26 రోజులకే రాజీనామా చేసిన ప్రధాన మంత్రి.. ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి

Sebastien Lecornu

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లారా గోజీ, హ్యూ షొఫీల్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఫ్రాన్స్ ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను రాజీనామా చేశారు. తన కేబినెట్ ప్రకటించిన మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం చర్చనీయమవుతోంది.

"ప్రధానిగా కొనసాగేందుకు అనుకూల పరిస్థితులు లేవు' అని లెకోర్ను సోమవారం ఉదయం అన్నారు. రాజకీయ పార్టీల మధ్య రాజీకి సిద్ధంగా లేని ధోరణిని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.

లెకోర్ను సోమవారం ఉదయం అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్‌తో సుమారు గంట పాటు సమావేశమయ్యారు. అనంతరం ఎలిసీ ప్యాలస్(అధ్యక్ష కార్యాలయం) లెకోర్ను రాజీనామా విషయాన్ని ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంతకుముందు ప్రధానిగా ఉన్న ఫ్రాంకోయిస్ బేరూ ప్రభుత్వం కూలిపోయిన తరువాత లెకోర్నును ప్రధానిగా నియమించారు. అయితే, ఆయన్ను నియమించిన 26 రోజులకే ఆయన రాజీనామా చేశారు.

ఈ ఆకస్మిక నిర్ణయం ఫ్రాన్స్ రాజకీయవర్గాల్లో సంచలనం రేపింది.

ఫ్రాన్స్‌లో గత రెండేళ్లలో అయిదుగురు ప్రధాన మంత్రులు రాజీనామా చేశారు.

Sebastien Lecornu

ఫొటో సోర్స్, Getty Images

మంత్రివర్గం కూర్పుపై విమర్శలే కారణమా?

లెకోర్ను మంత్రివర్గం కూర్పుపై నేషనల్ అసెంబ్లీలోని పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ఆయన కంటే ముందు ప్రధానిగా ఉన్న ఫ్రాంకోయిస్ బేరూ మంత్రివర్గానికి, తర్వాత లెకోర్ను మంత్రివర్గానికి పెద్దగా మార్పు లేకపోవడంతో, దాన్ని సభలో తీర్మానం ద్వారా ఓడించడానికి సిద్ధమయ్యాయి.

ముందస్తు ఎన్నికల కోసం అనేక పార్టీలు గట్టిగా డిమాండు చేస్తున్నాయి. అధ్యక్షుడు మేక్రాన్ పదవి నుంచి దిగిపోవాలని మరికొన్ని పార్టీలు పిలుపునిస్తున్నాయి. అయితే, తన పదవీకాలం 2027లో ముగిసేవరకూ తాను తప్పుకోబోనని చెబుతూ వస్తున్నారు మేక్రాన్.

''ఇప్పుడు చేయదగిన ఏకైక తెలివైన పని ఏదైనా ఉందంటే అది ఎన్నికలు నిర్వహించడమే'' అని నేషనల్ ర్యాలీ (ఆర్‌ఎన్) నాయకురాలు మెరైన్ లే పెన్ అభిప్రాయపడ్డారు.

''ఫ్రెంచ్ ప్రజలు విసిగిపోయారు. దేశాన్ని అత్యంత క్లిష్టతరమైన పరిస్థితిలోకి మేక్రాన్ నెట్టారు'' అని ఆమె అన్నారు.

Emmanuel Macron

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మేక్రాన్

మేక్రాన్ ముందున్న మూడు మార్గాలు...

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ముందు మూడు మార్గాలు ఉన్నాయి. మరొకరిని ప్రధానమంత్రిగా నియమించవచ్చు. లేదా నేషనల్ అసెంబ్లీని మరోసారి రద్దు చేయవచ్చు. లేదా తనే రాజీనామా చేయవచ్చు.

ఆయన రాజీనామా చేసే అవకాశం చాలా తక్కువ. అయితే, మరొకరిని ప్రధానమంత్రిగా నియమించడం ఆయన సహజమైన ఎంపిక కావచ్చు.

అయితే, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ఆయన ఎవరి పేరు ప్రతిపాదిస్తారనేది ప్రశ్న. పరమ విధేయుడైన లెకోర్ను తన చివరి ప్రయత్నంగా మేక్రాన్ భావించారు. కానీ లెకోర్ను కూడా రాజీనామా చేశారు. లెకోర్ను గత రెండేళ్లలో ఫ్రాన్స్‌కు అయిదో ప్రధానమంత్రి.

2024 జులై నుంచి ఫ్రెంచ్ రాజకీయాలు చాలా అస్థిరంగా మారాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)