ఆర్ఎస్ఎస్ కార్యక్రమంపై కమల్తాయ్ గవాయ్ రాసిన లేఖలో ఏముంది?

కమల్తాయ్ గవాయ్
    • రచయిత, భాగ్యశ్రీ రౌత్, నితేష్ రౌత్
    • హోదా, బీబీసీ కోసం

అక్టోబర్ 5న మహారాష్ట్రలోని అమరావతిలో జరగనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి కార్యక్రమానికి హాజరుకావడంలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ గవాయ్ తల్లి కమల్తాయ్ గవాయ్ స్పష్టం చేశారు.

కమల్తాయ్ గవాయ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న తర్వాత సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

అంతకుముందు కమల్తాయ్ గవాయ్ పేరుతో సామాజిక మాధ్యమాలలో ఓ లేఖ వైరల్ అయింది. అయితే ఆ లేఖ కమల్తాయ్ గవాయ్ రాసినది కాదని ఆమె కుమారుడు రాజేంద్ర గవాయ్ స్పష్టం చేశారు. తానీ లేఖపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనని కమల్తాయ్ గవాయ్ తెలిపారు.

''నేను ఏ వేదికపైనైనా అంబేడ్కర్ ఆలోచనలు, విపస్సన గురించి మాట్లాడతాను. విభిన్న కలిగినవారి కార్యక్రమాలకు వెళ్లకూడదనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. దాదాసాహెబ్ గవాయ్‌ది కూడా అటువంటి దృక్పథమే. ఆయన కూడా సంఘ్ కార్యక్రమాలకు వెళ్లారు. కానీ ఏనాడూ హిందుత్వను అంగీకరించలేదు' అని కమల్తాయ్ గవాయ్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కమల్తాయ్ గవాయ్ రాసిన లేఖ

కమల్తాయ్ గవాయ్ రాసిన లేఖలో ఏముంది?

వైరల్ అయిన లేఖను మా కుటుంబానికి దగ్గరగా ఉన్న ఒక సామాజిక కార్యకర్త రాసి ఉండవచ్చు. దీనిపై నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు.

నాకు తెలిసిన కొంతమంది అక్టోబర్ 5న జరిగే కార్యక్రమానికి రావాలని కోరారు. మేం అందరినీ గౌరవిస్తాం, స్వాగతిస్తాం. మాకు అందరిపట్ల సోదరభావం, స్నేహం ఉంది.

కానీ ఈ కార్యక్రమం గురించిన వార్త బయటపడగానే నాకు మాత్రమే కాకుండా, దివంగత దాదాసాహెబ్ గవాయ్‌పై కూడా విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. మేమిద్దరం డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలకు అంకితమైనవాళ్లం. దాదాసాహెబ్ గవాయ్ జీవితం అంబేడర్కైట్ ఉద్యమానికే అంకితమైంది.

మన అభిప్రాయాలను భిన్న వేదికలపై వ్యక్తపరచడం అవసరం. దీని కోసం ఎంతో ధైర్యం కావాలి. దాదాసాహెబ్ గవాయ్ తమ భావాలకు విరుద్ధమైన వేదికలకుపైన కూడా పేద ప్రజల సమస్యలు మాట్లాడేవారు. ఇది ఆయన విధానంలో భాగం.

ఆయన ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలకు హాజరైనప్పటికీ, హిందుత్వాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. సమానత్వం, స్వాతంత్య్రం, న్యాయం, సోదరభావం, శాస్త్రీయ దృష్టికోణం గురించి మాత్రమే ఆయన మాట్లాడేవారు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు, రాజ్యాంగ సిద్ధాంతాలకు ప్రాతినిథ్యం వహించేవారు.

నేను ఆ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమానికి హాజరైనా, డాక్టర్ అంబేడ్కర్ ఆలోచనలు విపస్సన గురించి మాట్లాడతాను. ఈ వివాదం నన్ను చాలా బాధించింది.

నేను ప్రస్తుతం 84 ఏళ్ల వయస్సులో ఉన్నాను. ఆరోగ్యం బాగోలేకపోవడంతో, డాక్టర్ల సలహాతో చికిత్స పొందుతున్నాను. అందుకే అక్టోబర్ 5న జరిగే కార్యక్రమానికి వెళ్లడం లేదు. ఎందుకంటే ఇది ఎక్కడో ఒక రోజు ఆగాల్సిందే. అని ఆలేఖలో రాశారు.

