ఎవరెస్ట్ దగ్గర భారీ హిమపాతంలో చిక్కుకున్న ఆ 1,000 మంది టూరిస్టుల పరిస్థితి ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లారా బికర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎవరెస్ట్ శిఖరం మూలన ఉన్న టిబెటన్ పర్వతాలపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తూర్పు వైపున ఉన్న కొండలపై మంచు తుపాను కారణంగా మొదట దాదాపు 1,000 మంది వరకు శిబిరాల్లో చిక్కుకున్నట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.
4,900 మీటర్లు (16,000 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకునే మార్గంలో మంచు పేరుకుపోయింది. దాన్ని తొలగించడానికి వందలమంది స్థానికులతోపాటు, రెస్క్యూ బృందాలు మోహరించాయి.
దాదాపు 350 మందిని రక్షించి, కుడాంగ్‌లోని చిన్న పట్టణానికి సురక్షితంగా తరలించారని స్థానిక మీడియా పేర్కొన్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ప్రస్తుతం ఇంకా అక్కడ దాదాపు 200మంది శిబిరాల్లోనే ఉన్నారని, వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
శుక్రవారం సాయంత్రం మొదలైన హిమపాతం టిబెట్‌లోని ఎవరెస్ట్ పర్వతం తూర్పు కొండలలో తీవ్ర రూపందాల్చింది. పర్వతారోహకులు, హైకర్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం.
‘‘ఈ హిమపాతం చాలా తడిగా, చల్లగా ఉంది. హైపోథెర్మియా(అల్పోష్ణస్థితి) నిజంగా ప్రమాదకరం’’ అని కుడాంగ్‌కు చేరుకున్న ట్రెక్కింగ్ బృందంలో ఒకరైన చెన్ గెషువాంగ్ రాయిటర్స్‌తో అన్నారు.

"ఈ సంవత్సరం వాతావరణం ఎప్పటిలాగా లేదు. అక్టోబర్‌లో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం చూడలేదని గైడ్ చెప్పారు. ఇది అకస్మాత్తుగా జరిగింది" అని చెన్ అన్నారు.
భారీ మంచు కారణంగా టెంట్లు కూలిపోయాయని, కొంతమంది హైకర్లు అప్పటికే హైపోథెర్మియాతో బాధపడుతున్నారని టిబెట్‌లోని బ్లూ స్కై రెస్క్యూ బృందానికి సాయం కోసం పిలుపు అందిందని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
టింగ్రి కౌంటీ టూరిజం కంపెనీ శనివారం నుంచి ఎవరెస్ట్ సీనిక్ ఏరియాకు టిక్కెట్ల అమ్మకాలు, ప్రవేశాన్ని నిలిపివేసిందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
ఈ ప్రాంతం ప్రస్తుతం తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. పక్కనే ఉన్న నేపాల్‌లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో భూకంపాలు, ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో వంతెనలు కొట్టుకుపోయి, గత రెండు రోజులలో సుమారు 47 మంది ప్రాణాలు కోల్పోయారు.
చైనాలో, టైఫూన్ మాట్మో తీరాన్ని తాకింది. దీంతో దాదాపు 150,000 మంది ప్రజలు తమ ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది.
ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం. ఇది 8,849 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. ప్రతి ఏడు చాలామంది దీన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, దీన్ని అధిరోహించడం ప్రమాదకరంగానే పరిగణిస్తున్నారు.
ఇటీవలి కాలంలో మౌంట్ ఎవరెస్ట్‌ను భారీ సంఖ్యలో ప్రజలు సందర్శించడం, పర్యావరణ ఆందోళనలు, ప్రమాదకర పరిస్థితుల్లో ఎవరెస్ట్‌ను ఎక్కాలనుకోవడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














