు కూర్చున్న జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌కు ఆ వ్యక్తి క్షమాపణ చెప్పారని, తద్వారా తన దాడి లక్ష్యం సీజేఐ గవాయ్ అని అర్థమవుతోందని తన్వీర్ పేర్కొన్నారు.

ఈ ఘటనను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) మాజీ కార్యదర్శి న్యాయవాది రోహిత్ పాండే ఖండించారు. దాడికి యత్నించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేసినట్లు ఏఎన్ఐ వెల్లడించింది.

సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డు అసోసియేషన్ (ఎస్‌సీఓఏఆర్ఏ) ఒక తీర్మానాన్ని విడుదల చేసింది. కోర్టు హాల్‌లో జరిగిన ఘటనను ఖండించింది. న్యాయవాది దుష్ప్రవర్తన పట్ల, సీజేఐ, న్యాయమూర్తుల స్థానాన్ని, అధికారాన్ని అగౌరవపరిచేందుకు ప్రయత్నించిన సంఘటన పట్ల తాము తీవ్ర ఆవేదనను, నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది.

అటువంటి ప్రవర్తన న్యాయవ్యవస్థకు, న్యాయవాద వృత్తికి మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవానికి మూలాలనే దెబ్బతీస్తుందని పేర్కొంది. దీన్ని కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించి, సంబంధిత న్యాయవాదిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

న్యాయస్థానంలో అటువంటి సంఘటన చోటుచేసుకోవడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ ఖండించింది.

న్యాయవాది రాకేష్ కిశోర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)