లండన్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం.. భారత్ ఏమందంటే

లండన్‌లో ధ్వంసం చేసిన గాంధీ విగ్రహం

ఫొటో సోర్స్, Simon Fraser / BBC

లండన్‌లోని మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని భారతదేశం డిమాండ్ చేసింది.

న్యాయ విద్యార్థిగా లండన్‌లోని యూనివర్సిటీ కాలేజీలో గాంధీ గడిపిన కాలానికి గుర్తుగా టావిస్టాక్ స్క్వేర్‌లో ఆయన కాంస్య విగ్రహాన్ని 1968లో ఆవిష్కరించారు.

''ఇది విధ్వంసం మాత్రమే కాదు, అహింసా సిద్ధాంతంపై హింసాత్మక దాడి'' అని భారత హైకమిషన్ 'ఎక్స్' పోస్టులో పేర్కొంది. దీన్ని 'సిగ్గుచేటు' అని ఖండించింది.

సంఘటన ప్రాంతాన్ని మంగళవారం బీబీసీ సందర్శించినప్పుడు స్థానిక కామ్డెన్ కౌన్సిల్ పంపిన పరిశుభ్రత బృందాలు విగ్రహం వద్ద శుభ్రం చేస్తున్నాయి.

గాంధీ విగ్రహం ధ్వంసం వెనుక ఎవరున్నదీ స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గాంధీ విగ్రహం ధ్వంసం

ఫొటో సోర్స్, Simon Fraser / BBC

విగ్రహం స్తంభంపై రాతలు...

'గాంధీ, మోదీ, హిందుస్తానీ (భారతీయులు)' అనే పదాలతో పాటు 'టెర్రరిస్ట్స్' అనే పదాన్ని నల్లటి స్ప్రే పెయింట్‌తో గాంధీ విగ్రహం స్తంభంపై దుండగులు రాశారు.

అయితే, విగ్రహం ధ్వంసానికి సంబంధించిన ఫోటోలను భారత హైకమిషన్ షేర్ చేయలేదు.

కానీ, 'ఎక్స్'లో అనేక ఖాతాలు, భారతీయ మీడియా... ఆ ధ్వంసాన్ని చూపించే చిత్రాలను షేర్ చేశాయి.

ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన గురించి తెలియగానే తమ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారని, దర్యాప్తు చేపట్టారని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.

లండన్‌లో గాంధీ విగ్రహం

ఫొటో సోర్స్, Simon Fraser / BBC

పునరుద్ధరణ చర్యలు...

గాంధీజీ కాంస్య విగ్రహాన్ని పోలెండ్‌ శిల్పి ఫ్రెడ్డా బ్రిలియంట్ రూపొందించారు.

దాని అసలు గౌరవానికి భంగం కలగకుండా విగ్రహాన్ని పునరుద్ధరించడానికి అధికారులతో సమన్వయం చేసుకుంటూ తమ బృందం కూడా అక్కడే ఉందని భారత హైకమిషన్ తెలిపింది.

అక్టోబర్ 2న అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహిస్తున్న గాంధీ జయంతికి కొన్ని రోజుల ముందు ఈ ఘటన జరగడం చర్చనీయమైంది.

బ్రిటన్‌లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2014లో లీసెస్టర్‌లోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇటీవల బ్రిటన్‌లోని కొన్నిచోట్ల గాంధీ విగ్రహాన్ని తొలగించాలంటూ క్యాంపెయిన్లు జరిగాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)