త్వరలో భారత్, చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు, ఐదేళ్ల నిషేధం తర్వాత..

భారత్, చైనా, విమాన సర్వీసులు, ఇండిగో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చెరిలాన్ మొలాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్, చైనా సంబంధాలను క్రమంగా సాధారణ స్థితికి తీసుకొచ్చే దిశగా మరో ముందడుగు పడింది. ఈ నెలలో ఇరుదేశాల మధ్య నేరుగా విమానాల రాకపోకలను తిరిగి పునరుద్ధరించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

హిమాలయాల బోర్డర్‌లో జరిగిన తీవ్ర సైనిక ఘర్షణల తర్వాత, 2020 నుంచి ఇరుదేశాల మధ్య నేరుగా నడిచే విమానాల సర్వీసులు నిలిచిపోయాయి.

కానీ, గత ఏడాది కాలంగా.. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్, చైనా చర్యలు చేపట్టడంతో పాటు సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా కృషి చేస్తున్నాయి.

అక్టోబర్ 26 నుంచి కోల్‌కతా, గ్వాంగ్‌జౌ నగరాల మధ్య విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ ఇండిగో గురువారం (అక్టోబర్ 2) తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

విమానాల పునరుద్ధరణతో ఇరుదేశాల "ప్రజల మధ్య సంబంధాలు సులభతరం అవుతాయి, ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించేందుకు దోహదపడుతుంది" అని గురువారం విడుదల చేసిన ప్రకటనలో భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

భారత్, చైనా 3,440 కిలోమీటర్లకి పైగా పొడవున సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇందులో కొన్నిచోట్ల కచ్చితమైన సరిహద్దు లేదు, రెండు దేశాలు ఆయా ప్రాంతంపై తమకు హక్కు ఉందని పేర్కొంటున్నాయి.

2020లో, గల్వాన్ లోయలో ఇరుదేశాల దళాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో కనీసం 20 మంది భారతీయ సైనికులు, నలుగురు చైనా సైనికులు మరణించారు.

1975 తర్వాత ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో జరిగిన ఘర్షణ ఇది. ఇరుదేశాల మధ్య సంబంధాలు స్తంభించిపోవడానికి దారితీసింది.

అయితే, గత ఏడాది కాలంగా దెబ్బతిన్న సంబంధాలను క్రమంగా బలోపేతం చేసుకునేందుకు బీజింగ్, దిల్లీ చర్యలు చేపడుతున్నాయి.

రెండు వైపుల నుంచి ఉన్నత స్థాయి అధికారులు అనేక దశల చర్చలు, సమావేశాలు నిర్వహించారు.

గత ఏడాది అక్టోబర్‌లో, వివాదాస్పద హిమాలయ సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారతదేశం, చైనా పెట్రోలింగ్ ఏర్పాట్లకు అంగీకరించాయి .

ఈ ఏడాది, టిబెట్ అటానమస్ రీజియన్ అని పిలిచే కొన్ని మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను సందర్శించడానికి భారతీయ యాత్రికులను అనుమతించింది చైనా. భారత్ కూడా చైనా పర్యటకులకు వీసా సేవలను పునఃప్రారంభించింది. నిర్దేశిత పాసుల ద్వారా సరిహద్దు వాణిజ్యానికి సంబంధించిన చర్చల పున:ప్రారంభానికి అంగీకరించింది.

అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణించడం కూడా దిల్లీ, బీజింగ్ సంబంధాలు మెరుగయ్యేందుకు మరో కారణంగా చెప్పొచ్చు.

ఆగస్టులో, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌‌లో పర్యటించారు. భారత్, చైనా ఒకరినొకరు "విరోధులు"గా కాకుండా "భాగస్వాములు"గా చూడాలని అన్నారు.

అదే నెల చివర్లో, భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్.. భారత్ సహా ఇతర దేశాలపై అధిక సుంకాలను విధించినందుకు అమెరికాను "బెదిరింపులకు పాల్పడుతోంది" అని వ్యాఖ్యానించారు.

ఆగస్టులో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత తొలిసారిగా షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) రక్షణ సదస్సులో పాల్గొనేందుకు చైనా పర్యటకు వెళ్లారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌‌తో కూడా భేటీ అయ్యారు.

భారత్ - చైనా సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంపై ఇద్దరు నేతలు తమ నిబద్ధతలను పునరుద్ఘాటించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)