లేఖ

అక్టోబర్ 5న అమరావతిలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం

ఈ కార్యక్రమాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అమరావతి నగర విభాగం నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆహ్వానాలు పంపిణీ చేశారు. దాదాసాహెబ్ గవాయ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ కమల్తాయ్ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని బుక్‌లెట్‌లో ఉంది.

అలాగే, న్యూ దిల్లీ నుంచి ఆర్ఎస్ఎస్ జాతీయ సమన్వయకర్త నందకుమార్‌జీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొన్నారు.

అక్టోబర్ 2 విజయదశమి పండుగను నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో పెద్దయెత్తున నిర్వహించనున్నారు. ఇందుకోసం హెడ్గెవార్ స్మారక సమితి ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాన కార్యక్రమం అక్టోబర్ 2న నాగ్‌పూర్‌లో ఉన్నందున, అమరావతి కార్యక్రమం అక్టోబర్ 5 తర్వాత నరసమ్మ కళాశాల మైదానంలో జరగనుంది.

ఆహ్వానం, కమల్‌తాయ్

ఆ లేఖలో ఏముంది?

కమల్తాయ్ గవాయ్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరవుతారని వార్తలు వెలువడిన తర్వాత, ఆమె పేరుతో ఒక లేఖ వైరల్ అయింది. ‘‘తాను ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని, అలాంటి వార్తలు అబద్ధమని’’ ఆ లేఖలో ఉంది.

"మా కుటుంబం అంబేడ్కర్ సిద్దాంతాలను అనుసరిస్తుంది. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటుంది. అందుకు నేనీ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. సామాజిక సామరస్యం దెబ్బతినడాన్ని నేను ఏ విధంగానూ అనుమతించను. విజయదశమి హిందూ సంస్కృతిలో భాగం కావొచ్చు. కానీ మా వరకు దమ్మచక్ర పర్వర్తన్ , అశోకుని విజయదశమికే ప్రాముఖ్యం. నన్ను సంప్రదించకుండా, నా లిఖితపూర్వక అనుమతి తీసుకోకుండా ఆర్ఎస్ఎస్ ఇలా కుట్ర పన్నింది. నేనీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాను’’ అని ఉంది.

రాజేంద్ర గవాయ్
ఫొటో క్యాప్షన్, 'ఆ ఉత్తరం మా అమ్మ రాసింది కాదు' అని రాజేంద్ర గవాయ్ అన్నారు.

‘‘ఆ ఉత్తరం మా అమ్మ రాయలేదు’’

ఈ లేఖ వైరల్ అయిన తర్వాత, డాక్టర్ కమల్తాయ్ గవాయ్‌ని సంప్రదించడానికి ప్రయత్నించాం. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. తరువాత, ఆమె కుమారుడు రాజేంద్ర గవాయ్ స్పందిస్తూ వైరల్ అవుతున్న లేఖ తన తల్లిది కాదని మీడియాకు తెలిపారు.

"మా అమ్మకు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఆమె దాన్ని అంగీకరించారు. గతంలో దాదాసాహెబ్ గవాయ్ కూడా ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గవాయ్ కుటుంబం ఎల్లప్పుడూ పార్టీలకతీతంగా సంబంధాలను కొనసాగించింది. అటల్ బిహారీ వాజపేయికి, దాదాసాహెబ్ గవాయికి మంచి అనుబంధం ఉంది. అయినప్పటికీ వాజపేయి ప్రధాని కావడానికి ఓటు అవసరమైనప్పుడు, దాదాసాహెబ్ ఓటు వేయలేదు. ఒకరి కార్యక్రమానికి హాజరవుతున్నామంటే మన ఆలోచనా విధానం మారిందని అర్థం కాదు. ప్రజలు ఒకరి కార్యక్రమాల్లో ఒకరు పాల్గొనాలని నేను నమ్ముతున్నాను" అని ఆయన అన్నారు.

"నా తల్లి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం ఏదైనప్పటికీ కొడుకుగా నేను ఆమెకు అండగా నిలుస్తాను" అని కూడా తెలిపారు.

ఆర్ఎస్ఎస్ ఏమంటోంది?

ఆర్‌ఎస్‌ఎస్ విదర్భ ప్రాంతీయ ప్రచార అధిపతి సంజయ్ గుల్వే ఈ విషయంపై స్పందించారు.

"కమల్తాయ్ ఆహ్వానాన్ని అంగీకరించారు. ఆమె కచ్చితంగా కార్యక్రమానికి హాజరవుతారు. వైరల్ అయిన లేఖ నకిలీదని కూడా నిర్ధరించారు. దానిని ఎవరు, ఎందుకు ప్రచారం చేశారనేది వేరే విషయం" అన్నారు.